IAF: సర్జికల్ స్ట్రైక్స్ చేశాక ప్రాణాలతో బయటపడడం చాలా కష్టం

సర్జికల్ స్ట్రైక్స్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, రేహాన్ ఫజల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

సరిహద్దులకు అవతల ఉన్న తీవ్రవాదుల స్థావరాలపై 2016 సెప్టెంబరు 29న సర్జికల్ స్ట్రైక్స్ చేసినట్లు ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. మిలటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ రణవీర్ సింగ్ విలేకరుల సమావేశంలో ఈ దాడుల గురించి ప్రకటించినపుడు ప్రపంచమంతా నివ్వెరపోయింది.

అంటే, నియంత్రణ రేఖ దాటి అంతకు ముందెప్పుడూ సర్జికల్ స్ట్రైక్స్ జరగలేదని కాదు. కానీ మేం దాడులు చేశామని ఇండియన్ ఆర్మీ ప్రపంచానికి స్పష్టం చేయడం మాత్రం అదే మొదటిసారి.

ఉరీలోని ఇండియన్ ఆర్మీ స్థావరాలపై తీవ్రవాదులు జరిపిన దాడుల్లో 17 మంది జవాన్లు మరణించడమే దీనికి కారణం. ఈ దాడుల్లో గాయపడ్డ ఇద్దరు సైనికులు తర్వాత ఆస్పత్రిలో మృతిచెందారు.

ఈ వార్త బయటకు రాగానే.. దిల్లీలోని రైజీనా హిల్స్‌లో కార్యకలాపాలు జోరందుకున్నాయి. హడావుడిగా అత్యంత సీక్రెట్ 'వార్ రూమ్స్'లో భారత దేశ రక్షణపై ఇంటెలిజెన్స్ సమావేశాలు నిర్వహించారు. అందులో ఒక సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర భద్రతా సలహాదారు అజిత్ డోభాల్‌తో కలిసి హాజరయ్యారు.

"ఇండియాస్ మోస్ట్ ఫియర్‌లెస్ స్టోరీస్ ఆఫ్ మోడర్న్ మిలిటరీ హీరోస్" సహ రచయిత రాహుల్ సింగ్ "దీని గురించి మేం చాలా మంది జనరల్స్, స్పెషల్ ఫోర్స్ అధికారులతో మాట్లాడాం. యుద్ధాన్ని శత్రువుల భూభాగంలోకి కూడా తీసుకెళ్లాలని, చేతులుముడుచుకుని కూర్చోకుండా ఈ దాడికి భారత్ సరైన జవాబు ఇవ్వాలని ఇండియన్ ఆర్మీ ఈ సమావేశంలో నిర్ణయించిందని మేం పూర్తి విశ్వాసంతో చెప్పగలం" అన్నారు.

సర్జికల్ స్ట్రైక్స్

మైక్ టాంగోకు ఆపరేషన్ బాధ్యతలు

సరిహద్దుకు అవతల తీవ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేసే బాధ్యతలను ఎలిట్ పారా ఎస్ఎఫ్‌కు చెందిన 2ఐసీ మేజర్ మైక్ టాంగోకు అప్పగించారు.

ఇది ఆయన అసలు పేరు కాదు. భద్రతా కారణాలతో పుస్తకం అంతా ఆయన్ను ఈ ఆపరేషన్ అంతా తను ఉపయోగించిన మైక్ టాంగో అనే తన రేడియో పేరుతోనే ప్రస్తావించారు.

‘ఇండియాస్ మోస్ట్ ఫియర్‌లెస్’ పుస్తక రచయిత, శివ్ అరూర్.. స్పెషల్ ఫోర్స్ అధికారులను క్రెమ్ డెలా క్రెమ్ ఆఫ్ సోల్జర్స్ అంటారు. ‘‘వీరు ఇండియన్ ఆర్మీలో అందరికంటే ఫిట్‌గా, బలంగా, మానసిక అప్రమత్తతతో ఉండే సైనికులు. నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం వీరిలో చాలా వేగంగా ఉంటుంది. చావోబతుకో తేల్చుకోవాల్సి వచ్చినపుడు వీళ్ల మెదడు చాలా వేగంగా పనిచేస్తుంది". అని చెప్పారు.

