నరేంద్ర మోదీ: తన విమర్శకులు, స్వలింగ సంపర్కులు న్యాయమూర్తులు కారాదని కేంద్రం కోరుకుంటోందా?

సీజేఐ డీవై చంద్రచూడ్, నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, ANI

    • రచయిత, సిద్ధనాథ్ గానూ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కేంద్ర ప్రభుత్వం తిప్పి పంపిన అయిదుగురి పేర్లను జడ్జిలుగా నియమించేందుకే సుప్రీంకోర్టు మొగ్గు చూపింది.

అయితే, ఈ పేర్లను మరోసారి పరిశీలించాలని చెప్పేందుకు ప్రభుత్వం భిన్న కారణాలను ప్రస్తావించింది.

ఒకరు బహిరంగంగానే స్వలింగ సంపర్కుడినని ప్రకటించుకోవడం, మరొకరు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విమర్శించే ఒక వార్తను షేర్ చేయడం లాంటి కారణాలు వాటిలో ఉన్నాయి.

న్యాయమూర్తుల నియామకాల్లో తమ మాట చెల్లాలని కేంద్ర ప్రభుత్వం పట్టుబడుతోంది. అయితే, ఇది అనవసర జోక్యమని సుప్రీం కోర్టు భావిస్తోంది. ఈ విషయంలో ఇటీవల రెండు వైపులా మాటామాటా పెరుగుతున్నట్లు కనిపిస్తోంది.

న్యాయమూర్తులుగా నియమించేందుకు ప్రభుత్వం తిప్పి పంపిన అయిదుగురి పేర్లను తాజాగా కొలీజియం పునరుద్ఘాటించడంతో దీనిపై చర్చ జరుగుతోంది.

సుప్రీం కోర్టులో అయిదుగురు సీనియర్ న్యాయమూర్తుల కమిటీనే కొలీజియంగా పిలుస్తారు. న్యాయమూర్తుల నియామక బాధ్యతలను ఈ కమిటీనే చూసుకుంటుంది.

సౌరభ్ కృపాల్

ఫొటో సోర్స్, TWITTER/ SAURABH KIRPAL

ఫొటో క్యాప్షన్, సౌరభ్ కృపాల్

ఏమిటీ వివాదం?

ప్రభుత్వం ఇటీవల వెనక్కి పంపిన అయిదుగురి పేర్లలో ముగ్గురి విషయంలో కొలీజియం చర్చల వివరాలను తాజాగా సుప్రీం కోర్టు బయటపెట్టింది.

వీటిలో మొదటి పేరు సౌరభ్ కృపాల్. న్యాయవాదిగా కొనసాగుతున్న ఆయన్ను దిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమించాలని కొలీజియం సూచించింది. సౌరభ్‌పై కేంద్ర ప్రభుత్వ అభ్యంతరాలు, కొలీజియం సమాధానాలు ఇవీ..

ప్రభుత్వ అభ్యంతరం

తన లైంగికత (సెక్సువల్ ఓరియెంటేషన్) గురించి సౌరభ్ తరచూ మాట్లాడుతుంటారు. అతడి జీవిత భాగస్వామి ఒక స్వీడన్ పౌరుడు.

కోర్టు స్పందన

లైంగికత ఆధారంగా వివక్ష చూపడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఆయనకు న్యాయమూర్తిగా అయ్యే అర్హతలు, సామర్థ్యం, మేధస్సు ఉన్నాయి. మరోవైపు సౌరభ్ జీవిత భాగస్వామి విషయంలో రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (ఆర్ఏడబ్ల్యూ) ఎలాంటి అభ్యంతరమూ వ్యక్తం చేయలేదు. పైగా అతడు భారత్ మిత్ర దేశమైన స్వీడన్ పౌరుడు.

సౌరభ్ పేరును 2017లో దిల్లీ హైకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఆ తర్వాత 2021 నవంబరు 11న ఆయన పేరును కేంద్రానికి సుప్రీం కోర్టు పంపింది. అయితే, అదే నెల 22న ఆయన పేరుపై పునరాలోచించాలని సుప్రీం కోర్టుకు కేంద్రం తిప్పి పంపింది.

