హైదరాబాద్‌లో ఈ అమ్మాయి బైక్ విన్యాసాలు చూస్తే.. కళ్లు తిరుగుతాయ్

- రచయిత, సంగీతం ప్రభాకర్; షూట్-ఎడిట్: నవీన్ కుమార్. కె
- హోదా, బీబీసీ ప్రతినిధులు
భయాన్ని జయిస్తే ఏదైనా సాధించవచ్చని 28 ఏళ్ల రెహానాఖాన్ నిరూపించింది. పెళ్లయినప్పటికీ, కుటుంబం... జీవితం అని సర్దుకుపోకుండా తాను అనుకున్న అతిక్లిష్టమైన పని నేర్చుకొని ఎంతోమంది అభిమానాన్నిచురగొంటున్నారు రెహానా.
ఇంతకీ రెహానా ఖాన్ ఎవరు? ఏం చేస్తారు?
ఆమెది ఉత్తర ప్రదేశ్‌లోని ఈటా జిల్లా. హైదరాబాద్ ఎగ్జిబిషన్లో సందర్శకులని వెల్ ఆఫ్ డెత్ (మృత్యు బావి) బైక్ విన్యాసాలతో అశ్యరంలో ముంచెత్తుతున్నారు.
రెహానా ఇలాంటి సాహసోపేత కళను ఎలా ఎంచుకున్నారో తెలుసుకోవడానికి బీబీసీ ఆమెను కలిసింది.
అప్పుడు అక్కడ ప్రదర్శన జరుగుతోంది. అది చూస్తున్న ప్రేక్షకులంతా మరో లోకంలో ఉన్నట్లు కనిపించారు.
అంతేకాదు, రెహానా ఖాన్ విన్యాసాలను వీడియో తీసేప్పుడు వెల్ ఆఫ్ డెత్ చుట్టూ మూడు రౌండ్లు రెహానాతో కెమెరా పట్టుకుని తిరగగానే నాకు కళ్ళు తిరిగాయి.
దీంతో రెహానా ఖాన్ విన్యాసాలకు ప్రేక్షకులతోపాటు నేను అంతే ఆశ్యర్యపోయాను.
తర్వాత రెహానా బీబీసీ తెలుగుతో మాట్లాడుతూ, 'మా ఇంట్లో పెద్ద వాళ్ళంతా నేను చేసే పని చూసి 'మా పిల్లకు ఎంత ధైర్యమో' అని సంతోషపడతారు. మళ్ళీ ఇంత ప్రమాదకరమైన పని ఎందుకు చేస్తావని అంటారు. కానీ, భయం అవతలే గెలుపుంది కదా' అని నవ్వుతూ చెప్పారు.

ఇంకా, ఆమె ఈ విన్యాసాన్ని వృత్తిగా ఎలా చేపట్టారో ఇలా వివరించారు:
''మాది ఉత్తరప్రదేశ్. నేను ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను. నాకు 20 ఏళ్లపుడు పెళ్లయింది. పెళ్ళయిన తర్వాత అందరు మహిళలలాగానే నేనూ సాధారణ గృహిణిలా గడిపాను. మా ఊర్లో జరిగిన ఎగ్జిబిషన్‌కి నేను నా ఫ్యామిలీతో వెళ్లాను.
అక్కడ వెల్ ఆఫ్ డెత్ విన్యాసాలు చూశాను. అక్కడ అందరూ మగవాళ్లే విన్యాసాలు చేస్తున్నారు. నాకు కూడా ఎందుకో అది నేర్చుకోవాలనే ఆలోచన వచ్చింది. ఎలాగైనా నేర్చుకోవాలని నిర్ణయించుకుని మా ఇంట్లో వాళ్లకు చెప్పాను. వారంతా వద్దని ఇది ఆడపిల్లల పని కాదని చాల ప్రమాదకరమైనదని హెచ్చరించారు.
కానీ, నా భర్త ఒక్కరే నాకు తోడుగా నిలిచారు. నేను నేర్చుకోవడానికి ఎంతో సహకరించారు. నేను ఇక్కడ ఇలా మీతో మాట్లాడుతున్నాను అంటే దానికి కారణం నా భర్త రియాజ్.''

ఎలా సాధించారు?
రెహానా తన భర్త రియాజ్ సహాయంతో వెల్ ఆఫ్ డెత్ స్టంట్‌లు నేర్పే వాళ్ళ కోసం చాల ప్రయతించారు. చివరకు ఛత్తీస్‌గఢ్‌లో ఒకరు నేర్పుతారని తెలుసుకొని అక్కడికి వెళ్ళారు. సమీర్ అనే వ్యక్తి శిక్షణలో నెల రోజుల్లో ఈ విద్యలో నైపుణ్యం సాధించారు.
వేల ప్రదర్శనలు
మొదటిసారి ప్రదర్శన ఇచ్చే ముందు నేను చేయగలనా అని చాలా భయమేసింది. ప్రదర్శన విజయవంతం అవగానే నా మనసులో కలిగిన సంతోషం మాటల్లో చెప్పలేను. అది ఇప్పటివరకు మర్చిపోలేను అని సంతోషంగా తన మొదటి ప్రదర్శనను గుర్తుచేసుకున్నారు రెహానా.
4 నెలల గర్భిణిగా ఉన్నపుడూ తాను ఈ ప్రదర్శనలు ఇచ్చానని ఈ పనంటే తనకు చాలా ఇష్టమని రెహానా చెప్పారు.
ఆమె కూతురుకు ఇప్పుడు అయిదేళ్ళు.
ఆమెమె రోజుకు 8 నుండి 10 ప్రదర్శనలు ఇస్తున్నారు. ఒక్కో ప్రదర్శన దాదాపు 10 -15 నిమిషాలు సాగుతుంది. ఒక బైక్ విన్యాసమే కాకుండా అప్పుడప్పుడూ ఆమె కారుతో కూడా ఇలాంటి విన్యాసాలు చేస్తారు.
మహిళలు ధైర్యంగా ఉండాలి
మహిళలు ఒకరిపై ఆధారపడకుండా ధైర్యంగా ఉండాలని, అప్పుడే లింగ వివక్ష వంటి జాడ్యాలు తగ్గుతాయని రెహానా అన్నారు.
నిత్యం ప్రదర్శనలు చేస్తూ ఉండే రెహానా మూడు నెలలకు ఓసారి ఇంటికి వెళ్లొస్తారు. పాపను చదువు కోసం అమ్మమ్మ ఇంటి వద్దే ఉంచారు.
ఇవి కూడా చదవండి:
- Fact Check: రాహుల్ గాంధీని 14 ఏళ్ల అమ్మాయి ప్రశ్నలతో ఇబ్బంది పెట్టిందా?
- బ్రిటన్ రాణి కంటే సోనియా సంపన్నురాలా...
- సంక్రాంతి ముగ్గుల చరిత్ర: మొదటి ముగ్గు ఎవరు వేశారు? రంగవల్లి ఎలా పుట్టింది?
- రియాలిటీ చెక్: నికితా వీరయ్య నిర్మలా సీతారామన్ కూతురేనా...
- అమ్మాయిల కన్యత్వానికి, సీసా సీల్‌కు ఏమిటి సంబంధం
- బీబీసీ రియాలిటీ చెక్: అది భార్యాబిడ్డల అమ్మకం కాదు.. ‘ కులాచారం’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









