టీబీ: భారత్‌లో వ్యాక్సీన్లతో క్షయ వ్యాధి నిర్మూలన సాధ్యమేనా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, నిఖిల హెన్రీ
- హోదా, బీబీసీ న్యూస్, దిల్లీ
2025 నాటికి క్షయవ్యాధిని నిర్మూలించాలని 2018లో భారత్ ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన గడువు కంటే ఐదేళ్లు ముందుగానే టీబీని పారదోలాలని లక్ష్యంగా పెట్టుకుంది.
టీబీ నిర్మూలనపై 2023 మార్చిలో వారణాసిలో నిర్వహించిన ప్రపంచ స్థాయి సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారు.
అయితే, ప్రపంచ ఆరగ్యో సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) విడుదల చేసిన ప్రపంచ టీబీ నివేదిక అందుకు భిన్నమైన పరిస్థితిని ప్రతిబింబిస్తోంది. భారత్‌లో ప్రతి రెండు నిమిషాలకు టీబీతో ఒకరు చనిపోతున్నట్లు నివేదిక చెబుతోంది.
డబ్ల్యూహెచ్‌వో నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా పరిశీలిస్తే భారత్‌లోనే టీబీ రోగుల సంఖ్య ఎక్కువ. 2022లో 1.06 కోట్ల మందికి టీబీ పరీక్షలు నిర్వహిస్తే, వారిలో దాదాపు 27 శాతం మందికి ఇన్షెక్షన్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. సుమారు 47 శాతం మంది మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ఇన్ఫెక్షన్ కలిగివున్నారు. అంటే, టీబీకి వాడే కనీసం రెండు ఔషధాలకు ప్రతిస్పందించని ఇన్ఫెక్షన్ శరరీంలో వృద్ధి అయినట్లు గుర్తించారు.
వ్యాధిని గుర్తించి, చికిత్స అందించడమే ఉత్తమ పరిష్కారంగా నిపుణులు చెబుతున్నప్పటికీ, టీబీని సమర్థంగా ఎదుర్కొనేందుకు భారత్ టీకాలపై కూడా పెట్టుబడులు పెట్టింది. 2019 నుంచి ఏడు పరిశోధనా సంస్థల్లో రెండు వ్యాక్సీన్లపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు.
అయితే, టీబీకి టీకాలు తయారు చేయడం అంత సులభమేమీ కాదు.
''వ్యాక్సీన్ ఎలా పనిచేయాలని అనుకుంటున్నామో కచ్చితంగా మనకు తెలియదు. టీబీ బ్యాక్టీరియాను మనిషి శరీరం ఎలా ఎదుర్కొంటుంది, లేదా ఎందుకు ఎదుర్కోలేకపోతోంది అనే విషయాలపై మనకు పూర్తి అవగాహన వచ్చే వరకూ, పూర్తి స్థాయిలో నిర్మూలించే టీకా తయారీ కష్టం'' అని కెనడాలోని మెక్‌గిల్ యూనివర్సిటీ హెల్త్ సెంటర్‌కు చెందిన ఇన్ఫెక్షనస్ డిసీజెస్ డివిజన్ డైరెక్టర్ డాక్టర్ మార్సల్ ఏ బెహర్ అభిప్రాయపడ్డారు.
అంటే ఇప్పటివరకూ, టీబీ వ్యాక్సీన్ యాంటీబాడీలను ప్రేరేపిస్తుందా, లేదా యాంటీజెన్ స్పెసిఫిక్ టీ-సెల్స్(బ్యాక్టీరియాపై నిర్దిష్టమైన పోరాట కణాలు), లేదా సహజ రోగనిరోధక శక్తిని పెంచుతుందా అనే విషయాలపై స్పష్టత లేదు.
