బంగ్లాదేశ్: నుస్రత్ జహాన్‌పై లైంగిక వేధింపులు, హత్యకేసులో 16మందికి మరణ శిక్ష

ఫొటో సోర్స్, FAMILY HANDOUT
ఉపాధ్యాయుడి లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేసిందని విద్యార్థినిని మంటల్లో తగలబెట్టి హత్యచేసినందుకు 16మందికి ఉరిశిక్ష విధిస్తూ బంగ్లాదేశ్ కోర్టు తీర్పునిచ్చింది.
19 ఏళ్ల నుస్రత్ జహాన్ రఫీ బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు 160 కి.మీ. దూరంలో ఉన్న ఫెనీ పట్టణంలో ఏప్రిల్‌లో హత్యకు గురయ్యారు.
లైంగిక వేధింపులపై నుస్రత్ ఫిర్యాదు చేసిన ప్రధాన ఉపాధ్యాయుడు, మరో ఇద్దరు విద్యార్థినులు ఈ కేసులో ప్రధాన నిందితులు.
నుస్రత్ హత్య దేశవ్యాప్తంగా అలజడి రేపింది. ఆమెకు న్యాయం చేయాలంటూ ఎన్నో నిరసనలు జరిగాయి.
ఈ కేసులో విచారణ చాలా వేగంగా ముగిసింది. సాధారణంగా ఇలాంటి కేసుల్లో సంవత్సరాల తరబడి విచారణ జరిగే బంగ్లాదేశ్‌లో ఈ కేసు విచారణ మాత్రం చాలా వేగంగా జరిగింది.
హత్య చేసి తప్పించుకోవడం సాధ్యం కాదని మరోసారి రుజువైంది అని ప్రాసిక్యూటర్ హఫీజ్ అహ్మద్ మీడియాతో అన్నారు.
ఈ తీర్పుతో తన బాధ కొద్దిగా తగ్గిందని నుస్రత్ తల్లి చెప్పారు.
"నేనిప్పటికీ నుస్రత్‌ను మర్చిపోలేకపోతున్నా. ఆమె ఎంత బాధ అనుభవించిందో నాకు నిరంతరం గుర్తొస్తూనే ఉంటుంది" అని తీర్పు విన్న తర్వాత షిరిన్ అక్తర్ వ్యాఖ్యానించారు.
దీనిపై అప్పీల్ చేస్తామని నిందితుల తరపు న్యాయవాదులు తెలిపారు.

ఫొటో సోర్స్, Reuters
నుస్రత్ హత్య కేసు విచారణలో ఆమె చేసిన ఆరోపణలను బయటకు రాకుండా చేసేందుకు జరిగిన కుట్రకోణం వెల్లడైంది. దీనిలో ఆమె తోటి విద్యార్థినులు, ఆ వర్గంలోని కొందరు పెద్దల పాత్ర కూడా ఉంది.
ప్రధానోపాధ్యాయుడు సిరాజ్ ఉద్దౌలాతోపాటు మరో ఇద్దరు ఉపాధ్యాయులు రుహుల్ అమీన్, మక్సూద్ ఆలమ్‌లను ఈ హత్యకు బాధ్యులుగా కోర్టు నిర్ణయించింది. వేధింపుల ఆరోపణలపై అరెస్టై జైలులో ఉన్న సిరాజ్.. జైలు నుంచే ఆమె హత్యకు ఆదేశాలిచ్చారని పోలీసులు తెలిపారు. మరో ఇద్దరు ఉపాధ్యాయులు అధికార అవామీ లీగ్ పార్టీకి చెందిన స్థానిక నేతలు.
నుస్రత్‌ది హత్య కాదు, ఆత్మహత్య అనే అసత్య ప్రచారానికి వీరికి స్థానిక పోలీసులు కూడా సహకరించారని నిర్ధరణైంది.

