క్లియోపాత్రాకు ఇష్టమైన ఊదారంగు దుస్తులు వేసుకున్నందుకు స్నేహితుడిని చంపించిన రోమన్ చక్రవర్తి... బంగారం కన్నా ఖరీదైన ఆనాటి 'పర్పుల్ కలర్ కథేంటి?

క్లియో పాత్ర

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, క్లియోపాత్ర

మనుషుల మధ్య తెలుపు. నలుపు రంగుల భేదాలు ఎప్పటి నుంచో రాజ్యమేలుతున్నాయి. కానీ, ఓ రంగు మాత్రం పూర్తిగా రాచరికపు చిహ్నంగా, రాజదర్పానికి ప్రతీకగా మారింది. ఆ రంగు తమకంటే ఎవరైనా చిన్నవారు ధరించినా భరించలేనంత అసూయ ఆ నాటి రోమన్ రాజులకు కలిగిందంటే వారు ఆ రంగు కోసం ప్రాణాలు ఇవ్వకపోయినా తీశారని అర్థమవుతుంది.

ఓ వెయ్యేళ్ళ కిందట ఈ భూమిమీద టైరియన్ పర్పుల్ రంగు అత్యంత ఖరీదైనది. కానీ, దాని తయారీ విధానం కనుమరుగైంది. అయితే, ప్రాచీన గుర్తులన్నింటినీ ఒకచోట చేర్చి ఓ వ్యక్తి ఈ రంగును మళ్ళీ మనుగడలోకి తీసుకువస్తే..?

ఎప్పుడో అదృశ్యమైన ఒక నది ఒడ్డున సిరియా ఎడారిలో పాడుపడినట్లుగా కనిపిస్తున్న ఖత్నా ప్రాంతంలో అవి మరకల్లా కనిపిస్తున్నాయి. మూడువేళ ఏళ్ళ తరువాత పురావస్తు శాస్త్రవేత్తలకు ఇక్కడ పరిశోధనలు చేయడానికి అవకాశం దొరికింది. వారిప్పుడొక రాజ సమాధి కోసం వెతుకుతున్నారు.

విశాలమైన హాళ్ళు, ఇరుకైన నడవాల ద్వారా, శిథిలమైన మెట్ల గుండా వారు ఓ గది వద్దకు చేరుకున్నారు. అక్కడ మూసి ఉంచిన ద్వారం వద్ద ఇరువైపులా ఒకేరూపంలో ఉన్న ఇద్దరు ద్వార పాలకుల విగ్రహాలు ఉన్నాయి. గదిలోపల సుమారు రెండువేల రకాల వస్తువులు ఉన్నాయి. వాటిల్లో బంగారు ఆభరణాలతోపాటు, ఓ పెద్ద బంగారు చేయి కూడా ఉంది. అలాగే, అక్కడ నేలపై ఏవో రహస్యం చెబుతున్నట్లుగా కొన్ని నల్లని మరకలు ఉన్నాయి. దుమ్ముధూళి మధ్య ఉన్న ఆ మరకలను వారు శుభ్రం చేసి, దానిపైనున్న పొరను సేకరించి పరీక్షకు పంపారు.

అలా ప్రాచీన కాలంలో అత్యంత అపురూపమైన వస్తువు జాడను పరిశోధకులు గుర్తించారు. ఈ అపురూపమైన వస్తువుతో చక్రవర్తులు రాజ్యలేలారు. ఎందరో రాజులను పడగొట్టారు. తరాలతరబడి ప్రపంచాన్ని ఏలారు. ఈజిప్ట్ రాణి క్లియోపాత్రకు ఈ వస్తువంటే తగని మక్కువ. ఆమె తన పడవ తెరచాపలకు కూడా దీనిని వినియోగించేవారు. కొందరు రోమన్ సామ్రాట్‌లు తాము తప్ప ఇతరులు ఎవరైనా దీనిని ధరిస్తే మరణశిక్ష విధించేవారు.

