#mPassport Seva: దేశంలో ఎక్కడి నుంచైనా పాస్‌పోర్ట్ అందించే సరికొత్త యాప్ విశేషాలు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, వరికూటి రామకృష్ణ
- హోదా, బీబీసీ ప్రతినిధి
పాస్‌పోర్ట్ తెలుసు కదా! ఏ దేశంలోనైనా ఇది లేకుండా అడుగుపెట్టలేరు. ఉన్నత చదువుల కోసం కొందరు, ఉపాధి కోసం మరికొందరు, విహారయాత్రలంటూ ఇంకొందరు మనదేశం నుంచి విదేశాలకు ప్రతి ఏడాదీ ఎగిరిపోతూ ఉంటారు. అలా ఎగిరి పోవాలంటే చేతిలో పాస్‌పోర్ట్ ఉండాల్సిందే.
అంత ముఖ్యమైన పాస్‌పోర్ట్‌ను ఇప్పుడు అతి సులభంగా పొందొచ్చు. మీరు దేశంలో ఎక్కడున్నా సరే. మీ శాశ్వత నివాస ప్రాంతం ఏదైనా సరే. పాస్‌పోర్ట్ కోసం ఎక్కడ నుంచైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇకపై దరఖాస్తు కోసం ఒకసారి, పోలీసు విచారణ కోసం మరోసారి ఇంటికి వెళ్లనక్కర్లేదు.
సరికొత్త యాప్
అలాగే అన్నిరకాల పాస్‌పోర్ట్ సేవలు ఒకేచోట సులభంగా లభించేలా భారతప్రభుత్వం సరికొత్త మొబైల్ యాప్‌ను తీసుకొచ్చింది. దాని పేరు 'mPassport Seva'. ఇంతకు ముందు ఆన్‌లైన్ దరఖాస్తు, పోలీసు విచారణ వంటి కోసం కొన్ని యాప్‌లు ఉన్నాయి. కానీ తాజాగా విడుదల చేసిన యాప్‌లో అన్ని సేవలు లభిస్తాయి. దరఖాస్తు దగ్గర నుంచి పాస్‌పోర్ట్ చేతికి వచ్చేదాకా ప్రతి సేవా కొత్త యాప్‌లో లభిస్తుంది.

ఫొటో సోర్స్, getty images/Hindustan Times
లభించే సేవలు
- పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు
- ఇప్పటికే దరఖాస్తు చేసి ఉంటే దాని పురోగతి ఏమిటో తెలుసుకోవచ్చు
- పాస్‌పోర్ట్ గడువు పొడిగించుకోవడం
- సమర్పించాల్సిన ధ్రువపత్రాల వివరాలు
- దగ్గర్లోని పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల సమాచారం
- సేవలకు వసూలు చేసే రుసుముల వివరాలు
- అఫిడవిట్ల నమూనాలు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
- సందేహాలు-సమాధానాలు
- టోల్‌ఫ్రీ నంబరు
ఈ సేవలన్నీ కొత్త యాప్‌లో లభిస్తాయి.

ఫొటో సోర్స్, Google Play
యాప్ ఎక్కడ ఉంటుంది?
ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు, గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 'mPassport Seva' అని టైప్ చేయాల్సి ఉంటుంది. పాస్‌పోర్ట్ సేవల పేరిట అనేక యాప్‌లు ఉంటాయి కనుక కాస్త జాగ్రత్తగా గమనించాలి. యాప్‌కు గూగుల్ ప్లే స్టోర్ ధ్రువీకరణ ఉందోలేదో సరి చూసుకోవాలి. ఐఫోన్ వినియోగదార్లకు యాపిల్ స్టోర్‌లో ఈ యాప్ లభిస్తుంది.
ఎలా పని చేస్తుంది?
యాప్ ద్వారా పాస్‌పోర్ట్ సేవల కోసం రిజిష్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తరువాత ఇమెయిల్ ఐడీ, పాస్‌వార్డ్ సహాయంతో లాగినై కావాల్సిన సేవలు వినియోగించుకోవచ్చు.

