ఏనుగుల ప్రాణాలు తీస్తున్న చర్మం వ్యాపారం, ఆసియాలో పెరుగుతున్న దారుణం

ఫొటో సోర్స్, Getty Images
హెచ్చరిక: ఈ స్టోరీలోని కొన్ని చిత్రాలు మీకు కలవరం కలిగించవచ్చు.
"నన్ను ఎవరో కడుపులో బలంగా కొట్టినట్లు అనిపించింది, ఆ ఫొటోలు చూడలేకపోయాను. జీవితంలో మొదటిసారిగా నిస్సహాయంగా అనిపించింది" 'వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్' సంస్థ మయన్మార్ దేశ డైరెక్టర్ క్రిస్టీ విలియమ్స్ మాట ఇది.
చర్మం పూర్తిగా వలిచేసిన ఏనుగుల చిత్రాల గురించి చెబుతూ ఆయన ఉద్వేగానికి లోనయ్యారు.
"ఆ ఏనుగు చర్మాన్ని పూర్తిగా తొలగించారు, గులాబీ రంగులోని కుళ్లిపోతున్న మాంసం తప్ప మరేమీ కనిపించలేదు" అని విలియమ్స్ బీబీసీతో చెప్పారు.
ఏనుగుల పరిశోధన, సంరక్షణలో 20 ఏళ్లుగా పాలుపంచుకొంటున్న తాను చాలా భయానక దృశ్యాలు చూశానని, కానీ ఇంత తీవ్రమైనది చూడటం ఇదే మొదటిసారని ఆయన తెలిపారు.
ఏనుగుల సంఖ్య పడిపోవడానికి ఏనుగు దంతాల కోసం జరిగే వేట, అడవుల నరికివేత రెండు ప్రధాన కారణాలని చెబుతారు. ఏనుగు చర్మం కోసం పెరిగిన డిమాండ్ ఆసియా ఏనుగులకు మరో కొత్త ముప్పుగా పరిణమిస్తోంది.

ఫొటో సోర్స్, WWF Myanmar
అయిదు ఆసియా దేశాల్లో వ్యాపారం
చైనాలో ఏనుగు చర్మం వ్యాపారం ఆధారాలు 1990ల మధ్యలోనే వెలుగులోకి వచ్చాయి. కానీ, ఏనుగు చర్మంతో తయారైన ఉత్పత్తుల క్రయవిక్రయాలు ఇప్పుడు ఒక్క చైనాకే పరిమితం కాలేదు.
ఏనుగు చర్మం ఉత్పత్తుల వాణిజ్యం ఆసియా ఖండమంతా విస్తరిస్తోందని బ్రిటన్ కేంద్రంగా పనిచేసే స్వచ్ఛంద సంస్థ 'ఎలిఫంట్ ఫ్యామిలీ' సంరక్షణ విభాగం సారథి డేవిడ్ ఎం.అగేరీ తెలిపారు. చైనా, మయన్మార్, లాగోస్, వియత్నాం, కంబోడియా- ఐదు ఆసియా దేశాల్లో ఈ వాణిజ్యం సాగుతోందనే ఆధారాలు తమకు దొరికాయని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
చర్మానికి డిమాండ్ ఎందుకుంది?
ఏనుగు చర్మాన్ని పొడిచేసి, చైనాలో ఔషధంగా వాడతారు. ఏనుగు చర్మంతో తయారైన ఉత్పత్తులను అల్సర్లు, కడుపులో వాపు, కడుపులో క్యాన్సర్ సమస్యలకు మందుగానూ అమ్ముతారు.
చర్మ ఇన్ఫెక్షన్లకు ఔషధంగా అమ్మే క్రీమ్ తయారీలోనూ ఏనుగు చర్మం పొడిని వాడతారు. క్రీమ్ తయారీలో ఏనుగు కొవ్వుకు ఈ పొడిని కలుపుతారు.
ఫ్యాషన్ పరిశ్రమ ఆభరణాల తయారీకి ఏనుగుల చర్మాన్ని కొంటోంది. చర్మాన్ని పూసల రూపంలోకి మార్చి, బ్రేస్‌లెట్లు, నెక్లెస్‌లు తయారుచేస్తారు. పాలిష్ చేసిన చర్మంతో 'పెండెంట్లు' చేసి అమ్ముతారు.
