కళ్లు లేకపోయినా.. కలెక్టర్ అయ్యారు: ప్రాంజల్ విజయగాథ

ఫొటో సోర్స్, L B Patil
- రచయిత, రోహన్ నామ్‌జోషి
- హోదా, బీబీసీ మరాఠీ
ప్రాంజల్ పాటిల్.. కేరళలోని ఎర్నాకుళం జిల్లా అసిస్టెంట్ కలెక్టర్‌గా విధుల్లో చేరారు. ఇది మామూలు వార్తగానే కనిపించొచ్చు. కానీ అక్కడి వరకూ రావటానికి ప్రాంజల్ చేసిన ప్రయాణం అసాధారణమైనది. ఎందుకంటే.. ఆమె అంధురాలు.
ఆమె కళ్లు ఏమాత్రం కనిపించవు. అయినా.. ఆమె సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో విజయం సాధించారు. అదీ ఒకసారి కాదు.. వరుసగా రెండు సార్లు ఎంపికయ్యారు. ఇప్పుడామె ఐఏఎస్ అధికారి.
ప్రాంజల్ మహారాష్ట్రలోని ఉల్హాస్‌నగర్‌లో జన్మించారు. పుట్టుకతోనే ఆమెకు పాక్షిక అంధత్వం ఉంది. ఆమె కంటిచూపు పూర్తిగా పోవచ్చునని డాక్టర్లు ఆమె తల్లిదండ్రులకు ముందే చెప్పారు. కానీ.. అది చాలా ముందుగానే సంభవించింది. ఆమె రెండో తరగతి చదువుతున్నపుడు.. ఓ సహ విద్యార్థి పెన్సిల్‌తో ఆమె కంట్లో పొడిచాడు. ఆమె పూర్తిగా కంటిచూపు కోల్పోయారు.
అయినా కానీ.. ప్రాంజల్ సాధారణ స్కూల్‌లో చదువు కొనసాగించారు. తర్వాత పరిస్థితిలు చాలా కష్టంగా మారాయి. ఆమెను బద్లాపూర్‌లోని ఒక స్కూల్‌లో చేర్చారు. అక్కడి వాతావరణంలో ఆమె ఇమడలేకపోయారు. దీంతో ఆమెను ముంబైలోని దాదర్‌లో గల కమలాబాయి మెహతా స్కూల్‌లో చేర్చారు.

ఫొటో సోర్స్, L B Patil
‘‘ఆ స్కూల్‌లో ఐదో తరగతి నుంచి పదో తరగతి వరకూ చదివింది. అదంతా చాలా భావోద్వేగాలతో నిండిన ప్రయాణం. సోమవారం నుంచి శుక్రవారం వరకూ అక్కడే స్కూల్‌లోనే ఉండేది. వారాంతాల్లో ఇంటికి వచ్చేది. అప్పుడు చాలా సంతోషంగా ఉండేది. కానీ సోమవారం వచ్చిందంటే చాలా బాధ కలిగేది’’ అని ఆమె తండ్రి ఎల్.బి. పాటిల్ చెప్పారు. అప్పుడు ఆయన గొంతులో ఆ బాధ స్పష్టంగా కనిపించింది.
‘‘పదకొండో తరగతి నుంచి ఆమెను దగ్గర్లోని కాలేజీలో చేర్చాం. నా భార్య, కుమారుడు ఆమెను కాలేజీలో దింపేవారు. పదో తరగతి వరకూ ఆమె మరాఠీ మీడియంలో చదివింది. పదకొండో తరగతి నుంచి ఇంగ్లిష్ మీడియం. దీంతో ఆమెకు చాలా కష్టాలు ఎదురయ్యాయి. అయినా అన్నిటినీ అధిగమించి హయ్యర్ సెకండరీ సర్టిఫికేట్ (హెచ్ఎస్‌సీ) పరీక్షల్లో జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ సాధించింది’’ అని ఆయన వివరించారు.
హెచ్ఎస్‌సీ తర్వాత ముంబైలోని సెయింట్ జేవియర్స్ కాలేజీలో ఆమె చేరారు. అంధుల కోసం అవసరమైన సదుపాయాలన్నీ ఆ కాలేజీలో ఉన్నాయి. ప్రాంజల్ విశ్వవిద్యాలయం స్థాయిలో ఫస్ట్ ర్యాంక్‌తో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు.
ఆమె ఇంకా ముందుకు సాగాలనుకున్నారు. దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో ఉన్నత విద్య అభ్యసించాలని నిర్ణయించుకున్నారు. అక్కడి నుంచే అంతర్జాతీయ సంబంధాల్లో ఎంఏ, ఎంఫిల్ పూర్తిచేశారు. పీహెచ్‌డీ కోసం కూడా నమోదు చేసుకున్నారు. ఈ మధ్యలో నెట్, సెట్ పరీక్షలు కూడా పాసయ్యారు.

