'నేను లైంగిక దాడి బాధితురాలిని, నా పేరు ప్రపంచమంతా తెలియాలి' -షనెల్ మిల్లర్

షనెల్ మిల్లర్
ఫొటో క్యాప్షన్, షనెల్ మిల్లర్
    • రచయిత, లారెన్ టర్నర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి, శాన్‌ ఫ్రాన్సిస్కో

లైంగిక దాడుల బాధితుల వివరాలను గోప్యంగా ఉంచాలని న్యాయస్థానాలు చెబుతుంటాయి. వారి ఫొటోలను, పేర్లను వార్తా కథనాలలోనూ ప్రచురించకూడదని సూచిస్తుంటాయి. కానీ, ఈ యువతి మాత్రం "నేను లైంగిక దాడి బాధితురాలిని, నా పేరు ప్రపంచంలో అందరికీ తెలియాలి" అంటున్నారు. అంతే కాదు, 'నో మై నేమ్' (నా పేరు తెలుసుకోండి) అనే పేరుతో ఆమె ఒక పుస్తకం కూడా రాశారు.

అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో 2015 జనవరిలో ఓ రాత్రి ఆమె మీద బ్రాక్ టర్నర్ (ప్రముఖ స్విమ్మర్) అనే వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అపస్మారక స్థితిలో, చిరిగిన దుస్తులతో ఓ చెత్త కుండీ దగ్గర పడిపోయి ఉన్న ఆమెను, ఇద్దరు యువకులు చూసి కాపాడారు.

అమెరికాలో సంచలనం సృష్టించిన ఈ కేసులో బాధితురాలి గుర్తింపును గోప్యంగా ఉంచేందుకు కోర్టులో ఎమిలీ డో అనే మారుపేరుతో పిలిచారు.

నాలుగేళ్లు గడిచింది. తన అసలు పేరును ప్రపంచానికి తెలియజేయాలని ఆమె నిర్ణయించుకున్నారు. షనెల్ మిల్లర్ తన అసలు పేరు అని గత నెలలో వెల్లడించారు.

షనెల్ సాహిత్యంలో గ్రాడ్యుయేట్, 'నో మై నేమ్' అనే పుస్తక రచయిత. ఆమె చక్కని డ్రాయింగులు వేస్తారు, స్టాండప్ కామెడీ కూడా చేస్తారు. షనెల్ విడుదల చేసిన తన విక్టిమ్ ఇంపాక్ట్ స్టేట్‌మెంట్‌ (వాంగ్మూలం)ను చదివితే ఆమె గురించి పూర్తిగా అర్థమవుతుంది.

హెచ్చరిక: ఈ కథనంలో కొన్ని విషయాలు పాఠకుల మనసును కలచివేయవచ్చు.

లైన్

మీరు ఎదుర్కొన్న క్షోభను, సంఘర్షణలను ఎందుకు అక్షరబద్ధం చేయాలనుకున్నారు? అని అడిగినప్పుడు, ప్రపంచంలో ఎంతోమంది యువతులు లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారని, 'చీకటి'లో మగ్గిపోతున్న వారికి దారి చూపడం తన కర్తవ్యమన్న ఆలోచనతో ఈ పుస్తకం రాశానని ఆమె చెప్పారు.

"ఉదయం లేవడం ఎంతో ఇబ్బందులు పడ్డ రోజులు చూశాను. నా ముందు ఏ మార్గం ఉందో కూడా ఉహించలేని పరిస్థితులు. నా జీవితంలో అత్యంత బాధాకరమైన సమయం అది. భయంకరమైన అనుభవం" అని షనెల్ గుర్తుచేసుకున్నారు.

"అలాంటి సమస్యలు ఎదురైనప్పుడు, ఇక నేనేమీ చేయలేను, ఇంట్లో మౌనంగా ఉండిపోవడమే ఉత్తమం అనుకోకూడదు. అది జీవితానికి మార్గం కాదు" అంటున్నారు ఆమె.

