వెంకి రామకృష్ణన్: ముసలితనాన్ని, మృత్యువును ఆపగలమా...భారత సంతతి నోబెల్ గ్రహీత ఏం చెబుతున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, కార్లోస్ సెర్రానో
- హోదా, బీబీసీ ప్రతినిధి
ముసలి వాళ్లం కావడం, చనిపోవడం.. ఇది లోకంలో ఉన్న ప్రతి జీవికి, ప్రతి ఒక్కరికీ ఎదురయ్యే పరిస్థితే. మరణాన్ని తలుచుకుని చాలా మంది భయపడుతుంటారు. కానీ, మనమెందుకు ముసలి వాళ్లం కావాలి, ఎందుకు చనిపోవాలి? వృద్ధాప్యాన్ని ఆపగలమా లేదా చావును తప్పించగలమా?
ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునేందుకు భారత సంతతికి చెందిన పరమాణు జీవశాస్త్రవేత్త(మోలిక్యులర్ బయోలజిస్ట్) వెంకి రామకృష్ణన్ తన వృత్తి జీవితానంతా వెచ్చించారు. రామకృష్ణన్ 1952లో తమిళనాడులోని చిదంబరంలో పుట్టారు.
ప్రొటీన్లను ఉత్పత్తి చేసే బాధ్యతున్న కణాల నిర్మాణం రైబోసోమ్స్‌పై ఆయన చేసిన పరిశోధనకు గాను 2009లో రసాయన శాస్త్రంలో థామస్ ఏ స్టైట్జ్, అడా ఈ. యోనాథ్‌లతో కలిసి రామకృష్ణన్ నోబెల్ పురస్కారాన్ని అందుకున్నారు.
‘‘వై వీ డై : ది న్యూ సైన్స్ ఆఫ్ ఏజింగ్ అండ్ ది క్వెస్ట్ ఫర్ ఇమ్మోర్టాలిటీ’ పేరుతో రామకృష్ణన్ రాసిన పుస్తకం ఆంగ్ల భాషలో ఈ ఏడాది మార్చిలో ప్రచురితమవుతుంది.
ఈ విషయాలపై రామకృష్ణన్‌తో మాట్లాడినప్పుడు మనుషులు ఎక్కువ కాలం జీవించేందుకు ఉపయోగపడే కణాలు తగ్గిపోవడానికి కారణమయ్యే రసాయన చర్యల నుంచి ప్రతి అంశాన్నీ వివరించారు.
బీబీసీ: వృద్ధాప్యం ఏమిటి? మనుషుల్లో ఉండే ఈ ప్రక్రియ ఏమిటసలు?
వెంకి రామకృష్ణన్: మన డీఎన్ఏలో ఉండే జన్యువులకు ప్రమాదం కలగడమే వయసు పెరిగేందుకు ప్రధాన కారణాల్లో ఒకటి. జన్యుపరమైన స్థాయిలో ప్రొటీన్లు వేలకొద్ది రసాయన చర్యలు మిళితమై ఉంటాయి. ఈ చర్యల ద్వారానే మనం జీవించి ఉంటాం.
ఇవే మన శరీరానికి బలాన్ని, ఒక ఆకారాన్ని అందిస్తాయి. జన్యువుల మధ్య సమాచార మార్పిడికి ప్రొటీన్లు తోడ్పడతాయి. వాటిపై ఆధారపడి మన నాడీ వ్యవస్థ పనిచేస్తుంది. మెదడులో చాలా అంశాలు భద్రపరిచేలా చేస్తాయి.
విటమిన్లు, హార్మోన్లు, ఎంజైమ్‌లు, యాంటీబాడీలు, హిమోగ్లోబిన్ వంటివన్నీ కూడా ప్రొటీన్లే. కణాలలో ప్రొటీన్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని మన శరీరం కోల్పోవడమే వృద్ధాప్యమని అర్థం.
మన టిష్యూలలో, కణాలలో, జీవ పరమాణుల్లో, చివరికి శరీరంలో రసాయన ప్రక్రియ దెబ్బతినడాన్ని మనం చూడొచ్చు. మనం పుట్టినప్పటి నుంచి జరిగే క్రమానుగత ప్రక్రియ ఇది.
చిన్నప్పటి నుంచి మనం వయసు పెరగడం చూస్తుంటాం. కానీ, అప్పుడు పెద్దగా పట్టించుకోం. ఎందుకంటే, పెరుగుతున్నాం, యవ్వనంలోకి మారుతున్నాం... అనే ఉత్సాహం ఉంటుంది.
