పన్ను హత్యకు అమెరికా సీక్రెట్ ఏజెంట్‌‌‌‌కే నిఖిల్ గుప్తా సుపారీ ఇచ్చారా? ఆ దేశం ఏం చెప్పింది...

గురుపట్వంత్ సింగ్ పన్ను

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గురుపట్వంత్ సింగ్ పన్ను

న్యూయార్క్‌‌లో ఉంటున్న ఒక వేర్పాటువాద నాయకుడిని హత్యమార్చేందుకు భారత్‌కు చెందిన నిఖిల్ గుప్తా ఒక వ్యక్తితో డీల్ కుదుర్చుకున్నాడని అమెరికా తెలిపింది. అందుకోసం అతనికి లక్ష డాలర్లు (రూ.83 లక్షలు) ఇచ్చినట్లు పేర్కొంది.

అమెరికా కోర్టులో సమర్పించిన పత్రాల ప్రకారం, భారత ప్రభుత్వంలో పనిచేస్తున్న ఒక ఉద్యోగి నుంచి నిఖిల్ గుప్తాకు ఆదేశాలు వచ్చాయి. నిఖిల్ గుప్తా వయసు 52 ఏళ్లని మీడియా కథనాలు చెబుతున్నాయి.

ఈ కుట్రలో భాగంగా, అంతం చేయాలనుకున్న ఆ వేర్పాటువాద నాయకుడెవరనే విషయం ప్రాసిక్యూషన్ ప్రస్తావించలేదు. అయితే, ఇండియన్ మీడియా, అంతర్జాతీయ మీడియా కథనాల మేరకు ఆ వేర్పాటువాద నాయకుడు లాయర్, సిక్కు వేర్పాటువాద నేత అయిన గురుపట్వంత్ సింగ్ పన్ను.

అమెరికా ఈ విషయాన్ని భారత్‌లోని ఉన్నత వర్గాల ముందు పెట్టింది. అనంతరం, ఈ ఆరోపణలను భారత్ సీరియస్‌గా తీసుకుంటోందని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ఒక ప్రకటన చేశారు.

అయితే, నేరారోపణల్లో భారతీయ అధికారి పేరు లేదని అరిందమ్ బాగ్చి గురువారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో తెలిపారు.

''భద్రతా వ్యవహారాలకు సంబంధించి అమెరికాతో జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా వ్యవస్థీకృత నేరస్తుల సంబంధాలు, టెర్రరిస్టులు, ఆయుధాల వ్యాపారులు, ఇతరుల గురించి అమెరికాతో కొంత సమాచారం షేర్ చేసుకున్నాం. దీనిపై దర్యాప్తు చేసేందుకు భారత్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (ప్రత్యేక దర్యాప్తు బృందం)ను ఏర్పాటు చేసింది'' అని బాగ్చి చెప్పారు.

గతంలో సిక్కు వేర్పాటువాద నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందని కెనడా కూడా ఆరోపించింది.

దీంతో అసలెవరీ గురుపట్వంత్ సింగ్ పన్ను అన్న ప్రశ్నతోపాటు, అమెరికా చెబుతున్నట్లు నిఖిల్ గుప్తా ఆయన్ను చంపడానికి ఎందుకు ప్రయత్నించాడు అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది.

గురుపట్వంత్ సింగ్ పన్ను

ఫొటో సోర్స్, SOCIAL MEDIA

ఎవరీ గురుపట్వంత్ సింగ్ పన్ను?

వృత్తిరీత్యా లాయర్‌ అయిన పన్ను కుటుంబం పంజాబ్‌లోని నాథు చక్ గ్రామంలో నివాసముండేది. అక్కడి నుంచి అమృత్‌సర్ సమీపంలోని ఖాన్‌కోట్‌కి మకాం మార్చింది. పన్ను తండ్రి మహిందర్ సింగ్ పంజాబ్ మార్కెటింగ్ బోర్డు సెక్రటరీ.

పన్నుకి ఒక సోదరుడు, సోదరి ఉన్నారు. ఆయన లుధియానాలో చదువుకున్నారు. 1990లలో పంజాబ్ యూనివర్సిటీ నుంచి లా చేశారు. కాలేజీ రోజుల్లో ఆయన విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా ఉండేవారు.

1991-92లో పన్ను అమెరికా వెళ్లారు. కనెక్టికట్ యూనివర్సిటీలో ఎంబీఏ (ఫైనాన్స్) పూర్తి చేశారు. అనంతరం న్యూయార్క్ యూనివర్సిటీ నుంచి లా పట్టా అందుకున్నారు.

చదువు పూర్తయిన తర్వాత న్యూయార్క్‌లోని వాల్‌స్ట్రీట్‌లో 2014 వరకూ సిస్టమ్ అనలిస్ట్‌గా పని చేశారు పన్ను. అదే సమయంలో రాజకీయంగానూ చురుగ్గా ఉంటూ వచ్చారు.

