డీబీ కూపర్: విమానం హైజాక్ చేసి, డబ్బు సంచులతో ఆకాశం నుంచి దూకేశాడు...

ఫొటో సోర్స్, FBI
- రచయిత, జుబేర్ ఆజం
- హోదా, బీబీసీ ప్రతినిధి
అది 1971 నవంబర్ 24. డీన్ కూపర్ అనే వ్యక్తి అమెరికాలోని ఒరెగాన్‌లో ఉన్న పోర్ట్‌ల్యాండ్ విమానాశ్రయం చేరుకున్నారు. వాషింగ్టన్‌లోని సియాటెల్ నగరానికి విమానం టికెట్ కొన్నారు.
నార్త్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ కౌంటర్ వద్ద నిలబడి ఉన్న సిబ్బందికి ఈ వ్యక్తి అమెరికా చరిత్రలో కనీవినీ ఎరుగని నేరం చేయబోతున్నారని తెలియదు. 52 సంవత్సరాల తర్వాత కూడా ఆయన జాడ దొరకలేదు.
ఆ సమయంలో డీన్ కూపర్ వయసు 40 సంవత్సరాలు. ఆ రోజు తెల్ల చొక్కా, నలుపు టైతో సూట్ ధరించి వ్యాపారవేత్తలా కనిపించారు. విమానం ఎక్కిన తర్వాత డ్రింక్ ఆర్డర్ ఇచ్చారు. చాలా తక్కువగానే మాట్లాడారు.
కూపర్ కాకుండా ఈ విమానంలో 36 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం టేకాఫ్ కాగానే, మధ్యాహ్నం 3 గంటల సమయంలో, డీన్ కూపర్ ఎయిర్ హోస్టెస్‌కి ఒక నోట్ ఇచ్చారు.
ఆ నోట్ చదవగానే ఎయిర్ హోస్టెస్ ముఖం తెల్లబోయింది. తన వద్ద ఉన్న బ్యాగ్‌లో బాంబు ఉందని, ఆమెను తన పక్క సీటులో నిశ్శబ్దంగా కూర్చోవాలని నోట్‌లో రాశారు డీన్ కూపర్.
ఆ సమయంలో ఎయిర్ హోస్టెస్ అయోమయానికి గురికావంతో డీన్ కూపర్ ఆయన దగ్గరున్న బ్రీఫ్‌కేస్ కొద్దిగా తెరిచి ఆమెకు చూపించారు.
బ్రీఫ్‌కేస్‌లో కొన్ని వైర్లు, ఎర్ర రంగులో స్టిక్స్ ఉండటం ఆమె గమనించారు. అది బాంబా లేక మరేదైనా అని మాత్రం ఆమెకు తెలియదు.
డీబీ కూపర్‌గా ప్రసిద్ధి చెందిన ఈ డీన్ కూపర్ ఆ రోజు ప్రయాణికుల విమానాన్ని హైజాక్ చేశారు. సిబ్బందిని బందీలుగా పట్టుకుని 2 లక్షల డాలర్లను తీసుకుని, విమానం నుంచి అదృశ్యమయ్యారు.
నేర ప్రపంచంలోని ఈ పజిల్ 50 ఏళ్లు దాటినా దర్యాప్తు సంస్థలకు చిక్కుముడిగానే ఉంది, దీనిని ఎఫ్‌బీఐ ఇప్పటికీ ఛేదించలేకపోయింది.
ఇంతకీ డీన్ కూపర్ భూమికి సురక్షితంగా చేరారా? లేదా ఆకాశంలోనే చనిపోయారా?

