మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమి, మరి ఇండియా కూటమి భవిష్యత్తు ఏంటి?

ఫొటో సోర్స్, Getty Images
ఐదు రాష్ట్రాల శాసన సభలకు జరిగిన ఎన్నికల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ విజయం సాధించగా, తెలంగాణలో తొలిసారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.
భారతీయ జనతా పార్టీ మధ్యప్రదేశ్‌లో అధికారాన్ని నిలబెట్టుకోవడంతో పాటు, పొరుగునే ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోనూ కాంగ్రెస్‌ను ఓడించి అధికారం చేజిక్కించుకుంది.
రాజస్థాన్‌లో రెండోసారి గెలిచి వరుసగా రెండుసార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పార్టీగా నిలిచి, పాత సంప్రదాయానికి మంగళం పాడాలనుకున్న కాంగ్రెస్ ఆశ నెరవేరలేదు. ఎప్పటిలానే రాజస్థాన్‌లో ప్రభుత్వం మారనుంది. ఒక్క తెలంగాణలో మాత్రమే కాంగ్రెస్‌కి విజయం దక్కింది.
కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి బీఆర్‌ఎస్‌యేతర (గతంలో టీఆర్ఎస్) ప్రభుత్వం ఏర్పాటు కానుంది.
కేంద్రంలో బీజేపీని గద్దెదించాలనే లక్ష్యంతో 28 పార్టీలు ఏకమై 'ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంట్ ఇన్‌క్లూజివ్ అలయన్స్' (ఇండియా) కూటమిగా ఏర్పడిన నేపథ్యంలో ఈ ఎన్నికలు 2024 లోక్‌సభ ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా భావిస్తున్నారు.
డిసెంబర్ 6న దిల్లీలో నిర్వహించనున్న ఇండియా కూటమి పక్షాల సమావేశానికి హాజరుకావాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఇండియా కూటమి పార్టీలకు పిలుపునిచ్చారు.
రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం పెరిగింది. ఈ ఎన్నికల ఫలితాలు ఇండియా కూటమిపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఫలితాల తర్వాత కూటమిలోని పార్టీలు కూడా కాంగ్రెస్ వైఖరిపై ప్రశ్నలు లేవనెత్తాయి.

ఫొటో సోర్స్, ANI
నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా కాంగ్రెస్‌ను నేరుగా టార్గెట్ చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ చెప్పిన మాటలు బూటకమని తేలిపోయిందని, కూటమిని కూడా నిర్లక్ష్యం చేశారని ఆయన ఆరోపించారు.
''డిసెంబర్ 6న డిన్నర్‌కి రావాలని ఇండియా కూటమి పక్షాలకు కాంగ్రెస్ అధ్యక్షులు ఆహ్వానం పంపారు. మూడు నెలల తర్వాత ఇండియా కూటమి గుర్తొచ్చింది. చూద్దాం.. ఏం జరుగుతుందో'' అన్నారాయన.
అలాగే జేడీయూ కూడా కాంగ్రెస్‌పై విరుచుకుపడింది. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి ప్రతిపక్షంగా లేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి కేసీ త్యాగి అన్నారు.
''ఎంతో చరిత్ర కలిగిన సోషలిస్ట్ పార్టీలు ఆయా రాష్ట్రాల్లో ఉన్నాయి. కానీ కాంగ్రెస్ తన మిత్రపక్షాలైన ఇండియా కూటమిలోని పార్టీలను సంప్రదించలేదు. కనీసం వారి అభిప్రాయం కూడా అడగలేదు'' అని ఆయన అన్నారు.
''ఎన్నికల ప్రచారంలో భాగంగా భోపాల్‌లో ఇండియా కూటమి పక్షాల ర్యాలీ జరగాల్సి ఉంది. కానీ పార్టీ అందుకు ఒప్పుకోలేదు'' అన్నారు.

ఫొటో సోర్స్, ANI
అవకాశం చేజారిందా?
తొలిరోజు నుంచీ ఇండియా కూటమి అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ కూటమిలో భాగస్వాములుగా ఉన్న పార్టీలు అనేక రాష్ట్రాల్లో బద్దశత్రువులుగా ఉన్నాయి. ఒక పార్టీపై మరో పార్టీ ఎన్నికల్లోనూ పోటీ చేస్తున్నాయి.