కానీ ఏళ్లు గడుస్తున్నా కొద్ది, ఈ లక్షణాలు మరింత తీవ్రంగా మారతాయి. శరీరంలోని క్లిష్టమైన వ్యవస్థలు విఫలైనప్పుడు, శరీరం మొత్తం ఒకే విధంగా పనిచేయలేదు. అదే మరణానికి దారితీసే పరిణామం.
అయితే, మరణంలో ఉన్న ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. మనం చనిపోయినప్పుడు.. శరీరంలో కొన్ని కణాలు బతికే ఉంటాయి. అందుకే అవయవాలను దానం చేస్తుంటారు. కానీ, శరీరంలో ఏ అవయవం కూడా పనిచేయకుండా పోవడం మరణం.

ఫొటో సోర్స్, Getty Images
బీబీసీ: జీవశాస్త్రంలో ప్రతి జన్యుపరిణామ క్రమాన్ని పరిగణనలోకి తీసుకుంటారని మీ పుస్తకంలో ప్రస్తావించారు. జన్యుపరిణామ పరంగా, మనం ఎందుకు ముసలోళ్లం కావాలి? ఎందుకు చనిపోవాలి?
వెంకి రామకృష్ణన్: ఎందుకంటే, జన్యు పరిణామం అనేది మనల్ని వ్యక్తిగతంగా చూడదు.
జన్యుపరిణామం అనేది జన్యువుల మార్పిడిగా మనం చెబుతుంటాం.
వృద్ధాప్యాన్ని చాలా వరకు మన ఆర్గానిజాలు అడ్డుకోవాలని ప్రయత్నిస్తుంటాయన్నది నిజం. మెరుగైన వ్యవస్థల ద్వారా వాటికవే బాగుపరుచుకోవాలని చూస్తుంటాయి.
వేటగాళ్ల చేతిలో చనిపోయే అత్యధిక ప్రమాదమున్న జీవులలో, ఎక్కువ కాలం జీవించే ఆర్గానిజం ఉన్నా...పెద్దగా ఉపయోగం ఉండదు. ఎందుకంటే, అవి ఏదో ఒక సమయంలో ఇతర జీవుల చేతిలో మరణిస్తాయి.
చిన్నవాటితో పోలిస్తే, పెద్ద పెద్ద జీవులకు అత్యధిక జీవన కాలం ఉంటుంది.
ఎలుకలు, గబ్బిలాలు చూడటానికి ఒకే బరువులో ఉంటాయి. కానీ, ఎలుకలతో పోలిస్తే, గబ్బిలాలు ఎక్కువ కాలం జీవిస్తాయి. ఎందుకంటే, అవి ఎగురుతాయి. వేటాడే జీవుల చేతిలో వాటికి తక్కువ ప్రమాదముంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
బీబీసీ: గత 150 ఏళ్లలో మానవ ఆయుర్దాయం దాదాపు రెండింతలైంది. అయితే, ప్రజల ఆయుర్దాయం మరింత పెరుగుతుందా? లేదా మన ఆర్గానిజాలు జీవించేంత స్థాయికి ఇప్పటికే మనం చేరుకున్నామా? అనేది శాస్త్రవేత్తలో పెద్ద చర్చనీయాంశంగా ఉంది. ఈ చర్చలో మీరు ఏం అనుకుంటున్నారు?
వెంకి రామకృష్ణన్: ఆరోగ్య, వైద్య వ్యవస్థలు మెరుగుపడటంతో నేడు మనం ఎక్కువ కాలం జీవిస్తున్నాం.
ఇవాల్టి కాలంలో మనం 120 ఏళ్లు జీవించగలం. ఈ వయసు దాటి జీవించే అవకాశం తక్కువే.
వందేళ్లు వచ్చిన వారి సంఖ్య పెరుగుతుందని, కానీ, 110 వచ్చిన వారి సంఖ్య పెరగడం లేదని అమెరికాలోని బోస్టన్‌లో దీర్ఘకాలం జీవించడంపై అధ్యయనం చేస్తున్న శాస్త్రవేత్త టామ్ పెర్ల్స్ పరిశీలనలో వెల్లడైంది.
110 ఏళ్లు దాటిన తర్వాత మనం సహజంగానే బయోలాజికల్ లిమిట్స్‌ను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన భావన.