సుప్రీం కోర్టు

ఫొటో సోర్స్, ANI

కొలీజియం పునరుద్ఘాటించిన మరో పేరు సోమశేఖర్ సుందరేశన్. బాంబే హైకోర్టులో న్యాయమూర్తిగా నియమించేందుకు ఆయన పేరును పరిశీలిస్తున్నారు.

మొదటగా 2021 అక్టోబరు 4న బాంబే హైకోర్టు కొలీజియం ఆయన పేరును సిఫార్సు చేసింది. 2022 ఫిబ్రవరి 16న సుప్రీం కోర్టు కూడా ఆమోదముద్ర వేసింది.

అయితే, 2022 నవంబరు 25న ఆయన పేరు గురించి మరోసారి ఆలోచించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. 

ప్రభుత్వ అభ్యంతరం

దేశంలోని భిన్న కోర్టుల్లో పెండింగ్‌లోనున్న అంశాలపై ఆయన తన అభిప్రాయాలను వ్యక్తంచేస్తున్నారు.

కోర్టు స్పందన

సోషల్ మీడియాలో అభిప్రాయాలను పరిశీలించి ఒక వ్యక్తి పక్షపాతంతో వ్యవహరిస్తారని అనుకోవడం సరికాదు.

ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాల్లో కొన్నింటిపై సోమశేఖర్ విమర్శలు చేస్తున్నారని కేంద్ర న్యాయ శాఖ మంత్రి తన లేఖలో నిర్ధరించి చెప్పడం కూడా సరికాదని కొలీజియం అభిప్రాయపడింది.

మరోవైపు ఆయనకు ఏదైనా ఒక రాజకీయ పార్టీతో సంబంధం ఉందని చెప్పే ఎలాంటి ఆధారాలూ కూడా లేవని కమిటీ చెబుతోంది.

నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, AFP

కొలీజియం పునరుద్ఘాటించిన మూడో పేరు ఆర్. జాన్ సత్యన్. మద్రాస్ హైకోర్టు బెంచ్‌కు ఆయన పేరు పరిశీలిస్తున్నారు. నిఘా విభాగం సమాచారాన్ని చూపించి ప్రభుత్వం ఆయన పేరును వెనక్కి పంపించింది.

ప్రభుత్వ అభ్యంతరం

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విమర్శించే ఓ కథనాన్ని ఆయన షేర్ చేశారు.

నీట్ కోసం సన్నద్ధమవుతూ ఆత్మహత్య చేసుకున్న అనిత అనే అమ్మాయి కథనాన్ని ఆయన షేర్ చేశారు. ‘‘రాజకీయా ద్రోహం’’ ఆ ఆత్మహత్యకు కారణమనే కోణంలో ఆ కథనం ఉంది.

కోర్టు స్పందన

ఆయన పేరును హైకోర్టుకు సూచించడం సరైన చర్యేనని న్యాయమూర్తుల కమిటీ భావిస్తోంది. మరోవైపు ఆయనకు వ్యక్తిత్వం, వృత్తిపరమైన అంశాల్లో మంచి పేరుందని నిఘా విభాగం కూడా స్పష్టంచేసింది.

సోషల్ మీడియాలో ఒక పోస్టును షేర్‌చేసినంత మాత్రాన, ఆయన వ్యక్తిత్వం, విలువలపై ఒక అంచనాకు రాకూడదు. ఆయన పేరును తిరస్కరించకూడదు.

కిరణ్ రిజిజు

ఫొటో సోర్స్, Facebook/KirenRijiju

ఫొటో క్యాప్షన్, కిరణ్ రిజిజు

కేంద్రం వర్సెస్ న్యాయవ్యవస్థ..

ఇది కేవలం అయిదుగురు న్యాయమూర్తులకు సంబంధించిన అంశం కాదు. కేంద్ర ప్రభుత్వం, న్యాయవ్యవస్థల మధ్య జరుగుతున్న వాగ్వాదానికి దీన్ని ఒక కొనసాగింపుగా చూడాలి.