ఖలిస్తాన్ ఉద్యమం

ఫొటో సోర్స్, Getty Images

ఏంటీ 'సిక్కు ఫర్ జస్టిస్'

2007లో పన్ను 'సిక్కు ఫర్ జస్టిస్' అనే సంస్థను స్థాపించారు. అమెరికాలోని వాషింగ్టన్‌‌లో సంస్థ కార్యాలయాన్ని రిజిస్ట్రేషన్ చేశారు. తన న్యాయవాద వృత్తి కార్యకలాపాలు సాగిస్తున్న అదే కార్యాలయం నుంచి సంస్థ కార్యకలాపాలు కూడా కొనసాగించారు.

‘సిక్కు ఫర్ జస్టిస్’ సంస్థ భారత్ నుంచి పంజాబ్‌కి విముక్తి కావాలంటూ 'రిఫరెండం 2020' పేరుతో ఒక ప్రచారం ప్రారంభించింది. పంజాబీలకు స్వతంత్రం కావాలంటూ ఖలిస్తాన్ నినాదమిచ్చింది.

ఈ క్యాంపెయిన్‌లో భాగంగా ఖలిస్తాన్‌కు మద్దతుగా పంజాబ్‌లోని సిక్కులే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సిక్కులందరూ ఆన్‌లైన్ ద్వారా ఓటు వేయాలని కోరింది. అయితే, ఓటింగ్‌కు ముందే సిక్కు ఫర్ జస్టిస్ సహా ఖలిస్తాన్‌కు అనుకూలంగా చెబుతున్న 40 వెబ్‌సైట్‌లను భారత ప్రభుత్వం నిషేధించింది.

తమది మానవ హక్కుల సంఘంగా ఆ సంస్థ చెబుతోంది. అయితే, భారత్ ఆ సంస్థను టెర్రరిస్టు సంస్థగా ప్రకటించింది.

గురుపట్వంత్ సింగ్ పన్ను బెదిరింపులు

నవంబర్ 4 - ఎయిర్ ఇండియా విమానాలను టార్గెట్ చేయబోతున్నారనే చర్చ

సెప్టెంబరు 27 - టార్గెట్ ఐసీసీ వరల్డ్ కప్

సెప్టెంబర్ 21- కెనడాలోని హిందువులు దేశం విడిచి వెళ్లాలని బెదిరింపులు

సెప్టెంబర్ 10 - ప్రధాని మోదీ, అమిత్ షాలకు ముప్పు

ఆగస్టు 31- ఇందిరాగాంధీ విమానాశ్రయాన్ని పేల్చేస్తామని బెదిరింపు

ఆగస్ట్ 28 - అరుణాచల్ ప్రదేశ్ చైనాలో భాగమని ప్రకటన

ఆగస్టు 27 - దిల్లీ మెట్రో స్టేషన్ బయట ఖలిస్తానీ నినాదాలు

ఆగస్టు 25 - ఇస్రోకు ముప్పు

ఆగస్టు 9 - ఆగస్టు 15న ఖలిస్తానీ జెండాల ఎగురవేయాలని ప్రకటన

జూలై 31- హరియాణాను ఖలిస్తాన్‌ చేసేస్తామని బెదిరింపు

ఖలిస్తాన్ ఉద్యమం

ఫొటో సోర్స్, Getty Images

టెర్రరిస్టుగా ప్రకటించిన ఇండియా

చట్టవ్యతిరేక కార్యకలాపాల నిషేధిత చట్టం (అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ - యూఏపీఏ) 1967 కింద కేంద్ర హోం శాఖ 2020 జులై ఒకటిన తొమ్మిది మందిని టెర్రరిస్టులుగా ప్రకటించింది. ఈ చట్టానికి 2019లో సవరణలు చేశారు.

ఆ తొమ్మిది మంది జాబితాలో ఏడో పేరు గురుపట్వంత్ సింగ్ పన్నుది. అమెరికాలో నివాసముంటున్న పన్ను నిషేధిత సంస్థ 'సిక్కు ఫర్ జస్టిస్'‌లో కీలక సభ్యుడిగా కేంద్ర హోం శాఖ పేర్కొంది.

పన్ను భారత సరిహద్దుల వెలుపల, విదేశాల్లో ఉంటూ పలు టెర్రిరిస్టు కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు హోం శాఖ చెబుతోంది. దేశ వ్యతిరేక కార్యకలాపాలు, ఖలిస్తాన్ ఉద్యమంతో పాటు పంజాబ్‌లో టెర్రరిజాన్ని పునరుద్ధరిస్తూ దేశాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తున్నారని చెబుతోంది.