ఇంతకీ, అదేమిటంటారా? అదే టైరియన్ పర్పుల్. దీనినే షెల్‌ఫిష్ పర్పుల్ అని కూడా అంటారు. అప్పట్లో దీనిని బంగారం కంటే మూడురెట్లు విలువైనదిగా భావించేవారని క్రీస్తు శకం 301 నాటి శాసనం చెపుతోంది. దీన్ని ఎలా తయారుచేస్తారో తెలిసినవారెవరూ భూమ్మీద బతికి లేరు. 15వ శతాబ్దం నాటికి ఈ రంగును తయారుచేసే విధానం పూర్తిగా కనుమరుగైపోయింది.

ఈ అత్యంత విలువైన, ఆకర్షణీయమైన రంగు ఎలా అదృశ్యమైపోయింది. దీనిని ఎవరూ ఎందుకు తిరిగి తయారు చేయలేకపోయారు?

గ్లాడియేటర్ ప్లేస్

ఫొటో సోర్స్, SALVATORE LAPORTA/KONTROLAB/LIGHTROCKET VIA GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, రోమ్‌లోని గ్లాడియేటర్‌లు తలపడే స్థలం. వీటిని తిలకించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున వచ్చేవారు

ఈ రంగు రోమన్ సామ్రాజ్యపు హంగు

ఒకనాడు సామ్రాజ్యంగా విలసిల్లిన కార్తెజ్‌కు కొద్దిదూరంలో తునీషియా ఈశాన్య మూలన ఓ చిన్నతోటలోని గుడిసెలో గడిచిన 16 ఏళ్ళుగా సమద్రపు నత్తలను పగులకొట్టి టైరియన్ పర్పుల్‌ను కలిగి ఉండే వాటి భాగాలను కలపాలని ప్రయత్నిస్తున్నారు.

టైరియన్ పర్పుల్ అనేది ఆనాటి సమాజంలో బలానికి, సార్వభౌమత్వానికి, డబ్బుకు చిహ్నంగా చూసేవారు. దీనిని సమాజంలో ఉన్నత స్థానాలలో ఉన్నవారు మాత్రమే వినియోగించేవారు. దానిని ఉపయోగించే తీరు ఆధారంగా ప్రాచీన రచయితలు దీనిని ఘనీభవించిన రక్తం, కొంత నలుపు, ముదురు ఎరుపు, వైలెట్ కలర్ అని అభివర్ణించారు. దీనిపై వెలుతురుపడితే జిగేల్మంటుందని 23 బీసీకి చెందిన ప్లిన్దీ ఎల్డర్ అనే రోమన్ విద్యావేత్త, చరిత్రకారుడు పేర్కొన్నారు.

ఈ రంగు ప్రాచీననాగరికతలో ముఖ్యంగా దక్షిణ యూరోప్, ఉత్తర ఆప్రికా, పశ్చిమాసియాలో బాగా ఇష్టపడేవారు. ఈ రంగుస్వభావం, ఉతికినా వెలిసిపోని దీని గుణం అందరికీ తెగనచ్చేది.

మధ్యధరా సముద్ర తీరాన ఉండేవారికి ఈ రంగు ఎంతో నచ్చింది. వారు తమ నగరం పేరు కలిసొచ్చేలా దీనికి ‘టైర్’ అని పేరు పెట్టారు. వీరిని పర్పుల్ పీపుల్ అని కూడా పిలిచేవారు.

ఈ రంగు దుస్తులు, బోటు ప్రయాణాలు, ఛాయాచిత్రాలు, ఫర్నీచర్, ప్లాస్టర్, వాల్ పెయింటింగ్స్, బంగారు ఆభరణాలతోపాటు చివరకు సమాధులపై కూడా విరివిగా వినియోగించేవారు.

40 బీసీలో రోమన్ చక్రవర్తి హఠాత్తుగా మౌరిటానియా రాజును చంపమని ఆజ్ఞాపించారు. ఈయన రోమన్లకు స్నేహితుడు కావడంతో ఓ గ్లాడియేటర్ మ్యాచ్ చూడటానికి పర్పుల్ రంగులో ఉన్న దుస్తులు ధరించి వెళ్ళారు. దీనిని సహించలేక రోమన్ చక్రవర్తి ఈ ఆదేశం ఇచ్చారు. కొన్ని సందర్భాలలో తీవ్రమైన అసూయ, తీరని కామాన్ని కలిగించడంతోపాటు ఒక్కోసారి ఒకరకమైన ఉన్మాదానికి కూడా ఈ రంగు కారణమయ్యేది.