జన్యుపరమైన అంశాలు, వారి జీవన విధానాలతో 110 ఏళ్లకు పైబడి జీవిస్తున్న వారుంటున్నది నిజమే. కానీ, ఈ సంఖ్య పెరగడం లేదు. అంటే, సహజంగా ఈ వయసు దాటిన తర్వాత పరిమితి ఉంటున్నట్లు కనిపిస్తుంది.
క్యాన్సర్ లాంటి వ్యాధులను అరికట్టగలిగితేనే సగటు ఆయుర్దాయాన్ని మరికొన్నేళ్ల పాటు పెంచవచ్చు.
వృద్ధాప్యానికి కారణమయ్యే వాటిని సమర్థవంతంగా ఎదుర్కోగలిగినప్పుడు, బహుశ ఈ పరిమితిని కూడా మించవచ్చు. కానీ, అలా చేయడం ఎంత తేలికనో నాకు తెలియదు. దీనిపై ఆలోచించాల్సిన అవసరం ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
బీబీసీ: వృద్ధాప్యం వ్యాధేనా అనేది కూడా చర్చనీయాంశం కదా...
వెంకి రామకృష్ణన్: క్యాన్సర్, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, శరీర భాగాల్లో వాపులు, కీళ్ల నొప్పులు, గుండె సంబంధిత వ్యాధులన్ని కూడా వయసుతో ముడిపడి ఉంటున్నాయి. అందుకే ఈ వ్యాధులకు కారణం వృద్ధాప్యమని చెబుతుంటారు. వృద్ధాప్యాన్ని ఒక వ్యాధిగా చూస్తున్నారు.
కానీ, వృద్ధాప్యం ప్రతి ఒక్కరూ ఎదుర్కోవాల్సిన సహజ ప్రక్రియ. అనివార్యంగా, సాధారణంగా జరిగే ఈ ప్రక్రియను వ్యాధిగా ఎలా చెబుతారు? అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.
వృద్ధాప్యం వ్యాధి కాదని ఇటీవలే ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా చెప్పింది.
వృద్ధాప్యాన్ని వ్యాధిగా పరిగణించాలని పెద్ద ఎత్తున ఒత్తిడి పెరగడంతో, దీనిపై పరిశోధనలు చేసేందుకు పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టారు.
బీబీసీ: రాబోయే కాలంలో దేని పరంగా యాంటీ-ఏజింగ్ చికిత్సలలో మరింత పురోగతి చూస్తారని మీరు భావిస్తున్నారా?
వెంకి రామకృష్ణన్: ‘‘అంచనాలు వేయడం చాలా కష్టం. ముఖ్యంగా భవిష్యత్ గురించి..’’ అని బేస్‌బాల్ ప్లేయర్ యోగి బెర్రా ఓ చమత్కారం చేశారు.
ఆ చికిత్సలెంత అధునాతమైనవో నాకు తెలియదు. కానీ, వృద్ధాప్యాన్ని తగ్గించేందుకు చాలా విధానాలు అందుబాటులో ఉన్నాయి.
ఉదాహరణకు.. కేలరీలను అదుపులో ఉంచడం వల్ల వృద్ధాప్యం బారిన పడటం తగ్గుతుందని పరిశోధకులు గుర్తించారు. చిన్న వయసులో అలా చేయడం వల్ల సమస్యలు వస్తుండటంతో, కేలరీలను అదుపులో ఉంచే సమర్థతతో పోలిన ఔషధాన్ని కనుగొంటున్నారు.
అయితే, ఎలాంటి చీకుచింతా లేకుండా ఐస్‌క్రీమ్‌తో కేక్ తినేసి, ఆ తర్వాత మందు వేసుకుంటే సరిపోతుందా..? రాపమైసిన్ అనే డ్రగ్‌పై చాలా మందికి ఆసక్తి ఉంది. కానీ, అత్యధిక మోతాదులో తీసుకుంటే, అది రోగనిరోధక శక్తి తగ్గించి, తీవ్రంగా నష్టాన్ని కలిగిస్తుందనే వాదనలున్నాయి.
మరో ప్రక్రియ..పారాబయోసిస్. యవ్వనంలో ఉన్న జంతువు నుంచి రక్తాన్ని తీసి, వృద్ధాప్యంలో ఉన్న దానికి ఎక్కిస్తారు. ఆ రక్తాన్ని పొందిన జంతువు, దాని శరీరంలో ఉన్న భాగాల్లో పునరుత్తేజం పొందుతుంది.
