థాయ్ జలపాతం వద్ద గున్న ఏనుగును కాపాడబోయి మరో ఐదు ఏనుగులు మృతి

ఘటనా స్థలంలో ఏనుగుల కళేబరాలు

ఫొటో సోర్స్, THAILAND DNP

ఫొటో క్యాప్షన్, ఘటనా స్థలంలో ఏనుగుల కళేబరాలు

ప్రమాదకరమైన ఒక జలపాతం వద్ద ఒక ఏనుగును మరొక ఏనుగు కాపాడే ప్రయత్నంలో మొత్తం ఆరు ఏనుగులు చనిపోయాయి.

థాయ్‌లాండ్‌లోని ఖావో యాయ్ నేషనల్ పార్క్‌లో ఒక జలపాతం పైనుంచి ఒక ఏనుగు పిల్ల జారి పడిపోయిన తర్వాత ఈ విషాదం చోటుచేసుకొందని అధికారులు తెలిపారు.

ఈ గున్న ఏనుగును కాపాడేందుకు ప్రయత్నించి మరో ఐదు ఏనుగులు చనిపోయాయి.

జలపాతం వద్ద కొండ అంచు మీద చిక్కుకుపోయిన మరో రెండు ఏనుగులను థాయ్ అధికారులు రక్షించారు.

ఏనుగు

ఫొటో సోర్స్, KHAO YAI NATIONAL PARK

'హేయూ నరోక్ (నరకపు జలపాతం)' అనే ఈ జలపాతం వద్ద ఇలాంటి ఘోర ప్రమాదాలు ఇంతకుముందు కూడా జరిగాయి.

1992లో జలపాతం పైనుంచి పడి ఒక గుంపులోని మొత్తం ఎనిమిది ఏనుగులు ప్రాణాలు కోల్పోయాయి. ఈ ఘటనపై అప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరిగింది.

స్థానిక కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున మూడు గంటలప్పుడు ఘటనా స్థలానికి సమీపంలోని రోడ్డును ఏనుగుల గుంపు ఒకటి దిగ్బంధం చేసిందని థాయ్‌లాండ్ జాతీయ పార్కులు, వన్యప్రాణులు, మొక్కల సంరక్షణ విభాగం (డీఎన్‌పీ) తెలిపింది. ఆ తర్వాత అధికారులను పిలిపించినట్లు చెప్పింది.

అధికారులు వచ్చి గాలింపు చేపట్టాక జలపాతం పాదం సమీపాన మూడేళ్ల పిల్ల ఏనుగు కళేబరం కనిపించింది. దానికి దగ్గర్లో మరో ఐదు ఏనుగుల కళేబరాలు కనిపించాయి.

గుంపులో మిగిలిన రెండు ఏనుగుల స్థితిని పరిశీలిస్తున్నామని జాతీయ పార్కు ప్రధానాధికారి కంచిత్ శ్రీనొప్పవన్ బీబీసీతో చెప్పారు.

ఏనుగులు

ఫొటో సోర్స్, THAILAND DNP

తాజా ప్రమాదంపై వైల్డ్‌లైఫ్ ఫ్రెండ్స్ ఫౌండేషన్ థాయ్‌లాండ్ వ్యవస్థాపకుడు ఎడ్విన్ వీక్ స్పందిస్తూ- పరస్పర రక్షణ, ఆహార అన్వేషణ కోసం ఏనుగులు సాధారణంగా పెద్ద పెద్ద గుంపులుగా తిరుగుతాయని, ఇప్పుడు ఒకేసారి ఆరుగురు ఏనుగులు చనిపోవడం మిగతా రెండు ఏనుగులపై ప్రభావం చూపిస్తుందని తెలిపారు.

ఈ రెండు ఏనుగుల భావోద్వేగ స్థితిపైనా ఈ ఘటన ప్రమాదం చూపించే ఆస్కారం ఉంది. గుంపులో ఏదైనా ఏనుగు చనిపోతే దాని తాలూకు బాధ మిగతా ఏనుగుల్లో కనిపిస్తుంది.

సగం కుటుంబాన్ని కోల్పోయిన భావన మిగిలిన ఏనుగులకు కలుగుతుందని ఎడ్విన్ వీక్ బీబీసీతో చెప్పారు.

థాయ్‌లాండ్‌లో సుమారు ఏడు వేల ఆసియా ఏనుగులు ఉన్నాయి. వీటిలో సగానికి పైగా ఏనుగులు నిర్బంధంలోనే ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)