నత్తగుల్లలు

ఫొటో సోర్స్, DE AGOSTINI VIA GETTY IMAGES/DE AGOSTINI VIA GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, నత్తగుల్లల నుంచి పర్పుల్ కలర్ తయారుచేసేవారు

నత్తగుల్లల నుంచి రంగు తయారీ

టైరియన్ పర్పులు మూడురకాలైన సముద్రపు నత్తల స్రావాల నుంచి తయారు చేస్తారు. ఒక్కో నత్త గుల్ల నుంచి ఒక్కోరకమైన రంగును తయారుచేస్తారు. నీలం రంగుతో ఉన్న పర్పుల్,ఎరుపు కలిసిన పర్పుల్, ఎరుపు రంగు కలిపి ఈ విభిన్నమైన పర్పుల్ రంగును తయారుచేసేవారు. తీరప్రాంతాలలోని మూరెక్స్ నత్తగుల్లలను సేకరించేవారు. వీటిని వలల ద్వారా కానీ, చేతులతోకానీ పట్టుకునేవారు. వెంటనే వాటిపైనున్న బురదను కూడా సేకరించేవారు. కొన్ని ప్రాంతాలలో మ్యూకస్ గ్రంథులను కోసేవారు.

ఓ రోమన్ రచయిత ప్రకారం, శ్లేష్మ గ్రంధులను కోయడం వలన నత్తగుల్లలు మ్యూకస్‌ను కన్నీటిలా స్రవించేవి. దీనిని సేకరించాకా వీటిని గుంతలో భద్రపరిచేవారు. మిగిలిన నత్తగుల్లల ముక్కలను నలిపివేసేవారు.

ఆ డై ఎలా తయారుచేస్తారో ఎవరికీ తెలియదు

ఈ రంగు గురించి చారిత్రక పత్రాలలో చాలా ఉంది. ఏ రంగు లేని నత్తల శ్లేష్మంతో ముదురు పర్పుల్ రంగును ఎలా తయారుచేసేవారో పూర్తి సమాచారాన్ని ప్లినీ ఇచ్చారు. దీని గురించిన పూర్తి వివరాలను ఆయన రాశారు.

‘‘మ్యూకస్ గ్రంధిని వేరు చేశాక, వాటిపై ఉప్పువేసి మూడురోజులు ఊరనిచ్చేవారు. బాగా పులిశాక మీడియమ్స్ అని పిలిచే సన్నని పాత్రలలో మంటపై పెట్టేవారు. ఈ పదార్థమంతా బాగా ఉడికి కొద్దిమొత్తం అయ్యేలా చేసేవారు. దీని తరవాత పదోరోజున ఈ రంగును ఓ వస్త్రానికి అద్ది పరీక్షించేవారు. ఆ వస్త్రం తాము అనుకున్న రంగులోకి మారితే, రంగు సిద్ధమైందని అర్థం’ అని తెలిపారు.

ఇందులో కష్టమేమంటే నత్తగుల్లల నుంచి చాలా కొద్దిమొత్తం మాత్రమే మ్యూకస్ వచ్చేది. దీంతో ఒక గ్రాము టైరియన్ పర్పుల్ రంగు తయారుచేయాలంటే దాదాపు 10వేల నత్తగుల్లలు అవసరమయ్యేవి. ఈ రంగు అచ్చులు తయారుచేసే చోట లక్షలాది నత్తగుల్లలు కనిపించేవి. టైరియన్ పర్పుల్ రంగు తయారీని మొదటి రసాయన పరిశ్రమగా వర్ణించేవారు.

‘రంగు వేయడమనేది అంత తేలికైన పనేమీ కాదు’ అని గ్రీసులోని అరిస్టాటిల్ యూనివర్సిటీ ఆఫ్ థెస్సాలోంకిలో కన్జర్వేషన్ కెమిస్ట్రీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న అయోనిస్ కర్పనాగియోటిస్ చెప్పారు. టైరియన్ పర్పుల్ మిగతా రంగులాంటిది కాదు. మిగతా రంగులకు ఉపయోగించే పత్రాలు తదితర వాటిల్లో వర్ణద్రవ్యాలు సహజంగానే ఉంటాయి. కానీ సముద్రపు నత్తల శ్లేష్మంలోని రసాయనాలు రంగులా మారడం అదీ కచ్చితమైన పరిస్థితులలో, నిజంగా అద్భుతం’ అని ఆయన తెలిపారు.