వృద్ధాప్యానికి కారణమయ్యే చాలా కారకాలు రక్తంలో ఉంటాయి. వాటిని గుర్తించేందుకు చాలా అధ్యయనాలు జరిగాయి.
వయసు పెరిగే కొద్ది వృద్ధాప్య కణాలు పెరుగుతాయి. వాపు కూడా దీనికి సంకేతమే.
వృద్ధాప్య కణాలను నాశనం చేయడం కుదురుతుందా? ఒకవేళ ఇది కుదిరితే, కొన్ని వృద్ధాప్య ప్రభావాల నుంచి బయటపడవచ్చు అని కొందరు పరిశోధకులంటున్నారు.
మరో ఆసక్తికరమైన పరిశోధన ఏంటంటే.. సెల్యులార్ రీప్రొగ్రామింగ్. దీనిలో కణాలను వాటి ప్రాథమిక స్థితికి తీసుకెళ్లి, వాటిలో వచ్చిన మార్పులను అధిగమించేందుకు చూస్తారు. ఈ ప్రక్రియ కాస్త ప్రమాదకరమైనది. ఎందుకంటే, కొన్నిసార్లు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అయితే, జంతువులపై చేసిన ఈ ప్రయోగాలు ఆశాజనకమైన ఫలితాలను ఇచ్చాయి.

ఫొటో సోర్స్, Getty Images
బీబీసీ: వీటితో పాటు, శాస్త్రీయపరమైన అపోహలు కూడా ఉన్నాయి. వాటికి చాలా హైప్ ఇస్తున్నారు..
వెంకి రామకృష్ణన్: అవును. పూర్తిగా శాస్త్రీయపరమైన అపోహలు కూడా ఉన్నాయి. ప్రజలు నమ్మే వాటిల్లో క్రయోనిక్స్ ఒకటి . అంటే ఎవరైనా చనిపోయినప్పుడు, వారి శరీరాన్ని లిక్విడ్ నైట్రోజన్‌లో భద్రపరచి ఉంచుతారు. అలా మరణాన్ని జయించాలని చూస్తున్నారు.
కానీ, వారిని బతికించేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం భవిష్యత్‌లో అందుబాటులోకి వస్తుందో లేదో తెలియదు. ప్రస్తుతానికి ఇది ఒక అపోహ మాత్రమే.
ప్రజల్లో చనిపోతామన్న భయాన్ని వాడుకునేందుకు ఇది ఒక మార్గం. బాగా డబ్బులుండి క్రయోనిక్స్‌పై డబ్బులు పెట్టే వారున్నారు. ప్రతీది డబ్బుతో కొనవచ్చు. కానీ, యవ్వనాన్ని కొనలేరు.
నేను భారత్‌లో పెరిగాను. ఆఫ్రికా నుంచి వచ్చిన చాలా మంది నాకు తెలుసు. ఎవరూ కూడా క్రయోనిక్స్ గురించి ఆలోచించడం లేదు.
బీబీసీ: వృద్ధాప్యంపై భయం చాలా మందిలో పెరిగింది. అందుకే మేం బోటోక్స్ వాడుతున్నాం. అంటే, తెల్లబడిన మా జుట్టుకు రంగు వేసుకోవడం లాంటివి.. ఇలాంటివి మాలో పెరిగే వృద్ధాప్య భయాలను తగ్గిస్తాయని మీరు అనుకుంటున్నారా?
వెంకి రామకృష్ణన్: వయసుతో సంబంధం లేకుండా మనిషిపై చాలా ఒత్తిళ్లు ఉంటాయి. ముఖ్యంగా మహిళలపై చాలా ఒత్తిడి ఉంటుంది. కానీ, వృద్ధాప్యాన్ని తగ్గించేందుకు చేపడుతున్న పరిశోధనలు, వయసు పెరిగే భయాన్ని తగ్గిస్తాయని నేను అనుకోవడం లేదు.

ఫొటో సోర్స్, Getty Images
బీబీసీ : వృద్ధాప్యాన్ని ఆలస్యం చేసేందుకు సైన్స్, టెక్నాలజీలో ఎన్నో పరిశోధనలను జరుగుతున్నాయి. ఎన్నో డబ్బులు పెట్టుబడిగా పెడుతున్నారు. కానీ, ఆరోగ్యకరంగా ఉండేందుకు ఇతర మార్గాల గురించి మీరు మీ పుస్తకంలో స్పష్టంగా వివరించారు. వాటి గురించి వివరిస్తారా?