చర్మానికి పెరుగుతున్న డిమాండ్‌కు తగ్గట్లుగా సరఫరా చేసేందుకు మయన్మార్‌లో ఏనుగులను విచక్షణ లేకుండా వేటాడుతున్నారు.
చాలా సార్లు వేటగాళ్లు విషపూరిత 'డార్ట్'లతో ఏనుగులపై దాడి చేస్తున్నారని, ఈ డార్ట్‌లు తగిలాక కొన్ని రోజులపాటు ఏనుగులు ఎంతగానో వేదన చెందుతాయని, ఈలోగా శరీరంలోని అణువణువూ విషం ప్రభావానికి గురవుతుందని విలియమ్స్ వివరించారు.
కొన్ని సందర్భాల్లో చర్మం ఒలవడం మొదలుపెట్టే సమయానికి, దాడికి గురైన ఏనుగు చచ్చుబడిపోయినా ప్రాణంతోనే ఉండొచ్చని ఆయన వెల్లడించారు. ఏనుగు శరరీరం నుంచి ప్రతి చదరపు అంగుళం చర్మాన్ని సేకరిస్తారని చెప్పారు.
వ్యాపారులు పంగోలిన్ జీవి పొలుసులతో ఏనుగు చర్మం పొడిని కలిపి సంప్రదాయ ఔషధంగానూ అమ్ముతున్నారని ఎలిఫంట్ ఫ్యామిలీ తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
అంతరించిపోయే ముప్పు
ఆసియా ఖండంలో 13 దేశాల్లో ఏనుగులు ఉన్నాయి. అడవుల్లో ఉండే మొత్తం ఏనుగుల సంఖ్య 50 వేలకు లోపే ఉంది. ఇందులో దాదాపు 60 శాతం ఒక్క భారత్‌లోనే ఉన్నాయి.
ఆసియా ఏనుగులను అంతరించిపోయే ముప్పు ఉన్న జాతులుగా ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్) గుర్తించింది.

ఫొటో సోర్స్, Getty Images
ఆసియా ఆడ ఏనుగులు: దంతాలు లేకున్నా ముప్పు
ఆఫ్రికా ఆడ ఏనుగుల కన్నా ఆసియా ఆడ ఏనుగులు చిన్నవిగా, ఎత్తు తక్కువగా ఉంటాయి. ఆఫ్రికా ఆడ ఏనుగుల మాదిరి కాకుండా వీటికి దంతాలు ఉండవు.
దంతాల కోసం ఏనుగులను వేటాడేవాళ్లు ఆసియా ఆడ ఏనుగులను లక్ష్యంగా చేసుకోరు. కానీ, చర్మం కోసం వేటాడేవారి నుంచి మాత్రం వీటికి ముప్పుంది.
ఏనుగు చర్మం కోసం వేట విచక్షణరహితంగా సాగుతోందని అమెరికాలోని వర్జీనియాకు చెందిన 'స్మిత్‌సోనియన్ కన్జర్వేషన్ బయాలజీ ఇన్‌స్టిట్యూట్' సారథి పీటర్ లీమ్‌గ్రుబర్ చెప్పారు.
చర్మం వేట ఆడ, మగ అనే తేడా లేకుండా అన్ని ఏనుగులకు, వాటి సంతానానికి ముప్పు కలిగిస్తుందని ఆయన తెలిపారు.
ఏనుగు దంతాల వేటతో పోలిస్తే ఏనుగు చర్మం, మాంసం కోసం జరిగే వేట ఏనుగుల సంఖ్యపై అధిక ప్రభావాన్ని చూపిస్తుందనే విషయాన్ని గుర్తించాల్సి ఉందని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, AFP
వియత్నాంలో..
వియత్నాంలోని మిన్ హోవా జిల్లాలో అటవీ అధికారులు 2013లో ఒక ఏనుగు కళేబరాన్ని చూశారు. దాంతో అక్కడా ఏనుగులకు వేటగాళ్ల బెడద ఉందన్న ఆందోళనలు మొదలయ్యాయి. ప్రస్తుతం వియత్నాంలో 100 ఏనుగులే ఉన్నాయి.