టీబీ పరీక్ష ప్రస్తుతమున్న ఇన్ఫెక్షన్, గతంలో ఉన్న ఇన్ఫెక్షన్ మధ్య తేడాను గుర్తించలేదు కాబట్టి టీకా తయారీ అవకాశాలను దెబ్బతీస్తుందని డాక్టర్ బెహర్ తెలిపారు. టీబీకి ప్రస్తుతం చేస్తున్న పరీక్ష కేవలం ఒక వ్యక్తికి బ్యాక్టీరియా సోకిందో లేదో మాత్రమే చెప్పగలదు. ఇప్పటికీ ఇన్ఫెక్షన్ ఉందా, లేదా గతంలో సోకి ఇప్పుడు నయమైందా, అనే స్పష్టత ఇవ్వలేదు.
''పరీక్షల్లో ఈ తేడాను గుర్తించలేనప్పుడు, ఎవరికి ఇన్ఫెక్షన్ ఉందో, ఎవరికి తగ్గిపోయిందో తెలుసుకోవడం కష్టం'' అని డాక్టర్ బెహర్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
వ్యాక్సీన్ ప్రయోగాల్లో ఐసీఎంఆర్ సైంటిస్టులు
అయితే, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) శాస్త్రవేత్తలు సరిగ్గా అదే పనిలో ఉన్నారని ఐసీఎంఆర్ వర్గాలు తెలిపాయి.
టీబీ రోగులతో నాలుగేళ్లుగా కలిసి ఉంటున్న వారిలో టీబీ లక్షణాలు వృద్ధి చెందాయో, లేదో తెలుసుకోవడంతో పాటు, వారితో కలిసి జీవించడం వల్ల ఇతరుల్లో టీబీ సోకే ప్రమాదం ఎంత ఉందన్న విషయాలపై పరిశోధనలు చేస్తున్నారని, అన్నీ అనుకున్నట్లుగా జరిగితే మార్చి నాటికి పరిశోధనల ఫలితాలు వెలువడతాయని ఐసీఎంఆర్ పరిశోధకులు బీబీసీతో చెప్పారు.
ఐసీఎంఆర్ వీపీఎం1002 అనే రీకాంబినెంట్ బీసీజీ వ్యాక్సీన్, ఇమ్యువాక్ అనే హీట్ కిల్డ్ సస్పెన్షన్ మైకోబ్యాక్టీరియం వ్యాక్సీన్‌పై పరీక్షలు చేస్తోంది.
ఇంకా సరళంగా చెప్పాలంటే, టీబీ బ్యాక్టీరియా డీఎన్‌ఏలో మార్పులు చేయడం ద్వారా మొదటి టీకా రూపొందుతోంది. రెండో టీకా వేడి పుట్టించడం ద్వారా టీబీ బ్యాక్టీరియాను అంతమొందిస్తుంది. ఇవి రెండూ ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు నిరూపించగలిగితే, అవి టీబీకి వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని వృద్ధి చేసే అవకాశం ఉంది.
మూడు గ్రూపులపై ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అందులో రెండు గ్రూపులకు రెండు వ్యాక్సీన్లలో ఒక వ్యాక్సీన్ ఒక డోసు ఇచ్చారు. మూడో గ్రూపుకు ప్లాసిబో(ఎలాంటి ఔషధం లేని ఉత్తుత్తి మాత్ర) ఇచ్చారు. ఈ పరిశోధనలో సుమారు 12 వేల మందికి పైగా భాగస్వాములయ్యారు. ఏ వ్యాధి కోసం ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారో వారికి తెలియదు.
''టీబీ రోగుల పరిచయస్తులకు వ్యాధి సోకే ప్రమాదాలను తగ్గించడమే టీకా అధ్యయనం లక్ష్యం'' అని ఐసీఎంఆర్‌కు చెందిన చెన్నై, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ రీసర్చ్ ఇన్ ట్యూబర్‌క్యులోసిస్‌లో ఈ పరిశోధనలకు నేతృత్వం వహిస్తున్న డాక్టర్ భాను రేఖ చెప్పారు.
ఈ టీకా అధ్యయనాలకు ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందని డాక్టర్ బెహర్ వంటి నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొందరిలో యాక్టివ్‌గా, మరికొందరిలో లేటెంట్ (నిగూఢంగా) టీబీ బ్యాక్టీరియాను ఒకటి లేదా రెండేళ్లలో సమర్థవంతంగా నయం చేయలగలిగితే ఆ టీకాను ప్రభావవంతమైనదిగా చెప్పొచ్చని వారు చెబుతున్నారు.