ఆమె స్వరం స్పష్టంగా, సూటిగా ఉంది. ప్రపంచంలో ఇతర మహిళలకు జరుగుతున్న అన్యాయాల పట్ల ఉద్వేగం, నిశ్శబ్ద ఆగ్రహం కూడా ఆ స్వరంలో ఉంది.

"ప్రతిభావంతులైన యువతులు మెరుగైన భవిష్యత్తు కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. వారికి సమాజం ఇవ్వాల్సినవి చాలా ఉన్నాయి. ఎంతోమంది వేధింపులకు గురవుతున్నారు. ఆ విషయాన్ని బయటకు చెబితే ఎవరేమనుకుంటారో అన్న భయంతో చాలామంది నిశ్శబ్దంగా ఉంటారు. అవమాన భారాన్ని మోస్తారు. బాధను దిగమింగుకుంటూ గడుపుతారు. కానీ, అది లోపలి నుంచి వారిని తినేస్తుంది" అని షనెల్ మిల్లర్ అన్నారు.

"బయటకి వెళ్లకుండా ఓ గదిలోనే ఉండిపోతే బాగుంటుంది, మన సమస్య గురించి నలుగురితో మాట్లాడకపోవడమే ఉత్తమం, ప్రేమను పొందడానికి, ఇతరులను ప్రేమించడానికి ఇక నాకు అర్హత లేదేమో అనుకుంటూ కుంగిపోతుంటారు. కానీ, అలా అనుకోవద్దు. వారిలో అలాంటి ప్రతికూల ఆలోచనలు రావడానికి కారణం మన సమాజమే" అని ఆమె అభిప్రాయపడ్డారు.

"మీరు కూడా ఏదైనా సాధించగలరు, మీకూ అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది అన్న భరోసా, ప్రోత్సాహం ఇవ్వకుండా సమాజం వారిని ఒంటరివారిని చేస్తోంది. ఏదీ మాట్లాడకుండా వారిని వెనక్కి లాగేస్తోంది" అని షనెల్ అన్నారు.

షనెల్ మిల్లర్

ఫొటో సోర్స్, Jared Stapp/BBC

ఫొటో క్యాప్షన్, షనెల్ మిల్లర్

లైంగిక దాడి జరిగినప్పుడు స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో షనెల్ విద్యార్థి కాదు, అప్పటికే ఆమె గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ విశ్వవిద్యాలయంలో చదువుతున్న తన చెల్లి టిఫనీతో కలిసి ఆమె ఓ పార్టీకి వెళ్లారు.

షనెల్ విక్టిమ్ ఇంపాక్ట్ స్టేట్‌మెంట్‌ (వాంగ్మూలం)ను చదివిన తర్వాత, అనేక మంది లైంగిక వేధింపుల బాధితులు ధైర్యంగా ముందుకొచ్చారు.

అమెరికాలో లైంగిక హింసకు వ్యతిరేకంగా పనిచేసే అతిపెద్ద సంస్థ రెయిన్ (రేప్, అబ్యూస్, ఇన్‌సెస్ట్ నేషనల్ వర్క్) విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ప్రతి ఆరుగురు అమెరికన్ మహిళల్లో ఒకరు లైంగిక వేధింపులకు లేదా అత్యాచారానికి గురవుతున్నారు. అమెరికాలో ప్రతి 92 సెకన్లకు ఒకరు లైంగిక వేధింపులకు గురవుతున్నారు. అయితే, వేధిపులకు పాల్పడినవారిలో చాలామందికి తగిన శిక్షలు పడటం లేదు. ప్రతి 1,000 లైంగిక వేధింపుల కేసుల్లో, 995 మంది నేరస్తులు బయట దర్జాగా తిరుగుతున్నారు.

ఈ లెక్కల ప్రకారం, రోజులో ఎంతమంది బాధితులు అవుతున్నారో చూడండి. అది ఊహిస్తేనే ఆందోళన కలుగుతుంది.

"ఇలాంటి గణాంకాలు చూడగానే, బాధితులు అంతమంది ఉంటారా? వాళ్లంతా బయటకు వచ్చి పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయడం లేదు? అని మనం అనుకుంటాం. కానీ, వాళ్లు ఫిర్యాదు చేసేందుకు సరైన వ్యవస్థలు లేవు" అని షనెల్ అన్నారు.

