పాకిస్తాన్: చూపు లేకపోయినా న్యాయమూర్తిగా ఎంపికయ్యాడు

ఫొటో సోర్స్, Faran Rafi/BBC
- రచయిత, ఫరాన్ రఫీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
25 ఏళ్ల యూసఫ్ సలీం పాకిస్తాన్‌లో తొలి అంధ న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు.
లాహోర్‌కు చెందిన యూసఫ్ 2014లో పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయ విద్య (ఎల్‌ఎల్‌బీ)లో గోల్డ్ మెడల్ సాధించారు.
డిగ్రీ పూర్తి చేశాక రెండేళ్లు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. జడ్జి అయ్యేందుకు అన్ని అర్హతలూ సాధించారు.
అంతేకాదు, జడ్జి నియామకానికి జరిగిన పరీక్షలో 6,500 మంది అభ్యర్థులు పోటీ పడితే, అందులో యూసఫ్ టాపర్‌గా నిలిచారు.
అయినా, "నువ్వు న్యాయమూర్తి కాలేవు" అని ఇంటర్వ్యూలో అధికారులు చెప్పారు. అందుకు కారణం ఇతనికి చూపు లేకపోవడమే.
రెటినైటిస్ పిగ్మెంటోసా (ఆర్‌పీ) అనే అరుదైన జన్యు సంబంధిత రుగ్మతతో యూసఫ్ బాధపడుతున్నారు. దాంతో చిన్నతనంలో కంటి చూపు 30 నుంచి 40 శాతం మాత్రమే ఉండేది.
అయితే, రానురాను అది కూడా తగ్గిపోతూ మరింత ఇబ్బందికరంగా మారింది.
ప్రస్తుతం ఆయన కొద్దిపాటి వెలుతురును మాత్రమే చూడగలరు.
యూసఫ్‌ను ఇంటర్వ్యూలో తిరస్కరించడాన్ని పాకిస్తాన్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సాకిబ్ నిసార్ సుమోటోగా స్వీకరించారు. దాంతో నాలుక కరచుకున్న అధికారులు యూసఫ్‌ను జడ్జి పోస్టుకు ఎంపిక చేశారు.
త్వరలోనే యూసఫ్ పాకిస్తాన్‌లో తొలి అంధ న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు.

ఫొటో సోర్స్, Faran Rafi/BBC
ఇద్దరు అక్కలదీ అదే ఘనత!
యూసఫ్‌కి ఇద్దరు అక్కలు ఉన్నారు. వాళ్లకు కూడా చూపులేదు. వారిలో ఒకరు ప్రస్తుతం పీహెచ్‌డీ చదువుతున్నారు.
మరో అక్క సైమా సలీమ్, పాకిస్తాన్ సివిల్ సర్వీస్ పరీక్షలో విజయం సాధించిన తొలి అంధ మహిళ.
ఆమె జెనీవా, న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి కార్యాలయాల్లో ఐదేళ్లు పనిచేశారు.
ప్రస్తుతం ఇస్లామాబాద్‌లోని పాకిస్తాన్ ప్రధానమంత్రి కార్యాలయంలో పనిచేస్తున్నారు.