ఫొటో సోర్స్, AFP
పోలీసులకు ఫిర్యాదు చేయాలని మార్చిలో నుస్రత్ జహాన్ నిర్ణయించుకున్నప్పుడు ఆమె కుటుంబం పూర్తిగా మద్దతునిచ్చింది. అప్పటి నుంచి ఆమెకు పోలీసు రక్షణ కూడా ఏర్పాటైంది. ఇప్పటికీ తాము భయంతోనే బతుకుతున్నామని ఆమె సోదరుడు మహ్మదుల్ హసన్ నోమన్ తెలిపారు.
"వాళ్లు కోర్టు గదిలోనే నన్ను బెదిరించారు. అది మీకు తెలుసు. నాకు చాలా భయంగా ఉంది. మాకు భద్రత కల్పించాలని ప్రధానికి విజ్ఞప్తి చేస్తున్నా. మా భద్రతపై పోలీసులు కూడా దృష్టిసారించాలని కోరుతున్నా" అని నోమన్ మీడియాతో అన్నారు.
కోర్టు తీర్పును నుస్రత్ కుటుంబం స్వాగతించింది. శిక్ష త్వరగా అమలు కావాలని కోరింది. బంగ్లాదేశ్‌లో మరణశిక్షను ఉరివేయడం ద్వారా అమలు చేస్తారు.

ఆగ్రహం, కన్నీళ్లు... న్యాయం కోసం పోరాటం
అక్బర్ హుస్సేన్, ఫెనీ నుంచి బీబీసీ బెంగాలీ ప్రతినిధి
కోర్టు తీర్పు వెలువడగానే నుస్రత్ కుటుంబ సభ్యులు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. తమకు అన్యాయం జరిగిందంటూ నిందితుల తరపు వాళ్లు గట్టిగా కేకలు వేశారు.
కానీ, బంగ్లాదేశ్‌లో సాధారణంగా నుస్రత్ లాంటి మహిళలకే అన్యాయం జరుగుతుంటుంది.
బంగ్లాదేశ్‌లోని విద్యా సంస్థలు, మదర్సాలలో లైంగిక వేధింపులు చాలా ఎక్కువ. దీనిపై మాట్లాడితే జరిగే పరిణామాలు కూడా తీవ్రంగానే ఉంటాయి.

నుస్రత్‌కు ఏమైంది?
ఈ సంవత్సరం ఏప్రిల్ 6న స్కూలు పైభాగంలో ఆమె లైంగిక వేధింపులకు గురైంది. ఇది జరిగిన 11 రోజుల తర్వాత, తనను అసభ్యకరంగా తాకుతున్నారంటూ ప్రధానోపాధ్యాయుడిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఆ తర్వాత బుర్ఖాలు ధరించిన నలుగురైదుగురు వ్యక్తులు ఆమెను చుట్టుముట్టి ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని ఒత్తిడి తెచ్చారు.
ఆమె తిరస్కరించారు. దీంతో ఆమెను మంటల్లో తగలబెట్టి హత్య చేశారు.
"దీన్ని వాళ్లు ఆత్మహత్య కింది చిత్రీకరించాలని ప్రయత్నించారు. కానీ, ఆమె తప్పించుకుని, సహాయాన్ని కోరడంతో విషయం బయటికొచ్చింది" అని పోలీసులు తెలిపారు.
తను తీవ్ర గాయాలపాలైందని తెలుసుకున్న తర్వాత.. ఆమె తన సోదరుడి ముందు ఓ వాంగ్మూలాన్నిచ్చింది. ఆతడు దాన్ని ఫోన్‌లో రికార్డు చేశాడు.
"ఆ ఉపాధ్యాయుడు నన్ను అసభ్యంగా తాకాడు. నా చివరి శ్వాస వరకూ నేను దీనిపై పోరాడతా" అంటూ దాడికి పాల్పడిన వారి పేర్లను వెల్లడించింది.
శరీరంపై 80శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఏప్రిల్ 10న ఆమె మరణించింది.