షనెల్ మీద లైంగిక దాడికి పాల్పడిన టర్నర్‌కు శిక్ష పడినప్పుడు, దానిని రేప్ కేసుగా కోర్టు పేర్కొనలేదు. కానీ, ఆ విషయంపై తీవ్ర చర్చ జరగడంతో, కాలిఫోర్నియా చట్టాన్ని సవరించింది.

షనెల్ మిల్లర్

ఫొటో సోర్స్, MARIAH TIFFANY

సమాజంలో మార్పు తెచ్చేందుకు ఉపయోగపడుతుందన్న ఆలోచనతో తన వాంగ్మూలాన్ని బహిర్గతం చేశానని షనెల్ చెప్పారు.

ఆ వాంగ్మూలాన్ని మొదట బజ్‌ఫీడ్ ప్రచురించింది. దానిని నాలుగు రోజుల్లోనే కోటి పది లక్షల మంది చదివారు. ఆ తర్వాత షనెల్‌ను ప్రశంసిస్తూ ప్రపంచ నలుమూలల నుంచీ ఆమెకు వందలాది ఉత్తరాలు, బహుమతులు వచ్చాయి.

అమెరికా ఉపాధ్యక్షుడు జోయ్ బిడెన్ కూడా ఆమెను అభినందిస్తూ లేఖ రాశారు. "బాధితులు ధైర్యంగా పోరాడేందుకు అవసరమైన బలాన్ని మీరు ఇచ్చారు. మీరు ఎన్నో ప్రాణాలను నిలబెడతారన్న నమ్మకం నాకుంది" అని ఆయన పేర్కొన్నారు.

షనెల్ వివరాలు గోప్యంగా ఉన్నందున, ఆ స్టేట్‌మెంట్‌ను తనే రాసినట్లు తెలియక తన స్నేహితులు కూడా దానిని ఆమెకు ఫార్వార్డ్ చేస్తుండేవారు.

ఆమె లైంగిక దాడికి గురైనట్లు ఆమెకు చికిత్స అందించిన వైద్యులకు తెలుసు, కానీ ఎమిలీ డో ఈమేనని వారికి కొన్ని నెలల దాకా తెలియలేదు. "స్టాన్‌ఫర్డ్ బాధితురాలి వాంగ్మూలం చదివారా? అని వైద్యులు ఆమెను అడిగేవారు.

షనెల్ లాంటి కేసుల విచారణలో కోర్టులు - బాధితులను మారుపేర్లతో పిలుస్తాయి. వారి గుర్తింపును తెలియజేసే ఎలాంటి వివరాలనూ బహిర్గతం చేయవు.

షనెల్ మిల్లర్

ఫొటో సోర్స్, Jared Stapp/BBC

ఇలాంటి విషయాలను బయటకు చెప్పకూడదు, ఇతరులు ఏమైనా అనుకుంటారేమో అన్న ఆలోచనతో వెనకడుగు వేయకూడదు. మనం ధైర్యాన్ని ప్రదర్శిస్తే, ఎదుటివారు భయపడి వెనక్కి వెళ్తారని అంటున్నారు షనెల్. ఆ మార్పు సమాజంలో రావాల్సిన అవసరం ఉందని ఆమె చెబుతున్నారు.

"నా విషయానికొస్తే, నా దగ్గర లైంగిక దాడి ఫోరెన్సిక్ ఆధారాల కిట్ ఉంది. పోలీసులు, నర్సుల సహకారం ఉంది. న్యాయవాది ఉన్నారు. ప్రభుత్వ ప్రాసిక్యూటర్ ఉన్నారు. అవసరమైన అన్ని రకాల మద్దతూ ఉంది" అని ఆమె చెప్పారు.

"నాలుగు గోడల నడుమ కోర్టు గదిలో ఏం జరుగుతుంది? అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది? తీర్పులు ఎలా చెబుతారు? అన్న విషయాలన్నీ అక్షరబద్ధం చేయడం నా కర్తవ్యం అనిపించింది" అని ఆమె వివరించారు.