ఫొటో సోర్స్, iStock
"మేమూ అన్నీ చేయగలం"
న్యాయమూర్తి అయ్యేందుకు ఎలాంటి అవాంతరాలను అధిగమించాల్సి వచ్చింది? అసలు ఆ వృత్తిని ఎందుకు ఎంచుకోవాలని అనిపించింది? వంటి విషయాలను యూసఫ్ బీబీసీతో పంచుకున్నారు.
"ఇంటర్మీడియేట్ పూర్తి చేశాక నాకు డిగ్రీలో లా తీసుకోవాలని అనిపించింది. ఆ నిర్ణయం తీసుకోవడానికి కూడా ఓ కారణం ఉంది. అప్పట్లో పాకిస్తాన్‌లో న్యాయవ్యవస్థ పరిరక్షణ కోసం న్యాయవాదులు పెద్ద ఉద్యమం చేశారు. ఆ న్యాయవాదుల్లో నేను కూడా ఒకడిని అవ్వాలని అనిపించింది."
"న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశాను. అది నాకు చాలా సంతృప్తినిచ్చింది. దాంతో న్యాయమూర్తిని అయితే చట్టబద్ధంగా తీర్పులు చెబుతూ.. ప్రజలకు నేరుగా న్యాయం చేసే వీలుంటుంది" అని యూసఫ్ చెప్పారు.
"మనం కూడా అన్ని పనులూ చేయగలం. కానీ, మేమూ చేయగలనని ఎదుటివారిని ఒప్పించడమే కాష్టమైన పని. వైకల్యంతో బాధపడుతున్న వారితో మాట్లాడేందుకు, వారి పనితీరును తెలుసుకునేందుకు చాలామంది ఇష్టపడరు. మన సమాజంలో ఉన్న అతిపెద్ద సమస్య అదే. కొందరు ఉన్నత విద్యావంతులు కూడా వికలాంగులను సరైన దృష్టితో చూడలేకపోతున్నారు. వికలాంగులనూ సాధారణ పౌరుల్లాగానే చూడాలి. వాళ్లను కూడా ప్రధాన స్రవంతిలోకి తీసుకురావాలి" అని యూసఫ్ కోరుతున్నారు.

ఫొటో సోర్స్, Faran Rafi/BBC
'సాఫ్ట్‌వేర్ సాయంతో చదివాను'
లా డిగ్రీ పూర్తి చేసేందుకు అనేక పుస్తకాలు చదవాల్సి వచ్చిందని, అందుకు జావ్స్(జాబ్ యాక్సెస్ విత్ స్పీచ్) అనే సాఫ్ట్‌వేర్ ఎంతో ఉపయోగపడిందని యూసఫ్ తెలిపారు. ఆ సాఫ్ట్‌వేర్‌తో చూపులేని వారు ఏ పుస్తకం అయినా, కథనం అయినా సులువుగా చదవొచ్చని అంటున్నారు.
అయితే, ప్రపంచవ్యాప్తంగా అంధుల కోసం అనేక సాంకేతిక పరికరాలు వచ్చినా, పాకిస్తాన్‌లో చాలామందికి అందుబాటులోకి రావట్లేదని యూసఫ్ చెప్పారు. అందుకు అనేక కారాలున్నాయన్నారు.
అన్ని ఇబ్బందులను తట్టుకుని, త్వరలో న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్న యూసఫ్.. చాలా ఉత్సాహంగా ఉన్నారు.
పాకిస్తాన్‌లో కేసుల విచారణలు చాలా ఆలస్యంగా జరుగుతున్నాయని యూసఫ్ అంటున్నారు.
"కొంత మంది ప్రజలు తమ జీవిత కాలమంతా వేచిచూడాల్సి వస్తోంది. అయినా వారికి న్యాయం జరగట్లేదు. భారీగా కేసులు పేరుకుపోవడం, అందుకు అవసరమైన సంఖ్యలో న్యాయమూర్తులు లేకపోవడమే ఆ జాప్యానికి ఓ కారణం" అని అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
- 'ఝాన్సీ రాణి లక్ష్మీబాయిని దొంగ దెబ్బ తీసి చంపారు'
- #గ్రౌండ్‌రిపోర్ట్: ఉద్దానం - ఎవరికీ అంతుబట్టని కిడ్నీ వ్యథలు
- ఉపగ్రహ చిత్రాలు: భారత్‌లో గాలి ఎందుకిలా మారింది?
- మైకేల్ జాక్సన్: అసలా స్టెప్పులు ఎలా వెయ్యగలిగాడు? పరిశోధనలో ఏం తేలింది?
- సంజయ్ గాంధీకి చరిత్ర అన్యాయం చేసిందా?
- కడప జిల్లా: వీరికి గబ్బిలాలు ‘దేవతలు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








