జయలలిత తమిళనాడులో సమ్మె చేస్తున్న ఉద్యోగులను తొలగించినప్పుడేం జరిగింది?

జయలలిత

ఫొటో సోర్స్, Hindustan Times

    • రచయిత, ప్రవీణ్ కాసం
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తెలంగాణ ఆర్టీసీ కార్మికులను ఉద్యోగం నుంచి తొలగించినట్లేనా? తమిళనాడులో గతంలో ఇదే తరహాలో చేస్తే ఏం జరిగింది?

సమ్మె చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులను ఇకపై ఉద్యోగాల్లోకి తీసుకునేది లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఆర్టీసీలో ప్రస్తుతం 1200 మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నారని, త్వరలోనే మిగిలిన ఖాళీలను భర్తీ చేస్తామని తెలిపారు.

ఈ నిర్ణయంపై ఎలాంటి జీవో విడుదల కానప్పటికీ సీఎం ప్రకటన సంచలనంగా మారింది.

అయితే, సీఎం ప్రకటనతో సమ్మె చేస్తున్నవారంతా ఉద్యోగాలు కోల్పోయినట్లేనా? కార్పొరేషన్ ఉద్యోగులను తొలగించే అధికారం ప్రభుత్వానికి ఉందా? ఇలా అనేక ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.

ఇంతకుముందు తమిళనాడులో ఆర్టీసీ యూనియన్ సమ్మెకు దిగినప్పుడు మద్రాస్ హైకోర్టు ఏం చెప్పింది?

మద్రాస్ హైకోర్టు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మద్రాస్ హైకోర్టు

తమిళనాడు ఆర్టీసీ సమ్మెపై మద్రాసు కోర్టు తీర్పు ఏమిటంటే..

తమిళనాడు ఆర్టీసీ యూనియన్ 2018లో సమ్మెకు దిగినప్పుడు విధులకు హాజరుకానివారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.

సమ్మెపై ప్రజాప్రయోజన వ్యాజ్యం కూడా దాఖలైంది. దీన్ని విచారించిన మద్రాసు హైకోర్టు.. తమ అనుమతి లేకుండా సమ్మె చేస్తున్న వారిని ఉద్యోగాల నుంచి తొలగించరాదని స్పష్టం చేసింది.

కార్మికులకు నిరసన తెలిపే హక్కు ఉందని కోర్టు అభిప్రాయపడింది. అయితే, ముందస్తు నోటీసు లేకుండా సమ్మెకు వెళ్లే ఉద్యోగులకు ఇది వర్తించదని పేర్కొంది.

కానీ, 2003లో తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె చేసినప్పుడు మాత్రం సుప్రీంకోర్టు ప్రభుత్వ నిర్ణయానికి అనూకూలంగా స్పందించింది. ప్రభుత్వ ఉద్యోగులకు సమ్మె చేసే హక్కు లేదని స్పష్టం చేసింది.

జయలలిత

ఫొటో సోర్స్, Getty Images

తమిళనాడులో ఏం జరిగింది?

జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2003 జులై 1న ఆ రాష్ట్రంలోని టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులు మూకుమ్మడిగా సమ్మెకు దిగారు. సచివాలయ సిబ్బంది సైతం ఈ సమ్మెలో పాల్గొన్నారు.

తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని ఆందోళన బాట పట్టారు. సమ్మె మొదలైన నాల్గో రోజే జయలలిత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

టీఎన్ ఎస్మా (తమిళనాడు ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ ఆక్ట్) కింద సమ్మె చేసిన 1.70 లక్షల మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది.

ఇందుకోసం అత్యవసరంగా ఐదు ఆర్డినెన్స్‌లు తీసుకొచ్చింది. ఎస్మా కింద వేలాది మంది ఉద్యోగులను అరెస్టు చేసింది.

ఈ సంచలన నిర్ణయంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ఉద్యోగ సంఘాలు రెండుగా చీలిపోయాయి. కొందరు ఉద్యోగులు ఈ నిర్ణయంతో గుండెపోటుకు గురై మరణించారు.

ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కొన్ని ఉద్యోగ సంఘాలు కోర్టును ఆశ్రయించాయి.

సుప్రీం కోర్టు

ఫొటో సోర్స్, Getty Images

ప్రభుత్వ ఉద్యోగులకు సమ్మె చేసే హక్కు లేదు: సుప్రీం

ఈ కేసును విచారించిన సుప్రీం కోర్టు ధర్మాసనం ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది.

ప్రభుత్వ ఉద్యోగులకు సమ్మె చేసే నైతిక హక్కు లేదని, అయితే, మానవతా దృక్పథంతో ఉద్యోగులను తిరిగి తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది.