అంతకుముందే, 2019 జూలైలో యూఏపీఏ చట్టం కింద సిక్కు ఫర్ జస్టిస్ సంస్థను కేంద్ర హోం శాఖ నిషేధించింది.

జప్తు చేసిన ఆస్తులు

ఫొటో సోర్స్, X/@NIA_INDIA

ఆస్తులు సీజ్ చేసిన ఎన్‌ఐఏ

గురుపట్వంత్ సింగ్ పన్నుపై 2019 జనవరి 15న ఐపీసీ 120బీ, 124ఏ, 153ఏ, 153బీ, 505 సెక్షన్లతో పాటు యూఏపీఏలోని 13, 17, 18 సెక్షన్ల కింద జాతీయ దర్యాప్తు సంస్థ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ - ఎన్ఐఏ) కేసు నమోదు చేసింది.

దేశంతో పాటు విదేశాల్లో ఉంటున్న కొందరు వ్యక్తులు, సంస్థలు టెర్రరిస్టు సంస్థలతో కలిసి నేరపూరిత కుట్రకు పాల్పడ్డాయని, పంజాబీ రెఫరెండం 2020 ఫర్ ఖలిస్తాన్ పేరుతో క్యాంపెయిన్ ప్రారంభించాయని కేంద్ర ప్రభుత్వానికి విశ్వసనీయ సమాచారం ఉందని ఎన్‌ఐఏ తెలిపింది. ఆ సంస్థల్లో 'సిక్కు ఫర్ జస్టిస్' కూడా ఉంది.

సిక్కు ఫర్ జస్టిస్ వంటి సంస్థలు పంజాబ్‌ను భారత్‌ నుంచి వేరుచేయాలనే నినాదంతో సిక్కులను రెచ్చగొడుతున్నాయని, క్షేత్రస్థాయిలో టెర్రిరిస్టు, వేర్పాటువాద కార్యకలాపాలకు పాల్పడడంతో పాటు సోషల్ మీడియాలోనూ వ్యాప్తి చేస్తున్నాయని ఎన్‌ఐఏ పేర్కొంది.

గురుపట్వంత్ సింగ్ పన్ను స్థాపించిన సిక్కు ఫర్ జస్టిస్ వంటి వేర్పాటువాద, రాడికల్ శక్తులు దేశ సార్వభౌమత్వానికి, సమైక్యతకు, దేశ సమగ్రతకు ముప్పుగా పరిణమిస్తున్నాయని ఎన్‌ఐఏ తెలిపింది.

ఈ నేపథ్యంలో పంజాబ్‌, మొహాలీలోని ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు పట్వంత్‌కు చెందిన భూమిని, ఇంటిని జప్తు చేయాలని ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆదేశాలిచ్చింది.

కోర్టు ఆదేశాల మేరకు అమృత్‌సర్ దగ్గర్లోని ఖాన్‌కోట్‌ గ్రామంలో ఉన్న 5.7 ఎకరాల వ్యవసాయ భూమితో పాటు చండీగఢ్‌లోని సెక్టార్ 15సీలో ఉన్న ఇంటిలో కొంత భాగాన్ని జప్తు చేశారు.

యూఏపీఏ కింద నమోదైన కేసుల్లో పన్ను ఆస్తులు జప్తు చేశారు. ఎన్‌ఐఏ కోర్టు 2021 ఫిబ్రవరి 3న పన్నుపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2022 నవంబర్‌లో పన్నుని పరారీలో ఉన్న వ్యక్తిగా కోర్టు ప్రకటించింది.

ఖలిస్తాన్ ఉద్యమం

ఫొటో సోర్స్, Getty Images

పంజాబ్ యువతను రెచ్చగొడుతున్నారనే ఆరోపణలు

కరోనా సమయంలో 2020 ఏప్రిల్‌లో సెక్షన్ 124ఏ ఐపీసీతోపాటు యూఏపీఏ చట్టం 10ఏ, 13(1) సెక్షన్ల కింద పంజాబ్ పోలీసులు గురుపట్వంత్ సింగ్ పన్ను, నిషేధిత సంస్థ సిక్కు ఫర్ జస్టిస్‌పై కేసు నమోదు చేశారు.

దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని అందులో ఆరోపణలు చేశారు. ఆటోమేటెడ్ ఫోన్ కాల్స్ ద్వారా పంజాబ్ యువతను రెచ్చగొడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

పంజాబ్‌, చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన కొంతమందికి నార్త్ అమెరికాకు చెందిన ఒక అంతర్జాతీయ నంబర్ నుంచి ఫోన్ కాల్స్, మెసేజ్‌లు వచ్చేవని పంజాబ్ స్పెషల్ ఆపరేషన్ సెల్ ఏఐజీ వీరేంద్ర పాల్ సింగ్ తెలిపారు.

