తెలంగాణ: అడవిని కాపాడే ఉద్యోగులకు ఆయుధాలెందుకు లేవు

- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
అడవిని కాపాడేవారికి ఆయుధాలెందుకు లేవు? ఆయుధం ఉండుంటే అనిత పరిస్థితి ఇంకోలా ఉండేదా?
తెలంగాణలో కాగజ్ నగర్ అటవీ సిబ్బందిపై దాడి ఘటన.. అటవీ సిబ్బంది భద్రతపై చర్చను లేవనెత్తింది. అటవీ సిబ్బందిపై దాడి జరగడం ఇదే మొదటిసారి కాదు. ఈ దాడే చివరిది కాదని కూడా కొత్తగూడెం ఘటన నిరూపించింది.
అటవీశాఖలో కింది స్థాయి ఉద్యోగాలు యూనిఫాం సర్వీసులు. వారు అడవికి కాపలా కాయాలి. కలప దొంగల నుంచి చెట్లను, వేటగాళ్ల నుంచి జంతువులను, ఆక్రమణదారుల నుంచి భూమినీ కాపాడాలి. ఈ విధి నిర్వహణలో వారికి ఎలాంటి వాహనంగానీ, ఆయుధంగానీ ఉండదు.
అటవీశాఖలో కింద స్థాయి నుంచి మొదటి ఉద్యోగం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ లేదా ఫారెస్ట్ గార్డ్. ఒక బీట్ ఆఫీసర్ పరిధిలో సుమారు ఐదు వేల ఎకరాల అటవీ భూమి ఉంటుంది. దీని రక్షణ బాధ్యతంతా బీట్ ఆఫీసర్‌దే.

ఫొటో సోర్స్, UGC
ఉదాహరణకు ఒక బీట్ ఆఫీసర్ తన పరిధిలో కలప దొంగలు చెట్లు నరకడం చూశారనుకోండి, వారిని ఎలా ఎదిరించి ఆ చెట్లను కాపాడగలరు? కలప దొంగలు నలుగురుకు తక్కువ కాకుండా చెట్లు కొట్టే పనిలో ఉంటారు. వారి దగ్గర గొడ్డళ్లు, రంపాలు ఉంటాయి. కొందరి వద్ద తుపాకులు కూడా ఉంటాయి. ఏ ఆయుధమూ లేకుండా చిన్న కర్ర చేతిలో పట్టుకుని ఒక్క అధికారి వారిని ఎదిరించగలరా? అటవీ సిబ్బంది సమస్య ఇదే.
ఇక జంతువుల వేటగాళ్ల దగ్గరైతే కచ్చితంగా తుపాకులు ఉంటాయి.
వీళ్లిద్దరినీ మించినోళ్లు భూ ఆక్రమణదారులు. వీరి విషయంలో భౌతిక దాడులుండవు కానీ రకరకాల ఒత్తిళ్లు, సమస్యలు ఉంటాయి. తాజాగా భూ ఆక్రమణ చేసే వారు కూడా భౌతిక దాడులకు పాల్పడటం కాగజ్ నగర్‌తోనే వెలుగులోకి వచ్చింది.
కాగజ్ నగర్ వీడియో వైరల్ కావడంతో సమస్య తీవ్రత అందరికీ తెలిసింది.
వాస్తవానికి దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా పదుల సంఖ్యలో అటవీ సిబ్బంది విధి నిర్వహణలో చనిపోతున్నారు.
అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 1984 నుంచి 2014 వరకు 31 మంది అటవీ సిబ్బంది విధి నిర్వహణలో ప్రాణాలు విడిచారు.
''అటవీ అధికారులకు ఆయుధాలు కావాలని మేం ఎంతో కాలంగా అడుగుతున్నాం. ఆయుధంగానీ, కనీసం తప్పించుకోవడానికి వాహనం కూడా లేని ఒక బీట్ ఆఫీసర్ పది మంది సాయుధులతో ఎలా పోరాడగలరు? కనీసం ఎదురు నిలిచే ధైర్యం చేయగలరా? ఇక అటవీ సంపదకు రక్షణ ఎలా ఉంటుంది? మేం ఆయుధాలు అడిగిన ప్రతిసారీ, వాటిని ఇస్తామని హామీలు ఇస్తారుగానీ ఇవ్వరు'' అని ఫారెస్ట్ డిప్యూటీ కన్జర్వేటర్‌గా పదవీ విరమణ చేసిన బుచ్చిరామిరెడ్డి తప్పుబట్టారు.
'ఫారెస్ట్ మార్టిర్స్' పేరుతో విధి నిర్వహణలో చనిపోయిన అటవీ సిబ్బందిపై ఆయన ఒక పుస్తకం సంకలనం చేశారు.

