వీవీఎస్ లక్ష్మణ్: నంబర్ త్రీగా ఆడడం వెనుక అసలు కథ

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రేహాన్ ఫజల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఆరోజు 60 ఓవర్లలో 171 పరుగులు మాత్రమే చేశారు. భారత జట్టు అంతా తిరిగి పెవిలియన్ చేరుకుంది. చివర్లో అవుటైన వీవీఎస్ లక్ష్మణ్ తన ప్యాడ్ విప్పుతున్నాడు. అప్పుడే కోచ్ జాన్ రైట్ ఆయన భుజాలపై మెల్లగా చేయి పెట్టి "లాక్స్ నీ ప్యాడ్స్ విప్పద్దు" అన్నాడు.
లక్ష్మణ్ 'ఏం జాన్' అన్నాడు.
జాన్ రైట్ 'నువ్వు తర్వాత ఇన్నింగ్స్‌లో నంబర్ త్రీలో బ్యాటింగ్ చేస్తున్నావ్' అనగానే లక్ష్మణ్ ఆశ్చర్యపోయాడు..
అప్పటి ఆస్ట్రేలియా టీమ్‌ను 'అజేయ' టీమ్ అని చెప్పడం తప్పు కాదేమో. ఎందుకంటే వరసగా 16 టెస్టులు గెలిచిన తర్వాత ఆ జట్టు కోల్‌కతా చేరుకుంది.

ఫొటో సోర్స్, Getty Images
హర్భజన్ హ్యాట్రిక్
ఆస్ట్రేలియా ఒక వారం ముందే భారత జట్టును ముంబయిలో పది వికెట్ల తేడాతో ఓడించింది. ఈడెన్ గార్డెన్‌లో ఆ జట్టు టాస్ గెలిచిన తర్వాత మైకేల్ స్లేటర్, జహీర్ ఖాన్ బౌలింగ్‌లో స్టాన్స్ తీసుకున్నప్పుడు స్టేడియంలో కూచున్న బెంగాలీ ప్రేక్షకులు "ఏటావో జాబే..." అంటే మనం ఈ మ్యాచ్ కూడా గెలవం అన్నారు.
స్లేటర్, లాంగర్, హెడెన్ రన్స్ చేశారు. మొదటిరోజు ఆస్ట్రేలియా 8 వికెట్ల నష్టానికి 291 పరుగుల స్కోర్ చేసింది. కానీ ఆరోజు హర్భజన్ సింగ్‌కు 'కమ్‌బ్యాక్'గా నిలిచింది. అతడు వరసగా మూడు బంతుల్లో పాంటింగ్, గిల్‌క్రిస్ట్, షేన్ వార్న్‌ను పెవిలియన్ పంపించి టెస్ట్ క్రికెట్‌లో భారత్ తరఫున మొదటి హ్యాట్రిక్ నమోదు చేశాడు.
ఆ మ్యాచ్‌లో అంపైరింగ్ చేస్తున్న శ్యామ్ కుమార్ బన్సల్‌కు ఆరోజు బాగా గుర్తుంది. "హర్భజన్ సింగ్ నా ఎండ్ నుంచే బౌలింగ్ చేస్తున్నాడు. మొదట రెండు ఓవర్ల వరకూ అసలు ఎలాంటి ప్రభావం చూపించలేకపోయాడు. అతడి బౌలింగ్‌లో మాథ్యూ హెడెన్ నాలుగు ఫోర్లు కూడా కొట్టాడు. దాంతో హర్భజన్ డిస్టర్బ్‌గా కనిపించాడు. కానీ హఠాత్తుగా ఆఫ్ స్టంప్ బయట బంతి వేశాడు" అన్నారు.
"పాంటింగ్ దాన్ని మిస్ అయ్యాడు. బంతి అతడి కాలికి తగిలింది. తనకు ఎల్‌బీడబ్ల్యు ఇవ్వడం తప్ప వేరే దారి లేదు. తర్వాత బంతికి గిల్‌క్రిస్ట్ కూడా ఎల్‌బీడబ్ల్యు అయ్యాడు. తర్వాత షేన్ వార్న్ వచ్చాడు. బంతిని ఎస్ రమేష్ ఉన్న షార్ట్ లెగ్ వైపు ఆడాడు. నేను అప్పుడు 'బ్లైండ్' అయిపోయా. ఆ క్యాచ్ స్పష్టంగా పట్టాడా, లేదా తెలీడం లేదు. దాంతో థర్డ్ ఎంపైర్‌కు 'రెఫర్' చేయాల్సి వచ్చింది. థర్డ్ అంపైర్ వార్న్ అవుటని 'సిగ్నల్' ఇచ్చాడు".
