ముంబయి ఆరే కాలనీ: "ఈరోజు ఇది అడవి కాదన్నారు.. రేపు మేం మనుషులమే కాదని అంటారేమో"

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మయూరేష్ కొన్నూర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
"ఇది అడవి కాదు అని వాళ్లంటున్నారు. రేపు... మీరు మనుషులు కాదు, మీకు ప్రాణవాయువు (ఆక్సిజన్) అవసరం లేదు అని కూడా మాతో అంటారేమో." ఇది ముంబయిలోని ఆరే కాలనీలో వందలాది చెట్ల నరికివేతను వ్యతిరేకిస్తున్న గిరిజనులు, పర్యావరణ కార్యకర్తల ఆవేదన.
"మేం ప్రకృతిని ఆరాధిస్తాం. ప్రకృతిని దేవతలా భావిస్తాం. గిరిజనులు అడవులపైనే ఆధారపడి జీవిస్తున్నారు" అని వారు అంటున్నారు.
శ్యామ్ ప్రకాశ్ భోయిర్, మనీషా ధిండేలు ముంబయిలోని ఆరే కాలనీలో ఉంటారు. ఈ కాలనీ పరిధిలో దాదాపు 27 చిన్న చిన్న గ్రామాలున్నాయి. దాదాపు 8 వేలమంది గిరిజనులు వందల ఏళ్లుగా ఇక్కడే నివాసముంటున్నారు.
రద్దీగా ఉండే ముంబయి నగరంలో ఉండడం కంటే, ప్రశాంతంగా ఉండే ఈ ఆరే కాలనీలో ఉండేందుకు చాలామంది గిరిజన యువత ఇష్టపడుతుంది.
కానీ, ఇప్పుడు ఇక్కడి అటవీ ప్రాంతంలో చెట్లను ముంబయి మెట్రో ప్రాజెక్టు కోసం నరికేందుకు సిద్ధపడ్డారు అధికారులు. మెట్రో రైళ్ల కోసం డిపో, షెడ్డు నిర్మాణం కోసం మొత్తం 2,702 చెట్లను నరికేయాలని చూస్తున్నారు. ఇప్పటికే నరికివేతలు ప్రారంభించారు కూడా.

ఫొటో సోర్స్, Reuters
ఇది అడవి అనే విషయాన్ని కోర్టులు కూడా పట్టించుకోవడం లేదు.
అయితే, దీనిపై పర్యావరణవేత్తల నుంచి, స్థానిక గిరిజనుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కొందరు బాలీవుడ్ నటులు, రాజకీయ పార్టీలు నిరసనలు చేస్తున్నాయి.
దీనిపై బొంబాయి హైకోర్టులో అనేక పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. కానీ, కోర్టు ఈ ప్రాంతం అడవి కాదని చెబుతూ అన్ని పిటిషన్లనూ తిరస్కరించింది.
శుక్రవారంనాడు కోర్టు తీర్పు రాగానే నిరసనలు మరింత తీవ్రమయ్యాయి. పోలీసులతో నిరసనకారులు వాగ్వాదానికి దిగారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో ఈ ప్రాంతంలో భారీగా పోలీసులను మోహరించారు. ఈ ప్రాంతమంతా 144 సెక్షన్ విధించారు.
దాదాపు 50 మంది కార్యకర్తలను అరెస్టు చేశారు. మరికొంత మందిని విచారణ పేరుతో అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు, తమ భవిష్యత్తు ఎలా ఉండబోతోందోనని ఆరే కాలనీలో నివసిస్తున్న గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తల్లిని వదిలి పిల్లలు ఎలా ఉండలేరో ఈ అడవిని వదిలి మేం కూడా బతకలేం అని ఇక్కడే నివాసం ఉంటున్న శ్యామ్ ప్రకాశ్ భోయిర్ అనే ఓ గిరిజన యువకుడు అన్నారు.
"మా దృష్టిలో ఇవి కేవలం చెట్లే కాదు... వీటిపై ఎన్నో రకాల జీవజాతులు నివాసాలు ఏర్పరచుకుని ఉంటాయి. పక్షులు, కీటకాలు వంటి వాటికి ఇవే ఆధారం. ప్రతి చెట్టుకూ ఓ ప్రత్యేకత ఉంటుంది. ఇది కేవలం చెట్ల కోసం పోరాటం మాత్రమే కాదు, మా మనుగడ కోసం చేసే పోరాటం కూడా" అని అంటారు శ్యామ్ ప్రకాశ్.
