ఆంధ్రప్రదేశ్: ఇప్పటం గ్రామం ఇప్పుడెలా ఉంది, కూల్చేసిన చోట ఏం చేశారు?

ఇప్పటం గ్రామం
    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

ఏడాది క్రితం ఇప్పటం గ్రామం ఒక్కసారిగా హాట్ టాపిక్‌ అయిపోయింది. 2022 నవంబర్ మొదటి వారంలో ఆ ఊరు చుట్టూ పెద్ద రాజకీయ దుమారమే రేగింది.

విపక్ష పార్టీలకు చెందిన కార్యకర్తల ఇళ్లను ప్రభుత్వం కూల్చేస్తోందంటూ చెలరేగిన ఆ వివాదం చివరకు ఏపీ హైకోర్టు వరకూ వెళ్లింది.

ఇప్పటంలో ఏం జరిగిందన్నది ఆసక్తికర అంశం. అప్పట్లో అభివృద్ధిని అడ్డుకుంటున్నారంటూ పాలకపక్షం వాదించింది.

మరి ఈ ఏడాది కాలంలో ఏం అభివృద్ధి జరిగిందన్నది బీబీసీ మరోసారి పరిశీలించింది.

ఇప్పటం
ఫొటో క్యాప్షన్, ఇప్పటం: రోడ్డు విస్తరణ కోసం కూల్చిన ఇంటి నిర్మాణాలు

అప్పుడేం జరిగింది?

మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని ఓ చిన్న గ్రామం ఇప్పటం. వ్యవసాయాధారిత ప్రాంతం. రెడ్లు, కాపులు, గౌడ కులస్తులు ఎక్కువగా నివసిస్తారు.

ఈ గ్రామానికి చెందిన రైతుల భూముల్లో జనసేన ఆవిర్భావ సభను నిర్వహించింది. పవన్ కల్యాణ్ ఆ సభలో పాల్గొని ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు చేశారు.

ఆ సభ జరిగిన కొన్ని నెలలకు ఇప్పటంలో రోడ్డు విస్తరణ పేరుతో ఆక్రమణల తొలగింపు జరిగింది. నోటీసులు ఇచ్చి కొన్ని గోడలు, వాటిని ఆనుకుని ఉన్న నిర్మాణాలను తొలగించారు.

జనసేన సభ నిర్వహణకు సహకరించిన వారిపై కక్షతోనే ఈ కార్యక్రమం అంటూ అప్పట్లో జనసేన ఆందోళనకు దిగింది. ఆపార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఏకంగా వాహనంపైన కూర్చుని ప్రయాణించడం ద్వారా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటంలో పర్యటించి బాధితులకు అండగా ఉంటామని తెలిపారు.

పవన్ కల్యాణ్‌తో పాటుగా తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, బీజేపీ, సీపీఎం సహా వివిధ ప్రతిపక్ష నేతలు కూడా ఇప్పటంలో పర్యటించడంతో కొన్ని రోజుల పాటు ఈ ఊరు వార్తల్లో నానింది.

ఇప్పటం

ఇప్పుడెలా ఉంది?

ఏడాది తర్వాత ప్రస్తుతం గ్రామం పరిధిలో సుమారు 500 మీటర్ల మేర రోడ్డు అభివృద్ధి చేస్తున్నారు. ఇంకా కొన్ని పనులు జరుగుతున్నాయి.

కొంతమేరకు రోడ్డు విస్తరించారు. పూర్వం 12 అడుగుల రోడ్డు మాత్రమే ఉండగా ప్రస్తుతం 60 అడుగుల రోడ్డు సిద్ధమవుతోంది. డివైడర్ నిర్మించారు. సెంట్రల్ లైటింగ్ కూడా ఏర్పాటు చేశారు.

రోడ్డు పనులు ఇంకా కొంత భాగం పెండింగులో ఉన్నాయి. రామాలయం ప్రాంతంలో పనులు జరగాల్సి ఉంది. రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీ నిర్మాణం కోసం పనులు సాగుతున్నాయి.