మరికొన్ని సవాళ్లు
అవి కాకుండా మరికొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి.
టీబీ వ్యాక్సిన్ ప్రభావంతంగా పనిచేయాలంటే, మొదట అది పనిచేయాలి. ఆ తర్వాత భారత్ జనాభా మొతానికి ఆ టీకా అందించగలగాలి.
''భారత్‌లో లక్షల మంది లేటెంట్ టీబీ(నిగూఢంగా ఉండే బ్యాక్టీరియా)తో జీవిస్తున్నారు'' అని ప్రజారోగ్య నిపుణుడు చాపల్ మెహ్రా అన్నారు.
ఈ లేటెంట్ టీబీ రోగులకు టీబీ సోకి ఉంటుందని, అయితే వారిలో లక్షణాలు కనిపించవని ఆయన అన్నారు.
1968, 1987 మధ్య తమిళనాడులో సుమారు 2,80,000 మంది వ్యక్తులపై దాదాపు 17 ఏళ్లపాటు కొనసాగిన ప్రయోగాలు నిరుత్సాహకర ఫలితాలిచ్చినట్లు నిపుణులు చెబుతున్నారు.
''బాగా వృద్ధి చెందిన బాసిల్లరీ పల్మనరీ టీబీ నుంచి బీసీజీ ఎలాంటి రక్షణ అందించలేదు'' అని గత ప్రయోగాలపై 1999లో విడుదల చేసిన నివేదిక తెలియజేస్తోంది.
అదో క్లిష్టమైన వ్యాధి, దానికి సామాజిక, ఆర్థిక, జీవన శైలి ఆధారిత కారణాలు ఉంటాయని, అందువల్ల ఒక్క ఔషధంతో టీబీని పూర్తిగా నయం చేయడం దాదాపు సాధ్యం కాదని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
టీబీని పేదల వ్యాధి అని ఎందుకంటారు?
''టీబీని తరచూ పేదవాళ్ల వ్యాధి అని ఎందుకంటారు? పేదలు నివసించే ప్రదేశం, సరైన పోషకాహారం లేకపోవడం వంటి కారణాలతో పేదలు టీబీ బారిన పడే అవకాశం ఉంది. టీబీని తొలగించాలంటే, ఆ వ్యాధిని, దాని కారకాలను మరింత లోతుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది'' అని మెహ్రా చెప్పారు.
భారత్‌లో డబ్ల్యూహెచ్‌వో సిఫార్సు చేసిన డాట్స్-డీవోటీఎస్(డైరెక్ట్‌లీ అబ్జర్వుడ్ ట్రీట్‌మెంట్, షార్ట్ కోర్స్) ప్రోగ్రామ్ అమలవుతోంది. ఈ ప్రోగ్రామ్ కింద టీబీ రోగులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా చికిత్స పొందవచ్చు.
అయితే, కొన్నిసార్లు ప్రభుత్వ ఆస్పతులు లేకపోవడం, లేదా సరైన చికిత్స అందకపోవడం కారణంగా వేల మంది రోగులు ప్రైవేటు ఆస్పతులను ఆశ్రయించాల్సి వస్తోంది.
వాటితోపాటు ఇతర సవాళ్లు కూడా ఉన్నాయి. 2020, 2021లో కేంద్ర ప్రభుత్వం సుమారు 75 లక్షల మంది టీబీ రోగులకు నేరుగా నగదు బదిలీ పథకం కార్యక్రమం కింద 2000 కోట్ల రూపాయలు విడుదల చేసింది. అయితే, రోగికి నెలకు అయ్యే ఖర్చుకు అది ఎంతమాత్రం సరిపోయేలా లేదని నిపుణులు అంటున్నారు.