ఫొటో సోర్స్, FACEBOOK/PRANJAL PATIL
సివిల్ సర్వీసెస్ ప్రయాణం...
ఎంఫిల్ పూర్తిచేసిన తర్వాత సివిల్ సర్వీసెస్ పరీక్షలకు హాజరవ్వాలని ప్రాంజల్ నిర్ణయించుకున్నారు. ఆరంభంలో.. అందుకు అవసరమైన స్టడీ మెటీరియల్ సంపాదించుకోవటానికి చాలా కష్టపడ్డారు. అప్పుడు తన పర్సనల్ కంప్యూటర్‌లో స్క్రీన్ రీడర్ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేసుకున్నారు.
‘‘ఆ సాఫ్ట్‌వేర్ నా జీవితాన్ని కొంత సులభం చేసింది. దీని సాయంతో నేను న్యూస్‌పేపర్లు, ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు అన్నీ చదివేదాన్ని. బ్రెయిలీలో లభించని కొన్ని పుస్తకాలని పీడీఎఫ్ ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేసి చదువుకునేదాన్ని’’ అని ప్రాంజల్ తెలిపారు.
‘‘జేఎన్‌యూలో నా ఫ్రెండ్ ఒకరు.. ప్రిలిమ్, మెయిన్ పరీక్షల్లో నా రైటర్‌గా హెల్ప్ చేసింది. మా మధ్య చాలా సఖ్యత కుదిరింది. జవాబు రాయటం కన్నా చెప్పటం చాలా సులభం. ఆమె చాలా సహకరించింది’’ అని వివరించారు.
‘‘నాకు రోజు వారీ పనులు అని నిర్దిష్టంగా ఏమీ లేవు. ఎంఫిల్, సివిల్ సర్వీసెస్ రెంటినీ సమన్వయం చేసుకోవటానికి ప్రయత్నించేదాన్ని’’ అని ఆమె తెలిపారు.
‘‘ఆమె హెడ్‌ఫోన్ సాయంతోనే చదివారు. దీనివల్ల తన చెవులు కూడా దెబ్బతింటాయేమోనని ఆమె కొన్నిసార్లు ఆందోళనపడేది’’ అని పాటిల్ చెప్పారు.
ప్రాంజల్ తన తొలి ప్రయత్నంలోనే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 773వ ర్యాంకుతో ఎంపికయ్యారు. కానీ ఆమె పోరాటం అక్కడితో ఆగలేదు. ఆమెకు ఇండియన్ రైల్వే ఎకౌంట్స్ సర్వీసెస్ (ఐఆర్ఏఎస్) కేటాయించారు. కానీ.. పూర్తిగా అంధురాలైన వ్యక్తికి ఆ పోస్టు ఇవ్వటానికి రైల్వే నిరాకరించింది. ఈ పరిణామం ప్రాంజల్‌ను తీవ్రంగా కలచివేసింది.

ఫొటో సోర్స్, L B PATIL
‘‘నేను రెండోసారి సివిల్స్ మెయిన్స్ పరీక్ష 2016 డిసెంబర్ మూడో తేదీన రాయాలి. డిసెంబర్ రెండో తేదీన ఈ విషయాలన్నీ తెలిశాయి. నేను షాక్ తిన్నాను. అయితే మొదట నేను పరీక్షల మీద దృష్టి కేంద్రీకరించాను. ఈ పరిణామం గురించి డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీఓపీటీ)లో విచారించాలని నా స్నేహితులకు చెప్పాను’’ అని ప్రాంజల్ తెలిపారు.
‘‘నాకు ఏ సమాచారమూ రాలేదు. అప్పటి రైల్వేమంత్రి సురేశ్‌ప్రభును కూడా కలిశాను. పీఎంఓ సహాయమంత్రి జితేంద్రసింగ్ దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లాను. దీంతో వారు నాకు ఇండియన్ పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ సర్వీసెస్ కేటాయించారు. సర్వీసును కేటాయించే తన పని డీఓపీటీ పూర్తిచేసినందున నేను అది తీసుకోవాల్సి వచ్చింది. సర్వీస్‌లో చేరాను. ఈలోగా రెండోసారి రాసిన మెయిన్స్‌లో ఎంపికయ్యాను. ఈసారి నాకు 124వ ర్యాంక్ వచ్చింది. నాకు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్) కేటాయించారు. నాకు కేరళ కేడర్ వచ్చింది’’ అని ఆమె వివరించారు.
అండగా నిలిచిన కుటుంబం...
ప్రాంజల్‌కు కోమల్ పాటిల్‌తో వివాహమైంది. ఆమెను ఆయన బేషరతుగా అంగీకరించారు. మహారాష్ట్రలోని ఒక చిన్న పట్టణం భూసావాల్‌లో నివసిస్తారు. అక్కడే ఆయనకు చిన్న వ్యాపారం ఉంది. కోమల్ లాగానే ప్రాంజల్ అత్తమామలు కూడా ఎంతో మద్దతు ఇచ్చారు. ఆమె కష్టసుఖాల్లో ఆమెను వెన్నంటి నిలిచారు.
మొదటి దశ శిక్షణ పూర్తయిన తర్వాత ప్రాంజల్ ఇటీవలే ఎర్నాకుళం అసిస్టెంట్ కలెక్టర్‌గా చేరారు. ‘‘ఇప్పుడే నా అసలు పరీక్ష మొదలైంది’’ అని ఆమె అంటారు. జీవితాంతం పోరాడుతూ విజయం సాధిస్తూ వస్తున్న ప్రాంజల్ ఇప్పుడు నూతనోత్సాహంతో ఈ పరీక్షను ఎదుర్కోనున్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