"ప్రమాదకర పరిస్థితుల్లో సజీవంగా ఉండేందుకు ఏం చేయాలో వీరికి చాలా బాగా తెలుసు. సాధారణంగా సైన్యాన్ని రక్షణ కోసం ఉపయోగిస్తారు. కానీ స్పెషల్ ఫోర్సెస్ వేటాడుతాయి. వారిని ఎప్పుడూ దాడుల కోసమే ఉపయోగిస్తుంటారు". అని ఆయన చెప్పారు.

సర్జికల్ స్ట్రైక్స్

ఫొటో సోర్స్, Getty Images

నిఘా వర్గాలతో సంప్రదింపులు

ఇటు, దిల్లీలో ఈ దాడులను అసలు ఏదీ జరగనట్టే తీసుకున్నారు. కోజికోడ్‌లో ప్రసంగించిన నరేంద్ర మోడీ ఉరీ దాడుల గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు.

మోదీ ఆ సభలో భారత్, పాకిస్తాన్‌ పేదరికం, నిరక్షరాస్యత, నిరుద్యోగంపై యుద్ధం చేయాల్సి ఉంటుందని మాత్రం అన్నారు.

అమెరికాలో ఉన్న సుష్మా స్వరాజ్ కూడా ఉరీ దాడిపై ఏమాత్రం ఆగ్రహం వ్యక్తం చేయలేదు. పాకిస్తాన్‌కు అంతా మామూలుగానే ఉందనే అభిప్రాయం కలిగించారు. కానీ లోలోపల మాత్ర సర్జికల్ స్ట్రైక్స్ సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి.

"మేజర్ టాంగో టీమ్ పాకిస్తాన్‌లో ఉన్న తమ నలుగురు సోర్సెస్‌నూ సంప్రదించింది. వీరిలో ఇద్దరు పాక్ ఆక్రమిత కశ్మీర్ గ్రామీణ ప్రాంతాల్లో ఉంటే, మిగతా ఇద్దరు జైషే మహమ్మద్‌లో భారత గూఢచారులుగా పనిచేస్తున్నారు. తీవ్రవాదులు వారి లాంచ్‌పాడ్‌లో ఉన్నారని నలుగురూ విడివిడిగా ధ్రువీకరించారు" అని రాహుల్ సింగ్ చెప్పారు.

సర్జికల్ స్ట్రైక్స్

ఫొటో సోర్స్, PTI

రాత్రి 8.30కు నడక మొదలైంది

మైక్ టాంగో నేతృత్వంలోని 19 మంది భారతీయ సైనికులు సెప్టంబర్ 26 రాత్రి 8.30 గంటలకు తమ స్థావరాల నుంచి కాలినడకన బయల్దేరారు. 25 నిమిషాల్లో వాళ్లు ఎల్ఓసీని దాటారు.

టాంగో చేతిలో ఎమ్4 ఎ1 5.56 ఎంఎం కార్బైన్ ఉంది. అతడి టీమ్‌లోని మరో సభ్యుడు ఎం4 ఎ1తో పాటూ ఇజ్రాయెల్‌లో తయారైన టెవర్ టార్-21 అసాల్ట్ రైఫిల్ పట్టుకుని ఉన్నాడు.

శివ్ అరూర్, రాహుల్ సింగ్‌తో మాట్లాడిన మైక్ టాంగో, "తను ఈ దాడి కోసం స్పెషల్ ఫోర్స్‌లోని మెరికల్లాంటి జవాన్లను ఎంచుకున్నానని. కానీ ఇలాంటి ఆపరేషన్లో కొంతమంది చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి" అని చెప్పారు.

నిజానికి దానికి 99.9999 శాతం అవకాశం ఉంటుంది. ప్రాణత్యాగం చేయడానికి ఆ టీమ్ మానసికంగా సిద్ధమైంది. తాము అక్కడికెళ్లామనే సమాచారం పాకిస్తానీలకు తెలిస్తే, అక్కడ్నుంచి తిరిగి రావడం ఈ ఆపరేషన్లో చాలా కష్టమైన దశ అవుతుందని టాంగో భావించారు.

