హిందుత్వ రాజకీయాలకు రామాయణం టీవీ సీరియల్ ఊపిరి పోసిందా?

ఫొటో సోర్స్, Ramanand Sagar Productions
- రచయిత, రాహుల్ వర్మ
- హోదా, బీబీసీ ప్రతినిధి
నేను పెరిగిందంతా లండన్‌లోనే. 80వ దశకం చివర్లో టీనేజ్‌లో ఉన్నాను. దగ్గరి బంధువులను కలుసుకునేందుకు అప్పుడప్పుడు దిల్లీ వెళ్లవాణ్ని. అలా వెళ్లినప్పుడు ఇంకో ప్రపంచంలో అడుగుపెట్టినట్లు నాకు అనిపిస్తుండేది.
'బ్యాట్‌మాన్' కామిక్స్ పుస్తకాలకు బదులు 'అమర్ చిత్ర కథ' పుస్తకాలు నా దగ్గర చేరేవి. అద్భుతమైన హిందూ పురాణాలతో కూడిన కథలు వాటిలో ఉండేవి. చెర్రీ కోక్ క్యాన్ల స్థానంలో కాంపా కోలా సీసాలు చేతిలోకి వచ్చేవి. నాలుగు టీవీ ఛానెల్స్‌కు బదులు ఒకే దూరదర్శన్ ఛానెల్ చూడాల్సి వచ్చేది.
లండన్‌లో మా తల్లిదండ్రులను నసపెడుతూ నైబర్స్, ఈస్ట్ ఎండర్స్ షోలు చూసేవాడిని. కానీ దిల్లీలో మా ఇంటిల్లిపాదితో కలిసి రామాయణం సీరియల్ చూడటం తప్పలేదు.
రామాయణ గాథపై రామానంద్ సాగర్ ఈ సీరియల్‌ను తీశారు.
యువరాజైన రాముడు పద్నాలుగేళ్లు వనవాసానికి వెళ్తాడు. సీతను పది తలల రాక్షసుడు రావణుడు అపహరిస్తాడు. రావణుడిని అంతం చేసి రాముడు తిరిగి సీతను తీసుకువస్తాడు.

ఫొటో సోర్స్, Ramanand Sagar Productions
చెడుపై మంచి సాధించిన విజయం, అయోధ్యకు రాముడు తిరిగి రావడానికి ప్రతీకగా జరుపుకునేదే దీపావళి పండుగ. దీపావళిని హిందువులతోపాటు సిక్కులు, జైనులు కూడా జరుపుకుంటారు. కొన్ని వర్గాల వారికిది నూతన సంవత్సర దినోత్సవం.
రామాయణ కథలోని ఘట్టాలను 'రామ్‌లీలా' పేరుతో చాలా చోట్ల ప్రదర్శిస్తుంటారు.
1987, 1988 సంవత్సరాల్లో 18 నెలలపాటు రామాయణం సీరియల్ నడిచింది. వారానికి ఒకటి చొప్పున 45 నిమిషాల నిడివి ఉన్న 78 ఎపిసోడ్లను రామానంద్ సాగర్ రూపొందించారు. అప్పుడు భారత్‌లో నడిచే ఏకైక టీవీ ఛానెల్ దూరదర్శన్‌లో ఆదివారం ఉదయం ఇది వచ్చేది. భారత చరిత్రలోనే అత్యంత విజయవంతమైన టీవీ షోగా మారింది. కొన్ని కొన్ని ఎపిసోడ్లను ఏకంగా 8 కోట్ల నుంచి 10 కోట్ల మంది వీక్షించారు. అంటే దేశ జనాభాలో ఎనిమిదో వంతు ప్రజలు.
భారతీయుల సాంస్కృతిక జ్ఞాపకాల్లో రామాయణానికి ఉన్న ప్రత్యేక స్థానమే ఆ టీవీ సీరియల్‌కు అంత గొప్ప ఆదరణ తెచ్చిపెట్టింది. ఆ టీవీ సీరియల్‌ను వారం వారం చూడటం ఓ భక్తిపూర్వకమైన అలవాటుగా మారుతుందని ఎవరూ ఊహించి ఉండరు.

