అయోధ్య భూవివాదంలో సుప్రీం కోర్టు తీర్పుపై ఐదు ప్రశ్నలు

ఫొటో సోర్స్, Getty Images
అయోధ్య రామమందిరం-బాబ్రీ మసీదు వివాదంపై సుప్రీం కోర్టు నవంబర్ 9న ఇచ్చిన తీర్పుతో స్వతంత్ర భారతంలో అత్యంత సున్నితమైన సమస్యల్లో ఒకటి పరిష్కృతమైంది.
వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఏకాభిప్రాయంతో హిందూ పక్షానికి కేటాయించింది. అయితే, ఈ తీర్పు ఏ ప్రాతిపదికన ఇచ్చారన్న అంశం గురించి న్యాయ నిపుణుల నుంచి కొన్ని సందేహాలు తలెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు న్యాయవాది, ‘అయోధ్యాస్ రామ్ టెంపుల్ ఇన్ కోర్ట్ష్’ పుస్తక రచయిత విరాగ్ గుప్తా, సీనియర్ పాత్రికేయుడు వెంకటేషన్‌లతో బీబీసీ చర్చించింది. వారు వ్యక్త పరిచిన ఐదు ప్రధాన ప్రశ్నలు ఇవే..

ఫొటో సోర్స్, Getty Images
మొదటి ప్రశ్న: మిగతా పుణ్య క్షేత్రాలకు సంబంధించిన వివాదాలపై ఈ తీర్పు ప్రభావం ఎలా ఉంటుంది?
మధ్య యుగంలో సుల్తాన్లు, మొఘల్ పాలకులు అనేక పుణ్య క్షేత్రాలను ధ్వంసం చేశారు. భారత్ అన్న భావన ఎంత పురాతనమైందో అయోధ్య వివాదం మూలాలు కూడా అంతే పురాతనమైనవని సుప్రీం కోర్టు చెబుతోంది.
1991లో పార్లమెంటు చేసిన ఓ చట్టం గురించి తీర్పులో కోర్టు ప్రస్తావించింది. ఆ చట్టం ప్రకారం అయోధ్య మినహా మిగిలిన మత క్షేత్రాలన్నింటిలో 1947 ఆగస్టు 15కు ముందున్న స్థితి కొనసాగుతుంది. అయోధ్యలోనే కాకుండా మధుర, కాశీల్లోనూ ఆలయాల మధ్యలో ఏర్పడ్డ మసీదులపై వివాదాలు ఉన్నాయి.
సుప్రీం తాజా తీర్పు తర్వాత మిగతా క్షేత్రాలపై ఎలాంటి వివాదాలను చేయబోమని సంఘ్ పరివార్ చెబుతోంది.
కానీ, అయోధ్యలో దేవుడిని సుప్రీం కోర్టు 'జ్యూరిస్టిక్ పర్సన్' పరిగణించింది. దీని ఆధారంగా మిగతా పుణ్య క్షేత్రాల్లోని వివాదాల గురించి ఇతరులు కూడా పిటిషన్లు వేసే అవకాశాలు ఉన్నాయి. అలాంటి పిటిషన్లను ఎలా ఆపుతారు?