బంగ్లాదేశ్‌లో లైంగిక వేధింపులు ఎక్కువేనా?
బంగ్లాదేశ్‌లో లైంగిక వేధింపులు సర్వసాధారణం.. వస్త్ర పరిశ్రమలో పనిచేసే 80శాతం మంది మహిళలు వేధింపులను చూడటమో, అనుభవించడమో జరిగిందని యాక్షన్ ఎయిడ్ అనే ఓ స్వచ్ఛంద సంస్థ నివేదిక ఈ సంవత్సరంలో వెల్లడించింది.
మరోవైపు, 2019లో మొదటి ఆరు నెలల్లో లైంగికంగా వేధింపులకు గురై 26 మంది మహిళలు చనిపోయారు, 592 మంది అత్యాచారానికి గురయ్యారు, 113 మంది మహిళలు సామూహిక అత్యాచారానికి గురయ్యారని మహిళా హక్కుల సంస్థ 'మహిళా పరిషద్' తెలిపింది.
ఇవి కేవలం అధికారిక లెక్కలు. కానీ వాస్తవ పరిస్థితులు ఇంకా భయంకరంగా ఉండొచ్చు.
లైంగిక వేధింపులపై నుస్రత్ మాదిరిగా బహిరంగంగా మాట్లాడటం ఇక్కడ చాలా తక్కువ. ఇక దీనిపై ఫిర్యాదు చేయడం ప్రమాదంతో కూడిన వ్యవహారం.
నుస్రత్ కేసు ప్రత్యేకం. ఎందుకంటే ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఆమె వాంగ్మూలాన్ని వారు ఫోన్లో రికార్డు చేశారు. ఆ తర్వాత ఇది మీడియాకు చేరింది.
మరోవైపు, ప్రధానోపాధ్యాయుడిని విడుదల చేయాలంటూ కొందరు నిరసన ప్రదర్శనలు చేశారు. దీంతో నుస్రత్ కుటుంబం మరింత ప్రమాదంలో పడింది.

ఫొటో సోర్స్, Reuters
నుస్రత్ హత్యపై ప్రజలు ఎలా స్పందించారు?
నుస్రత్ హత్య దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలకు కారణమైంది. లైంగిక వేధింపుల బాధితులు ఎంతటి ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నారో తెలియచేసింది.
చట్టపరంగా తీసుకునే చర్యల నుంచి ఏ ఒక్క దోషీ తప్పించుకోలేడని ప్రధాన మంత్రి షేక్ హసీనా బహిరంగంగా వ్యాఖ్యానించారు. ఆమె చూపిన ప్రత్యేక శ్రద్ధ నుస్రత్ కుటుంబానికి కొంత ధైర్యాన్నిచ్చింది.
"ఇంత త్వరగా న్యాయం జరుగుతుందని మేం ఊహించలేదు. దీనికి మేం ప్రధానికి నేరుగా కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాం. ఆమె అవకాశం ఇస్తారనే ఆశిస్తున్నాం" అని నోమన్ అన్నారు.
లైంగిక వేధింపుల ఆరోపణలను పోలీసులు మొదట కొట్టిపారేసినా, మే నెలలో 16మందిపై అభియోగాలు నమోదు చేశారు. వేగంగా జరిగిన ఈ కేసు విచారణ 62 రోజుల్లో పూర్తైంది.
ఇవి కూడా చదవండి.
- #100WOMEN: పోర్న్‌హబ్‌తో కలిసి పనిచేస్తానని హాలీవుడ్ నటి బెల్లా థోర్న్ ఎందుకన్నారు...
- టాకింగ్ బాక్స్: కెన్యాలో బాలికలపై వేధింపులకు ఇవి ఎలా పరిష్కారం చూపిస్తున్నాయి...
- కంట్లో ప్రతిబింబించిన చిత్రంతో పాప్‌సింగర్ ఇల్లు కనిపెట్టి వేధించిన యువకుడు
- అది ఇస్లామిక్ పాఠశాల కాదు... చిత్ర హింసల కారాగారం
- ఆర్టీసీ బస్ నంబర్ ప్లేట్ మీద Z ఎందుకుంటుందో తెలుసా
- ఏఐఎంఐఎం: భాగ్యనగరం నుంచి బిహార్ వరకు ఎగిరిన ‘గాలిపటం’
- ఆర్టీసీ సమ్మెకు ఆర్టీసీ ముగింపే సమాధానమన్న కేసీఆర్, స్పందించిన ఆర్టీసీ జేఏసీ నాయకులు
- హుజూర్నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విజయం.. సైదిరెడ్డికి 43359 ఓట్ల మెజార్టీ
- కెనెడాలో ఒక సిక్కు 'కింగ్ మేకర్' ఎలా అయ్యారు?
- ఈ ఊరిలో బిడ్డను కంటే 8 లక్షల రూపాయల బోనస్ ఇస్తారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