ఫొటో సోర్స్, Ramanand Sagar Productions
ఈ టీవీ సీరియల్ వచ్చే సమయంలో ఉత్తర భారత్‌లో జనజీవనం స్తంభించిపోయేదని న్యూయార్క్ యూనివర్సిటీలో మీడియా స్టడీస్ ప్రొఫెసర్‌గా ఉన్న అరవింద్ రాజగోపాల్ అన్నారు.
''రైళ్లు స్టేషన్లలో ఆగిపోయేవి. బస్సులు స్టాపుల్లో నిలిచిపోయేవి. ప్రయాణికులు దిగి రోడ్డు పక్కనే ఉండే టీవీలకు అతుక్కుపోయేవారు. జనాలు ఎక్కువై ఎవరికీ ఏమీ కనిపించేది కాదు, వినిపించేది కాదు. కాని అక్కడ ఉండటం వాళ్లకు ప్రధానం'' అని ఆయన చెప్పారు.
రామాయణం టీవీ సీరియల్ వచ్చే సమయంలో భారత్ బంద్ ఉన్నట్లుగా పరిస్థితి ఉండేదని బీబీసీ దిల్లీ కరెస్పాండెంట్ సౌతిక్ బిశ్వాస్ 2011లో రాశారు.
''ఆదివారం ఉదయం వీధులన్నీ ఖాళీగా మారేవి. దుకాణాలు మూతపడేవి. సీరియల్ మొదలవ్వడానికి ముందు జనాలు స్నానం చేసి, టీవీలకు పూలమాలలు వేసేవారు'' అని ఆయన పేర్కొన్నారు.
మా నానమ్మకు వారంలో ఆదివారం ఉదయం అత్యంత ముఖ్యమైన సమయం. ప్రసారం మొదలయ్యే ముందు ఆమె ఇంట్లోనే ఉండే చిన్న పూజ గదిలో ప్రార్థనలు చేసేవారు. కింద నేలపై కూర్చొని, తలపై కొంగు కప్పుకొని కుటుంబంలోని మూడు తరాలతో కలిసి ఆ సీరియల్ చూసేవారు.
గుడిలో పద్ధతులే మా నానమ్మ కూడా పాటించేవారు. ఆలయంలో దేవుని దర్శనం అనుభూతిని ఆ సీరియల్ టీవీలోకి తెచ్చేసింది. గుడిలో దర్శనం అంటే దేవుడి విగ్రహాన్ని చూడటం. ఇక్కడేమో టీవీలో దేవుళ్లు తమ లీలను చూపుతున్నారు.
''పూర్తిగా గుడికి వెళ్లినట్లే ఉండేది. సీరియల్ మొదలయ్యే ముందు జనాలు పూజలు చేసేవారు. టీవీలకు మాలలు వేసేవారు. తిలకాలు దిద్దేవారు. సీరియల్ పట్ల వాళ్లకు అలాంటి అభిమానం ఉండేది'' అని ఆ సీరియల్‌లో రాముడి పాత్ర పోషించిన అరుణ్ గోవిల్ అన్నారు.

ఫొటో సోర్స్, Ramanand Sagar Productions
ఈ సీరియల్ గోవిల్ జీవితాన్నే మార్చేసింది.
''ఎక్కడికి వెళ్లినా జనాలు నన్ను, నా పాదాలను తాకేవారు. నా పట్ల ఎంతో ఆరాధనా భావం చూపేవారు. కన్నీళ్లు పెట్టుకునేవారు. ఓసారి నేను వారణాసికి వెళ్లినప్పుడు దినపత్రికలో వచ్చిన వార్త క్లిప్పింగ్ ఇప్పటికీ నా దగ్గర ఉంది. 'శ్రీరాముడిని చూసేందుకు పది లక్షల మంది వచ్చారు' అని దానికి హెడ్‌లైన్ పెట్టారు'' అని గోవిల్ గుర్తు చేసుకున్నారు.
''ముందెప్పుడూ జరగలేదు. భవిష్యత్తులో జరగబోదు. ఆ సీరియల్ కోసం కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా, గుజరాత్ నుంచి గోరఖ్‌పుర్ దాకా, లక్షల మంది టీవీల ముందు కూర్చున్నారు. ప్రార్థనలు చేశారు. మరిన్ని లక్షల మంది దానిపై పోట్లాడుకున్నారు'' అని ఆ సీరియల్ ఆఖరి ఎపిసోడ్ ప్రసారమైన ఓ వారం తర్వాత (1988 ఆగస్టు 7న) ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికలో శైలజా బాజ్‌పేయి రాశారు.
హిందూ జాతీయవాదం ప్రధానాంశంగా మారడంలో ఈ సీరియల్ పాత్ర ఎంతో ఉందని చాలా మంది అంటుంటారు. రామాయణం సీరియల్ మొదలయ్యేవరకూ భారత్‌లో టీవీల్లో మతపరమైన కార్యక్రమాలకు పరిమితులుండేవి. భారత్ లౌకిక దేశం కాబట్టి, అన్ని మతాలను సమానంగా చూసేది.
''లౌకికవాద అభిప్రాయాలను మొదట గాయపరిచింది రామాయణం సీరియల్ ప్రసారమే. భక్తి, సంప్రదాయాలను ఈ కార్యక్రమం ప్రోత్సహించింది. ఈ సీరియల్ వల్ల జనాల్లో భక్తి భావం ఉప్పొంగింది. రాజకీయ పార్టీలు దాన్ని రాజకీయాంశంగా మలుచుకున్నాయి'' అని రాజగోపాల్ అభిప్రాయపడ్డారు.
''దశాబ్దాలుగా పాటిస్తున్న మతపరమైన నిష్పక్షపాతానికి భంగం కలిగింది. హిందూ జాతీయవాదులు అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. భారత రాజకీయ రంగులను ఇది సమూలంగా మార్చింది. బహుశా స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జరిగిన అతిపెద్ద ప్రచార కార్యక్రమం ఇదే అయ్యుంటుంది. మతపరమైన కావ్యంపై రూపొందిన టీవీ సీరియల్‌కు అంతటి జనాదరణ రావడం జాతి ఏకమవుతోందన్న భావనను కలిగించింది. హిందూ జాగృతి అన్న ఆలోచనపై గట్టి నమ్మకం కుదిరేలా చేసింది'' అని ఫ్రంట్‌లైన్ మ్యాగజైన్‌కు 2000లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రాజగోపాల్ చెప్పారు.