ఫొటో సోర్స్, MANSI THAPIYAL
రెండో ప్రశ్న: రామ మందిరం నిర్వహణ కేంద్రం చూసుకుంటుందా?
ఆర్టికల్ 142, రామమందిరంపై కేంద్ర ప్రభుత్వ నియంత్రణ గురించి కొన్ని సందేహాలు తలెత్తుతున్నాయి.
చాలా రాష్ట్రాల్లో పెద్ద పెద్ద ఆలయాల నిర్వహణపై ఆయా రాష్ట్రాల ప్రభుత్వాల నియంత్రణ ఉంది. అయోధ్య రామమందిరం విషయంలో ట్రస్టు ఏర్పాటు, నిర్వహణ అధికారం కేంద్రానికి ఉంటుంది. ఇది విభిన్నంగా ఉండే అంశం.
రాజ్యాంగం ప్రకారం భూమి రాష్ట్రాల పరిధిలోని అంశం. రాష్ట్రపతి ఆదేశంతో అయోధ్యలోని వివాదాస్పద భూమిని కేంద్ర ప్రభుత్వం చట్టప్రకారం తీసుకుంది. పురావస్తు శాఖ తవ్వకాల్లో అక్కడ మందిరం ఉండేదని తేలితే ఆ భూమిని ఆలయ నిర్మాణం కోసం ఇస్తామని అప్పట్లో పీవీ నరసింహారావు ప్రభుత్వం చెప్పింది.
1994లో ఇచ్చిన తీర్పు ప్రకారం అయోధ్య భూ సేకరణ చట్టంలోని సెక్షన్ 6, 7లు చట్టబద్ధమైనవేనని సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. వాటిని అనుసరిస్తూ కేంద్ర ప్రభుత్వానికి కొత్త ట్రస్టును ఏర్పాటు చేసే బాధ్యతను ఇచ్చింది.
అయోధ్యలో సేకరించిన స్థలాన్ని తిరిగి తమకు అప్పగించాలని లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో వ్యాజ్యం వేసింది. దీనిపై విచారణే జరగలేదు. పురావస్తు శాఖ ఇచ్చే ఆధారాలకు అనుగుణంగా ఆలయ నిర్మాణం కోసం భూమిని ఇవ్వమని కేంద్రాన్ని సుప్రీం కోర్టు ఆదేశించవచ్చు. ఇంత పెద్ద తీర్పు ఇవ్వాల్సిన అవసరమే ఉండేది కాదు.
అయోధ్య కేసులో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు పక్షాలుగా లేవు. సుప్రీం కోర్టులో వాదించనూ లేదు. అయినా, రామమందిర నిర్మాణం కోసం ట్రస్టు ఏర్పాటు చేయాలని, మసీదు కోసం భూమి కేటాయించాలని కోర్టు ప్రభుత్వాన్ని ఎలా ఆదేశించింది?

ఫొటో సోర్స్, Getty Images
మూడో ప్రశ్న: తీర్పుపై సమీక్ష, క్యూరేటివ్ పిటిషన్లు ఎవరు వేయొచ్చు?
అయోధ్య తీర్పుపై సమీక్ష, క్యూరేటివ్ పిటిషన్లు వేయబోమని సున్నీ వక్ఫ్ బోర్డు ప్రకటించింది.
శబరిమల-లింగసమానత్వం విషయంలో అప్పుడున్న పక్షాలు కాకుండా వేరే పక్షాలు కూడా సమీక్ష పిటిషన్లు వేయొచ్చన్నది చూశాం. అయోధ్య వివాదాన్ని సీపీసీ చట్టం ప్రకారం హైకోర్టు, కింది కోర్టులు హిందూ పక్షం వర్సెస్ ముస్లిం పక్షం కేసుగా చూశాయి.
ఎలాంటి తీర్పుపైనైనా బాధిత పక్షమని చెప్పుకుంటూ నెల లోపు ఎవరైనా సమీక్ష పిటిషన్ వేయొచ్చు.
ప్రస్తుత చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ పదవీవిరమణ చేశాక, కొత్త చీఫ్ జస్టిస్ బోబ్డే అధ్యక్షతన ఏర్పడే ధర్మాసనం ఆ సమీక్ష పిటిషన్లను విచారించాలా? వద్దా? అని నిర్ణయం తీసుకుంటుంది.
ధర్మాసనం ఏకాభిప్రాయంతో ఇచ్చిన ఈ తీర్పు సమీక్ష పిటిషన్లతో మారే అవకాశాలు చాలా తక్కువ. మూడు నెలల్లోగా కేంద్ర ప్రభుత్వం ఆలయ నిర్మాణానికి ట్రస్టు ఏర్పాటు చేయాలి. ట్రస్టుకు ప్రాతినిధ్యం వహించేందుకు నిర్మోహి అఖాడా, హిందూ మహాసభ, రామ జన్మభూమి న్యాస్ పోటీపడే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
మసీదు కోసం ఇచ్చే ఐదు ఎకరాల భూమిని ఏ ప్రాంతంలో కేటాయిస్తారన్నది కూడా కీలకమైన అంశం. అదెక్కడ ఇవ్వాలన్నది సుప్రీం కోర్టు స్పష్టంగా చెప్పలేదు.
మసీదు కోసం ఇచ్చే భూమిని తీసుకోవాలా? వద్దా? అన్న విషయంలోనూ రాజకీయాలు మొదలయ్యాయి. ధర్మాసనం తీర్పు ఇచ్చింది గానీ, నాయకుల మధ్య పంచాయితీ ముగియలేదు.