సర్జికల్ స్ట్రైక్స్
ఫొటో క్యాప్షన్, (ఎడమ నుంచి) రేహాన్ ఫజల్‌తో శివ్ అరూర్, రాహుల్ సింగ్

హఠాత్తుగా ఫైరింగ్ శబ్దం

నాలుగు గంటలు నడిచాక టాంగో, అతడి టీమ్, తమ లక్ష్యానికి చాలా దగ్గరగా చేరుకుంది. అసలు చేరలేమని అనుకున్న ప్రాంతానికి వాళ్లు 200 మీటర్ల దూరంలో ఉన్నారు.

లాంచ్ పాడ్‌ నుంచి హఠాత్తుగా ఫైరింగ్ మొదలైంది. వాళ్లకు ఒక్క క్షణం పాటు, పాకిస్తానీలకు తాము వస్తున్నామనే విషయం ముందే తెలిసిపోయిందా అనిపించింది.

అరక్షణంలో జవాన్లంతా నేలను కరుచుకుపోయారు. కానీ చాలా అనుభవం ఉన్న టాంగో చెవులు ఆ కాల్పులను అంచనా వేశాయి. తన టీమ్ లక్ష్యంగా ఆ ఫైరింగ్ జరగలేదు.

కానీ దానితో వారికి ఒక బాడ్ న్యూస్ కూడా తెలిసింది. లాంచ్ పాడ్ లోపల ఉన్న తీవ్రవాదులు అప్రమత్తంగా ఉన్నారు.

సర్జికల్ స్ట్రైక్స్

ఫొటో సోర్స్, Getty Images

ఉన్న చోట అలాగే దాక్కుని ఉండాలని టాంగో నిర్ణయించాడు. 24 గంటలు గడిచాక తర్వాత రోజు రాత్రి మనం దాడి చేద్దామని తన వాళ్లకు చెప్పాడు.

"అది ఆ ఆపరేషన్‌లో అత్యంత సున్నితమైన, ప్రమాదకరమైన భాగం" అంటారు శివ్ అరూర్.

రాత్రిపూట చీకట్లో శత్రువుల భూభాగంలో దాక్కుని ఉండడం అంత కష్టమేం కాదు. కానీ తెల్లవారాక పగలంతా అదే ప్రాంతంలో ఉండాలంటే, దానికి చాలా సాహసం కావాలి.

కానీ అలా చేసుంటే, ఆయనకు కచ్చితంగా ఒక ప్రయోజనం కలిగుండేది. ఆ ప్రాంతాన్ని, వారి వ్యూహాలను తెలుసుకోడానికి 24 గంటల సమయం లభించేది. టాంగో చివరిసారి శాటిలైట్ ఫోన్‌లో తన సీఓను సంప్రదించాడు. తర్వాత దాన్ని ఆఫ్ చేశాడు.

సర్జికల్ స్ట్రైక్స్

ఫొటో సోర్స్, PTI

ఫొటో క్యాప్షన్, సర్డికల్ స్ట్రయిక్ గురించి డీజీఎంఓ లెఫ్టినెంట్ రణ్‌వీర్ సింగ్ ప్రెస్ కాన్ఫరెన్స్

50 గజాల దూరం నుంచే తీవ్రవాదులపై గురి పెట్టారు

సెప్టంబర్ 28 రాత్రి దిల్లీలో భారతీయ కోస్ట్ గార్డ్ కమాండర్స్ వార్షిక విందు జరుగుతోంది. కానీ రక్షణ మంత్రి మనోహర్ పారికర్, కేంద్ర భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, సైన్యాధ్యక్షుడు జనరల్ దల్వీర్ సింగ్ సహా ముఖ్య అతిథులంతా అక్కడున్నవారికి సారీ చెప్పి ఆర్మీ మిలిటరీ ఆపరేషన్ రూమ్ చేరుకున్నారు. అప్పుడే మొదలైన ఆపరేషన్‌ను ఢిల్లీ నుంచి మానిటర్ చేయాలనుకున్నారు.

దిల్లీకి 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న టాంగో, అతడి టీమ్, అర్ధరాత్రి తాము దాక్కున్న చోటు నుంచి బయటకొచ్చింది. లాంచ్ పాడ్ వైపు అడుగులేయడం ప్రారంభించింది.