వన్యప్రాణుల శరీరభాగాలతో చేసే వస్తువుల వ్యాపారాలపై చైనాలో నియంత్రణ తక్కువ ఉండేది. ఇప్పుడు అక్కడా కొంత నియంత్రణ ఏర్పడడంతో అక్కడి వ్యాపారులంతా ఆన్‌లైన్ విధానంలోకి మారిపోయారు. దుకాణాలు మూతపడినా ఆన్‌లైన్ వ్యాపారం జోరుగా సాగుతోంది.
ఆన్‌లైన్లోనే డబ్బులు చెల్లిస్తే కావాల్సిన వస్తువు చెప్పిన చోటకు సరఫరా చేసేస్తున్నారు. దీన్ని చైనా నియంత్రించలేకపోతోంది.
''ఏనుగు దంతాలకు ఉన్న విలువ చర్మానికి లేదు. కానీ, ఫ్యాషన్ ప్రపంచంలో దానికి గిరాకీ పెరిగింది'' అని ఐయూసీఎన్‌లో ఏసియన్ ఎలిఫంట్స్ ప్రోగ్రాం మేనేజర్ సందీప్ కుమార్ తివారీ చెప్పారు.
మయన్మార్‌లో ఏనుగు చర్మం కేజీ 108 అమెరికన్ డాలర్లకు(రూ.7 వేలకు పైగా) విక్రయిస్తున్నారు.
అక్కడి నుంచి తరలిపోయే ఏనుగు చర్మం చైనాలోని గుయాంగ్జో నగరంలో 200 అమెరికన్ డాలర్ల ధరకు విక్రయమవుతుంది. ఆన్‌లైన్‌లో దాని ధర 285 డాలర్లు.
ఏనుగు చర్మంతో తయారుచేసే ఉన్నత శ్రేణి పూసల ధర గ్రాము 32 డాలర్లు (సుమారు రూ. 2200) పలుకుతోంది.

ఫొటో సోర్స్, WWF Myanmar
మేలుకోకుంటే ముప్పే
ఏనుగు చర్మంతో చేసే వస్తువుల ధరలు అమాంతం పెరుగుతూ ఉంటే గిరాకీ కూడా మరింత పెరుగుతుంది. అది ఏనుగులకు మరింత ప్రమాదంగా మారుతుంది.
మయన్మార్ ఈ సమస్యను గుర్తించి ఇప్పటికే చర్యలు మొదలుపెట్టింది. ఏనుగుల వేట, వాణిజ్యంపై కఠిన చర్యలు తీసుకుంటోంది.
ఇటీవల 10 మంది వేటగాళ్లను పట్టుకుని భారీగా ఏనుగు మాంసం స్వాధీనం చేసుకుంది.
అయితే, ఇవేవీ అంత త్వరగా ఫలితాలివ్వవని వన్యప్రాణి సంరక్షణ ఉద్యమకారులు అంటున్నారు.
అంతర్జాతీయంగా వివిధ దేశాల సమన్వయంతో చర్యలు చేపడితేనే ఏనుగులను కాపాడుకోగలమని వారు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- ‘కశ్మీర్ ప్రత్యేక జెండా, ప్రత్యేక రాజ్యాంగం రద్దు’
- కశ్మీర్: పాకిస్తాన్ అభ్యర్థనను అంతర్జాతీయ సమాజం ఎందుకు వినడం లేదు...
- కశ్మీర్: 'ఈద్ సంగతి తర్వాత... ముందు మా ఇంట్లో వాళ్లెలా ఉన్నారో తెలుసుకోవాలి'
- ఈ మహిళలు తుపాకీ రిపేర్ చేస్తే తూటా సూటిగా దూసుకుపోవాల్సిందే...
- ముత్తులక్ష్మి రెడ్డిపై గూగుల్ డూడుల్: దేశంలో తొలి మహిళా ఎమ్మెల్యే.. దేవదాసీ వ్యవస్థపై పోరాడిన మొదటి డాక్టర్
- హైదరాబాద్‌లో అమ్మపాల బ్యాంకు: తల్లుల నుంచి పాల సేకరణ.. ఉచితంగా చిన్నారులకు
- మలేషియా అడవుల్లో మాయమైన ఆ టీనేజ్ అమ్మాయి ఎక్కడ?
- 1971 యుద్ధంలో పాకిస్తాన్ నుంచి భారత్ స్వాధీనం చేసుకున్న అందమైన ఊరు కథ
- నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రుడిపైకి వెళ్లలేదంటే మీరు నమ్ముతారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








