షర్మిల రాకతో ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ ఊపిరి పోసుకుంటుందా?

ఫొటో సోర్స్, Ys Sharmila Office
- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
వైఎస్ షర్మిల తాను స్థాపించిన వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు.
పన్నెండేళ్ల కిందట తన అన్న జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లడంతో ఆయన స్థాపించిన పార్టీ భారాన్ని మోయడానికి రాజకీయాల్లోకి వచ్చిన షర్మిల, ఆ తరువాత సొంతంగా పార్టీ స్థాపించి చేసిన రాజకీయ ప్రయాణంలో ఇదొక కొత్త మలుపు.
‘‘చనిపోయిన నా తండ్రిని ఏ1 నిందితుడిగా పేర్కొన్న దుర్మార్గులు’’ అంటూ ఒకప్పుడు కాంగ్రెస్, ఆ పార్టీ నేతలను తిట్టిన షర్మిల మళ్లీ అదే పార్టీలో చేరారు. మరి ఆమె కాంగ్రెస్ విల్లు నుంచి జగన్‌పైకి దూసుకెళ్లే బాణం కాబోతున్నారా అనే ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1

ఫొటో సోర్స్, Ys Sharmila Office
ప్రస్థానం సాగిందిలా...
వై.ఎస్. రాజశేఖర రెడ్డి బతికి ఉన్నప్పుడే జగన్ రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ, షర్మిల మాత్రం రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. అయితే ఆర్థిక అవకతవకలకు సంబంధించిన కేసుల్లో వై.ఎస్.జగన్ జైలుకు వెళ్లాల్సి వచ్చినప్పుడు, ఆయన స్థాపించిన వైయస్సార్ కాంగ్రెస్‌ను జనంలోకి తీసుకెళ్లే బాధ్యతను తీసుకున్నారు షర్మిల.
2011లో వైయస్సార్సీపీ ప్రారంభిస్తే, 2012లో ఆమె ఆ పార్టీలో బాధ్యతలు తీసుకున్నారు. ఆ పార్టీ జాతీయ కన్వీనర్‌గా పదవి దక్కింది. పదవి కంటే కూడా జగన్ చెల్లిగా ఒక రకంగా పార్టీలో నంబర్ టూ స్థానాన్ని అందుకున్నారామె.
జగన్ జైల్లో ఉన్నప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో ఆ పార్టీ 15 అసెంబ్లీ సీట్లు గెలుచుకున్నప్పుడు ప్రచారంలో చురుగ్గా ఉన్నది షర్మిల, విజయలక్ష్మిలే.
ఆ తరువాత ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి వరకూ ఎవరూ చేయనట్టుగా 3 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకూ సాగిన యాత్ర, జగన్ జైల్లో ఉన్నప్పుడు ఆ పార్టీకి ఊపిరి పోసింది అని చెప్పవచ్చు.
ఇక 2019 ఎన్నికల ముందు బైబై బాబు పేరుతో 11 రోజులపాటు బస్సు యాత్ర చేసి ఆంధ్రాలో వైయస్సార్సీపీ తరఫున విస్తృత ప్రచారం చేశారు.

ఫొటో సోర్స్, YS SHARMILA REDDY/FB
అన్నతో విభేదాలు... సొంత పార్టీ ఏర్పాటు
జగన్ అధికారంలోకి వచ్చిన ఏడాది తరువాత పరిణామాలు మారుతూ వచ్చాయి. అన్నాచెల్లెళ్ల మధ్య ఏం జరిగింది అన్నది ఇప్పటికీ స్పష్టంగా అధికారికంగా ఇద్దరూ చెప్పలేదు. కానీ జగన్-షర్మిల మధ్య తీవ్ర విభేదాలు వచ్చాయని అర్థమవుతోంది.
2021 ఫిబ్రవరిలో షర్మిల వైయస్సార్సీపీతో తెగదెంపులు చేసుకున్నారు. 2021 ఏప్రిల్ 9వ తేదీన షర్మిల తెలంగాణలో తన కొత్త పార్టీని స్థాపిస్తున్నట్టు ప్రకటించారు. అదే ఏడాది అంటే 2021 జూలై 8న వైయస్ రాజశేఖర రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఖమ్మం వేదికగా పార్టీని ప్రారంభించారు షర్మిల.
ప్రారంభించిన మొదటి రోజు నుంచే తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. తెలంగాణలో వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. నిరాహారదీక్షలు కూడా చేశారు. కానీ, ఆవిడ ఆశించిన స్పందన జనం నుంచి రాలేదు.