కొలీజియం ద్వారా న్యాయవ్యవస్థల్లో ఖాళీలను భర్తీ చేయడంపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఇటీవల కాలంలో పదేపదే కేంద్ర ప్రభుత్వ అసమ్మతిని తెలియజేస్తూనే ఉన్నారు.

ఈ నియామక ప్రక్రియల్లో ప్రభుత్వ వాదన చెల్లుబాటు కావాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.

ఈ విషయంపై ఇటీవల భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌కు జనవరి చివరి వారంలో కిరణ్ రిజిజు ఒక లేఖ రాశారు. హైకోర్టు న్యాయమూర్తులను నియమించే ‘‘సెర్చ్ కమ్ ఎవాల్యూయేషన్ కమిటీ’’లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులకు కూడా చోటు ఉండాలని ఆయన డిమాండ్ చేశారు.

అలానే సుప్రీం కోర్టు నియామకాల్లో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు ఉండాలని ఆయన అంటున్నారు.

‘‘ఇది చాలా ప్రమాదకరం. న్యాయవ్యవస్థ నియామకాల్లో ప్రభుత్వ జోక్యం ఉండకూడదు’’ అని ఆ లేఖపై కిరణ్ రిజిజును దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు.

అయితే, దీనికి కిరణ్ రిజిజు ప్రత్యుత్తరం ఇచ్చారు. ‘‘మీరు కోర్టు నిర్ణయాన్ని శిరసావహిస్తారని భావిస్తున్నాను. జాతీయ న్యాయసేవల నియామక కమిషన్ (ఎన్‌జేఈసీ) చట్టాన్ని కొట్టివేసే సమయంలో కొలీజియం విధి విధానాలను(మెమోరాండం ఆఫ్ ప్రొసీజర్ -ఎంవోపీ)ను పునర్‌వ్యవస్థీకరించాలని సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం సూచించింది. మేం ఆ మార్గదర్శకాలను అనుసరించే చర్యలు సూచిస్తున్నాం’’అని ఆయన వ్యాఖ్యానించారు.

మరోవైపు జనవరి 21న మాజీ న్యాయమూర్తి ఇంటర్వ్యూను కిరణ్ రిజిజు ట్వీట్ చేశారు. ‘‘దేశంలోని మూడు వ్యవస్థలు అంటే.. శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కలిసి పనిచేయాలి’’అని చెబుతున్నట్లు ఆ వీడియోలో ఉంది.

అయితే, కేంద్ర ప్రభుత్వ వ్యాఖ్యలు, వారు తీసుకునే చర్యలు తమ సామాజిక-సాంస్కృతిక-రాజకీయ అజెండాలను అనుగుణంగా కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకుడు డాక్టర్ సుహాస్ పాల్‌శిఖర్ వ్యాఖ్యానించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

న్యాయ వ్యవస్థ

ఫొటో సోర్స్, Getty Images

న్యాయమూర్తులను న్యాయమూర్తులే ఎందుకు నియమిస్తున్నారు?

న్యాయమూర్తుల నియామకాల విషయంలో కేంద్రం, న్యాయవ్యవస్థ మధ్య మొదట్నుంచీ వివాదముంది. ఈ విషయంపై 1993లో విచారణకు వచ్చిన కేసును ‘‘సెకండ్ జడ్జెస్ కేస్’’గా పిలుస్తారు. ఈ కేసులో నియామక ప్రక్రియల విషయంలో న్యాయవ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ కలిసి పనిచేయాలని సుప్రీం కోర్టు సూచించింది. కోర్టు ఏం చెప్పిందంటే..

  • ఒకవేళ ఈ రాజ్యాంగ వ్యవస్థల మధ్య ఏవైనా విభేదాలుంటే భారత ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయానికి అంతిమంగా ప్రాధాన్యం ఇవ్వాలి.
  • చీఫ్ జస్టిస్ అభిప్రాయాలకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టు లేదా హైకోర్టుల్లో నియామకాలు జరగకూడదు.
  • ఒకవేళ సూచించిన అభ్యర్థుల పేర్లు సరైనవి కాదని ప్రభుత్వం భావిస్తే, దానికి తగిన కారణాలను చీఫ్ జస్టిస్‌కు తెలియజేయాల్సి ఉంటుంది. అయితే, ఒకవేళ మళ్లీ ఆయన పేరును న్యాయమూర్తి పునరుద్ఘాటిస్తే, ఆ నియామకాన్ని చేపట్టాల్సి ఉంటుంది.
  • ఇక్కడ చీఫ్ జస్టిస్ అభిప్రాయానికి సర్వోన్నత అధికారం ఉంటుంది. హైకోర్టు న్యాయమూర్తుల బదిలీల్లోనూ ఆయన నిర్ణయమే అంతిమం.