ఫొటో సోర్స్, Getty Images
నాలుగో ప్రశ్న: అనుబంధ భాగం ఎందుకు?
సాధారణంగా కోర్టులు ఇచ్చే తీర్పులకు అనుబంధ భాగాలేవీ ఉండవు.
కానీ, అయోధ్య తీర్పులో అనుబంధ భాగం ఇచ్చారు.
ధర్మాసనంలో ఉన్న ఐదుగురు న్యాయమూర్తుల పేర్లు గానీ, వారి సంతకాలు గానీ దీనిపై లేవు.
అసలు ఇలా ఎందుకు చేశారు?

ఫొటో సోర్స్, K K MUHAMMED
ఐదో ప్రశ్న: రామ్‌లల్లాకు ఆకారం ఉందా? లేదా?
1949లో వివాదాస్పద స్థలంలో రామ్ లల్లా విగ్రహం పెట్టారు. ఆ విగ్రహాన్నే సుప్రీం కోర్టు జ్యూరిస్టిక్ పర్సన్‌గా పరిగణించిందా?
అదే నిజమైతే, విగ్రహాన్ని అక్కడ పెట్టడాన్ని కోర్టు ఎందుకు తప్పపట్టింది?
ప్రస్తుతమున్న రామ్ లల్లా విగ్రహానికి కొత్తగా నిర్మించే మందిరంలో ముఖ్య స్థానం ఉంటుందా?
వివాదాస్పద 2.77 ఎకరాల భూమి రామ్ లల్లాకు చెందుతుందని కోర్టు ప్రకటించింది. హిందువుల తరఫున ఈ వివాదంలో పోరాటం ఆరంభించిన హిందూ మహాసభ, నిర్మోహి అఖాడాల పిటిషన్లను కొట్టివేసింది. 1989లో దాఖలైన వ్యాజ్యం ప్రకారం రామ్ లల్లాకు అనుకూలంగా కోర్టు తీర్పును ఇచ్చింది.
రామ్‌లల్లాను కోర్టు 'జ్యూరిస్టిక్ పర్సన్'గా పరిగణించింది. రామ జన్మస్థానాన్ని ‘జ్యూరిస్టక్ పర్సన్’గా పరిగణించకున్నా, చారిత్రక ప్రాధాన్యం ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.
దేవుడు, విగ్రహం, జన్మస్థానాలకు 'జ్యూరిస్టిక్ పర్సన్' హోదా ఇవ్వడంపై వస్తున్న సందేహాలకు చాలా ప్రాధాన్యత ఉంది.
అయోధ్య శ్రీరాముడి జన్మస్థలామా అన్న ప్రశ్నపై వివాదం ఎప్పుడూ లేదు.
కానీ ఆ వివాదాస్పద స్థలంలోనే రాముడు జన్మించాడా? ఈ విషయంలో సాక్ష్యాలు, విశ్వాసాల కలగాపులగం జరిగిందని ఆరోపణలున్నాయి.
ఇవి కూడా చదవండి.
- అయోధ్య తీర్పుపై పాకిస్తాన్ స్పందన ఏమిటి?
- అయోధ్య తీర్పు: ‘తప్పు చేసిన వారికే బహుమతి ఇచ్చారు’ - జస్టిస్ లిబర్హాన్ కమిషన్ న్యాయవాది అనుపమ్ గుప్తా
- ‘అయోధ్య తీర్పులో స్పష్టంగా చెప్పారు, రామ జన్మస్థలం మసీదు కిందే ఉంది’ - సి.ఎస్.వైద్యనాథన్
- మెక్ డోనల్డ్స్ బర్గర్లు: పదేళ్లైనా పాడవలేదు.. బూజు పట్టలేదు.. ఎందుకు?
- రామజన్మభూమి - బాబ్రీ మసీదు వివాదం పూర్తి చరిత్ర
- ఈ మొక్కలు కార్చిచ్చుతో మళ్లీ పుడతాయి.. అంగారకుడిపై పెరుగుతాయి... 32000 సంవత్సరాలు బతుకుతాయి
- హిందుత్వ రాజకీయాలకు రామాయణం టీవీ సీరియల్ ఊపిరి పోసిందా?
- అయోధ్య: రామ మందిర వివాదంతో మోదీకి లాభమా? నష్టమా?
- వారానికి నాలుగు రోజులే పని.. 40 శాతం పెరిగిన మైక్రోసాఫ్ట్ అమ్మకాలు
- తొలి రాత్రే అనుమానం... మహిళలను మానసికంగా చంపేస్తున్న ‘రక్త పరీక్షలు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








