స్త్రీ శక్తి: కొవ్వలిని ‘మనోహరం’గా మలచిన ‘గ్రామ దీపం’

మనోహరి

ఫొటో సోర్స్, Nagaraja Gali

    • రచయిత, నాగరాజ గాలి
    • హోదా, బీబీసీ తెలుగు కోసం

ఆమెను అందరూ ‘శ్రీమంతురాలు’ అంటారు. కారణం.. దేశ రాజధానిలో ప్రతిష్టాత్మక విశ్వ విద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసించటం కాదు. అక్కడి నుంచి తను పుట్టిపెరిగిన మారుమూల గ్రామానికి తిరిగివచ్చి.. గ్రామాభివృద్ధికి ‘దీపం’గా మారినందుకు.

కానీ ‘శ్రీమంతురాలు’ అనటాన్ని అమె ఒప్పుకోరు. తాము ఎవరికీ అనుకరణ కాదంటారు. ‘శ్రీమంతుడు’ సినిమానే తమకు అనుకరణ అని చెప్తారు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వలి గ్రామాభివృద్దికి చిరుదివ్వెగా మారిన ఒక విద్యావంతురాలి స్ఫూర్తిమంతమైన కథ ఇది.

ఆమె పేరు వెలమాటి మనోహరి. దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో రాజనీతిశాస్త్రంలో డాక్టరేట్ పట్టా పొందారు. ఏ సివిల్ సర్వీసుకో ఎంపికై గొప్ప అధికారి అవుతారని ఆమె తల్లిదండ్రులు భావించారు.

ఇక ఊరివైపు చుట్టంచూపుగా రెండు మూడేళ్లకోసారి వస్తారని ఊరివాళ్లు అనుకున్నారు. కానీ వారి ఆలోచనలు, అంచనాలు తప్పని తేలింది. ఆమె కొవ్వలి తిరిగి వచ్చారు. గ్రామంలో మార్పుకు శ్రీకారం చుట్టారు.

కంపోస్టును సిద్ధం చేస్తున్న చిన్నారులు

ఫొటో సోర్స్, Grama Deep/Facebook

ఉద్యమంలోకి మహిళలు, బాలబాలికలు

జేఎన్‌యూ నుంచి బయటికి వచ్చాక లోక్‌సత్తా నేత జయప్రకాశ్ నారాయణ ఆధ్వర్యంలో స్వరాజ్ ఉద్యమంలో కొంత కాలం పనిచేశారు. ఆ తర్వాత తమ గ్రామ వికాసానికి పరిమితం కావాలని నిర్ణయించుకున్నారు.

కొవ్వలి గ్రామాన్ని బహిరంగ మలవిసర్జన నుంచి విముక్తి కల్పించడం అందులో తొలి అడుగుగా భావించారు. ‘గ్రామ దీపం’ అనే సంస్థను స్థాపించారు. అందులో మహిళలను, బాలబాలికలను భాగస్వాములను చేశారు.

ఫలితంగా బహిరంగ మలవిసర్జన ప్రదేశాలు పచ్చటి మొక్కలు, బెంచీలతో పెద్దల మాటామంతీకి రచ్చబండలుగా రూపాంతరం చెందాయి. ఊరి మంచినీళ్ల చెరువు గట్లు గ్రామానికి ప్రాణవాయువును ఇచ్చే, సేదదీర్చే హరిత వనాలుగా మారాయి.

బాలికా విద్య కోసం ‘బాలిక విద్యా నిధి’ ఏర్పాటయింది. గ్రామానికి చెందిన అనేకమంది ప్రవాసాంధ్రులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తులు వితరణశీలురు తలా ఒక చేయి వేశారు.

చిన్నారులతో మనోహరి

ఫొటో సోర్స్, Grama Deep/Facebook

మహిళలే మార్పుకు పునాది రాళ్ళు

కర్ణాటక మాజీ గవర్నరు వి.రమాదేవి సోదరుడు, ప్రముఖ వ్యాపారవేత్త ఉషా బాలకృష్ణ 'గ్రామ దీపం' ఉద్యమానికి రాయబారిగా వ్యవహరించడానికి ముందుకు వచ్చారు. ఫేస్‌బుక్ లాంటి సామాజిక మాధ్యమాలు మార్పుకు వేదికై ఎక్కడెక్కడో ఉన్న పల్లె ముద్దుబిడ్డలను ఒక చోటుకు చేర్చాయి.