1998లో అప్పటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ ‘‘ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్’’ ద్వారా ఈ విధానంపై కొన్ని ప్రశ్నలను సుప్రీం కోర్టు ముందు ఉంచారు. దీన్నే ‘‘థర్డ్ జడ్జెస్ కేస్’’గా పిలుస్తారు. దీనిలో కోర్టు ఏం చెప్పిందంటే..

  • ఇక్కడ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించడం అంటే నియామక ప్రక్రియల్లో పాల్గొన్న న్యాయమూర్తులను సంప్రదించడం.
  • ఈ విషయంపై ప్రధాన న్యాయమూర్తి.. సుప్రీం కోర్టులో తన తర్వాత నలుగురు సీనియర్ న్యాయమూర్తులతో చర్చలు జరపాల్సి ఉంటుంది. అదే హైకోర్టులో అయితే, ప్రధాన న్యాయమూర్తి ఇద్దరు సీనియర్ న్యాయమూర్తులతో సంప్రదింపులు జరపాలి.
  • ఒకవేళ పేర్లను వెనక్కి పంపిస్తు ప్రభుత్వం ఏదైనా డాక్యుమెంట్లను పంపిస్తే, వీటిపై సీజేఐ ఒక్కరే నిర్ణయం తీసుకోకూడదు. ఇతర న్యాయమూర్తులతో దీనిపై చర్చలు జరపాలి.
వీడియో క్యాప్షన్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్‌వీ రమణ ప్రమాణ స్వీకారం

మోదీ ప్రభుత్వం ఏం చేసింది?

కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జాతీయ న్యాయసేవల నియామకాల కమిషన్ చట్టం (ఎన్‌జేఏసీ యాక్ట్)ను తీసుకొచ్చింది. అప్పట్లో న్యాయ శాఖ మంత్రిగా రవి శంకర్ ప్రసాద్ ఉండేవారు. న్యాయ నియామకాల కోసం ఒక కమిటీని ఏర్పాటుచేయాలని దీని ద్వారా ప్రభుత్వం భావించింది. ఆ కమిటీలో ఎవరెవరు ఉంటారంటే..

  • చీఫ్ జస్టిస్
  • సుప్రీం కోర్టులో ఇద్దరు సీనియర్ న్యాయమూర్తులు
  • న్యాయ శాఖ మంత్రి
  • ఇద్దరు సివిల్ సొసైటీ ప్రతినిధులు
  • ప్రధాన మంత్రి, సీజేఐ, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు కమిటీ ఎంపిక చేసిన ఒక సభ్యుడు (ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/మైనారిటీ/మహిళల నుంచి ఆ సభ్యుడిని ఎంపిక చేయాలి)

అయితే, అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖేహర్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఆ చట్టాన్ని రాజ్యాంగ వ్యతిరేకమని చెబుతూ కొట్టివేసింది. ప్రస్తుత కొలీజియం వ్యవస్థ కొనసాగుతుందని ఆ ధర్మాసనం స్పష్టంచేసింది.

దీనిపై మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రు మాట్లాడుతూ.. ‘‘ఈ సమస్యను పరిష్కరించేందుకు రాజ్యాంగంలో ఎలాంటి నిబంధనలూ లేవు. అసలు ఇలా జరగుతుందని ఎవరు ఊహిస్తారు? స్వాతంత్ర్యం అనంతరం మొదటి 20 ఏళ్లలో నియామక ప్రక్రయల్లో కార్యనిర్వాహక వ్యవస్థ సూచనలు ఇచ్చేది. అయితే, ముగ్గురు సీనియర్ న్యాయమూర్తులను తోసిరాజని జస్టిస్ ఏఎన్ రేను ప్రధాన న్యాయమూర్తిగా అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ నియమించడంతో వివాదం మొదలైంది. నిరసన వ్యక్తంచేస్తూ ఆ ముగ్గురు న్యాయమూర్తులు రాజీనామాలు చేశారు’’అని చెప్పారు.