"మా ముందు తరాలవారు పెద్దగా చదువుకోలేదు. వారంతా వ్యవసాయంపైనే ఆధారపడి జీవించారు. ఇక్కడి గిరిజనులు అడవుల నుంచి పళ్లు, కూరగాయలు సేకరించి, వాటితోనే జీవితాలు గడిపారు. మేం కూడా ఇప్పుడు ఈ అడవిపైనే ఆధారపడి జీవిస్తున్నాం. మార్కెట్లో కొనుక్కోవాలంటే అన్నీ దొరుకుతాయి. కానీ మాకు అవసరం లేదు" అని ఆరే ప్రాంతంలోని ఓ గ్రామంలో నివసిస్తున్న మనీషా అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
మెట్రో డిపో కోసం గిరిజనులు, వన్యప్రాణుల నివాస ప్రాంతాలను తాము తీసుకోవడం లేదని ముంబయి మెట్రో రైల్ అథారిటీ చెబుతోంది. కానీ మెట్రో ప్రాజెక్టు నిర్మాణం ఇక్కడ పూర్తైతే అది వన్యప్రాణులపై తీవ్ర ప్రభావం చూపుతుందని గిరిజనులు భావిస్తున్నారు.
"ఇదో ముఖ్యమైన ప్రాజెక్టు. ఈ ప్రాంతానికి ప్రయాణిస్తూ రోజుకు కనీసం 10మంది చనిపోతున్నారు. మెట్రో ప్రారంభమైతే ముంబయి వాసుల భయాలన్నీ తొలగిపోతాయి" అని మెట్రో అథారిటీ చెబుతోంది.

ఇన్ని చెట్లుంటే ఇది అడవి ఎందుకు కాదు?
ఆరే కాలనీలో ఇన్ని వందల, వేల చెట్లుంటే ఇది అడవి ఎందుకు కాదు అని ప్రశ్నిస్తున్నారు మనీషా.
"మెట్రోను గానీ, మెట్రో షెడ్డు నిర్మాణాన్ని గానీ మేం వ్యతిరేకించడం లేదు. ఆ నిర్మాణాల కోసం రెండువేలకు పైగా చెట్లను నరికేయాలనే ఆలోచనను మాత్రమే వ్యతిరేకిస్తున్నాం. ఎన్నో ఏళ్లనుంచి పెరుగుతున్న చెట్లను నరికితేనే వాటి నిర్మాణం సాధ్యమంటే అలాంటి ప్రాజెక్టులు మాకు అవసరం లేదు. అలా జరగకూడదు" అని మనీషా అంటున్నారు.
"గిరిజనులు ఈ అడవులను తమ జీవితంలో భాగం చేసుకున్నారు. తరతరాలుగా ఇక్కడే నివాసం ఉంటున్నారు. కానీ, ఈ భూమి అంతా ప్రభుత్వానికి చెందినది అని ప్రభుత్వం చెబుతోంది. అలాంటప్పుడు ఇక్కడున్న చెట్ల పరిరక్షణ ప్రభుత్వం బాధ్యతే కదా" అంటున్నారు మనీషా.
ఆరే కాలనీలో 4.8 లక్షల చెట్లున్నాయి. అయినా కానీ ఇది అటవీ శాఖ పరిధిలోకి రాదు.
"2,702 చెట్లను కూల్చివేస్తామని వాళ్లంటున్నారు. ఇక్కడ చిన్న ప్రదేశంలోనే ఇన్ని చెట్లున్నాయి అంటే ఇది అడవే కదా. కానీ దీన్ని ఎవరూ అంగీకరించరు. ప్రభుత్వం కూడా ఒప్పుకోదు" అని శ్యామ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
"కోర్టు తీర్పు వచ్చిన తర్వాత చెట్ల నరికివేత ప్రారంభించేందుకు కనీసం 15 రోజుల సమయం ఇచ్చి ఉండాలి. కానీ అలా జరగలేదు. వెంటనే కూల్చివేత ప్రారంభమైంది" అని పర్యావరణవేత్తలు ఆరోపిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
"రేపు మీరు మనుషులు కాదంటారేమో..."
రాత్రి 9.30 గంటల సమయంలో కార్పొరేషన్ సిబ్బంది వచ్చారు. వెంటనే, మెట్రో షెడ్డు నిర్మాణం కోసం ఎంపిక చేసిన స్థలంలో చెట్లను నరకడం ప్రారంభించారు" అని ఇక్కడే నివసించే గిరిజన కార్యకర్త ప్రకాశ్ భోయిర్ అన్నారు.
