వరల్డ్ ఎర్త్ డే: లాబ్‌స్టర్, పీతల గుల్లలతో ఎకో-ఫ్రెండ్లీ ప్లాస్టిక్ సంచుల తయారీ

ఈసారి మీరు పీతల కూర తింటున్నప్పుడు, వాటి గుల్లలు బయట పడేయకండి. అవి పర్యావరణాన్ని కాపాడేందుకు చాలా ఉపయోగపడతాయి.
లాబ్‌స్టర్స్, పీతల్లాంటి గుల్లలున్న సముద్ర జీవులు ఇప్పుడు ప్రపంచంలో పేరుకుపోతున్న ప్రమాదకరమైన సమస్యకు ఒక పరిష్కారం అందించగలవు.
ప్రపంచంలో ప్రస్తుతం ఏటా దాదాపు 500 బిలియన్ ప్లాస్టిక్ సంచులు వాడుతున్నారని ఐక్యరాజ్యసమితి చెబుతోంది.
ప్లాస్టిక్ సంచుల వాడకం వల్ల సుమారు 8 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రంలో కలుస్తున్నాయని, దానివల్ల సముద్రంలో ఉన్న ఎన్నో జీవులకు ముప్పు ఏర్పడుతోందని చెబుతోంది.
లండన్‌లోని ఒక స్టార్టప్ సంస్థ లాబ్‌స్టర్స్ నుంచి పర్యావరణ హితమైన బయో ప్లాస్టిక్ తయారుచేసే ప్రయోగాలు చేస్తోంది.
లాబ్‌స్టర్స్, పీతల్లాంటి జీవులకు వాటి గుల్లల్లో చిటిన్ అనే పదార్థం ఉంటుంది. దాని నుంచి వచ్చే బయో-పాలిమర్‌తో ప్లాస్టిక్ సంచులు తయారు చేయచ్చని ఈ సంస్థ చెబుతోంది.
వీటి గుల్లలను మొదట బ్లెండర్‌తో పొడిగాచేస్తారు. దానిలోంచి చిటిన్ వెలికితీస్తారు. ఆ 'చిటోసన్ పౌడర్'ను వెనిగర్‌తో కలుపుతారు.
దాంతో బయో ప్లాస్టిక్ సొల్యూషన్ ఏర్పడుతుంది. ఈ సొల్యూషన్‌ను త్రీడీ ఉత్పత్తుల తయారీకి వాడతారు. ప్రస్తుతం దానితో ప్లాస్టిక్ సంచులు తయారు చేయడంపై పరిశోధనలు జరుగుతున్నాయి.
ఈ బయో ప్లాస్టిక్ శిలీంద్రాలు, యాంటీ బ్యాక్టీరియాను కూడా నిరోధిస్తుంది. కాబట్టి ఆహారం నిల్వచేసేందుకు ఈ సంచులు సురక్షితమైనవని షెల్ వర్క్స్ సహ-వ్యవస్థాపకులు అమీర్ అఫ్షర్ చెప్పారు.

ఈ సంచులు నిజానికి కాలుష్య కారకంకాని ఎరువు లాంటివి. ఈ ప్లాస్టిక్‌ను ముక్కలు చేసి మొక్కల కుండీల్లో వేస్తే అవి ఏపుగా పెరుగుతాయి.
లండన్‌లోని ఒక లాబ్‌స్టర్ వంటకాలు అందించే ఒక సంస్థ వాటి నుంచి తీసే బయో ప్లాస్టిక్‌తో ఏటా దాదాపు 7.5 మిలియన్ ప్లాస్టిక్ సంచులు ఉత్పత్తి చేస్తోంది.

భవిష్యత్తులో వాడిపడేసే స్పూన్లు, ఫోర్కులు, గ్లాసులు లాంటి వాటిని తయారుచేయడానికి ఈ బయో ప్లాస్టిక్ ఉపయోగించవచ్చని అంటున్నారు.
కానీ, కొందరు మాత్రం ఇది ఇప్పట్లో సాధ్యం కాదని అంటున్నారు. ఈ ప్లాస్టిక్‌తో సంచులు చేయడం భారీ పరిశ్రమలు ప్లాస్టిక్ బ్యాగ్స్ తయారు చేసినంత చౌకగా ఉండదని చెబుతున్నారు.
ప్రపంచంలో ప్లాస్టిక్ వినియోగం ఇలాగే ఉంటే 2050 నాటికి సముద్రాల్లో చేరే ప్లాస్టిక్ అక్కడ ఉన్న చేపల బరువును మించిపోతుందని నిపుణులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- అంతరిక్షంలో అత్యధికంగా చెత్త నింపే దేశం ఏదో తెలుసా...
- రాత్రిపూట మద్యం తాగితే నిద్ర బాగా పడుతుందా?
- తల్లితండ్రుల వలసలు... దాడులకు బలవుతున్న పిల్లలు
- అత్యంత భారీ ఎయిర్పోర్ట్.. అంతా ఒక్క బిల్డింగ్‌లోనే
- లోక్‌సభ ఎన్నికలు 2019: లఖ్‌నవూలో రాజ్‌నాథ్ సింగ్‌కు గట్టి పోటీఇచ్చేదెవరు
- బీజేపీ ‘ఆర్టికల్ 370, 35ఎ రద్దు' హామీని వ్యతిరేకిస్తున్న జమ్ముకశ్మీర్ పార్టీలు
- రఫేల్ తీర్పు సమీక్షపై కేంద్రం అభ్యంతరాలను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు
- ‘బీజేపీ వ్యతిరేకులు దేశద్రోహులు కారు’ - అడ్వాణీ
- రాజకీయ పార్టీల నుంచి ముస్లిం మహిళలు ఏం కోరుకుంటున్నారు...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