ఫొటో సోర్స్, Ys Sharmila Office
సమైక్యవాది నుంచి తెలంగాణ కోడలి వరకూ..
తెలంగాణ ఉద్యమ సమయంలో షర్మిల స్పష్టమైన సమైక్యవాదిగా ఉన్నారు. తెలంగాణ విభజనను తప్పు పడుతూ ఆంధ్ర రాష్ట్ర ఎన్నికల్లో విస్తృత ప్రచారం చేశారు.
వైయస్సార్సీపీ తెలంగాణతో సంబంధాలు తెంచుకుని 2019లో అసలు తెలంగాణలో పోటీ చేయని సందర్భంలో కూడా షర్మిల స్పందించలేదు. కానీ అన్నతో విభేదాల తరువాత అకస్మాత్తుగా ఆమె తెలంగాణ ప్రాంతాన్ని తనదని చెప్పుకోవడం ప్రారంభించారు.
షర్మిల భర్త అనిల్ కుమార్ ఖమ్మం ప్రాంతం వారు కావడంతో, తాను తెలంగాణ కోడలిని అంటూ చెప్పుకునే వారు. తెలంగాణలో కూడా రాజన్న రాజ్యం తెస్తానంటూ ప్రచారం సాగించారు.
అయితే అన్న మీద కోపం ఉంటే ఆ రాష్ట్రంలో పార్టీ పెట్టాలి తప్ప ఇక్కడ పార్టీ ఏమిటంటూ తెలంగాణలోని ఆమె ప్రత్యర్థులు విమర్శించారు. ఆమె గతంలో ఎప్పుడూ తెలంగాణకు అనుకూలంగా లేరని వాదించారు. వాటిని ఆమె సమర్థంగా తిప్పికొట్టలేకపోయారు.

ఫొటో సోర్స్, @Congress4TS
కాంగ్రెస్‌లో చేరిక
వైయస్సార్ తెలంగాణ పార్టీ అంత సఫలం కాని సమయంలో అటు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఎన్నికల్లో పుంజుకుంటోన్న వేళ షర్మిల కూడా కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధమయ్యారు. ఆ మేరకు ఆమె దిల్లీ వెళ్లి రాహుల్, సోనియాలను కలిశారు.
2011లో తన అన్న కాంగ్రెస్ నుంచి వేరుపడ్డ తరువాత ఆ పార్టీపై తీవ్ర విమర్శలు చేసిన షర్మిల, మొదటిసారి 2023లో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడారు. తన తండ్రిని కేసుల్లో చేర్చడం అనేది కాంగ్రెస్ ఉద్దేశపూర్వకంగా చేసింది కాదంటూ కాంగ్రెస్‌ని వెనకేసుకువచ్చారు.
షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారంటూ వార్తలు వచ్చినప్పటికీ ఆమె ఆశించినట్టుగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ఆమెను ఆహ్వానించడానికి ఇక్కడి తెలంగాణ నాయకత్వం ఆసక్తి చూపలేదు.
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ మధ్యవర్తిత్వంలో ఈ వ్యవహారం అంతా జరిగినా, షర్మిలపై ఉన్న ఆంధ్ర ముద్ర తమకు వ్యతిరేకం కాగలదన్న విషయాన్ని కాంగ్రెస్ అధిష్టానానికి నచ్చచెప్పడంలో రేవంత్ రెడ్డి సహా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు సఫలమయ్యారు. దీంతో షర్మిల పార్టీ కాంగ్రెస్‌లో విలీనం వాయిదా పడింది.
తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తామంటూ ముందు నుంచీ చెప్తూ వచ్చిన షర్మిల సరిగ్గా ఎన్నికల ముందు తన నిర్ణయాన్ని మార్చుకున్నారు.
ఆ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే అవకాశాన్ని ఆపడం కోసమంటూ, తాను పోటీ నుంచి తప్పుకుని కాంగ్రెస్‌కి మద్దతిస్తున్నట్టుగా ప్రకటించారు.
తాను పోటీ చేయాలనుకున్న ఖమ్మం పాలేరులో కూడా తమ కుటుంబానికి చిరకాల మిత్రుడయిన పొంగులేటి శ్రీనివాస రెడ్డికి మద్దతిస్తున్నట్టు చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి బేషరతుగా మద్దతిచ్చిన షర్మిల, తెలంగాణలో కాంగ్రెస్ గెలిచిన తరువాత ఆ గెలుపులో తమకూ భాగం ఉందంటూ బహిరంగంగానే చెప్పారు.