''ప్రజలకు ఇబ్బంది కలిగించేలా ఆర్థిక, పారిశ్రామిక కార్యక్రమాలను స్తంభింపజేసే హక్కు రాజకీయ పార్టీలు లేదా సంస్థలకు లేదు'' అని జస్టిస్ ఎంబీ షా, జస్టిస్ ఏఆర్ లక్ష్మణన్‌లతో కూడిన ధర్మాసనం తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించింది.

కార్మిక సంఘాలకు యాజమాన్యంతో బేరసారాలు సాగించే హక్కు ఉన్నప్పటికీ సమ్మె చేసే హక్కు లేదని జస్టిస్ ఎంబీ షా పేర్కొన్నారు.

సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవడంతో సమ్మెలో పాల్గొన్నవారిలో లిఖితపూర్వకంగా క్షమాపణలు చెబుతూ, మళ్లీ సమ్మెకు దిగమని ప్రమాణపత్రం దాఖలు చేసిన 1,56,106 మంది ఉద్యోగులను ప్రభుత్వం మళ్లీ విధుల్లోకి తీసుకుంది.

టీఎస్ ఆర్టీసీ

సమ్మె చేయడం చట్టబద్దమేనా?

ఇండస్ట్రియల్‌ డిస్‌ప్యూట్‌ యాక్ట్‌ - 1947 సమ్మె గురించి నిర్వచించింది.

ఇందులోని సెక్షన్ 2 (క్యూ) సమ్మె అనే పదాన్ని నిర్వచిస్తుంది. దీని ప్రకారం సమ్మె అంటే ఏదైనా పరిశ్రమలో పనిచేసే కార్మికులు సంఘటితంగా పనులు నిలిపివేయడం, కొనసాగించడం చేయవచ్చు.

సెక్షన్ 22 (1) ప్రకారం సమ్మె అనేది చట్టం చెప్పిన విధానాన్ని అనుసరించాలి. లేకపోతే ఆ సమ్మెను చట్టవిరుద్ధంగా భావించవచ్చు.

ఈ చట్టం సమ్మె హక్కులపై కొన్ని ఆంక్షలను విధించింది. కాంట్రాక్టును ఉల్లంఘిస్తూ ప్రజా సంబంధిత సేవా సంస్థల్లో పనిచేసే ఏ వ్యక్తి ముందస్తు నోటీసు లేకుండా సమ్మెకు దిగకూడదని పేర్కొంది.

మద్రాస్ హైకోర్టు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మద్రాస్ హైకోర్టు

సమ్మెపై వివిధ సందర్భాల్లో కోర్టు తీర్పులు...

బీఆర్ సింగ్ vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో జస్టిస్ అహ్మదీ తీర్పునిస్తూ ''తగినంత సభ్యత్వ బలం కలిగిన కార్మిక సంఘాలు తమ డిమాండ్ల కోసం యాజమాన్యంతో బేరసారాలు జరపవచ్చు. విధులకు హాజరు కాకపోవడం, సమ్మె చేయడం తదితర రూపాల్లో ఆందోళన చేయొచ్చు. దీనిని దాదాపు అన్ని ప్రజాస్వామ్య దేశాలు గుర్తించాయి'' అని పేర్కొన్నారు.

తమిళనాడు ఉపాధ్యాయ జేఏసీ 2019లో సమ్మె చేసినప్పుడు దాఖలైన పిటిషన్‌పై మద్రాసు హైకోర్టు... ''సమ్మె చట్టవిరుద్ధం కాదు. సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. ప్రభుత్వం ఆ పని చేయనప్పుడు సహజంగానే ఉద్యోగులు వివిధ రూపాల్లో ఆందోళన చేస్తుంటారు'' అని వ్యాఖ్యానించింది.

తెలంగాణ బస్ భవన్

సమ్మెకు ఏపీఎస్ఆర్టీసీ యూనియన్ మద్దతు

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు చేపడుతోందని, సమ్మెకు తాము మద్దతు ప్రకటిస్తున్నామని ఏపీఎస్‌ఆర్టీసీ యూనియన్ ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదర్ తెలిపారు.

ఆయన బీబీసీతో మాట్లాడుతూ, ''సమ్మె నోటీసులు ఇచ్చినా 35 రోజులుగా ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే కార్మికసంఘాలు సమ్మెకు వెళ్లాయి. కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగిస్తామని బెదిరించడం సరికాదు. ఇది ఉద్యమాన్ని అణచివేసే చర్యలు మాత్రమే. అన్ని రాష్ట్రాల కార్మికులు వారికి మద్దతిస్తున్నారు. మేం మా పూర్తి మద్దతు ప్రకటించాం. ప్రజలను ఇబ్బందులు పెట్టకుండా సానుకూలంగా సమస్యలు పరిష్కరించాలి'' అని చెప్పారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)