పేక మేడలా కుప్పకూలిన జట్టు
రెండో రోజు స్టీవ్ వా, జాసన్ గిలెస్పీ స్కోరును 445 వరకూ తీసుకెళ్లారు. తర్వాత మెక్ గ్రాత్, గిలెస్పీ, కాష్ప్రోవిజ్, వార్న్ బౌలింగ్ ముందు భారత జట్టులో ఒక్కరు కూడా నిలబడలేకపోయారు. జట్టు పేకమేడలా కుప్పకూలింది.
ఈడెన్ గార్డెన్‌లో కూచున్న అదే ప్రేక్షకుల నోటి నుంచి "ఎటావో గైలో" అంటే ఈ మ్యాచ్ కూడా పోయింది అని వినిపించింది. 59 పరుగులు చేసిన వీవీఎస్ లక్ష్మణ్ కాస్త పరువు కాపాడాడు. 171 పరుగులకు ఆలౌట్ చేసిన తర్వాత ఆస్ట్రేలియా భారత్‌కు ఫాలోఆన్ ఇచ్చింది. భారత జట్టు మేనేజర్ చేతన్ చౌహాన్ మనసులో ఒక కొత్త వ్యూహం మెరిసింది.

ఫొటో సోర్స్, Getty Images
లక్ష్మణ్‌ను 3వ స్థానంలో ఆడించాలని నిర్ణయం
ఆ రోజు గురించి చెప్పిన చౌహాన్ "నాకు గుర్తుంది, మొదటి ఇన్నింగ్స్ తర్వాత నేను లక్ష్మణ్ దగ్గరికి వెళ్లా. మీరెప్పుడైనా మూడో నంబర్లో బ్యాటింగ్ చేశారా? అని అడిగా. తను నాతో నేను జీవితం అంతా మూడో నంబరులోనే బ్యాటింగ్ చేశాను అన్నాడు. తర్వాత నేను జాన్ రైట్‌తో లక్ష్మణ్ చాలా మంచి ఫాంలో ఉన్నాడు. మీరు రెండో ఇన్నింగ్స్‌లో అతడిని 'ప్రమోట్' చేయచ్చు కదా? అన్నాను.
"అయితే మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తున్న రాహుల్ ద్రావిడ్‌కు ఈ నిర్ణయం గురించి ఎవరు చెబుతారనే ప్రశ్న తలెత్తింది. తర్వాత ఆ బాధ్యతను నాకే ఇచ్చారు. నేను రాహుల్‌తో బ్యాటింగ్ ఆర్డర్ చేంజ్ చేయాలని అనుకుంటున్నాం. లోయర్ ఆర్డర్లో పంపిస్తే మీకేం అభ్యంతం లేదుగా? అన్నా. రాహుల్ చాలా మర్యాదగా ఉంటారు. మీరు టీమ్ ప్రయోజనాల కోసం ఏం చేయాలనుకుంటే చేయండి అన్నాడు. అలా వీవీఎస్ లక్ష్మణ్ మూడో నంబర్లో బ్యాటింగ్ చేయడానికి వచ్చాడు".
తర్వాత భారత జట్టు కోచ్ జాన్ రైట్ తన 'ఇండియన్ సమ్మర్స్' పుస్తకంలో "అయాన్ చాపెల్ చెప్పిన ఒక విషయం నాకు బాగా గుర్తుంది. ప్రత్యర్థి వ్యూహాన్ని చిత్తు చేసేలా, చెత్త బంతులను కసిగా బాదేలా నంబర్ త్రీలో స్ట్రోక్ ప్లేయర్ ఉండాలని ఆయన వాదించేవారు" అని రాశారు.