‘‘న్యాయమూర్తుల నియామకాల కోసం ఒక శాశ్వత సచివాలయం ఉండాలి. ఏదో తాత్కాలికంగా ఏర్పాట్లు ఉండకూడదు. అసలు ఎన్‌జేఏసీ విషయంలో కార్యనిర్వాహక వ్యవస్థకు పైచేయి ఉందని న్యాయ వ్యవస్థ భావించి ఉంటే, ఆ కమిటీలో మార్పులను సూచిస్తే సరిపోయేది. ఇక్కడ అన్ని నియామకాలకు శాశ్వత వ్యవస్థలు అందుబాటులో ఉన్నప్పుడు, న్యాయ వ్యవస్థకు మాత్రం మినహాయింపు ఎందుకు?’’అని ఆయన ప్రశ్నించారు.

వీడియో క్యాప్షన్, పోలీసులే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఎలా: ప్రొఫెసర్ హరగోపాల్

స్వయంప్రతిపత్తి

కేవలం కేంద్ర న్యాయ శాఖ మంత్రి మాత్రమే కాదు. ఉప రాష్ట్రపతి, లోక్‌సభ స్పీకర్ కూడా ఈ విషయంలో ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

రాజస్థాన్ అసెంబ్లీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ మాట్లాడారు. ‘‘కోర్టులు చట్టాలను చేయలేవు. అలానే శాసన వ్యవస్థ తీర్పులను రాయలేదు. కానీ, ఇటీవల కాలంలో ప్రజల మెప్పు పొందేందుకు న్యాయ వేదికలను ఉపయోగించుకొనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇతర వ్యవస్థలనూ ప్రభావితం చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇది సరికాదు’’అని ఆయన వ్యాఖ్యానించారు.

మరోవైపు స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లా మాట్లాడూతూ.. ‘‘న్యాయ వ్యవస్థ, వారి స్వయం ప్రతిపత్తిలను మనం గౌరవిస్తాం. అదే విధంగా వారి హద్దులను కూడా వారు గౌరవించాలి’’అని వ్యాఖ్యానించారు.

అయితే, మోదీ ప్రభుత్వం కావాలనే వ్యవస్థలను బలహీనం చేస్తోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కానీ, ఒకసారి చరిత్రను పరిశీలిస్తే, ఇందిగా గాంధీ హయాంలోనూ న్యాయ వ్యవస్థను నియంత్రణలోకి తీసుకునే ప్రయత్నాలు జరిగాయి.

ఇందిరా గాంధీ ప్రభుత్వ హయాంలోనే రాజ్యాంగ సవరణల్లో సర్వోన్నత అధికారం శాసన వ్యవస్థకు ఉంటుందని, ఇది సుప్రంకోర్టు సమీక్ష పరిధిలోకి కూడా రాదని చెప్పే ప్రయత్నాలు జరిగాయి.

1973లో కేరళ నుంచి వచ్చిన ఒక కేసులోనే బేసిక్ స్ట్రక్చర్ సిద్ధాంతం (రాజ్యాంగ మౌలిక స్వరూపం)ను సుప్రీం కోర్టు తీసుకొచ్చింది. అప్పట్లో కేరళలో వామపక్షాలు, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండేది.

ఈ రెండు వ్యవస్థల మధ్య ఘర్షణ వాతావరణం కొత్తేమీ కాదు. ఎప్పటికప్పుడు కొత్త రూపాల్లో ఈ వివాదాలు కనిపిస్తూనే ఉన్నాయి.

నేడు సుప్రీం కోర్టు పునరుద్ఘాటనకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం వెళ్తుందో.. లేక ఆ సిఫార్సులకు ఆమోదం తెలుపుతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)