అంతేకాదు, తెలంగాణలో కాంగ్రెస్ తక్కువ మెజార్టీతో గెలిచిన స్థానాలు తమ చలవేననీ, తాము పోటీ చేయకపోవడం వల్లే కాంగ్రెస్ దాదాపు 35 స్థానాల్లో గెలిచిందనీ షర్మిల మీడియా ముందు చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2

ఫొటో సోర్స్, YS SHARMILA REDDY/FB
షర్మిల నిర్ణయాన్ని ఆ పార్టీలో పనిచేసిన కొండా రాఘవ రెడ్డి, ఏపూరి సోమన్న వంటి నాయకులు తీవ్రంగా తప్పుపట్టారు. వైయస్సార్ తెలంగాణ పార్టీ ద్వారా సొంతంగా పోటీ చేయాలని ఆశించిన సోమన్న, ఇప్పటికీ వైయస్సార్సీపీతో మంచి సంబంధాలున్న కొండా రాఘవ రెడ్డి బహిరంగంగానే షర్మిల నిర్ణయాన్ని తప్పు పట్టారు.
అయితే, తెలంగాణలో షర్మిల రెండేళ్లు కష్టపడ్డా కనిపించని మద్దతు ఆంధ్రాలో షర్మిల కాంగ్రెస్‌లోకి వస్తుందనగానే కనిపించింది. ప్రస్తుత మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి తాను షర్మిలతో కలసి పనిచేస్తానని బహిరంగంగా ప్రకటించారు.
షర్మిల రాక మీకు ఇష్టమేనా అంటూ దిల్లీ కాంగ్రెస్ పెద్దలు సైతం ఆంధ్రా కాంగ్రెస్ నాయకులను దిల్లీ పిలిచి ప్రశ్నించారు. వాళ్లంతా షర్మిల రాకను స్వాగతించారు.
ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన తరువాత దారుణంగా దెబ్బతింది. 138 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఏ రాష్ట్రంలో చూడనంత ఘోర అపజయం ఆంధ్రాలో చూసింది ఆ పార్టీ.
అయినప్పటికీ బీజేపీ కంటే నాలుగు ఓట్లు ఎక్కువే ఉన్నాయి. రఘువీరా రెడ్డి, శైలజానాథ్, గిడుగు రుద్రరాజు, మస్తాన్ వలీ, సుంకర పద్మశ్రీ వంటి నాయకులు ఆంధ్రా కాంగ్రెస్ లో ఉన్నారు. ఇప్పుడు షర్మిల రాకతో మళ్లీ ఆంధ్రా కాంగ్రెస్ కి కాస్త ఊపిరి వస్తుందని ఆ పార్టీ అభిమానులు నమ్మకంగా ఉన్నారు.
ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంది?
2014 తరువాత కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో దెబ్బతిన్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే 2019లో భారతదేశంలోని మరే రాష్ట్రంలోని లేనంత తక్కువ ఓట్లు జాతీయ పార్టీలకు వచ్చింది కూడా ఆంధ్రప్రదేశ్‌లోనే.
ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, కమ్యూనిస్టులు సహా ఏ జాతీయ పార్టీకీ అవకాశం లేనంతగా ప్రాంతీయ పార్టీలు వచ్చేశాయి. అలాంటి రాజకీయ వాతావరణంలోనూ, ఉన్న ఆ నాలుగు జాతీయ పార్టీలతో పోల్చిచూస్తే, కాంగ్రెస్ పరిస్థితే కాస్త మెరుగ్గా ఉందని లెక్కలు చెబుతున్నాయి.
2019 శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్‌లో 1.17 శాతం ఓట్లు వచ్చాయి. జనసేన పార్టీ ఆ తరువాత స్థానంలో నిలిచింది. ఆ లెక్కన ఒక్క శాతం కూడా దాటని బీజేపీ, కమ్యూనిస్టులు, బీఎస్పీ కంటే మెరుగైన స్థానం కాంగ్రెస్‌కు వచ్చినట్టు అయింది.
నోటా కంటే కాస్త తక్కువ స్థానం. కానీ అదే ఎన్నికల్లో అప్పటికీ ఐదేళ్ల కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కంటే లక్ష ఓట్లు ఎక్కువ వచ్చాయి కాంగ్రెస్.
ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు దాదాపు 3.60 లక్షల ఓట్లు వస్తే, బీజేపీకి 2.60 లక్షల ఓట్లు మొత్తం రాష్ట్రం అంతా కలపి వచ్చాయి.
అప్పుడే జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 1.31 శాతం ఓట్లు, అంటే 4 లక్షల ఓట్లు వచ్చాయి. బీజేపీకి 3 లక్షల ఓట్లు వచ్చాయి.
ఆంధ్రప్రదేశ్‌లో షర్మిల ప్రభావమెంత?
షర్మిల రాకతో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ సమీకరణాల మార్పు గురించి చర్చ మొదలైంది.
అటు జగన్‌తో పనిచేయలేక, ఇటు తెలుగుదేశం, బీజేపీ వంటి పార్టీల్లో చేరలేక ఉండిపోయిన కాంగ్రెస్ నాయకులు మాత్రమే ఆ పార్టీలో కొనసాగుతున్న పరిస్థితుల్లో, షర్మిల రాక ఆసక్తి కలిగిస్తోంది.
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డికి జగన్ సీటు నిరాకరించడంతో ఏం చేయాలా అని ఆలోచిస్తున్న ఆయనకు షర్మిల – కాంగ్రెస్ కాంబినేషన్ కలసి వచ్చింది. అదే క్రమంలో మరింత మంది తమతో చేరతారని ఆ పార్టీ ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.
అయితే, ఇప్పుడు అందరి ముందున్న ప్రశ్నఒకటే.. ఆంధ్రలో షర్మిల ప్రభావం ఎంత? ఎవరికి నష్టం? ఎవరికి లాభం? అని.
వైఎస్సార్సీపీ ప్రారంభం తరువాత సంస్థాగతంగా కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్న దళిత, రెడ్డి, ముస్లింలతో పాటూ ఇతర కులాల్లోని కాంగ్రెస్ సానుభూతిపరులు జగన్‌తో కలసి పనిచేయడం ప్రారంభించారు.
2019 ఎన్నికల్లో జగన్ ఆ కాంబినేషన్‌ని మరింత బలపరచి, గతంలో కాంగ్రెస్‌కి ఎన్నడూ పనిచేయని బీసీ కులాలను కూడా తన వైపుకు తిప్పుకున్నారు. మరి ఇప్పుడు షర్మిల వచ్చిన తరువాత ఆ నాటి పాత కాంగ్రెస్ ఓటర్లను ఎంత వరకూ ఆకర్షిస్తారనేది చూడాలి.
ఇక్కడ ఒక ఆసక్తికర తెలంగాణ పరిణామం చెప్పాల్సి ఉంటుంది.
గత రెండు ఎన్నికల్లో బీఆర్ఎస్ వైపు నిలిచిన తెలంగాణ ముస్లింలు చాలా మంది, మొన్నటి ఎన్నికల్లో కొంతవరకు కాంగ్రెస్ వైపు మళ్లారు. బీఆర్ఎస్–బీజేపీ ఏకమయ్యాయి అనే ప్రచారమే అందుకు కారణమనే విశ్లేషణలు వినిపించాయి. ఏపీలో కూడా వైెఎస్సార్సీపీ, టీడీపీ, జనసేన – మూడు ప్రాంతీయ పార్టీలూ బీజేపీకి అనుకూలంగా ఉన్న వేళ, బీజేపీ వ్యతిరేకులు కాంగ్రెస్ వైపు చూడవచ్చన్నది ఒక వాదన.

ఫొటో సోర్స్, Bro Anil Kumar/FB
షర్మిల భర్త అనిల్ కుమార్ ఏం చేస్తారు?
గత ఎన్నికల్లో షర్మిల భర్త అనిల్ కుమార్ క్రైస్తవ సంఘాలను సమన్వయం చేసి క్రైస్తవుల ఓట్లు గంపగుత్తగా జగన్‌కు పడేలా విస్తృత కృషి చేశారు. రాష్ట్రంలో క్రైస్తవుల ఓట్లు దాదాపు 20 శాతం ఉంటాయి.
ఇప్పుడు షర్మిల కాంగ్రెస్‌లో చేరిన రోజే, ”మణిపూర్‌లో చర్చిలపై దాడులు ఒక క్రైస్తవురాలిగా తనను బాధించాయి” అని మాట్లాడారు.
జగన్ క్రైస్తవుడే అయినా బీజేపీతో ఉన్న అనుబంధం మూలంగా ఒక్కసారి కూడా మణిపూర్ విషయంలో పెదవి విప్పలేదు.