"మేం ఎప్పుడూ వన్ డౌన్‌లో రాహుల్ ద్రావిడ్‌ను దించేవాళ్లం. కానీ, తను నెమ్మదిగా ఆడేవాడు. అందుకే లక్ష్మణ్ 59 పరుగులకు అవుటై వచ్చాక, మాకు 'ఫాలోఆన్' ఇవ్వగానే, నేను లక్ష్మణ్‌తో లాక్స్, నీ ప్యాడ్ విప్పద్దు, నువ్వు ఈ ఇన్నింగ్స్‌లో నంబర్ త్రీలో వెళ్తున్నావ్ అన్నాను".

ఫొటో సోర్స్, Getty Images
లక్ష్మణ్, ద్రావిడ్ మెమరబుల్ ఇన్నింగ్స్
"అదృష్టవశాత్తూ, శివసుందర్ దాస్, రమేశ్ మొదటి వికెట్‌కు 52 పరుగులు జోడించారు. లక్ష్మణ్‌కు కాస్త విశ్రాంతి తీసుకునే సమయం దొరికింది. రమేష్ అవుట్ అయ్యాక, అతడు క్రీజులోకి దిగాడు. మొదటి బంతి నుంచే అతడు అటాకింగ్ బ్యాటింగ్ మొదలుపెట్టాడు".
దాస్, తెందుల్కర్ అతడితో ఎక్కువ సేపు ఉండలేకపోయారు. గంగూలీ కాసేపు కుదురుకున్నట్టు అనిపించాడు. కానీ 48 పరుగుల దగ్గర అవుటై పెవిలియన్ చేరాడు. నంబర్ సిక్స్‌లో ద్రావిడ్ దిగాడు. క్రీజులోకి రాగానే పాంటింగ్ అతడిని 'కవ్వించే' వ్యాఖ్యలు చేశాడు. "నంబర్ త్రీ నుంచి నంబర్ సిక్స్, నంబర్ సిక్స్ తర్వాత టీమ్ నుంచి బయటకు" అన్నాడు. ద్రావిడ్‌పై ఆ మాటలు ఎలాంటి ప్రభావం చూపించలేదు. తను ఒక వైపు స్థిరంగా ఆడాడు.
తర్వాత లక్ష్మణ్ తన జీవితంలోనే అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శించాడు. మొదటి సెంచరీ పూర్తి చేశాడు. తర్వాత డబుల్ సెంచరీ చేశాడు. తర్వాత 15 ఏళ్ల నుంచీ చెరగని గావస్కర్ 236 పరుగుల అత్యుత్తమ స్కోరు రికార్డు బద్దలు కొట్టాడు. నాలుగో రోజంతా లక్ష్మణ్, ద్రావిడ్ ఆడుతూనే ఉన్నారు. ఈలోపు ద్రావిడ్ కూడా తన సెంచరీ పూర్తి చేశాడు.

ఫొటో సోర్స్, WESTLAND SPORT
ఎర్ర రంగు విటమిన్ మాత్రలు
రోజు ముగుస్తోందనగా, రాహుల్ ద్రావిడ్ పిక్క కండరాల్లో 'క్రాంప్స్' వచ్చాయి. నిలబడలేకపోతున్నాడు. భారత జట్టు 'ఫిజియో' ఆండ్రూ లీపస్ తర్వాత దాని గురించి రాశాడు. "నాకు గుర్తుంది ద్రావిడ్‌కు క్రాంప్స్ రాగానే, జాన్ రైట్ నన్ను అరిచాడు. ద్రావిడ్‌ను సరిచెయ్. ద్రావిడ్ 'రిటైర్డ్ హర్ట్' కాకుండా పిచ్‌పైనే ఉండడం మనకు చాలా ముఖ్యం అన్నట్లు చెప్పాడు".
"క్రాంప్స్‌కు వెంటనే ఎలాంటి చికిత్సా చేయలేం. దానికి సైకాలజిస్టు చికిత్స మాత్రమే ఉంటుంది. నేను మైదానంలోనే ద్రవిడ్‌కు ఎర్ర రంగు 'విటమిన్ బి' మాత్రలు ఇచ్చాను. దీనివల్ల నీ నొప్పి తగ్గుతూ ఉంటుంది అన్నాను. రాహుల్ నేను చెప్పింది నమ్మేశాడు, అదే నమ్మకంతో మైదానంలో నిలిచాడు. ఆ మాత్రలు ప్రభావం చూపిస్తాయని అనుకున్నాడు. కానీ, నేను చెప్పిన అబద్ధాలు అతడిపై ప్రభావం చూపించాయని నేను చెప్పను. అక్కడ నిలవాలనే స్ఫూర్తి కూడా రాహుల్‌కు ఆ శక్తిని ఇచ్చింది".