1453 మే 29న తెల్లవారుజామున కానిస్టెంట్‌నోపుల్‌లోని బైజంటైన్ నగరాన్ని ఒట్టోమాన్లు స్వాధీనం చేసుకున్నారు. దీంతో తూర్పు రోమన్ సామ్రాజ్యం కథ ముగిసింది. దాంతోపాటే టైరియన్ పర్పుల్ రంగు కూడా.

ఆ సమయంలో నగరం మధ్య ఈ రంగు పరిశ్రమ వర్థిల్లుతోంది. కాథలిక్ పూజారులు పర్పుల్ కలర్‌తో తయారుచేసిన దుస్తులు ధరించేవారు. తమ మతగ్రంథాలను పర్పుల్ రంగు వస్త్రాలలో భద్రపరిచేవారు. అయితే, భారీ పన్నులు విధించిన కారణంగా అప్పటికే ఈ పరిశ్రమ మూతపడే దశకు చేరుకుంది.

ఒట్టోమాన్ ఆక్రమణ తరువాత క్రిస్టియన్ నాయకులు ఆధిపత్యాన్ని కోల్పోయారు. దీని తరువాత పోప్ క్రిస్టియానిటికి ఎరుపురంగును గుర్తుగా మార్చారు. పైగా ఈ రంగును కొన్ని కీటకాల నుంచి తేలికగా తయారు చేయవచ్చు. అయితే, టైరియాన్ పర్పుల్ అదృశ్యమైపోవడం వెనుక ఇతర కారణాలు కూడా ఉండి ఉండవచ్చు.

2003లో పురాతన అండ్రయిరక్ ఓడరేవు సమీపంలో భారీ నత్తగుల్లల పెంకులకుప్పను కనుగొన్నారు. ఇవి ఆరవ శతాబ్దానికి చెందినవని, దాదాపు 600 లక్షల నత్తగుల్లలు ఉండవచ్చని అంచనా కట్టారు. వీటిని ఆ సమయంలో పెద్ద ఎత్తున వినియోగించారని భావించారు.

భారీ వినియోగం కారణంగా కూడా నత్తగుల్లల లభ్యత క్షీణించడం కూడా ఈ పరిశ్రమ మూతపడేందుకు కారణమై ఉండొచ్చు. కానీ, కొన్నేళ్ళ తరువాత ఈ పురాతన రంగు పున:సృష్టిపై ఆశ రేకెత్తింది.

మహమ్మద్ ఘాసెన్ నోయిరా

ఫొటో సోర్స్, mohammed ghassen noiraIMAGE SOURCE,FETHI BELAID/AFP VIA GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, మహమ్మద్ ఘాసెన్ నోయిరా

ఆధునిక కాలంలో ప్రాచీన రంగులు

సెప్టెంబరు 2007 టునిషియా శివార్లలోని టునిస్‌లో నివసించే మహహ్మద్ గాసిన్ నోయిరా సముద్రపు ఒడ్డున నడిచి వెళుతున్నాడు.

‘‘గతరాత్రి తుపాను వచ్చింది. దీంతో, ఒడ్డున జెల్లీఫిష్, సీవెడ్,చిన్నచిన్న పీతలు, చచ్చి పడి ఉన్నాయి. మరికొన్ని అక్కడా ఇక్కడ కనిపిస్తున్నాయి. కానీ ఒక చోట సముద్రపు నత్త నుంచి ఎరుపు వయెలెట్ రంగు బయటకు వస్తున్నట్టు కనిపించింది. నాకు టైరియాన్ పర్పుల్ గురించి చదివిన విషయంగుర్తుకు వచ్చింది. ఓడరేవు దగ్గర వరకు వెళ్ళి చూశాను. అక్కడ బోలెడు నత్తగుల్లలు వలల్లో చిక్కుకుని కనిపించాయి. వాటిని తీసుకువెళ్ళి, వాటి నుంచి రంగు తయారుచేయడానికి ప్రయత్నించాను. కానీ మొదట్లో నాకు నిరాశే ఎదురైంది. దాన్నుంచి తీసే ద్రవమంతా కేవలం తెల్లగా ఉండేది. నేను వాటిని ఓ బ్యాగులో పెట్టి నిద్రపోయాను. కానీ పొద్దున్నే నిద్ర లేచే సరికి తెల్లటి ద్రవంలా ఉన్నదంతా మరో రంగులోకి మారినట్టు కనిపించింది.’’అని గాసిన్ చెప్పారు.

