ప్రపంచ చాంపియన్ మేరీ కోమ్‌ను బాధించే విషయం ఏంటి?

ప్రపంచ చాంపియన్ మేరీ కోమ్‌

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ప్రభాత్ పాండేయ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఆరు ప్రపంచ చాంపియన్ టైటిల్స్, ఒక ఒలింపిక్ కాంస్యం, ఆసియా గేమ్స్‌, కామన్‌వెల్త్ గేమ్స్‌లో ఒక్కో స్వర్ణం. ఇన్ని సాధించినా భారత మహిళా బాక్సర్ మేరీ కోమ్‌ మనసులో ఒక బాధ అలాగే ఉంది.

భారతదేశానికి ఒలింపిక్ స్వర్ణ పతకం గెలవలేకపోయాననేదే ఆమె బాధ.

రష్యాలో జరుగుతున్న మహిళా ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్ కోసం వెళ్లడానికి ముందు మేరీ కోమ్ బీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు.

"నేను ఆరుసార్లు ప్రపంచ చాంపియన్ టైటిల్స్ గెలిచాను. కానీ ఈ టోర్నమెంటుకు ఏ వాల్యూ లేనట్టు అనిపిస్తోంది. వార్తా పత్రికల్లో కూడా ఒక చిన్న కాలంలో ఈ వార్త ప్రచురిస్తున్నారు. నా లక్ష్యం ఒలింపిక్ స్వర్ణ పతకం గెలవడమే" అని మేరీ కోమ్ అన్నారు.

మహిళా ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో మేరీ కోమ్ 51 కిలోల విభాగంలో పోటీపడుతున్నారు.

ప్రపంచ చాంపియన్ మేరీ కోమ్‌

ఫొటో సోర్స్, AFP

ఈసారీ 51 కిలోల కేటగిరీలో...

అక్టోబర్ 8న ఆమె తన ఫైట్ ప్రారంభిస్తారు. ఆమె ఈ టైటిల్ గెలుచుకుంటే, టోక్యో ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయ్యే అవకాశాలు మరింత మెరుగవుతాయి.

‘‘అయినా, ఇప్పుడు మహిళా బాక్సింగ్ గురించి వార్తలు రావడం మొదలయ్యింది. మొదట్లో నేను అన్ని బాక్సింగ్ టైటిల్స్ గెలిచినా, ఎవరికీ తెలిసేది కాదు" అన్నారు మేరీ కోమ్.

మేరీ కోమ్ జీవితంలో అత్యంత ముఖ్యమైన క్షణం 2012లో లండన్ ఒలింపిక్స్‌లో ఆమె కాంస్య పతకం గెలుచుకున్న రోజు. ఆ తర్వాత ఆమె పేరు దేశమంతా మార్మోగిపోయింది.

ఒక మహిళా బాక్సర్‌ను ఒలింపిక్స్‌కు పంపించడం అదే మొదటిసారి. అప్పుడు మేరీ కోమ్ సెమీ ఫైనల్లో బ్రిటన్‌కు చెందిన నికోలా ఆడమ్స్‌ను ఓడించి కాంస్య పతకంతో సంతృప్తి చెందారు.

మేరీ కోమ్ మొదట 48 కిలోల విభాగం పోటీల్లో పాల్గొనేవారు. కానీ ఒలింపిక్స్‌లో 51 కిలోల కేటగిరీ నుంచే పోటీలు మొదలవుతాయి. దాంతో, ఆమె బరువు పెరిగి 51 కిలోల కేటగిరీ పోటీల్లో పాల్గొనడం ప్రారంభించారు.

ప్రపంచ చాంపియన్ మేరీ కోమ్‌

ఫొటో సోర్స్, Getty Images

గోల్డ్ మెడల్‌పై దృష్టి

ఇప్పుడు మేరీ కోమ్ దృష్టంతా వచ్చే ఏడాది టోక్యోలో జరగబోయే ఒలింపిక్స్‌లో భారత్‌కు గోల్డ్ మెడల్ తీసుకురావడంపైనే ఉంది.

"ఒలింపిక్ పోడియంలో అనుభవం విషయానికి వస్తే అది చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అందులో కాంపిటీషన్ స్థాయి చాలా ఉన్నతంగా ఉంటుంది. ఈసారీ, భారత్‌కు గోల్డ్ తీసుకురావడానికి నా శక్తిమేరకు ప్రయత్నిస్తా" అని మేరీ కోమ్ చెప్పారు.

"ఇప్పుడు భారత్‌లో అందరికీ మహిళా బాక్సింగ్ గురించి తెలియడం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి స్థాయిలో అమ్మాయిలు ఇందులోకి వస్తున్నారు. అది చాలా సంతోషించాల్సిన విషయం" అన్నారు.

మేరీ కోమ్ తన విజయం పూర్తి క్రెడిట్‌ను తన కుటుంబానికి, భర్తకు ఇస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)