నాలుగో రోజు ఆట ముగియగానే ఇద్దరు బ్యాట్స్‌మెన్లు పెవిలియన్ చేరినప్పుడు, తను చాలా కష్టంగా నడుస్తున్నాడు. జాన్ రైట్ తన పుస్తకం ఇండియన్ సమ్మర్స్‌లో "ద్రావిడ్ 'డీహైడ్రేషన్'కు గురయ్యాడు. ఆ సమయంలో మెడను చల్లగా ఉంచే రుమాళ్లు ఉండేవి కావు. దాంతో మేం టవలును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటిని ఐస్‌లో ఉంచి మెడ చుట్టూ కట్టుకోడానికి పంపించేవాళ్లం" అని చెప్పాడు.
"ఆట ముగిసి ఇద్దరూ పెవిలియన్ చేరుకోగానే అర డజను డాక్టర్లు వాళ్ల కోసం అక్కడ వేచిచూస్తున్నారు. లక్ష్మణ్‌ను వెంటనే డైనింగ్ టేబుల్‌పై, ద్రావిడ్‌ను ఫిజియో బల్లపై పడుకోబెట్టాం. ఇద్దరికీ వెంటనే డ్రిప్ ఎక్కించాం".

ఫొటో సోర్స్, Getty Images
బంతితో తెందూల్కర్ అద్భుతం
అయిదో రోజు లక్ష్మణ్ 281 పరుగుల దగ్గర అవుటయ్యాడు. భారత్ ఇన్నింగ్స్ ముగిస్తున్నట్టు ప్రకటించింది. ఆస్ట్రేలియాకు 75 ఓవర్లలో 384 పరుగుల లక్ష్యం ఇచ్చింది. టీ వరకూ ఆస్ట్రేలియా 3 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. మ్యాచ్ డ్రా దిశగా వెళ్తోంది. అప్పుడే తెందూల్కర్ అద్భుతం చేశాడు.
అంపైర్ బంసల్ అది గుర్తు చేసుకున్నారు. "తెందుల్కర్ ఆడిన చాలా మ్యాచుల్లో నాకు అవకాశం దొరికింది. తన అద్భుతం ఏంటంటే, లెగ్ బ్రేక్‌తోపాటు ఆఫ్ బ్రేక్ కూడా వేస్తాడు. బౌలింగ్ కూడా కంట్రోల్లో ఉంటుంది. ఆస్ట్రేలియా రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ వచ్చినపుడు అతడు ఆఫ్ బ్రేక్ బౌలింగ్ చేశాడు. వాళ్ల లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ వచ్చినపుడు లెగ్ బ్రేక్ వేశాడు".
"అంటే రెండు వైపుల నుంచీ తన బౌలింగ్ ఎలా ఉందంటే, ఆ బంతి మిస్సై కాళ్లకు తగిలిందంటే ఎల్‌బీడబ్ల్యు ఇవ్వడం తప్ప వేరే అవకాశమే ఉండదు. షేన్ వార్న్ కూడా ఇది లెగ్ బ్రేక్ బయటికి వెళ్తుందిలే అని ఒక బంతిని వదిలేశాడు. అది లోపలికి రావడంతో ఎల్‌బీడబ్ల్యు అయ్యాడు".

ఫొటో సోర్స్, Getty Images
అలిసిపోయిన వార్న్
లక్ష్మణ్ తన ఆత్మకథ '281 అండ్ బియాండ్'లో "పెవిలియన్ చేరుకోగానే ఎవరూ మా వీపుపై తట్టలేదు. ఎందుకంటే, అలా చేస్తే, ఆ బరువుకు మేం నేలపై పడిపోతామని వాళ్లకు తెలుసు" అని రాశాడు.