"పుస్తకం రాయడం కోసం నా కేసుకు సంబంధించిన కోర్టు పత్రాలను సేకరించాను. అంతకుముందు నా వద్దకు రాని వేల పేజీల రాతపూర్వక పత్రాలను కూడా సేకరించాను. వాటిని చదవడం చాలా కష్టంగా అనిపించింది. దాంతో కొంతకాలం పాటు పుస్తకం రాయడాన్ని ఆపేశాను. తర్వాత, మళ్లీ ఆలోచించి, ఎలాగైనా దానిని పూర్తి చేయాలని నిర్ణయించాను. నా లోదుస్తులు లాగేసి, చేతివేళ్లు లోపలకు తోసి... బ్రాక్ టర్నర్ నా మీద ఎంత పైశాచికంగా దాడి చేశాడో చదువుతుంటే... నా పరిస్థితి మాటల్లో చెప్పలేను" అని ఆమె గుర్తు చేసుకున్నారు.

షనెల్ మిల్లర్

ఫొటో సోర్స్, Chanel Miller

ఫొటో క్యాప్షన్, శాన్ ఫ్రాన్సిస్కో‌లోని తన నివాసంలో బొమ్మలు గీస్తున్న షనెల్ (పాత చిత్రం)

షనెల్ పుస్తకం రాయడాన్ని 2017లో మొదటుపెట్టారు. తన అసలు పేరును బయటపెట్టాలని ఆమె మొదట్లో అనుకోలేదు. బాగా ఆలోచించిన తర్వాత ఆరు నెలల కిందటే ఆ నిర్ణయం తీసుకున్నారు.

తమ వాస్తవ పేరును వెల్లడించకుండా గోప్యతను పాటించడం అత్యంత బారంగా ఉంటుందని, తనకు తెలిసినవారిలో 90 శాతం మందికి తన వాస్తవ గుర్తింపు వివరాలు తెలియవని ఆమె చెప్పారు.

"మొదట్లో నా వివరాలను బయటపెట్టకుండా గోప్యంగా ఉంచడం తప్పనిసరి అయ్యింది. కానీ, తర్వాత చాలా ఇబ్బందిగా అనిపించింది. నా గురించి బయటకు చెప్పడంలో తప్పు లేదని అనిపించింది. అందుకే బాగా ఆలోచించి నా పేరు వెల్లడించాను" అని షనెల్ చెప్పారు.

ఆమె రాసిన 'నో మై నేమ్' పుస్తకం 2019 సెప్టెంబర్ 24న విడుదలైంది.

తన వాస్తవ వివరాలను, తను ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితులను ప్రపంచానికి తెలియజేసేందుకు ధైర్యంగా ముందుకొచ్చిన ఆమె‌కు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం

స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం స్పందన:

ఆ పుస్తకం విడుదలైన తర్వాత స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం కూడా ఆమెకు అభినందనలు తెలిపింది.

"తనగాథను ధైర్యంగా అక్షరబద్ధం చేసి పుస్తకం రూపంలో బహిర్గతం చేసినషనెల్ మిల్లర్‌కు అభినందనలు. స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో లైంగిక దాడి జరగడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాం. ఒక విశ్వవిద్యాలయంగా లైంగిక వేధింపులను పూర్తిగా నివారించేందుకు, తక్షణ చర్యలు చేపట్టేందుకు అన్ని ప్రయత్నాలనూ కొనసాగిస్తున్నాం " అని స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం తెలిపింది.

షనెల్ రాసిన పుస్తకం ఇప్పుడు మార్కెట్‌లో అందరికీ అందుబాటులో ఉంది.

తర్వాత ఏం చేయాలనుకుంటున్నారు? అని అడిగినప్పుడు... "పిల్లల కోసం పుస్తకాలు రాయాలనుకుంటున్నాను. భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలను ధీటుగా ఎదుర్కొనేలా రచనల ద్వారా వారిలో స్థైర్యం నింపేందుకు ప్రయత్నిస్తా " అని షనెల్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)