దీనికి తోడు వివిధ సమస్యలు, వేర్వేరు అంశాలపై కాంగ్రెస్ వైఖరి, అభిప్రాయాలు కూడా వేరుగా ఉంటున్నాయి.
ఎన్నికల ఫలితాలను విశ్లేషించే సందర్భంలో సీనియర్ జర్నలిస్టు సీమా చిస్తీ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి, కాంగ్రెస్ అవకాశం కోల్పోయాయని అన్నారు.
ఈ ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీలను ఏకతాటిపైకి తెచ్చి రాజకీయ మార్పుకు శ్రీకారం చుట్టి ఉండొచ్చని, అది ఇండియా కూటమి స్ఫూర్తిని బలోపేతం చేస్తుందనేది ఆమె వాదన.
చిన్న పార్టీలను కలుపుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాలను పొందడంలో కాంగ్రెస్ తప్పు చేసిందని బీబీసీ హిందీ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ ఆమె అన్నారు.
''కూటమి ఏర్పాటు వల్ల జరగాల్సిన ప్రయోజనాలు కలగలేదు. తెలంగాణలో సీపీఐతో పొత్తుపెట్టుకున్నారు కానీ సీపీఎంతో కలవలేదు. ఇతర రాష్ట్రాల్లోనూ చిన్నపార్టీలతో కలిసి పోటీ చేయడం ద్వారా ప్రయోజనం పొందే వీలుంది. కానీ, కాంగ్రెస్ దానిని పట్టించుకోలేదు'' అని ఆమె అన్నారు.
''ఉదాహరణకు, అజిత్ జోగి పార్టీ జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్ ఓట్లు బీజేపీకి మళ్లాయి. రాజస్థాన్‌లో భారత్ ఆదివాసీ పార్టీ (బీఏపీ)తో పొత్తు పెట్టుకోవచ్చు. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా మధ్యప్రదేశ్‌లో పోటీ చేయాలనుకున్నారు. ఆయన పార్టీకి కూడా ఒకటి, రెండు సీట్లు ఇచ్చి ఉండొచ్చు'' అని వివరించారు సీమా.
''వామపక్షాలకు కొన్ని సీట్లు ఇచ్చి ఉంటే కొత్త రాజకీయాలను ఊహించొచ్చు. కానీ, కాంగ్రెస్ కూడా హిందూత్వ చుట్టూనే తిరిగింది. ఇలా అయితే మీరు హిందూత్వను సవాల్ చేయడం కాదు, దానిని మీరు ఎదుర్కోలేరు. అలాంటప్పుడు ఎవరైనా మిమ్మల్ని ఎందుకు ఎన్నుకోవాలి?'' అన్నారు.
తెలంగాణ పరిస్థితులు వేరని, స్థానికంగా ఉన్న అసమ్మతి కారణంగానే అక్కడ కాంగ్రెస్‌కి విజయం దక్కిందని సీనియర్ జర్నలిస్ట్ నళిన్ వర్మ అన్నారు.
బీబీసీ హిందీ పాడ్‌కాస్ట్‌లో ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తూ ''చిన్న పార్టీలను కలుపుకుని ఉంటే మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో కొంత ప్రయోజనం కలిగి ఉండేది. ఉదాహరణకు, అఖిలేష్ యాదవ్ పార్టీ అయిన సమాజ్‌వాదీ పార్టీకి మధ్యప్రదేశ్‌లో కొంత అవకాశం ఉంది. సమాజ్‌వాదీ పార్టీకి అక్కడ పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చి ఉంటే బిహార్, యూపీలోనూ పరిస్థితులు అనుకూలంగా మార్చుకునే అవకాశం వచ్చి ఉండేది. కానీ ఇప్పుడు దానికి ఇంకా చాలా సమయం పట్టేలా ఉంది. ఎందుకంటే, ప్రస్తుతం అక్కడ పరిస్థితులు అనుకూలంగా లేవు'' అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, TWITTER/KHARGE
బీజేపీని ఓడించడం అంత కష్టమా..
ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఇండియా కూటమి వైఫల్యంగా చూడలేమని, వాటి ఆధారంగా కూటమి భవిష్యత్తు గురించి మాట్లాడలేమని సీనియర్ జర్నలిస్ట్ నళిన్ వర్మ అభిప్రాయపడ్డారు.
''హిందీ బెల్ట్‌లోని మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో ఇండియా కూటమి నుంచి ఎవరెవరు పోటీ చేశారు? కేవలం కాంగ్రెస్ మాత్రమే. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ మధ్యనే పోటీ జరిగింది. దీనిని ఇండియా కూటమి పోటీగా చెప్పలేం'' అన్నారు.
ఈ ఎన్నికల ఫలితాలు అంత ప్రభావం చూపే అవకాశాలు లేవని స్వరాజ్ అభియాన్ నేత, ఎన్నికల విశ్లేషకులు యోగేంద్ర యాదవ్ అభిప్రాయపడ్డారు. ఎన్నికల ఫలితాలపై బీబీసీ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
''బీజేపీ గెలిచిన సీట్లు చూస్తే నంబర్లలో భారీ తేడాలేమీ కనిపించడం లేదు. గతంలోనూ ఆ మూడు రాష్ట్రాల్లో బీజేపీ గెలిచింది. మరోసారి ఆ రాష్ట్రాల్లో బీజేపీ గెలిచింది. అయితే, బీజేపీని ఓడించడం ఇంతకుముందు కంటే ఇప్పుడు కష్టమని మాత్రం చెప్పొచ్చు'' అన్నారాయన.
''అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినట్లే లోక్‌సభ ఎన్నికల్లోనూ జరగాలని లేదు. కానీ అధికారంలో మార్పు అంత తేలిక కాదని మాత్రం తేలిపోయింది'' అన్నారు.
''బీజేపీని గద్దెదించాలంటే గుజరాత్ నుంచి బిహార్ వరకూ ఉత్తర భారతంలో ఆ పార్టీని ఓడించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కాంగ్రెస్ సీట్లు గెలుచుకోవాల్సిన అవసరం ఉంది. కానీ, ఈ ఎన్నికల ఫలితాల తర్వాత అది మరింత కష్టతరంగా మారింది'' అని యోగేంద్ర యాదవ్ అన్నారు.

ఫొటో సోర్స్, ANI
కులగణన ప్రభావమెంత?
అధికారంలోకి వస్తే కులగణన చేపడతామని దాదాపు అన్ని సభలు, వేదికలపైనా కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తూ వచ్చింది. ప్రతిపక్షాల కూటమికి దేశవ్యాప్తంగా ఇది ప్రధానమైన అంశం.
ఈ ఏడాది జూలై 18న బెంగళూరులో జరిగిన సమావేశం అనంతరం కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఇండియా కూటమి సంయుక్త ప్రకటన కూడా విడుదల చేసింది.
కులగణన చేపడితే సంప్రదాయ హిందూ ఓటర్లలో, ముఖ్యంగా అగ్రవర్ణాల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని బీజేపీ ఆందోళన చెందుతున్నందున, కులగణన బీజేపీకి అంత సులభం కాదని ప్రతిపక్షాల భావన.
2024 లోక్‌సభ ఎన్నికలకు కూడా కులగణన ప్రధాన అంశంగా ప్రతిపక్ష పార్టీలు భావిస్తున్నాయి.
''ఉత్తర ప్రదేశ్, బిహార్‌లో మాదిరిగా సోషలిస్టు, వెనకబడిన తరగతుల ఉద్యమాల ప్రభావం మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో తక్కువ. బిహార్, యూపీలో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. అక్కడ కులగణన ప్రభావం ఉంటుంది. అందుకు అక్కడ అవకాశం ఉంది'' అని నళిన్ వర్మ అన్నారు.