ఫొటో సోర్స్, Ministry of External Affairs, GOI
దేశంలో ఎక్కడ ఉన్నా సరే
భారత ప్రభుత్వం పాస్‌పోర్ట్ సేవలను మరింత సరళీకరించింది. దేశంలో ఎక్కడనుంచైనా పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించింది.
దరఖాస్తు చేసుకునేటప్పుడు మీకు నచ్చిన ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయాన్ని, దాని పరిధిలోని పాస్‌పోర్ట్ సేవా కేంద్రం లేదా పోస్ట్ ఆఫీస్ పాస్‌పోర్ట్ కేంద్రాన్ని ఎంచుకోవచ్చు. ఇటీవల పాస్‌పోర్ట్ సేవా దివస్ సందర్భంగా భారత విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఈ విషయాలు తెలిపారు.
మీ శాశ్వత నివాసం సంబంధిత ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం పరిధిలోకి రాకపోయినా ఎటువంటి ఇబ్బంది ఉండదు. దరఖాస్తులో రాసిన చిరునామాకు వచ్చి పోలీసులు విచారణ జరుపుతారు.
స్వస్థలానికి పోనక్కర్లేదు
ఉదాహరణకు మీరు బెంగళూరులో పని చేస్తున్నారు. మీ శాశ్వత నివాసం ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో ఉంది.
పాస్‌పోర్ట్ కావాలంటే గతంలో విశాఖపట్నం ప్రాంతీయ కార్యాలయం పరిధిలోని పాస్‌పోర్ట్ సేవా కేంద్రానికి వెళ్లి దరఖాస్తు చేయాల్సి ఉండేది. ఇప్పుడు ఆ అవసరం లేదు.
బెంగళూరులోని పాస్‌పోర్ట్ సేవా కేంద్రం లేదా పోస్టాఫీస్ పాస్‌పోర్ట్ కేంద్రం పరిధిలో దరఖాస్తు చేసుకోవచ్చు. పోలీసు విచారణ కూడా బెంగళూరులో జరుగుతుంది. ఒకవేళ అవసరమైతే ఒంగోలులో విచారణ జరుపుతారు.
బెంగళూరు కార్యాలయమే పాస్‌పోర్టను జారీ చేస్తుంది. దరఖాస్తులో మీరు రాసిన చిరునామాకు పాస్‌పోర్ట్‌ను పంపిస్తారు.
ఇవి కూడా చదవండి
- #గ్రౌండ్‌రిపోర్ట్: ఉద్దానం.. ‘వీళ్లు ఎందుకు చనిపోతున్నారో ఎవరికీ స్పష్టంగా తెలీదు’
- ఈ గ్రామస్తులు మరుగుదొడ్లు ఎందుకు వద్దంటున్నారు?
- వైరల్: తమిళ విద్యార్థులను ఆకట్టుకున్న ఈ టీచర్ తెలుగాయనే
- అత్యధిక సమయం ప్రయాణించే నాన్‌స్టాప్ విమానం ఇదే
- అమెరికా ఉద్యోగాలు: హెచ్-1బీ కొత్త మార్పులు ఏంటి? వాటితో లాభనష్టాలేంటి?
- చరిత్రలో అత్యంత ధనికుడు ఇతనేనా!!
- #లబ్‌డబ్బు: గోల్డెన్ వీసా అంటే ఏంటి? ఇది పొందడం ఎలా?
- సంతోషంలో భారత్ కంటే బంగ్లా, పాకిస్తాన్‌లే మెరుగు. అసలేమిటీ హ్యాపీనెస్ ఇండెక్స్?
- మనం ఖర్చు చేసే విధానాన్ని క్రెడిట్ కార్డులు ఇలా మార్చేశాయి
- ఆక్స్ఫర్డ్.. కేంబ్రిడ్జ్.. స్టాన్ఫర్డ్ల్లో ఉచితంగా చదవాలనుందా!
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