అప్పట్లో రోడ్డు విస్తరణలో అడ్డంగా ఉన్నాయనే పేరుతో పంచాయతీ వద్ద జాతీయ నాయకుల విగ్రహాలు కొన్ని తొలగించారు. వాటిని మళ్లీ ఏర్పాటు చేశారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం కూడా అప్పట్లో తొలగించారు. ఇప్పుడు మరోసారి విగ్రహాల ఏర్పాటు ప్రయత్నం జరుగుతోంది.

ఇప్పటం
ఫొటో క్యాప్షన్, సరిగ్గా గ్రామంలో ప్రవేశించే వరకూ 12అడుగుల రోడ్డు.

డిసెంబర్ 15 నాటికి పూర్తి చేస్తాం

రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన స్పెషల్ గ్రాంట్ నిధులతో ఇప్పటంలో అభివృద్ధి పనులు చేపట్టారు.

మొత్తం రూ. 3 కోట్ల రూపాయలతో ఇప్పటం మెయిన్ రోడ్డు అభివృద్ధి చేస్తున్నట్టు మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ నిర్మల్ కుమార్ అన్నారు.

‘‘ప్రభుత్వం ప్రత్యేక నిధులు ఇచ్చింది. కార్పొరేషన్ పరిధిలో దశల వారీగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అనేక చోట్ల రోడ్లు విస్తరణ, గ్రీనరీ ఏర్పాటు వంటివి చేస్తున్నాం. ఇప్పటంలో కూడా అందులో భాగంగానే పనులు చేపట్టాం. కొందరి అభ్యంతరాల కారణంగా స్వల్ప జాప్యం జరిగింది. ప్రస్తుతం పనులు పూర్తి కావొస్తున్నాయి. డిసెంబర్ 15 నాటికి మిగిలిన రోడ్డు భాగం పూర్తి చేసి, ఇరువైపులా డ్రైనేజీలను కూడా సిద్ధం చేస్తాం. వాటితో పాటుగా నాయకుల విగ్రహాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. డ్రైనేజీల సమీపంలో కార్పొరేషన్ స్థలం ఉంది. అక్కడే విగ్రహాలు వస్తాయి" అంటూ ఆయన వివరించారు.

కార్పొరేషన్ పరిధిలోని మిగిలిన ప్రాంతాల్లో కూడా అదే రీతిలో సుందరీకరణ చేస్తామని ఆయన బీబీసీతో అన్నారు.

ఇప్పటం గ్రామం

పూర్తిగా చేస్తేనే నమ్ముతాం

ఇప్పటంలో జరుగుతున్న అభివృద్ధి ప్రస్తుతానికి అరకొరగానే ఉంది. కొన్ని ప్రాంతాలకే పరిమితమైనట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా డ్రైనేజీ నిర్మాణం పూర్తి కాలేదు. అందులోనూ కాపులు నివసించే ప్రాంతంలోనే ఈ పనులు పెండింగులో కనిపిస్తున్నాయి.

అరకొరగా కాకుండా మొత్తం పనులన్నీ పూర్తి చేస్తేనే ప్రభుత్వం చెబుతున్న మాటలను నమ్మగలమని అంటున్నారు స్థానిక జనసేన నేతలు. అప్పట్లో కార్పొరేషన్ తీరుని తప్పుబడుతూ ఇప్పటం వాసులు ఏపీ హైకోర్టుని ఆశ్రయించారు. ఆ కేసు ఇంకా విచారణలోనే ఉంది.

అదే సమయంలో తమ మీద పెట్టిన కేసులు కూడా కొనసాగుతున్నాయని జనసేన ఇప్పటం గ్రామ నాయకుడు సాదు చంద్రశేఖర్ అన్నారు.