లాంచ్ పాడ్‌ 50 గజాల దూరంలో ఉందనగా, టాంగో తన నైట్ విజన్ డివైజ్ నుంచి గమనించాడు. ఇద్దరు తీవ్రవాదుల తమ స్థావరాలకు కాపలా కాస్తున్నారు.

"టాంగో 50 గజాల దూరం నుంచి గురి చూశాడు. ఒకేసారి ఇద్దరు తీవ్రవాదులనూ నేలకూల్చాడు. కమాండర్స్ మనసులో ఒత్తిడి మొదటి బుల్లెట్ పేల్చే వరకే ఉంటుంది. బుల్లెట్ బయిటి రాగానే అది కూడా పోతుంది".

సర్జికల్ స్ట్రైక్స్

ఫొటో సోర్స్, Getty Images

38 నుంచి 40 మంది తీవ్రవాదులు మృతి

ఆ తర్వాత బుల్లెట్ల వర్షం కురిపిస్తూ టాంగో కమాండోలు లాంచ్ పాడ్ వైపు కదిలారు. హఠాత్తుగా ఇద్దరు తీవ్రవాదులు భారత జవాన్లపై వెనక నుంచి దాడి చేయడానికి, అడవిలోకి పరిగెత్తడాన్ని టాంగో గమనించాడు.

9ఎంఎం సెమీ ఆటోమేటిక్ పిస్టల్ తీసిన టాంగో, 5 అడుగుల దూరం నుంచి ఆ తీవ్రవాదులపై ఫైర్ చేశాడు. వారిని నేలకూల్చాడు.

"మైక్ టాంగో, అతడి టీమ్ అక్కడ 58 నిమిషాలు ఉంది. అక్కడ శవాలు లెక్కపెడుతూ సమయం వృథా చేయద్దని వాళ్లకు ముందే ఆదేశాలు ఇచ్చారు. కానీ ఒక అంచనా ప్రకారం, నాలుగు లక్ష్యాల్లో మొత్తం 38 నుంచి 40 మంది తీవ్రవాదులు, పాకిస్తాన్ ఆర్మీకి చెందిన ఇద్దరు జవాన్లు మృతి చెందారు. ఈ మొత్తం ఆపరేషన్ జరుగుతున్నంతసేపూ వారు రేడియోను పూర్తిగా సైలెన్స్‌లో ఉంచేశారు". అన్నారు శివ్ అరూర్.

సర్జికల్ స్ట్రైక్స్

ఫొటో సోర్స్, Getty Images

చెవుల పక్క నుంచి దూసుకెళ్లిన బుల్లెట్లు

ట్యాంగోకు ఇప్పుడు సురక్షితంగా తిరిగి భారత సరిహద్దుల దగ్గరికి ఎలా వెళ్లాలి అనే అసలైన సవాలు ఎదురైంది. ఎందుకంటే వారు వచ్చినట్టు ఇప్పటికే పాకిస్థాన్ సైన్యానికి తెలిసిపోయుంటుంది.

మైక్ టాంగో మాతో, "నేను ఇంకొన్ని అంగుళాల పొడవుంటే, ఇప్పుడు మీ ముందిలా కూచుని మాట్లాడుతూ ఉండేవాడిని కానేమో. పాకిస్తానీ సైనికుల బుల్లెట్లు మా చెవుల పక్క నుంచి దూసుకెళ్లాయి. అటోమేటిక్ ఆయుధం నుంచి వచ్చే బుల్లెట్ చెవుల పక్క నుంచి వెళ్తుంటే, పట్... పట్.... పట్.. అని శబ్దం వస్తుంది. మేం ఏ దారిలో అక్కడికి వెళ్లామో, అదే దారిలో వెనక్కు వచ్చుండచ్చు. కానీ తిరిగి రావడానికి మేం కావాలనే చాలా పొడవాటి దారిని ఎంచుకున్నాం" అన్నారని రాహుల్ సింగ్ చెప్పారు.