ఫొటో సోర్స్, FBI
ఈ ఘటన ఎలా జరిగింది?
విమానంలో బాంబు ఉందని బెదిరించి, కూపర్ తన డిమాండ్లను ఉద్యోగికి తెలిపారు, దాని ప్రకారం 2 లక్షల డాలర్లు, ప్యారాచూట్‌లు ఇవ్వాలి. తనకిచ్చే డబ్బుకు సంబంధించి ప్రత్యేక డిమాండ్ కూడా చేశారు కూపర్.
ఈ మొత్తంలో కేవలం 20 డాలర్ల నోట్లు మాత్రమే ఉండాలని, నోట్లు ఒకే శ్రేణికి చెందినవి కాకూడదనే కండీషన్ పెట్టారు. అంటే వాటిని గుర్తించడం అంత సులువు కాకూడదని హైజాకర్ అభిప్రాయం.
తన డిమాండ్లను నెరవేర్చకపోతే విమానంలో బాంబు పేలుస్తానని కూపర్ నోట్‌లో రాశాడు.
ఎయిర్ హోస్టెస్ ఈ సందేశాన్ని పైలట్‌కు తెలియజేసిన కాసేపటి తర్వాత, సాంకేతిక లోపం కారణంగా విమానం ల్యాండ్ కాబోతోందని ఇంటర్‌కామ్‌లో ఒక వాయిస్ వినిపించింది.
దీంతో విమానంలో ఉన్న ప్రయాణికులకు ఏం జరుగుతుందో తెలియదు. అంతేకాదు ఆ విమానం ల్యాండ్ కాకముందే హైజాక్ జరిగినట్లు అధికారులకు సమాచారం అందింది.
అయితే, హైజాకర్ డబ్బుతో పాటు ప్యారాచూట్లనూ అడగడంతో పోలీసులు, ఎఫ్‌బీఐ ఆశ్చర్యపోయారు.

ఫొటో సోర్స్, BETTMANN
డిమాండ్లను నెరవేర్చారా?
బయట వెలుతురు ఉన్న చోట విమానాన్ని ఆపాలని, బయటి నుంచి ఎవరూ లోపలికి చూడకుండా లోపల లైట్లు డిమ్ చేయాలని హైజాకర్ పైలట్‌ను హెచ్చరించారు.
సమీపంలోకి ఏదైనా వాహనం లేదా వ్యక్తి వస్తే, విమానాన్ని పేల్చేస్తామని కూపర్ బెదిరించారు.
దీంతో అధికారులు ఎయిర్‌లైన్స్ ప్రెసిడెంట్‌కు విషయం తెలియజేశారు, అనంతరం హైజాకర్ డిమాండ్లను నెరవేర్చాలని ఆయన ఆదేశించారు.
బాంబు బెదిరింపును దృష్టిలో ఉంచుకుని ప్రయాణికుల ప్రాణాలను కాపాడేందుకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు.
ఒక ఎయిర్‌లైన్ ఉద్యోగి డబ్బుతో విమానం వద్దకు చేరుకున్నారు, ఫ్లైట్ అటెండెంట్ విమానం నిచ్చెనను దించారు. రెండు పారాచూట్లు, పెద్ద బ్యాగ్‌లో డబ్బులు తీసుకున్నారు.
డిమాండ్లను నెరవేర్చిన తర్వాత, కూపర్ 36 మంది ప్రయాణికులను, ఒక ఉద్యోగిని విడుదల చేయడంతో వారు విమానం నుంచి కిందకి దిగారు.

ఫొటో సోర్స్, FBI
ఎలా తప్పించుకున్నారు?
అయితే, కూపర్ ఇద్దరు పైలట్లు, ఒక ఫ్లైట్ అటెండెంట్, మరో ఫ్లైట్ ఇంజనీర్‌ను విడుదల చేయలేదు, అనంతరం విమానాన్ని న్యూ మెక్సికో సిటీ వైపు తీసుకెళ్లాలని ఆదేశించారు.
ఆ సిబ్బంది కాక్‌పిట్‌లో ఉన్నారు, కూపర్ కాక్‌పిట్ వెలుపల ఉన్నారు.
కూపర్ విమానాన్ని 150 నాట్స్ (గంటకు 278 కి.మీ) వేగంతో పదివేల అడుగుల ఎత్తు నుంచి తీసుకెళ్లాలని పైలట్‌కు సూచించారు.
20 నిమిషాల తర్వాత కాక్‌పిట్‌లో ఎర్రటి లైట్ వెలిగింది. అంటే ఎవరో విమానం డోర్లు తెరిచారు.
పైలట్ ఇంటర్‌కామ్‌లో కూపర్‌ని ఉద్దేశించి, మీకు ఏదైనా అవసరమా అని అడిగాడు, దానికి కూపర్ కోపంగా 'లేదు' అని జవాబిచ్చారు.
హైజాకర్ మాట్లాడిన చివరి మాటలవి. దీని తర్వాత కూపర్ అదృశ్యమయ్యారు. డబ్బు తీసుకొని ప్యారాచూట్ సాయంతో విమానం నుంచి దూకినట్లు అర్థమవుతోంది.