కోవిడ్ మహమ్మారి సమయంలో కర్ఫ్యూ, లాక్‌డౌన్‌ పేరుతో యువతను హింసిస్తున్నారని పన్ను ప్రచారం చేసేవారు. అలా యువతను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించేవారని వీరేంద్ర పాల్ చెప్పారు. అలాంటి ఫోన్ కాల్స్ ద్వారా సిక్కు వేర్పాటువాద అజెండాను వ్యాప్తి చేసేందుకు ప్రయత్నించేవారన్నారు.

ఆ ఫోన్ కాల్స్‌లో సిక్కు ఫర్ జస్టిస్ విధానాలను సమర్థిస్తే 1 నొక్కండి, ప్రధాన మంత్రి, భారత ప్రభుత్వ విధానాలను సమర్థించేట్లయితే 2 నొక్కండి అని వచ్చేదని పోలీసులు చెబుతున్నారు.

ఆ మెసేజ్‌లలో ప్రతి కరోనా వ్యాధిగ్రస్తుడికి సిక్కు ఫర్ జస్టిస్ 2 వేల రూపాయల ఆర్థిక సాయం అందజేస్తుందంటూ పన్ను వాయిస్ కూడా వినిపిస్తుందని పోలీసులు చెప్పారు.

అమెరికా అభియోగం

ఫొటో సోర్స్, US DEPARTMENT OF JUSTICE

ఫొటో క్యాప్షన్, నగదు లావాదేవీలకు సంబంధించి అమెరికా అభియోగపత్రంలో పేర్కొన్న ఫోటో

నిఖిల్ గుప్తా ఎవరు?

అమెరికా కోర్టులో సమర్పించిన అభియోగ పత్రాల ప్రకారం, భారత ప్రభుత్వంలో పనిచేస్తున్న ఒక అధికారి సూచనల మేరకు సిక్కు వేర్పాటువాదిని హత్య చేసేందుకు నిఖిల్ గుప్తా ఒక వ్యక్తితో డీల్ కుదుర్చుకున్నారు.

తనకు మాదక ద్రవ్యాలు, ఆయుధాలు, ఇంటర్నేషనల్ స్మగ్లింగ్‌లో ప్రమేయం ఉందని సదరు భారతీయ అధికారితో మాటల సందర్భంలో నిఖిల్ గుప్తా చెప్పారని కోర్టులో సమర్పించిన అభియోగపత్రంలో పేర్కొన్నారు.

నిఖిల్ గుప్తా డీల్ కుదుర్చుకున్న ఆ మూడో వ్యక్తి అమెరికా ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన అండర్‌కవర్ ఏజెంట్‌ అని, నిఖిల్‌తో జరిపిన సంభాషణలు, కార్యకలాపాలన్నింటినీ ఆ ఏజెంట్ రికార్డ్ చేశారని అభియోగపత్రంలో పేర్కొన్నారు.

భారతీయ అధికారి, నిఖిల్ గుప్తాకి మధ్య ఒక ఎన్‌క్రిప్టెడ్ యాప్ ద్వారా సంభాషణలు జరిగాయని, ఆ సమయంలో నిఖిల్ దిల్లీ, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నట్లు అమెరికన్ ఏజెన్సీ దర్యాప్తులో తేలిందని కోర్టుకి సమర్పించిన అభియోగ పత్రంలో ఉంది.

నిఖిల్ గుప్తాపై గుజరాత్‌లో ఒక క్రిమినల్ కేసు ఉందని, అందులో నుంచి బయటపడేసేందుకు ఆ భారతీయ అధికారి సాయం చేస్తానని హామీ ఇచ్చారని, ఇందుకు బదులుగా న్యూయార్క్‌లో ఒకరి హత్యకు అతను అంగీకరించినట్లు అభియోగపత్రంలో పేర్కొన్నారు.

అతనిపై ఉన్న క్రిమినల్ కేసుతో ఇబ్బంది లేదని, ఇక గుజరాత్ పోలీసుల నుంచి ఫోన్ కాల్స్ రావని భారతీయ అధికారి మే 12న గుప్తాకి చెప్పినట్లు తెలిపింది.

తన బాస్‌తో మాట్లాడానని, గుజరాత్ కేసు క్లోజయిందని, ఇక ఫోన్ కాల్స్ కూడా రావని మే 23న నిఖిల్ గుప్తాతో భారతీయ అధికారి చెప్పినట్లు పేర్కొంది.

నేరారోపణల నేపథ్యంలో అమెరికా అభ్యర్థన మేరకు 2023 జూన్ 30న నిఖాల్ గుప్తాను చెక్ రిపబ్లిక్‌లో అరెస్టు చేశారు. అతన్ని అమెరికాకు రప్పించనున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)