నత్తగుల్లల శ్లేష్మానికి సూర్యరశ్మి తగిలితే దాని రంగు మారుతుందని శాస్త్రజ్ఞులకు తెలుసు. తొలుత అది పసుపు రంగులోకి, తరువాత నీలం రంగుంలోకి చివరగా పర్పుల్ రంగులోకి మారుతుంది. బాగా ఎండగా ఉన్నరోజున ప్రయోగం చేస్తే ఐదునిమిషాలకు మించి సమయం పట్టదు’’ అని ప్రొఫెసర్ కర్పనాగియోటిస్ చెప్పారు.

12 వేల నత్తగుల్లల శ్లేష్మం నుంచి 1.4 గ్రాముల పర్పుల్ రంగును ఓ శాస్త్రవేత్త తయారుచేశారు. కానీ ఆయన దీనిని ఓ పరిశ్రమ తరహాలో రసాయనాలు ఉపయోగించి చేశారు.

మహమ్మద్ నోయిరా మాత్రం దీనిని పురాతన పద్ధతిలోనే తయారుచేయాలని అనుకుంటున్నారు. ఈ ప్రయత్నంలో ఆయన 16 ఏళ్ళు గడిపారు. ఈ రంగును ఆయన ఎన్నోసార్లు తయారుచేశారు కానీ, టైరియాన్ పర్పుల్ రంగుకు దగ్గరగా రాలేకపోయారు. ప్లినీ రాసిన పురాతన పత్రులు ఆధారంగా పర్పుల్ రంగును తయారుచేసేందుకు ఈయన ప్రయత్నిస్తున్నారు.

‘‘నేను ప్రాచీన పర్పుల్ రంగును ఇప్పటిదాకా తిరిగి సృష్టించలేకపోయాను. ఆ రంగులోని జీవం, వెలుగుపడగానే దాని జిలుగు, ఆ రంగు మీ కళ్ళతో ఆడుకుంటున్నట్టుగా ఉంటుంది’’ అని నోయిరా చెప్పారు.

ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో ఈ రంగు తయారీకి చేస్తున్న ప్రయోగాలను నోయిరా చూపించారు. ఈయన తన ప్రయోగాలను లండన్‌లో బ్రిటీషు మ్యూజియంలోనూ, బోస్టన్‌లోని మ్యూజియం ఆఫ్ ఫైన్ ఆర్ట్స్‌లో ప్రదర్శించారు.

కానీ, ఒకటి మాత్రం నిజం...ఒకనాడు అంతరించిపోయిన టైరియాన్ పర్పుల్ మరోసారి ప్రమాదంలో పడింది.

ఈ ప్రమాదం రంగు తయారు చేసే విధానం గురించి కాదు, ఇందుకు ఉపయోగించే మ్యూరెక్స్ సమద్రపు నత్తగుల్లల గురించి. కాలుష్యం, వాతావరణ మార్పుల కారణంగా ఈ నత్తగుల్లలు అంతరించిపోతున్నాయి. ఇప్పటికే ఎర్ర నత్తగుల్లలు మధ్యధరా సముద్రం నుంచి అదృశ్యమైపోయాయి.

చరిత్ర నుంచి వెలికి తీసిన పర్పుల్ రంగు మరోసారి ప్రపంచాన్ని చూసినా, అది మనతో శాశ్వతంగా ఉంటుందనే నమ్మకం లేదు. ఈ రంగు మరోసారి చరిత్రగా మారే అవకాశమే ఎక్కువ.

ఇవికూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)