ఫొటో సోర్స్, BETTMANN
ఇరవై డాలర్ల నోట్లే ఎందుకు?
కూపర్ 20 డాలర్ల నోట్లు మాత్రమే ఎందుకు అడిగాడో తర్వాత అర్థమైంది. 2 లక్షల డాలర్ల డబ్బు మొత్తం బరువు 21 పౌండ్లు (సుమారు 9.5 కేజీలు) ఉంటుంది.
డాలర్ విలువ తక్కువుంటే, బరువు ఎక్కువుండేది, అంత బరువుతో దూకడం ప్రాణాంతకం. విలువ ఎక్కువ మొత్తంలో ఉంటే, బరువు తక్కువుంటుంది, అయితే, వాటిని బయట ఉపయోగిస్తే ఇబ్బందులు తలెత్తవచ్చు.
ఇదే సమయంలో ఎఫ్‌బీఐ కొంచెం తెలివి ప్రదర్శించి ఆయనకు 'ఎల్' అనే కోడ్ అక్షరం ఉన్న నోట్లను మాత్రమే ఇచ్చింది.
అయితే కూపర్ ప్యారాచూట్ అడిగినపుడు, ఆయన విమానం నుంచి దూకబోతున్నాడని అధికారులకు అనుమానం రాలేదా? దూకిన తర్వాత ఎందుకు పట్టుకోలేదు అనే ప్రశ్న కూడా తలెత్తింది.
వాస్తవానికి విమానాన్ని వెంబడించాలని పోలీసులు ప్లాన్ చేశారు. దానికోసం F-106 విమానాలను ఉపయోగించాలనుకున్నారు.
కానీ, అప్పటికే కూపర్ తెలివిగా తన విమానం వేగాన్ని తగ్గించాలని పైలట్‌కు సూచించాడు. F-106 విమానాలు అంత తక్కువ వేగంతో నడపడం కష్టం.
అందుకే ఇంటర్నేషనల్ గార్డ్ సర్వీసెస్ నుంచి T-33 విమానాలను అడిగారు, అయితే T-33, కూపర్ విమానం వద్దకు చేరుకునేలోపే ఆయన దూకేశారు.

ఫొటో సోర్స్, FBI
ఐదు నెలల తర్వాత మరో హైజాక్
విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. కాని కాక్‌పిట్ నుంచి బయటకు వచ్చి చూడగా, విమానంలో కూపర్ లేరని సిబ్బంది గమనించారు.
విమానంలో ఆయన టై, ప్యారాచూట్ బ్యాగ్ మాత్రమే ఉన్నాయి.
విమానం డోర్లు తెరిచిన సమయం ఆధారంగా కూపర్ మెరూన్ సరస్సు ప్రాంతంలో దూకి ఉండవచ్చని భావించారు పోలీసులు.
ఎఫ్‌బీఐ వెంటనే ఆ ప్రాంతంలో వెతకడం ప్రారంభించింది, వందలాది మందిని విచారించారు. రోజురోజుకూ దర్యాప్తు విస్తరింపజేసింది, కానీ, ఎలాంటి ఆధారాలు దొరకలేదు.
ఐదు నెలల తర్వాత, విమానాన్ని హైజాక్ చేసి, డబ్బు తీసుకొని ప్యారాచూట్ సహాయంతో విమానం నుంచి దూకిన సంఘటన మరొకటి చోటుచేసుకుంది.
కానీ ఈసారి అలా దూకిన వ్యక్తిని పట్టుకున్నారు పోలీసులు. అతనే రిచర్డ్ ఫ్లూయిడ్. అంతకుముందు హైజాక్ కూడా ఈ వ్యక్తే చేశాడని ఎఫ్‌బీఐ మొదట్లో అనుకుంది.
అయితే ఫ్లైట్ అటెండెంట్‌కి ముఖం చూపించగా.. ఇద్దరూ వేరువేరని తెలిపారు. డీన్ కూపర్ విమానం హైజాక్ విజయవంతంగా చేయడంతో రిచర్డ్ కూడా ఈ నేరానికి పాల్పడ్డాడని అర్థమైంది.