"ఐదేళ్లుగా ఈ ఉద్యమం జరుగుతోంది. నేను గత సంవత్సరమే వీళ్లతో కలిశాను. ఈ చెట్లు మనకు ఎంతో అవసరం. ఇది అడవి కాదు అని వాళ్లంటున్నారు. రేపు... మీరు మనుషులు కాదు, మీకు ప్రాణవాయువు (ఆక్సిజన్) అవసరం లేదు అని కూడా మాతో అంటారేమో. ఈ నగరం, మన పిల్లల భవిష్యత్తు గురించే మా ఆందోళనంతా. గత 7 వారాలుగా మేం దీన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నాం" అని సుశాంత్ బాలి బీబీసీతో చెప్పారు.
పర్యావరణ కార్యకర్తలు శనివారం నాడు బొంబాయి హైకోర్టులో తాజాగా మరో పిటిషన్ దాఖలు చేశారు.
పిటిషనర్లు సుప్రీం కోర్టును ఆశ్రయించవచ్చని, ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేమని అంతకు ముందు పిటిషన్లను తిరస్కరించే సమయంలో బొంబాయి హైకోర్టు వ్యాఖ్యానించింది.
ఈ అంశంపై ఇప్పటికే సుప్రీంకోర్టులోను, జాతీయ హరిత ట్రైబ్యునల్‌లోనూ వివాదం నడుస్తోందని, అందువల్ల దీనిపై ఎలాంటి ఆదేశాలూ ఇవ్వలేమని కోర్టు వ్యాఖ్యానిస్తూ అన్ని పిటిషన్లనూ తిరస్కరించింది.
కంటెంట్ అందుబాటులో లేదు
మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.పోస్ట్ of Facebook ముగిసింది
ప్రభుత్వం ఏమంటోంది?
దీనిపై కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవడేకర్ స్పందించారు. బొంబాయి హైకోర్టు ఆరే కాలనీ ప్రాంతం అడవి కాదు అని స్పష్టం చేసింది అని ఆయనన్నారు.
"దిల్లీలో మొదటి మెట్రో స్టేషన్ నిర్మించే సమయంలో 20-25 చెట్లు కూల్చాల్సి వచ్చింది. అప్పుడు కూడా ప్రజలు వ్యతిరేకించారు. అయితే, నరికిన ప్రతి చెట్టుకు ఐదు చెట్లు నాటారు. దిల్లీలో మొత్తం 271 మెట్రో స్టేషన్ల నిర్మాణం జరిగింది. అదే సమయంలో నగరంలో పర్యావరణ వ్యవస్థ కూడా మెరుగైంది. 3 కోట్ల మంది ప్రజలకు పర్యావరణహిత రవాణా వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. ఇక్కడ కూడా అలానే జరుగుతుంది. పర్యావరణాన్ని రక్షించుకుంటూనే అభివృద్ధి జరగాలి" అని మంత్రి అన్నారు.
అధికార బీజేపీకి తమ మిత్రపక్షం శివసేన నుంచే తీవ్ర వ్యతిరేకత వస్తోంది. శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే, ఆయన కుమారుడు ఆదిత్య ఠాక్రే కూడా ఆరే కాలనీలో చెట్ల నరికివేతను వ్యతిరేకిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
- పర్యావరణానికి సిమెంటు సమాధి కడుతుందా.. 8 వేల ఏళ్ల కిందటే కాంక్రీటు ఉండేదా?
- గండికోట జలాశయం: ''మా ఇళ్లలోకి నీరొస్తోంది.. పరిహారం మాత్రం రాలేదు''
- 1971 యుద్ధంలో పాకిస్తాన్ నుంచి భారత్ స్వాధీనం చేసుకున్న అందమైన ఊరు కథ
- కశ్మీర్‌కు ప్రత్యేక జెండా ఎందుకు ఉంది? ఆ జెండా ప్రత్యేకత ఏమిటి?
- ‘జీవితంలో మొదటిసారి నేను ముస్లిం అని నాకు అనిపించింది‘
- ఆధార్‌తో లింక్ చేసుకోకపోతే పాన్ కార్డు పనిచేయదు... మరి ఎలా చేయాలి?
- హైదరాబాద్: నర్సరీ విద్యార్థులకు కూడా ర్యాంకులా?
- సంస్కృతం - హిందీ - తమిళం - తెలుగు... ఏది ప్రాచీన భాష? ఏ భాష మూలాలు ఏమిటి?
- చమురు వరమా, శాపమా?.. ప్రపంచాన్ని అది ఎలా మార్చింది
- నకాషీ: 500 ఏళ్ల నుంచి ప్రత్యేకత నిలుపుకుంటున్న తెలంగాణ చిత్రకళ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