గ్రామంలోని చెత్త కుప్పలు పచ్చటి పార్కులుగా మారాయి. వెల్జాన్ కంపెని యజమాని వెలమాటి జనార్థనరావు విరాళంగా ఇచ్చిన ఏడు లక్షల రూపాయలతో చెత్త తరలించాడనికి ఒక వాహనం కొన్నారు.

గ్రామంలోని మహిళలే మార్పుకు పునాది రాళ్లని మనోహరి అన్నారు. ఆర్థిక, సామాజిక అంతరాల సాలెగూళ్లలో చిక్కుకున్న మహిళలను ఏకం చేయడం పెద్ద సవాలుగా మారింది.

కొవ్వలి గ్రామంలో రచ్చబండ

ఫొటో సోర్స్, Nagaraja Gali

మహిళల్ని కలిపిన తెలుగు పండుగలు

ఊహించినట్లుగానే గ్రామ రాజకీయాలు అడ్డుగోడలుగా మారాయి. అయితే.. సంక్రాంతి, ఉగాది లాంటి తెలుగు పండుగలు మహిళలను ఒక చోట చేర్చడానికి ఉపకరించాయి. ఈ సందర్భంగా జరిగే ముగ్గుల పోటీలు, ఆటల పోటీలు గ్రామ మహిళలకు ప్రత్యేక ఆకర్షణగా మారాయి.

పార్కు అభివృద్ధికి గ్రామ రాజకీయాలు అడ్డుపడినప్పుడు.. అక్కడ నాటిన మొక్కలను దుండగులు ధ్వంసం చేసినప్పుడు తోటి మహిళల నుంచి అందిన మనోధైర్యం మరువలేనిదని ఆమె అంటారు.

అమరావతికి మహిళల బృందాలను సందర్శనకోసం తీసుకెళ్లారు. అసెంబ్లీ, సెక్రటేరియట్‌లను చూసే అవకాశం స్థానిక మహిళలకు కలుగచేశారు. ఇలాంటి పర్యటనలు చైతన్యంతో పాటు సంఘబలాన్ని పెంపొందించడానికి ఎంతో తోడ్పడతాయని మనోహరి అంటారు.

గ్రామ దీప్ సభ్యుల కృషి

ఫొటో సోర్స్, Grama Deep/Facebook

ఉన్నత చదువులు ముగించి తను ఇంటికి వచ్చినప్పుడు తమ గ్రామం ఒక పెద్ద మురికి కూపంగా కనిపించిందని.. మార్పు అనేది ఇక్కడే మొదలవ్వాలని తనకు అనిపించిందని 35 సంవత్సరాల మనోహరి అంటారు.

ఇదే విషయం మిగతా మహిళలతో అన్నప్పుడు చైతన్యం ఎగసింది. మహిళా దండు పంచాయతీ కార్యాలయానికి వెళ్లి సమావేశంలో ఉన్న తమ ప్రతినిధులను చెత్త విషయమై నిలదీశారు.

కుటుంబంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపైన కూడా ‘గ్రామ దీపం’ ప్రత్యేక దృష్టి పెట్టింది. వారం వారం జరిగే సమావేశాల్లో కుటుంబ హింస, వరకట్న వేధింపులు లాంటి సమస్యలపై మహిళల నుంచి 'గ్రామ దీపం' ఫిర్యాదులు స్వీకరించి పరిష్కారానికి కృషి చేస్తోంది.

చెరువు గట్టు హరితవనంగా మారిన దృశ్యం

ఫొటో సోర్స్, Grama Deep/Facebook

గాంధీకి విరాళాలు

అవసరం అయితే బాధిత మహిళలకు న్యాయ సహాయం అందిస్తామని మనోహరి తెలిపారు.

స్వాతంత్ర్యోద్యమ కాలం నుంచి మహిళా వికాసంలో కొవ్వలికి ప్రత్యేక స్థానం ఉంది. స్వరాజ్య ఉద్యమంలో భాగంగా మహత్మా గాంధీ పర్యటించినప్పుడు తమ ఒంటిమీద ఆభరణాలను స్వరాజ్య నిధి కోసం గ్రామ మహిళలు స్వచ్ఛందంగా విరాళమిచ్చినట్టు స్థానికులు చెబుతుంటారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)