ఈ క్రమంలో బీజేపీని వ్యతిరేకిస్తూనే ప్రస్తుతానికి జగన్ వైపు నిలిచిన ముస్లిం, క్రైస్తవ ఓటర్లను ఆకర్షించి, జగన్‌తో పడకపోయినా వేరే పార్టీలలో చేరలేని రెడ్డి నాయకులను షర్మిల ఏకం చేయగలరా అన్నది కీలక ప్రశ్న.
విశ్లేషకులు ఏమంటున్నారు?
‘‘తెలంగాణలో షర్మిల ఎంత ప్రయత్నించినా ఆమె పట్ల విశ్వసనీయత ప్రశ్నార్థకంగానే ఉండేది. ఆమె బీజేపీకో, బీఆర్ఎస్‌కో అనుకూలంగానో లేదా, ఏదో వ్యూహంలో భాగంగానో పార్టీ పెట్టారు అన్నట్లు చూశారు చాలామంది” అంటూ బీబీసీతో చెప్పారు సీనియర్ పాత్రికేయులు మేరుగుమాల నాంచారయ్య.
“మొదట్లో కాంగ్రెస్‌ను విమర్శించి, తన అన్నలాగే వైఎస్సార్‌టీపీ కూడా కాంగ్రెస్ వ్యతిరేక శక్తి అన్న భావన కలిగించారు షర్మిల. ఇప్పుడు ఏపీలో షర్మిల ప్రభావం ఎలా ఉంటుందన్న దానితో సంబంధం లేకుండా ఆమె రాకను జగన్ వ్యతిరేకులు, టీడీపీ అనుకూల వర్గాలు పండగ చేసుకుంటున్నాయి. 'షర్మిల రాక వైఎస్సార్సీపీకి నష్టమ'ని వారు అనుకుంటున్నారు. అయితే, పాత కాంగ్రెస్ నాయకులు మళ్లీ షర్మిల వైపు వచ్చే అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయి” అని నాంచారయ్య అన్నారు.
ఆమె కాంగ్రెస్ పార్టీని జనసేనస్థాయికి అంటే పార్టీ ఓట్లను 5-6 శాతానికి తీసుకెళ్ళగలిగితే అది పెద్ద విజయంగా భావించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
అయితే, కాంగ్రెస్ చీల్చబోయే ఓట్ల వల్ల ప్రతిపక్షాలకే నష్టమనే వాదనతోనూ ఏకీభవించలేమని చెప్పిన నాంచారయ్య, "తెలంగాణలో బీజేపీ మూడవ పక్షంగా పెద్ద ఎత్తున ఓట్లు చీల్చినప్పటికీ, కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చింది" అని గుర్తు చేశారు.
ఏది ఏమైనా, షర్మిల కాంగ్రెస్‌లోకి రావడంతో వైఎస్సార్సీపీ శ్రేణులను ఆలోచనలో పడేశాయి. టీడీపీ వర్గాలకు ఈ పరిణామం కొంత ఉత్సాహాన్నిచ్చిందని చెప్పవచ్చు.
నాంచారయ్య చెప్పినట్లు, " ఎన్నికలు ముందు పొత్తుల కాంబినేషన్లు ఎలా ఉంటాయన్నది చాలా ముఖ్యం. అప్పుడే ఆమె ప్రభావాన్ని స్పష్టంగా అంచనా వేయగలం.’’
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: '2024 ఎన్నికల్లో కేవలం సంక్షేమ పథకాలే గెలిపించలేవని జగన్ భావిస్తున్నారా?'...ఇంచార్జ్‌ల మార్పులో వైసీపీ వ్యూహమేంటి?
- యూపీఐ పేమెంట్స్: పొరపాటున వేరే అకౌంట్‌కు డబ్బులు పంపినా, 4 గంటల్లో తిరిగి పొందొచ్చా?
- ఇరాన్: జనరల్ ఖాసిం సులేమానీ సమాధి వద్ద జంట పేలుళ్లు, 103 మంది మృతి, 141 మందికి గాయాలు
- ఆలివ్ ఆయిల్: చెడు కొలెస్ట్రాల్‌ను దూరం చేసే ఈ నూనె ధర ఎందుకు పెరుగుతోంది... దీనికి ప్రత్యామ్నాయం ఏమైనా ఉందా?
- తిన్నది ఒంటబట్టడానికి 7 చిట్కాలు.. పాటిస్తే సంపూర్ణ ఆరోగ్యం సొంతం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