నక్సలైట్ల భయంతో ఆయుధాలు వెనక్కు
1982 ముందు వరకు ఉమ్మడి ఏపీలో అటవీశాఖ అధికారులకు ఆయుధాలుండేవి. తర్వాత నక్సలైట్లు అటవీ సిబ్బంది ఆయుధాలను ఎత్తుకెళ్లిపోతుండడంతో, వారి దగ్గరున్న ఆయుధాలను సమీపంలోని పోలీస్ స్టేషన్లో ఇచ్చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఆంధ్ర ప్రదేశ్‌లో ఎర్ర చందనం అక్రమ రవాణా జరిగే ప్రాంతాల్లో మాత్రం సిబ్బంది దగ్గర కొన్ని ఆయుధాలుండేవి. 1994-95 ప్రాంతాల్లో వాటినీ వెనక్కు తీసుకున్నారు. తెలంగాణలో మాత్రం 1982 నుంచి ఇప్పటివరకు అటవీ సిబ్బందికి ఆయుధాల్లేవు. 2013లో కొందరు సిబ్బంది చనిపోయిన తర్వాత ఆయుధాల కోసం అటవీ ఉన్నతాధికారులు ఉమ్మడి ఏపీ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.
రాష్ట్ర విభజన తరువాత, ఆంధ్ర ప్రదేశ్‌లో ఎర్రచందనం అంశాన్ని ప్రముఖంగా తీసుకున్న ప్రభుత్వం అటవీ సిబ్బందికి వందల సంఖ్యలో ఆయుధాలిచ్చింది. తిరుపతిలో ప్రత్యేక పోలీసు బలగాన్ని ఏర్పాటు చేసింది.
తెలంగాణలో ఆయుధాలు ఇవ్వలేదు. అలాగని ఇక్కడ పరిస్థితి ప్రశాంతంగానూ లేదు. పాత ఆదిలాబాద్ ప్రాంతంలో ముల్తానా ముఠాలు కలప అక్రమ రవాణాకు అడ్డువచ్చిన వారి పట్ల క్రూరంగా ప్రవర్తించసాగాయి. పరిస్థితి ఎంత తీవ్రంగా మారిందంటే, చివరకు సొంతంగా తుపాకీ లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకోవాలనుకున్నారు స్థానిక ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్.
''2015 ప్రాంతంలో మేం ముఖ్యమంత్రిని ఈ విషయమై మౌఖికంగా అడిగాం. ఆయన పోలీసు శాఖతో మాట్లాడి చెప్తామన్నారు'' అని ఒక ఉన్నతాధికారి బీబీసీకి తెలిపారు.

తుపాకీ లేకపోతే అంతే సంగతులు
''ఏదో రకంగా దోచుకోవాలి, లేదా తప్పించుకోవాలని స్మగ్లర్లు చూస్తున్నారు, ఎంతకైనా తెగిస్తున్నారు. వారిని తట్టుకోవాలంటే ఆయుధాలు కావాలి. ఏ రకమైన రక్షణ వ్యవస్థా లేకుండా క్షేత్రస్థాయిలో పనిచేయడం కష్టం'' అని రాయలసీమలో సుదీర్ఘ కాలం పనిచేసిన శాంతశీల బాబు చెప్పారు.
తిరుపతి ఫ్లయింగ్ స్క్వాడ్ డీఎఫ్‌వోగా పదవీ విరమణ చేసిన ఆయన, అటవీ సంరక్షణలో భాగంగా రెండుసార్లు తుపాకీ వాడారు. రెండుసార్లూ ఆయనపై మేజిస్ట్రేట్ విచారణ జరిగి, క్లీన్ చిట్ పొందారు.
1970లో ఒకసారి, 1990లో ఒకసారి శాంతశీల బాబు ఆత్మరక్షణ కోసం కలప స్మగ్లర్లపై ఆయుధం ఉపయోగించారు. సిబ్బందిని రక్షించడానికీ, గుంపును చెదరగొట్టడానికీ, ఆత్మరక్షణ కోసం ఆయుధం వాడక తప్పలేదని ఆయన వివరించారు. తాను ఆ సందర్భాలను ఎలా ఎదుర్కొన్నదీ వివరించారు.
''అప్పట్లో ఆత్మరక్షణ కోసం 410 మస్కట్ (ఒక రకం తుపాకీ) వాడాం. నేను కాల్పులు జరపకపోతే పరిస్థితి ఇంకా దిగజారి ఉండేది. కాకపోతే మనం ఆయుధం వాడింది 'ఆత్మరక్షణ-విధి నిర్వహణ కోసమే' అని నిరూపించాలి. ఒకసారి కడప జిల్లా చింతరాజు పల్లె, మరోసారి కర్నూలు జిల్లా ఆత్మకూరు దగ్గర ఇవి జరిగాయి. ఒకసారి 80 మంది దాడికి వచ్చారు. మరోసారి గొడ్డలితో నరకబోయారు. నాక్కూడా గాయాలయ్యాయి'' అంటూ అప్పటి పరిస్థితిని ఆయన గుర్తు చేసుకున్నారు.
''ఆయుధం ఉండటమే మంచిది. ఆయుధం ఉంటే దొంగ కాస్త భయపడతాడు. తుపాకీ ఉంటే కాల్చేస్తామని కాదు. కనీసం బెదిరించాలి కదా. ఫారెస్ట్ ఆఫీసర్ వద్ద ఆయుధం లేదని తెలిసినవాళ్లు ఏమనుకుంటారు? వారికి భయం ఉండదు. పైగా స్మగ్లర్ల వద్ద అన్ని రకాల ఆయుధాలూ ఉంటున్నాయి'' అని శాంతశీల బాబు వివరించారు.