"మేం పాకిస్తానీ భూభాగంలోకి మరింత లోపలికి వెళ్లాం. అక్కడి నుంచి తిరిగివద్దామని వెనక్కు తిరిగాం. మధ్యలో 60 మీటర్ల దూరం కవర్ చేసుకోడానికి అసలు ఏదీ కనిపించ లేదు. మా జవాన్లంతా నేలపై పాకుతూ ఆ ప్రాంతాన్ని దాటారు"

టాంగో టీమ్ ఉదయం నాలుగున్నరకు భారత భూభాగంలో అడుగుపెట్టింది. కానీ అప్పటికీ వారు పూర్తిగా సురక్షితంగా లేరు. కానీ అప్పటికే అక్కడికి చేరుకున్న భారతీయ జవాన్లు, వాళ్లకు కవర్ ఫైర్ ఇవ్వడం ప్రారంభించారు. అన్నిటికంటే ముఖ్యంగా ఈ మొత్తం ఆపరేషన్‌లో టాంగో టీమ్‌లోని ఒక్క జవాను కూడా ప్రాణాలు కోల్పోలేదు, గాయపడలేదు.

సర్జికల్ స్ట్రైక్స్
ఫొటో క్యాప్షన్, రాహుల్ సింగ్‌తో రేహాన్ ఫజల్

బాటిల్‌తో నేరుగా నోట్లోకి విస్కీ

భారత్ సరిహద్దులు దాటగానే ఒక చీతా హెలికాప్టర్, టాంగోను, 15 కోర్ హెడ్ క్వార్టర్స్ తీసుకొచ్చింది. ఆయన్ను నేరుగా ఆపరేషన్ గదిలోకి తీసుకొచ్చారు. అక్కడ సీఓ ఆయన్ను హత్తుకున్నారు. కోర్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ సతీష్ దువాను చూడగానే టాంగో ఆయనకు సెల్యూట్ చేశారు.

"జనరల్ దువా టాంగోను కలిసినప్పుడు. ఒక వెయిటర్ ట్రేలో బ్లాక్ లేబుల్ విస్కీ నింపిన కొన్ని గ్లాసులు తీసుకొచ్చాడు. 'వాటిని తిరిగి తీసుకెళ్లిపో, నేరుగా బాటిలే తీసుకురా' అని జనరల్ అతడిని ఆదేశించాడు. 'నీకు తెలీదా, వీళ్లు గ్లాస్ కూడా నమిలేస్తారు' అన్నాడు. అది నిజమే, ఎందుకంటే స్పెషల్ ఫోర్స్ కమాండోస్‌కు గ్లాస్ నమిలే ట్రైనింగ్ కూడా ఇస్తారు". అన్నారు రాహుల్ సింగ్.

"వెయిటర్ వెంటనే బ్లాక్ లేబుల్ బాటిల్ తీసుకొచ్చాడు. జనరల్ దువా బాటిల్ తన చేతిలోకి తీసుకుని టాంగోను నోరు తెరవమన్నాడు. ఇక చాలు అని చెప్పేవరకూ ఆయన టాంగో నోట్లో విస్కీ పోస్తూనే ఉన్నారు. తర్వాత టాంగో కూడా జనరల్ దువాకు నేరుగా బాటిల్‌తోనే విస్కీ తాగించారు".

సర్జికల్ స్ట్రైక్స్
ఫొటో క్యాప్షన్, మేజర్ టాంగోను కీర్తి చక్రతో గౌరవిస్తున్న అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ

నార్తర్న్ కమాండ్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ డీఎస్ హుదాను కలవడానికి టాంగో ఉదయ్‌పూర్ వెళ్లినపుడు, మరో రౌండ్ విస్కీ పార్టీ జరిగింది. "ఏదైనా తినడానికి ఇవ్వచ్చుగా, అంరూ మందే తాగిస్తున్నారు" అని టాంగో తన మనసులో అనుకున్నారు. అని రాహుల్ చెప్పారు.

2017 మార్చి 20న సర్జికల్ స్ట్రైక్స్ చేసిన టీమ్‌లోని ఐదుగురు సభ్యులకు శౌర్య చక్ర లభించింది.

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మేజర్ టాంగోను కీర్తిచక్రతో గౌరవించారు. కీర్తి చక్ర సాధించింది సర్జికల్ స్ట్రైక్స్ హీరో మేజర్ టాంగోనే అనే విషయాన్ని ఆ సమయంలో పెద్దగా ప్రచారం చేయలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)