''బిహార్‌లో కర్పూరీ ఠాకూర్ వర్సెస్ లాలూ ప్రసాద్ యాదవ్, ఉత్తర్ ప్రదేశ్‌లో లోహియా వర్సెస్ ములాయం సింగ్ యాదవ్ మధ్య జరిగినట్లుగా ఈ రాష్ట్రాల్లో అలాంటి పోటీ లేదు. అదే ఇక్కడ బీజేపీకి బలంగా మారింది. కాంగ్రెస్ కూడా ఇండియా కూటమి ఏర్పడిన తర్వాత నుంచే వెనకబడిన తరగతుల ఉద్యమం గురించి మాట్లాడుతోంది'' అని ఆయన వివరించారు.
ఉత్తర ప్రదేశ్, బిహార్‌తో పోలిస్తే రాజస్థాన్ మధ్యప్రదేశ్‌లో కులగణన గురించి అంతగా అవగాహన లేదని సీనియర్ జర్నలిస్ట్ సీమా చిస్తీ అభిప్రాయపడ్డారు.
''రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో భూస్వాముల వ్యవస్థ కారణంగా కులగణనపై పెద్దగా ఎవరూ మాట్లాడడం లేదు. ఈ రాష్ట్రాల్లో కులగణన ప్రభావం అంతగా ఉండకపోవచ్చు. ఎందుకంటే, అది ఇక్కడ కొంచెం కొత్తగా అనిపిస్తుంది. వెనకబడిన వర్గాల ఉద్యమాలు జరిగిన బిహార్‌తో పోలిస్తే వాటి ప్రభావం ఇక్కడ అంతగా ఉండకపోవచ్చు'' ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, PHOTO BY NIHARIKA KULKARNI/NURPHOTO VIA GETTY IMAGES
సీట్ల పంపిణీలో కొంత ఉదారం అవసరం
కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఏర్పాటు చేసిన సమావేశంలో లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల పంపిణీపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు.
ఈ ఎన్నికల ఫలితాలు కూటమిని మరింత దగ్గర చేస్తాయని స్వరాజ్ ఇండియా నేత యోగేంద్ర యాదవ్ అభిప్రాయపడ్డారు.
''ఈ పరాజయంతో ఇండియా కూటమి అంతర్గత సమీకరణాలు మారతాయి. ఒకవేళ కాంగ్రెస్ బలపడి ఉంటే కూటమి పక్షాల మధ్య సమస్య మరింత ముదిరి ఉండేది. ఈ పరాజయంతో కూటమి అవసరం చాలా ఉందని కాంగ్రెస్, ఇతర పక్షాలు కూడా అవగాహనకు వచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నా'' అని ఆయన అన్నారు.
బీజేపీ విజయం సాధించిన రాష్ట్రాల్లో భారత కూటమి ప్రభావం అంతగా లేదు. అయితే, రాజస్థాన్‌లో సీపీఎం, బీఏపీ(భారతీయ ఆదివాసీ పార్టీ )తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని ఉండి ఉంటే కమలం పార్టీకి విజయం కొంచెం కష్టమయ్యేది'' అన్నారు.
''మహారాష్ట్ర, ఝార్ఖండ్, బిహార్, అసోం, ఉత్తర ప్రదేశ్‌లలో ఈ కూటమి ఐక్యంగా ఉండడం చాలా అవసరం. నిజంగా అక్కడ చాలా అవసరం ఉంది. ఈ ఫలితాలతో సీట్ల పంపిణీ కొంత సులభతరం అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నా'' అన్నారాయన.
అయితే, ఈ అంచనాలు సరైనవో, కావో డిసెంబర్ 6న జరిగే సమావేశం తర్వాత తేలనుంది.
ఇవి కూడా చదవండి:
- కేసీఆర్, రేవంత్ రెడ్డి, ఈటల అక్కడ ఎలా ఓడిపోయారంటే...
- మీ నియోజకవర్గంలో ఎవరు గెలిచారు?
- ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా, ఆమోదించిన గవర్నర్
- తెలంగాణలో పోలింగ్ శాతం ఎందుకు తగ్గింది? పల్లెలు, పట్టణాల మధ్య అంత తేడాకు కారణమేంటి?
- తెలంగాణ ఎన్నికల్లో 70.35 శాతం పోలింగ్: అత్యధికంగా ఏ జిల్లాల్లో ఓటింగ్ నమోదైందంటే?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














