బీజేపీ ‘ఆర్టికల్ 370, 35ఎ రద్దు' హామీని వ్యతిరేకిస్తున్న జమ్ముకశ్మీర్ పార్టీలు

ఫొటో సోర్స్, Getty Images
జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370, 35ఎను రద్దు చేస్తామని బీజేపీ మరోసారి ఎన్నికల మానిఫెస్టోలో చెప్పడాన్ని కశ్మీరు లోయలోని రాజకీయ పార్టీలన్నీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
ఆర్టికల్ 375 లేదా 35ఎను రద్దు చేయడానికి ఎలాంటి ప్రయత్నం చేసినా కశ్మీర్ అగ్నిగుండంగా మారుతుందని, అది చాలా ప్రమాదకరం అని లోయలోని కొన్ని రాజకీయ పార్టీలు హెచ్చరించాయి.
ఆదివారం మానిఫెస్టో విడుదల చేసిన బీజేపీ రాజ్యంగంలోని ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏ రద్దు చేస్తామనే హామీకి కట్టుబడి ఉన్నట్లు తెలిపింది.
ఆర్టికల్ 370, 35ఎ జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని అందిస్తాయి. బయటి ప్రజలు ఆ రాష్ట్రంలో స్థిరాస్తులు కొనుగోలు చేయకుండా అడ్డుకుంటాయి.

ఫొటో సోర్స్, Getty Images
ప్రధాని నరేంద్ర మోదీకి అత్యంత సన్నిహితులుగా భావించే పీపుల్స్ కాన్ఫరెన్స్(పీసీ) ఛైర్మన్, బీజేపీ-పీడీపీ ప్రభుత్వ మాజీ మంత్రి సాజద్ గనీ లోనె బీబీసీతో మాట్లాడుతూ "370, 35ఎ ఆర్టికళ్లను రద్దు చేస్తామని హామీ ఇవ్వడం చాలా ప్రమాదం. అది రాష్ట్రం రగిలేలా చేస్తుంది" అన్నారు.
"చూడండి, నేను ఆర్టికల్ 370, 35ఎలను విశ్వసనీయమైన అధికరణలుగా భావిస్తున్నా. ఈ ఆర్టికళ్లను రద్దు చేసే ప్రశ్నే లేదు. వాళ్లు మ్యానిఫెస్టోలో ఏదైనా రాసుకోవచ్చు. కానీ గ్రౌండ్ రియాలిటీని మార్చలేరు. నేను మీకొకటే చెబుతా. గత 30 ఏళ్లలో మేం ఎంతో హింస, అణచివేతను చూశాం. మీరు ఉపయోగించిన సైనిక దళాలను కూడా చూశాం. మీపై తిరుగుబాటు ఉండచ్చు, కానీ దాన్ని ఓడించలేరు. ఆర్టికల్ 370ని తొలగించడం అనేది సైనిక రహిత చర్య లాంటిది. ఆర్టికల్ 370, 35ఎను రద్దు చేసే ప్రశ్నే లేదు. దానిని మేం ఊహించలేం. ఈ ఆర్టికళ్లను తొలగించడానికి ఏ ప్రయత్నం చేసినా కశ్మీర్ భగ్గుమంటుంది అనే విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు. ప్రజలంతా రోడ్లపైకి వస్తారు, వారిని ఎవరూ ఆపలేరు" అని లోనె చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
బీజేపీ మానిఫెస్టోపై స్పందించిన సీపీఎం మాజీ ఎంఎల్ఏ తరిగామి ఆర్టికల్ 370 లేదా 35ఎను తొలగించేందుకు ఏ ప్రయత్నం చేసినా అనూహ్య పరిణామాలు ఎదురవుతాయి అన్నారు.
"బీజేపీ మానిఫెస్టోలో ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఎను తొలగిస్తామని హామీ ఇవ్వడం ఆ పార్టీ ఎన్నికలకు ముందు ఓటర్లను ఏమారుస్తోందనడానికి మరో ఉదాహరణ. కశ్మీర్ లోయలో పరిస్థితి అందరికీ తెలుసు. 2014 సార్వత్రిక ఎన్నికల తర్వాత బీజేపీ సాధించిన అతిపెద్ద విజయం, కశ్మీర్‌ను హింసాత్మక పరిస్థితుల్లోకి నెట్టడమే అనేది స్పష్టమైంది. ఫలితంగా అక్కడ పౌరులు, భద్రతా దళాలు భారీగా చనిపోతున్నారు. కశ్మీర్లో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందంటే అధికారులు వారానికి రెండు రోజులు జాతీయ రహదారిపై ప్రజారవాణాను కూడా నిలిపేశారు" అన్నారు.
"భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 జమ్ము-కాశ్మీర్‌కు కేంద్రంతో ఉన్న సంబంధాలకు ఒక ప్రాథమిక నిర్మాణాత్మక ఆధారాన్ని అందిస్తుంది. కేంద్ర, రాష్ట్ర సంబంధాలకు లైఫ్‌లైన్ అయిన ఆర్టికల్ 370, 35ఎ రద్దుకు వ్యతిరేకంగా సీపీఎం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. జమ్ముకశ్మీర్ ప్రజలు అలాంటి చర్యలను సహించలేరు, ఆర్టికల్ 370, 35ఏను తొలగించేందుకు ఒప్పుకోరు. దానికి సంబంధించి ఎలాంటి ప్రయత్నాలు చేసినా పార్టీలకు అతీతంగా ప్రజలు ఏకమై అలాంటి ప్రయత్నాలను తిప్పికొడతారు. రాష్ట్రంలో తలెత్తే ఆ పరిస్థితిని సైన్యం కూడా అదుపు చేయలేదు. ప్రజలను ఏ అధికారాలూ ఆపలేవు, బల ప్రదర్శన అస్సలు పనిచేయదు. జమ్ముకశ్మీర్‌లోని పార్టీలన్నీ దీనిని వ్యతిరేకిస్తున్నాయి. భారత దేశంలో లౌకికవాదులందరూ ముందుకు వచ్చి ఈ చర్యలను వ్యతిరేకించాలని, మోదీ ప్రభుత్వాన్ని ఓడించాలని నేను కోరుకుంటున్నాను" అని తరిగామి అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
జమ్ము కశ్మీర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(కేపీసీసీ) కూడా ఎన్నికల సమయంలో బీజేపీ రాజకీయ జిమ్మిక్కులు చేస్తుందని, వాస్తవం ఏంటో అందరికీ తెలుసని చెప్పింది.
జేకే పీసీసీ చీఫ్, మాజీ మంత్రి గులాం అహ్మద్ మిర్ "గత ఎన్నికల మానిఫెస్టోలో బీజేపీ ఇవే విషయాలను చెప్పింది. ఈసారీ వాళ్లు మళ్లీ అదే విషయం హామీ ఇస్తున్నారు. బీజేపీ దాన్ని చేయగలదని నాకు అనిపించడం లేదు. బీజేపీ ఐదేళ్లుగా అధికారంలో ఉంది, అప్పుడెందుకు చేయలేకపోయారు. ఇవి మాటలు మాత్రమేనని వారికి తెలుసు. ఇది ఓట్ల కోసమే తప్ప వేరే ఏం లేదు. కాంగ్రెస్ ఈసారీ ఆర్టికల్ 370 గురించి మానిఫెస్టోలో చెప్పడం, ఏఎఫ్‌ఎస్‌పిఏ సమీక్ష గురించి మాట్లాడడంపై నాకు సంతోషంగా ఉంది. ఇదంతా రాష్ట్ర కాంగ్రెస్ చెప్పలేదు. కానీ ఏఐసీసీ చెప్పింది. కాంగ్రెస్ ఈ హామీలన్నీ తప్పకుండా నెరవేరుస్తుందనే నేను నమ్ముతున్నా" అన్నారు.
బీజేపీ తమ మేనిఫెస్టోను విడుదల చేసిన రోజు, దాన్ని వ్యతిరేకించిన కశ్మీర్‌లోని రాజకీయ పార్టీలన్నీ "ఇది తమ స్వేచ్ఛకు మార్గం వేసినట్లే" అన్నాయి.
సోమవారం శ్రీనగర్‌లో ఒక ఎన్నికల ర్యాలీలో ప్రసంగించిన నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా భారత ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేస్తామని చెబుతోందని అన్నారు.
"కానివ్వండి, అలాగే చేయండి. మీరు అలా చేసిన ఆ క్షణమే, అది కేంద్రంలో జమ్ముకశ్మీర్ విలీనానికి ముగింపు అవుతుంది" అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇటు సోమవారం తన నివాసంలో మీడియాతో మాట్లాడిన పీడీపీ అధ్యక్షురాలు , మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కూడా "ఆర్టికల్ 370ని రద్దు చేయాలని బీజేపీ ప్రభుత్వం నిర్ణయించగానే, ఆటోమేటిగ్గా జమ్ముకశ్మీర్‌కు దేశం నుంచి స్వేచ్ఛ లభిస్తుందని" అన్నారు.
జమ్ముకశ్మీర్ ప్రత్యేక రాజ్యాంగ హోదాను రద్దు చేసి చూడాలని ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలకు హింద్వారాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సవాలు విసిరారు. రాష్ట్ర ప్రజలు వారిని అలా చేయనివ్వరని చెప్పారు.