లక్ష్మణ్ అందులో "అప్పుడు ఎలా ఉందంటే మాకు మ్యాచ్ గెలిచే పరిస్థితి లేదు. అందుకే పిచ్‌పై ఎంత సేపు వీలైతే అంత సేపు ఆడాలని అనుకున్నా. మొదటి నుంచీ బంతి నా బ్యాట్ మధ్యకు వస్తోంది. మెక్ గ్రాత్, గిలెస్పీ బౌలింగ్‌లో వీలైనంత వరకూ 'వీ'లో ఆడాలి. సమాంతర షాట్లు కొట్టకుండా ఉండాలి అనుకున్నాను".
ఆ తర్వాత కాష్ప్రోవిజ్, షేన్ వార్న్ వచ్చారు. కాస్పర్స్ రివర్స్ స్వింగ్ చేస్తారు, అందుకే అతడి బౌలింగ్లో కూడా నాకు మిడాఫ్ కుడివైపు, మిడ్ వికెట్ ఎడమ వైపు చోటు దొరికేది. అక్కడే ఆడాలని అనుకున్నా. మిగతా మైదానం గురించి అసలు పట్టించుకోలేదు. వార్న్ రిథమిక్ బౌలింగ్‌ను కూడా ధ్వంసం చేయాలని అనుకున్నా. బౌలింగ్ వేస్తున్న కొద్దీ వాళ్ల మెరుపు తగ్గుతూ వచ్చింది. అంటే వాళ్లు అలిసిపోవడం మొదలయ్యింది. బంతులు గాల్లో అంతకు ముందు కంటే నెమ్మదిగా వస్తున్నాయి.

స్పిన్ బౌలింగ్‌లో అత్యుత్తమ ప్రదర్శన
షేన్ వార్న్ బౌలింగ్‌లో లక్ష్మణ్ ఆడిన టెక్నిక్ గురించి అయాన్ చాపెల్ చాలా బాగా చెప్పారు. "ఆ ఇన్నింగ్స్ గురించి నాకు ఎప్పుడూ ఒక విషయం గుర్తొస్తుంది. లక్ష్మణ్ క్రీజు నుంచి బాగా బయటికి వచ్చి అలా ఆడుతున్నప్పుడు వార్న్ ప్రపంచంలోనే అత్యుత్తమ లెగ్ స్పిన్నర్, బంతిని బాగా స్పిన్ కూడా చేస్తున్నాడు".
"నాకు తెలిసి ఒక లెగ్ స్పిన్నర్ బౌలింగ్‌లో ఆన్ డ్రైవ్ కొట్టడం అంటే, అది మంచి పిచ్‌లో కూడా చాలా కష్టమైన షాట్ అవుతుంది. ఆరోజు లక్ష్మణ్ క్రీజ్ నుంచి మూడు అడుగులు బయటికేసి పిచ్ పైకి వచ్చి బంతిని ఆన్ డ్రైవ్ చేస్తున్నాడు"
నాకు గుర్తుంది. నేను మ్యాచ్ తర్వాత షేన్ వార్న్‌ను "మీరా మ్యాచ్‌లో చెత్త బౌలింగ్ వేశారా" అని అడిగా. దానికి వార్న్ "అస్సలు లేదు" అన్నాడు. నేను కూడా చూశా. బాగా పరుగులు ఇచ్చాక వార్న్ స్టంపవుట్ చేయడానికి షార్ట్ బాల్స్ వేసినపుడు లక్ష్మణ్ వెనక్కు వెళ్లి వాటిని మిడ్ వికెట్‌పై ఫోర్ కొట్టడానికి పుల్ చేసేవాడు. అంతకు ముందెప్పుడూ స్పిన్ బౌలింగ్‌ను అంత బాగా ఆడిన వారిని నేను చూళ్లేదు.

ఫొటో సోర్స్, Getty Images
అద్భుత విజయం
హర్భజన్ బౌలింగ్‌లో పాంటింగ్ కొట్టిన బంతి దాస్ చేతుల్లో పడినపుడు మ్యాచ్ భారత్ చేతుల్లోకి వచ్చేసింది. లాస్ట్ సెషన్‌లో ఏడు వికెట్లు పడ్డాయి. మెక్ గ్రాత్‌ను హర్భజన్ ఎల్‌బీడబ్ల్యు చేసినపుడు భారత్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది.