అలాగే, టీబీ రోగులతో సన్నిహితంగా మెలిగే వారికి కూడా పోషకాహారం అందించడం ద్వారా టీబీ వ్యాప్తిని గణనీయంగా తగ్గించొచ్చని పోషకాహార నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
పోషకాహారం టీబీ రోగులకు సన్నిహితంగా ఉండేవారిలో వ్యాధి సోకే అవకాశాలను తగ్గించిందని, అన్నిరకాల టీబీని 40 శాతం, ఇన్ఫెక్షియస్ టీబీని 50 శాతం తగ్గించినట్లు తమ ఆరు నెలల అధ్యయనంలో తేలిందని మాధవి భార్గవ, అనురాగ్ భార్గవ రాసిన అధ్యయనం ఇటీవల మెడికల్ జర్నల్ లాన్సెట్‌లో ప్రచురితమైంది.
''టీబీని తగ్గించేందుకు సమర్థవంతమైన టీకా అవసరం. అయితే, టీకా ఇంకా పౌష్టికాహారం టీబీ రోగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో రెండు ప్రభావవంతమైన విషయాలుగా చూడొచ్చు'' అని ప్రజారోగ్య నిపుణురాలు డాక్టర్ మాధవి భార్గవ్ చెప్పారు.
ప్రపంచానికి మూడంచెల టీబీ నిర్మూలన వ్యవస్థ అవసరమని డాక్టర్ బెహర్ అన్నారు. వాటిలో మరింత స్పష్టంగా వ్యాధి నిర్ధరణ- చికిత్స, పౌష్టికాహారం, వ్యాధిని నిరోధించడంతోపాటు వ్యాప్తిని నివారించే వ్యాక్సీన్ అవసరమని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
క్షయ వ్యాధి ఎలా సంక్రమిస్తుంది?
క్షయ వ్యాధి సోకిన వ్యక్తి తుమ్ము, దగ్గు నుంచి వచ్చే తుంపరలు(డ్రాప్‌లెట్స్)ను పీల్చడం ద్వారా బ్యాక్టీరియా సంక్రమిస్తుంది.
ప్రధానంగా ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది. శరీరంలోని ఇతర అవయవాలపై కూడా ప్రభావం ఉంటుంది.
వ్యాధి సోకిన వ్యక్తితో ఎక్కువ కాలం సన్నిహితంగా గడపడం వల్ల ఇది సంక్రమించే అవకాశం. ఒకవేళ వ్యాధి సోకిన తర్వాత చికిత్స తీసుకోకపోతే ప్రాణాంతకంగా మారుతుంది.
సరైన యాంటీబయాటిక్స్‌తో చికిత్స చేస్తే నయమవుతుంది.
మూడు వారాలకు పైగా దగ్గు రావడం, ఉన్నట్టుండి బరువు తగ్గిపోవడం, జ్వరం, రాత్రిళ్లు చెమటలు పోయడం వంటివి ఈ వ్యాధి లక్షణాలు.
బీసీజీ వ్యాక్సీన్ చిన్నారులు, 35 ఏళ్లలోపు వారిపై ప్రభావవంతంగా పనిచేస్తుంది. వారు టీబీ బారిన పడే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
ఇవి కూడా చదవండి:
- యూపీఐ పేమెంట్స్: పొరపాటున వేరే అకౌంట్‌కు డబ్బులు పంపినా, 4 గంటల్లో తిరిగి పొందొచ్చా?
- అయోధ్య: రామమందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి వెళ్ళడం వల్ల కాంగ్రెస్‌కు లాభమా, నష్టమా?
- ‘హిట్ అండ్ రన్’ చట్టాన్ని డ్రైవర్లు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? పాత చట్టానికి, కొత్త చట్టానికి తేడా ఏమిటి?
- కల్పనా సోరెన్: సీఎం భార్య కోసమే ఆ ఎమ్మెల్యే సీటు ఖాళీ చేశారా?
- యాపిల్ ఐఫోన్ కంపెనీని మోదీ ప్రభుత్వం టార్గెట్ చేసిందా, వాషింగ్టన్ పోస్ట్ కథనంలో ఏముంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