ఫొటో సోర్స్, Ramanand Sagar Productions
రామాయణం టీవీ సీరియల్ ప్రసారం చేయడం ద్వారా హిందూ ఓట్లకు వల వేయాలనుకుంది కాంగ్రెస్ పార్టీ. కానీ, ఆ చర్య ప్రయోజనాలు మాత్రం బీజేపీకి దక్కాయి. 1998 నుంచి 2004 వరకూ కూటమి ప్రభుత్వాలు నడిపిన బీజేపీ, 2014, 2019ల్లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అద్భుత విజయాలు అందుకుంది.
రామయాణం సీరియల్ ప్రసారమైన సమయంలో, ఆ తర్వాత... హిందూ జాగృతి అన్న ఆలోచనను సంఘ్ పరివార్ బాగా ఉపయోగించుకుంది. 'రామ రాజ్య స్థాపన' గురించి చెబుతూ వివిధ హిందూ సంస్థలనూ ఐక్యం చేసింది. ఈ సీరియల్ ప్రసారం అవుతున్న సమయంలో అయోధ్యలో బాబ్రీ మసీదు ఉన్న స్థలంపై వివాదం రేగింది. దాన్ని రామ జన్మభూమిలో నిర్మించారని హిందూ జాతీయవాదులు వాదిస్తున్నారు.

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది, 1

రామ జన్మభూమి కోసం హిందూ జాతీయవాదులు దేశవ్యాప్త ఉద్యమాన్ని ప్రారంభించారు. రామాయణం టీవీ సీరియల్‌లోని రామక్ష్మణుల్లా దుస్తులు ధరించి కార్యకర్తలు అందులో పాల్గొన్నారు. బాబ్రీ మసీదు ఉన్న స్థలంలో రామమందిరం నిర్మించాలని డిమాండ్ చేశారు. 'అయోధ్యకు ఇటుకలను పంపడం', 'రూపాయిని పంపడం' వంటి కార్యక్రమాలతో దేశవ్యాప్తంగా హిందువులను ఏకం చేసే కార్యక్రమాలు చేపట్టారు.
''సీరియల్‌లోని ఓ సీన్‌లో తన జన్మభూమి నుంచి ఈ భూమిని మోస్తున్నానని రాముడు అంటాడు. నేను ఏ రామయణంలోనూ రాముడు ఇలా చెప్పడం చూడలేదు. రాజకీయాలను ఆ సీరియల్ ఎలా ప్రతిబింబించింది, తిరిగి రాజకీయాలు ఆ సీరియల్‌ను ఎలా ప్రతిబింబించాయనేదానికి ఇదే నిదర్శనం'' అని రాజగోపాల్ అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Ramanand Sagar Productions
వివాదాస్పద రామజన్మభూమిలో మందిరం నిర్మించాలని డిమాండ్ చేస్తూ 1992 డిసెంబర్‌లో హిందూ సంస్థలు నిర్వహించిన కార్యక్రమంలో 1.5 లక్షల మంది పాల్గొన్నారు. అది హింసారూపం దాల్చింది. బాబ్రీ మసీదును ఆందోళనకారులు కూల్చారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. ఆ స్థలం ఎవరిదన్న కేసుపై సుప్రీం కోర్టు త్వరలో తీర్పు వెల్లడించాల్సి ఉంది.
భారత రాజకీయాల్లో నిత్యం రామాయణంలోని పాత్రలు, విశేషాల ప్రస్తావనలు ఉంటుంటాయి. 'రామ రాజ్యం' నాయకుల ప్రసంగాల్లో ఎప్పుడూ వినిపిస్తూ ఉంటుంది. ప్రధాని నరేంద్ర మోదీని రాముడిగా, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాను లక్ష్మణుడిగా వర్ణిస్తుంటారు. అయితే, వీటన్నింటికీ రామాయణం సీరియల్ కారణం కాదు గానీ, అందరికీ వాటిని చేరవేసేలా అది తోడ్పడింది.
''నిష్ఠగా ఉండే హిందూ వ్యక్తిత్వాన్ని రూపొందించాలన్నది ఎంతో కాలంగా హిందూ జాతీయవాదుల ఆశ. వ్యక్తిత్వ పునర్మిర్మాణం చేస్తే జాతిని కూడా పునర్నిర్మించవచ్చు. అయితే, ఈ ప్రక్రియ క్షేత్ర స్థాయిలో మొదలై పైస్థాయికి చేరుకుంటుందని భావించేవారు. మీడియా, టీవీల రాకతో ఇది పైస్థాయిలో మొదలై కింద స్థాయికి చేరుకుంది'' అని రాజగోపాల్ అన్నారు.