ఫొటో సోర్స్, AFP
"బీజేపీ తన మానిఫెస్టోలో ఆర్టికల్ 370, 35ఎలను తొలగిస్తామని చెబుతోంది. కానీ, మా ప్రత్యేక ప్రతిపత్తిపై ఎవరు దాడి చేసినా ఎన్సీ సహించదు" అన్నారు.
2014లో దిల్లీకి చెందిన ఒక ఎన్జీఓ ఆర్టికల్ 35ఎను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.
గత మూడేళ్లుగా ఆర్టికల్ 35ఏను వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు చేపట్టినా కశ్మీర్ ప్రజలు వాటిని వ్యతిరేకిస్తున్నారు. చాలా సందర్భాల్లో ఆందోళనలకు, సమ్మెలకు పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి:
- భారతదేశం ఎన్నికలు... ఆరు వారాల పెళ్ళి సంబరాలు
- ఛత్తీస్‌గఢ్: అక్కడ ఎన్నికలు నిర్వహించడం యుద్ధంతో సమానం
- రఫేల్ కేసులో సుప్రీం తీర్పు: "ఒప్పందంపై కోర్టు జోక్యం అవసరం లేదు..."
- అభిప్రాయం: రాజీవ్‌కు బోఫోర్స్.. మోదీకి రఫేల్?
- రఫేల్ డీల్ ఆడియో టేపు లీక్.. మొత్తం సంభాషణ ఇదే..
- ఆరోగ్యంపై హార్మోన్ల ప్రభావం గురించి మహిళలు తెలుసుకోవాల్సిన 5 విషయాలు
- ‘తమిళనాడులో టిక్‌టాక్’ యాప్‌ను నిషేధించాలని నిర్ణయం’
- హైదరాబాద్‌లో ఈ అమ్మాయి బైక్ విన్యాసాలు చూస్తే.. కళ్లు తిరుగుతాయ్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో బ్‌స్క్రైబ్ చేయండి.)









