మోదీకి మూకదాడుల గురించి లేఖ రాసిన 49 మంది ప్రముఖులపై దేశద్రోహం కేసు

గుహ, మణిరత్నం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రామచంద్ర గుహ, మణిరత్నం

ఈ సంవత్సరం జులై 23న ప్రధాని మోదీకి లేఖరాసిన 49మంది ప్రముఖులపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని బిహార్‌లోని ఓ కోర్టు పోలీసులను ఆదేశించింది.

చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తులు, సామాజిక కార్యకర్తలు, చరిత్ర కారులతో కూడిన 49 మంది దేశంలో జరుగుతున్న మూకదాడులపై మోదీకి ఓ లేఖ రాశారు.

ఈ లేఖలో సంతకాలు చేసినవారిపై సుధీర్ కుమార్ ఓజా అనే ఓ న్యాయవాది ముజఫర్ పూర్ చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు.

మణిరత్నం

ఫొటో సోర్స్, Getty Images

ప్రధాని పదవి విలువ తగ్గించేలా ప్రవర్తించారంటూ వీరిపై దాఖలు చేసిన కేసులో పేర్కొన్నారు.

ఈ పిటిషన్‌పై స్పందించిన కోర్టు వారందరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆగస్టు 20న పోలీసులను ఆదేశించింది. దీంతో అక్టోబర్ 3న పోలీసులు కేసు నమోదు చేశారు. మత విశ్వాసాలను కించపరిచారనే ఆరోపణలపై కూడా వారిపై కేసులు నమోదయ్యాయి.

రేవతి, నటి

ఫొటో సోర్స్, Getty Images

లేఖపై సంతకాలు చేసిన వారిలో దర్శకులు అదూర్ గోపాలకృష్ణన్, శ్యామ్ బెనెగల్, అనురాగ్ కశ్యప్, మణిరత్నం, చరిత్రకారుడు రామచంద్ర గుహ, నటులు అపర్ణా సేన్, రేవతి వంటివారున్నారు.

మోదీకి రాసిన లేఖలో మూకదాడులతో పాటు, దేశంలో దళితులు, ముస్లింలు, ఇతర మైనారిటీలపై జరుగుతున్న హింస, గోరక్షణ పేరుతో జరుగుతున్న దాడులను వారు ప్రస్తావించారు. జైశ్రీరాం అనే పదం మూకదాడులకు కారణమవుతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

తమపై కేసు నమోదుచేయడం అవివేకమైన చర్య అని, రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగించడమేనని మలయాళీ చిత్ర నిర్మాత అదూర్ గోపాలకృష్ణన్ మీడియతో అన్నారు.

మోదీకి 49 మంది ప్రముఖుల లేఖ

లేఖలో వారు ఏం రాశారు?

ప్రముఖులు తమ లేఖలో 'నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో' (ఎన్సీఆర్బీ) గణాంకాలను ప్రస్తావించారు. 2009 జనవరి 1 నుంచి 2018 అక్టోబర్ 29 మధ్యలో మతగుర్తింపు ఆధారంగా 254 నేరాలు నమోదైనట్లు తెలిపారు. వీరిలో 91 మందిని హత్య చేశారని, 579 మంది గాయపడ్డారని చెప్పారు.

భారత రాజ్యాంగంలో భారతదేశాన్ని ఒక లౌకిక గణతంత్ర రాజ్యమని, ఇక్కడ అన్ని మతాలు, సమాజాలు, కులాలు, అన్ని లింగాల వారికి సమాన హక్కులు లభించాయని చెప్పారని వీరు లేఖలో తెలిపారు.

దేశంలో 14 శాతం ముస్లి జనాభా ఉంది, కానీ ఇలాంటి 62 శాతం నేరాల్లో వారే బాధితులుగా నిలిచారని లేఖలో చెప్పారు.

మోదీకి 49 మంది ప్రముఖుల లేఖ

ఈ లేఖలో చెప్పిన వివరాల ప్రకారం ఇలాంటి నేరాల్లో 90 శాతం నరేంద్ర మోదీ మొదటిసారి అధికారంలోకి వచ్చాక, అంటే 2014 మే తర్వాతే జరిగాయి.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పార్లమెంటులో లించింగ్ ఘటనలను ఖండించారు. కానీ అది సరిపోదని ప్రముఖులు భావించారు. ఇలాంటి కేసుల్లో దోషులకు కఠిన శిక్షలు విధించాలని డిమాండ్ చేశారు.

ప్రజాస్వామ్యంలో 'అసమ్మతి' ప్రాధాన్యాన్ని కూడా వీరు తమ లేఖలో నొక్కి చెప్పారు. ఏదైనా ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తే, వారిపై 'యాంటీ నేషనల్' లేదా 'అర్బన్ నక్సల్' అనే ముద్ర వేయకూడదని అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)