‘‘ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంటే ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ, కక్షపూరితంగా వ్యవహరించడాన్నే మేం తప్పుబట్టాం. ఇప్పుడు కూడా రామాలయం ఆనుకుని ఉన్న రోడ్డు పనులు జరగడం లేదు. మా ప్రాంతంలో డ్రైన్ పనులు జరగడం లేదు. అభివృద్ధి కొందరికేనా అని మేం ప్రశ్నిస్తున్నాం. ఇటీవల గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకెళ్లాం. ఆయన అంతా అభివృద్ధి చేస్తామని చెప్పారు. అది కూడా జరిగితేనే నమ్మకం కలుగుతుంది’’ అని బీబీసీతో చంద్రశేఖర్ అన్నారు.

సామరస్యంగా, అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని పనులు చేసి ఉంటే ఏ సమస్య ఉండకపోయేది అని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇప్పటం గ్రామం

రోడ్డంతా విస్తరించాలి

ఇప్పటం వెళ్లేందుకు జాతీయ రహదారి నుంచి కొలనుకొండ, వడ్డేశ్వరం మీదుగా ఉన్న రోడ్డును ఎక్కువ మంది వినియోగిస్తారు. ఈ రోడ్డు ఇప్పటం మీదుగా పెద వడ్లపూడి వైపు ఉంటుంది.

అయితే ఎన్‌హెచ్ నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉండే ఇప్పటం గ్రామంలోని అర కిలోమీటరు మేర మాత్రమే ప్రస్తుతం రోడ్డు అభివృద్ధి చేశారు. మిగిలిన భాగమంతా ఎటువంటి విస్తరణ జరగలేదు.

ముఖ్యంగా కొలనుకొండ, వడ్డేశ్వరం వంటి గ్రామాల్లో కేవలం 12 అడుగుల రోడ్డు మాత్రమే ఉంటుంది. అది గ్రామంలో ఇరుకు సందులా ఉంటుంది. ఒక వాహనం ఎదురుగా వస్తే రెండో వాహనం తప్పించుకోవడం కూడా కష్టమన్నట్టుగా ఉంటుంది.

కానీ 4 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత ఆ రోడ్డులో ఇప్పటం చేరే సరికి జాతీయ రహదారిని తలపించేలా నాలుగు లైన్ల రోడ్డు సిద్ధం అవుతోంది. 60 అడుగుల వెడల్పుతో సిద్ధం చేస్తున్నారు. మళ్లీ ఇప్పటం గ్రామం దాటగానే రోడ్డు 12 అడుగులు మాత్రమే ఉంది. అంటే కేవలం ఇప్పటం ఊరిలో మాత్రమే రోడ్డు వెడల్పుగా ఉంటే ఏం ప్రయోజనం అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.

"రోడ్డు బాగుంది. అప్పుడు కూడా బాగుండేది. కానీ ఇప్పుడు బాగా విస్తరించడం వల్ల ఇంకా బాగుంది. కానీ కేవలం ఇక్కడ కొంత భాగం మాత్రమే అభివృద్ధి చేస్తే ఏం ఉపయోగం. రోడ్డు అంతా వెడల్పు చేస్తే వచ్చీ పోయే వాళ్లకు బాగుంటుంది. పైగా పెద్ద పెద్ద వాహనాలు కూడా వచ్చే రోడ్డు కూడా కాదు. అయినా 60 అడుగులు ఇక్కడ వేసి, మిగిలిన అంతా వదిలేయడం వల్ల ఉపయోగం ఉండదు" అంటూ ఇప్పటం గ్రామానికి చెందిన పులి శివనాగమణి అన్నారు.

అధికారులు ఆలోచించి, మరింత మెరుగైన రీతిలో మొత్తం రోడ్డు అందుబాటులోకి తీసుకురావాలని ఆమె కోరారు.

వీడియో క్యాప్షన్, పవన్ కల్యాణ్ సభ పెట్టిన ఇప్పటం గ్రామం ఇప్పుడెలా ఉంది?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)