ఫొటో సోర్స్, FBI
కూపర్ కేసును చాలా ఏళ్లు ఎఫ్‌బీఐ దర్యాప్తు చేసింది.
అయితే, కూపర్ దూకడంతో బహుశా చనిపోయారేమోనని చాలామంది భావించారు.
1980లో ఒక పిల్లవాడికి నది దగ్గర చిరిగిన 20 డాలర్ల నోట్లు కనిపించాయి, వాటి మొత్తం విలువ 5,800 డాలర్లు. ఎఫ్‌బీఐకి ఈ సమాచారం అందగానే సీరియల్ నంబర్‌ను పరిశీలించింది.
ఆ డబ్బు కూపర్‌కు ఇచ్చిన నోట్లుగా అధికారులు నిర్ధారించారు. ఆ రాత్రి కూపర్ దూకినట్లుగా భావిస్తున్న ప్రదేశంలో చెట్లు ఉండటంతో ఆయన బతక్కపోవచ్చని అధికారులు భావించారు.

'కూపర్ నా అంకుల్'
అయితే, చాలామంది కూపర్ చనిపోయాడనే వాదనతో ఏకీభవించలేదు.
దూకిన సమయంలో కూపర్ దగ్గర నుంచి కొన్ని నోట్లు పడిపోయి ఉండొచ్చని భావించారు. మిగిలిన డబ్బుతో కూపర్ పారిపోయిండొచ్చని అనుకున్నారు.
ఈ పజిల్ డీన్ కూపర్‌ను అమెరికాలో ఫేమస్‌గా మార్చింది. 2011 ఆగస్టులో డీన్ కూపర్ తన అంకుల్ (బాబాయి లేదా మామ) అని మరియా కూపర్ అనే మహిళ పేర్కొన్నారు.
హైజాక్ విషయం విన్నానని, విమానం నుంచి అంకుల్ దూకడంతో డబ్బు గాలిలో పోయిందని మరియా తెలిపారు. అప్పటికీ ఇలాంటి వాదనలు చాలానే వచ్చాయి.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, హైజాక్ అయిన విమానంలోని ఫ్లైట్ అటెండెంట్, మారియా అంకుల్ చిత్రాన్ని చూసి, హైజాకర్ మాదిరిగానే ఉన్నారని చెప్పారు.
అయితే అధికారులు నమ్మలేకపోయారు. కూపర్ ఫైల్ మూసివేయడానికి ఇష్టపడలేదు.
45 ఏళ్లపాటు దర్యాప్తు చేసినప్పటికీ, ఎఫ్‌బీఐ ఈ కేసును ఛేదించలేకపోయింది.
అయితే, 2016లో ఈ కేసు విచారణ కోసం కేటాయించిన నిధులు, సిబ్బందిని ఇతర కేసులకు ఉపయోగించాలని ఎఫ్‌బీఐ నిర్ణయించుకుంది.
ఈ కేసుపై పెద్దగా దృష్టి పెట్టనప్పటికీ, ఎవరిదగ్గరైనా సమాచారం ఉంటే, తమను సంప్రదించవచ్చని స్పష్టం చేసింది.
డీన్ కూపర్ అమెరికా చరిత్రలో పట్టుబడని ఏకైక హైజాకర్.
కూపర్ జ్ఞాపకార్థం ప్రతి ఏడాది నవంబర్ 24న అప్పట్లో ఆయనను వెతకడానికి ఎఫ్‌బీఐ కార్యకలాపాలు జరిపిన ఆఫీసు స్థలంలో ఒక వేడుక నిర్వహిస్తారు.
సూట్, అద్దాలు ధరించి, పారాచూట్‌లు పట్టుకున్న కొందరు వ్యక్తులు ఆ ఏరియల్ టావెర్న్‌లో గుమిగూడుతారు. అర్థరాత్రి వరకు ఈ వేడుక కొనసాగుతుంది.
ఇవి కూడా చదవండి
- జ్యులియా సికెట్టిన్: ఈ అమ్మాయి దారుణ హత్య ఇటలీని కుదిపేస్తోంది, ఎందుకు?
- నరేంద్ర మోదీ: తన విమర్శకులు, స్వలింగ సంపర్కులు న్యాయమూర్తులు కారాదని కేంద్రం కోరుకుంటోందా?
- 'రూ. 5 కోట్ల లాటరీ తగిలాక అందరూ వచ్చి పలకరిస్తున్నారు'
- రాజమౌళి: ఆర్ఆర్ఆర్ డైరెక్టర్ దేవుడు అన్న స్టీవెన్ స్పీల్బర్గ్ ఎవరు
- క్లిటొరొమెగాలీ: యోనిలో క్లిటోరిస్ సైజును సర్జరీతో తగ్గించుకున్న ఓ యువతి కథ
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