వెంకి రామకృష్ణన్: మంచి నిద్ర, తిండి, వ్యాయామం...వయసు కనిపించకుండా ఉండేందుకు మార్కెట్లో ఇంతకుమించిన మందు లేదు.
వీటికి మీరు ఎక్కువగా ఖర్చు కూడా పెట్టాల్సినవసరం లేదు. ఎలాంటి దుష్ఫభావాలు ఉండవు.
మన జీవ పరిణామం ఒకరిపై ఆధారపడటం, వేటాడటంతో ప్రారంభమైంది. అప్పట్లో ఒక క్రమ పద్ధతిలో తినేవాళ్లు. సహజంగా ఉపవాసం చేసేవాళ్లు. నేను ముందు చెప్పిన విధంగా కేలరీలను కూడా అదుపులో ఉంచుకునేవాళ్లు.
కానీ, ఇప్పుడు మనం ఆకలి లేకపోయినా తింటున్నాం. పశ్చిమంలో ఊబకాయం బాగా పెరిగింది. మన పూర్వీకులతో పోలిస్తే మనమిప్పుడు కడుపులో చల్ల కదలకుండా బతుకుతున్నాం. వ్యాయామం సరిగ్గా లేదు.
ఇక నిద్ర విషయానికి వస్తే, అసలు దాని ప్రాధాన్యతనే పట్టించుకోవడం లేదు. మన శరీర పునరుద్ధరణ వ్యవస్థలలో ఇదే అత్యంత ముఖ్యమైనదన్న విషయం మర్చిపోతున్నాం.
మన పూర్వీకులు అనుసరించిన విధానాలను మనం ఇప్పుడు పాటిస్తే కండరాలు, మైటోక్రాండియల్ పనితీరును, రక్తపోటును, ఒత్తిడిని, జ్ఞాపకశక్తి తగ్గిపోయే ప్రమాదాన్ని తగ్గించుకోగలం. వీటిని ఎల్లవేళలా అనుసరించడం అంత తేలిక కాకపోవచ్చు. కొన్నిసార్లు ప్రజలు ఒక టాబ్లెట్ తీసుకుని, వారికి కావాల్సిన జీవితాన్ని వారు గడుపుతుంటారు. కానీ, దాన్ని అధిగమించాలి.
బీబీసీ: ఎన్నేళ్లు జీవించామన్నది కాదు, ఎలా జీవించామన్నది ముఖ్యం అనే నానుడిని మీరు ఇష్టపడతారా?
వెంకి రామకృష్ణన్: అవును, ఇది చక్కటి మాట. దీంతో నేను ఏకీభవిస్తాను. అదే కదా కావాల్సింది. జీవితోద్దేశ్యం ఏంటో తెలిస్తే.. గుండెనొప్పుల ప్రమాదాలు తగ్గుతాయి. మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.
మనం కోరుకున్న విధంగా ఎంత కాలం వీలైతే అంత కాలం జీవించాలనుంటున్నాం. అది గందరగోళానికి కారణమవుతుంది. వ్యక్తిగతంగా మనం కోరుకునేది సమాజానికి లేదా ఈ పర్యావరణానికి అంత మంచిది కాకపోవచ్చు.
ఇంధన వాడకం, గ్లోబల్ వార్మింగ్ కారణంగా జీవవైవిధ్యం కోల్పోడాన్ని మనం చూస్తున్నాం. వ్యక్తిగతంగా మనం తీసుకునే నిర్ణయాలు సమాజానికి చెడును కలిగిస్తాయి. దాన్ని అధిగమించేందుకు మనలో నిజమైన చేతన అవసరం.
ఇవి కూడా చదవండి:
- మరణ శిక్షను ఏయే పద్ధతుల్లో అమలు చేస్తున్నారు?
- ఏపీలో శ్మశానం అభివృద్ధికి తెలంగాణ ఎంపీ నిధులపై వివాదం ఎందుకు రేగింది?
- యూదుల ఊచకోత నుంచి బతికి బయటపడ్డ చిన్నారి జార్జ్ ఇప్పుడు ఎలా ఉన్నారు? నాటి మహా విషాదంపై ఆయన ఏమన్నారు?
- ధోర్డో: ఎడారి మధ్యలోని ఈ గుజరాత్ గ్రామానికి లక్షల మంది టూరిస్టులు ఎందుకు వస్తున్నారు?
- అయోధ్య రామాలయం: ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాది ఆలయాల ఆర్కిటెక్చర్ భిన్నంగా ఎందుకు ఉంటుంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