ఆయుధమే సమస్యకు పరిష్కారమా?
ఈ విషయంలో అటవీ ఉన్నతాధికారుల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి.
''ఇప్పటివరకు అటవీ అధికారుల వద్ద ఆయుధాలు ఉండని కారణంగా, వారిని కేవలం తరిమి వదిలేయడం లాంటివి చేసేవారు. కానీ సిబ్బంది దగ్గర ఆయుధం ఉందని తెలిసినప్పుడు, నేరస్థుడు కూడా ఆయుధాన్ని ఉపయోగించడానికి వెనుకాడడు. అప్పుడు అటవీ సిబ్బందికి ప్రాణహాని పెరుగుతుందనే వాదన ఉంది. ఆయుధం వాడినప్పుడు ఎవరైనా మరణించినా, మరేం జరిగినా సదరు ఉద్యోగి సమాధానం చెప్పుకోవాలి. ఆయుధం అవసరం లేదనే వారున్నారు, ఉండి తీరాలనే వారూ ఉన్నారు. ఆయుధాలు ఉండడం వల్ల ఉపయోగం ఉండొచ్చు. కొంత మేలు చేస్తుంది కూడా. కానీ సమస్యకు అదే పరిష్కారం మాత్రం కాదు'' అని తెలంగాణ అటవీశాఖ ఉన్నతాధికారి ఒకరు బీబీసీతో చెప్పారు.
''చాలా సందర్భాల్లో మేం అడిగిన వెంటనే పోలీసులు రాలేని పరిస్థితులు ఉంటాయి. అవన్నీ వారు చెప్పుకోలేరు. మరికొన్ని చోట్ల రాజకీయ ఒత్తిళ్లుంటాయి. వారు వచ్చే వరకు మేం ఆగలేం. ఇదీ సమస్య. పలుకుబడి ఉన్నవారు వాళ్ల వ్యూహాలు వారు పన్నుతారు. వాళ్లనీ ఎదుర్కోవాలి. కాగజ్ నగర్లో జరిగింది అలాంటిదే'' అని ఆయన వ్యాఖ్యానించారు.
తెలంగాణలో అటవీ సిబ్బందికి ఆయుధాలు ఇస్తారా, ఇవ్వరా అనే దానిపై ప్రభుత్వం ఇంకా ప్రకటన చేయలేదు.
తెలంగాణ హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మంగళవారం ఈ అంశంపై చర్చించారు. అటవీ సిబ్బందికి పోలీసులు తగిన భద్రత కల్పిస్తారని చెబుతూ ఒక ప్రకటన విడుదల చేశారు.
ఇవి కూడా చదవండి:
- సంక్షోభంలో ప్రకృతి: 10 లక్షల జీవుల మనుగడను ప్రమాదంలోకి నెట్టిన మనిషి
- లాబ్‌స్టర్, పీతల గుల్లలతో ఎకో-ఫ్రెండ్లీ ప్లాస్టిక్ సంచుల తయారీ
- అనంతపురం కాలేజీ వైరల్ వీడియో వెనుక అసలు కథ
- ఆంధ్రప్రదేశ్‌లో క్రిమినల్ కేసులున్న మంత్రులెందరు.. వారిలో అత్యంత సంపన్నులెవరు
- 'వందేమాతరం' రచయిత బంకిమ్ చంద్ర గురించి తెలుసుకోవాల్సిన విషయాలివే
- మగాళ్ళ గర్భనిరోధక జెల్ ఎలా పని చేస్తుంది...
- ఒక్క అంతర్జాతీయ వన్డే కూడా ఆడలేదు.. కానీ, వరల్డ్‌కప్ జట్టులో చోటు.. ఎవరీ మయాంక్ అగర్వాల్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