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది, 2

రామాయణం టీవీ సీరియల్ చూపిన ప్రభావం గురించి 2018లో హిందుస్తాన్ టైమ్స్ పత్రిక ఓ వ్యాసం ప్రచురించింది.
''భారత రాజకీయాల్లో ఆర్‌ఎస్ఎస్, బీజేపీ నేతృత్వంలో వచ్చిన హిందుత్వ మార్పు నేపథ్యంలో రామాయణం సీరియల్ నడిచింది. ఉద్దేశపూర్వకమైనా, కాకపోయినా ఈ సీరియల్ ఆ పరిణామానికి ఉత్ప్రేరకంగా నిలిచిందని అభిప్రాయపడ్డ విశ్లేషకులు ఉన్నారు'' అని అందులో పేర్కొంది.
అయితే, పురాతన హిందూయిజం ఇంకా ఈ ఆధునిక సమాజంలో మనగలదని ఈ టీవీ సీరియల్ చూపించింది.
సీరియల్ ముగిసి 30 ఏళ్లు గడిచినా, రాముడి పాత్ర ధరించిన గోవిల్‌పై దాని ప్రభావం ఇంకా పోలేదు. ఇప్పుడు కూడా ఆయన ఓ నాటకంలో రాముడి పాత్ర పోషిస్తున్నారు. ఆయనపైనే కాదు, భారత్‌పైనా ఆ సీరియల్ ప్రభావం పోలేదని చెప్పొచ్చు.
ఇవి కూడా చదవండి
- రామ్‌లీల: ‘సంపూర్ణ రామాయణాన్ని’ తొలిసారి ప్రదర్శించింది ఇక్కడే
- 'రామాయణంలో సీత టెస్ట్‌ట్యూబ్ బేబీనే.. మహాభారత కాలంలోనే లైవ్ టెలికాస్ట్..'
- వోడ్కా, విస్కీ, వైన్, బీర్, పచ్చి గుడ్డు సొన.. ఇవన్నీ కలిపేసి నీళ్లలా తాగేస్తాడు.. చైనాలో పెరుగుతున్న మద్యం దాహానికి ఇది సంకేతమా?
- కెనెడాలో ఒక సిక్కు 'కింగ్ మేకర్' ఎలా అయ్యారు?
- అయోధ్య: ఈ సుదీర్ఘ కోర్టు కేసులో తీర్పు ఎలా వచ్చే అవకాశం ఉంది? పిటిషనర్లు ఏమంటున్నారు?
- రఫేల్‌కు ‘ఆయుధ పూజ’.. ‘దేశాన్ని రక్షించడానికి రఫేల్, రఫేల్‌ను రక్షించడానికి నిమ్మకాయలు’
- అయోధ్య కేసు: అసలు వివాదం ఏమిటి? సుప్రీం కోర్టు తీర్పు ఎప్పుడు వెలువడుతుంది...
- కశ్మీర్, గో రక్షణ, మూకదాడులు, మతాంతర వివాహాలపై గాంధీ అభిప్రాయాలేంటి?
- పాకిస్తాన్‌లోని వేలాది హిందూ ఆలయాలకు మోక్షం ఎప్పుడు?’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