అప్పటి భారతీయ జట్టులో వికెట్ కీపర్ నయన్ మోంగియా బీబీసీతో, "నాలుగో రోజు, అయిదో రోజు మేం పూర్తిగా డ్రెస్సింగ్ రూంలో కుర్చీల్లోనే ఉండిపోయాం అనేది నిజం. నిలబడినా మా స్థానాల నుంచి కదల్లేదు. లక్ష్మణ్, ద్రావిడ్ పరుగులు చేసేకొద్దీ, మాలో ఉత్సాహం పెరుగుతూ పోయింది. దానిని మాటల్లో చెప్పలేం" అన్నాడు.

ఫొటో సోర్స్, Getty Images
టెస్ట్ చరిత్రలో అతిపెద్ద మ్యాచ్
ఈ విజయం భారత క్రికెట్ రూపాన్నే మార్చేసిందని తర్వాత అప్పటి కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నాడు. "చివరి ఏడు ఓవర్ల వరకూ మేం గెలుస్తామని మాకు తెలీదు. ఎందుకంటే మెక్ గ్రాత్, గిలెస్పీ సుదీర్ఘ భాగస్వామ్యం నమోదు చేశారు. ఈ విజయాన్ని నేను అద్భుతం అనే అంటాను. ఫాలోఆన్ తర్వాత 600 కంటే ఎక్కువ పరుగులు చేయడం, ఆస్ట్రేలియా లాంటి పెద్ద జట్టును రెండున్నర సెషన్స్ లోపలే ఆలౌట్ చేయడం ఎప్పుడూ జరిగేది కాదు. ఈ విజయం భారత క్రికెట్‌ను శాశ్వతంగా మార్చేసింది" అన్నాడు.
ఇది బహుశా టెస్ట్ క్రికెట్‌లోనే అతిపెద్ద టెస్ట్ మ్యాచ్. ఒక జట్టు ఫాలోఆన్ ఆడిన తర్వాత కూడా ప్రపంచంలోని అత్యుత్తమ జట్టును ఓడించింది. ఈడెన్ గార్డెన్స్ ప్రేక్షకులు సంబరాల్లో మునిగిపోయారు.
టీవీలో మ్యాచ్ చూస్తున్న కోట్ల మంది ఆనంద బాష్పాలు ఆపుకోలేకపోయారు. ఇది భారత క్రికెట్‌లో అమూల్యమైన క్షణం.
జాన్ రైట్ తన పుస్తకంలో రాశారు. "నేను సుమారు 80 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాను. చాలా మ్యాచ్‌లు దగ్గర నుంచి చూశాను. కానీ, ఈ టెస్ట్‌తో దేన్నీ పోల్చలేం. ఆ రోజు భారత డ్రెస్సింగ్ రూమ్‌లో నేను కూడా భాగం కావడం నాకు దక్కిన ఒక అపూర్వమైన గౌరవం".
ఇవి కూడా చదవండి:
- రామమందిరం నిర్మాణానికి మోదీ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురానుందా?
- పిల్లలను కనాలంటే భయమా? అది టోకోఫోబియా అవ్వొచ్చు
- కేసీఆర్ వర్సెస్ ప్రజా కూటమి: పై చేయి ఎవరిది? - ఎడిటర్స్ కామెంట్
- ‘గాంధీ ఎప్పుడూ మహాత్ముడు కాదు, ఆయనకు ఆ పేరు పొందే అర్హత లేదు’: బీబీసీ ఇంటర్వ్యూలో బీఆర్ అంబేడ్కర్
- BBC Special: తాజ్‌మహల్: ‘జాగ్రత్తపడకపోతే... జ్ఞాపకమే మిగులుతుంది’
- చెన్నైలో Hidden కెమెరాలు పెట్టి మహిళా హాస్టల్ నడుపుతున్న వ్యక్తి
- మీ పిల్లల స్కూలు బ్యాగ్ బరువు ఎంతుండాలో తెలుసా
- రాహుల్ గాంధీకి 'కౌల్' గోత్రం ఎలా వచ్చింది
- గ్లోబల్ వార్మింగ్: ఈ 5 పనులూ చేయండి.. భూ తాపాన్ని మీరే తగ్గించండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








