భారత్‌లో పురుషుల కన్నా మహిళలకే ఎక్కువగా క్యాన్సర్! ఎందుకు?

ఫొటో సోర్స్, AFP
- రచయిత, సౌతిక్ బిశ్వాస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
క్యాన్సర్ విషయానికి వస్తే ఆంకాలజిస్టులకు భారతదేశం ఒక పజిల్‌లా కనిపిస్తోంది.
భారతదేశంలో క్యాన్సర్ రేటు ఆర్థికంగా ముందంజలో ఉన్న అమెరికా కన్నా తక్కువగా ఉంది.
భారత్‌లో ఏటా లక్ష మందికి 100 కేసులు నమోదు అవుతుండగా, అమెరికాలో 300 కేసులు నమోదవుతున్నాయి.
భారతదేశపు జనాభాలో యువతే ఎక్కువగా ఉంది. ప్రజలు వయసు మీరే కొద్దీ క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి.
కానీ బతికే అవకాశాలు మాత్రం తక్కువ. క్యాన్సర్ బాధితుల్లో మూడింట ఒక వంతుకు మించి ఐదేళ్లకన్నా ఎక్కువ కాలం జీవించడం లేదు.
'ద లాన్‌సెట్ ఆంకాలజీ'లో ప్రచురించిన పరిశోధనా వివరాల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ బాధితుల్లో మహిళలకన్నా పురుషులు 25 శాతం ఎక్కువ.
భారతదేశంలో మాత్రం ఈ ధోరణి భిన్నంగా ఉంది.
అయితే మన దేశంలో క్యాన్సర్ వల్ల చనిపోతున్న వారిలో స్త్రీలకన్నా పురుషులే ఎక్కువ.
దీనికి కారణం మహిళలకు వచ్చే క్యాన్సర్లలో 70 శాతం రొమ్ము, గర్భాశయ ముఖద్వార, అండాశయ క్యాన్సర్‌లు.
వీటికి చికిత్స చేస్తే వారు బతికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
దీనికి భిన్నంగా పురుషులు ఎక్కువగా ఊపిరితిత్తులు, నోటి క్యాన్సర్‌తో బాధ పడుతున్నారు. ఇవి రెండూ పొగ తాగడం, పొగాకు నమలడం వల్ల వచ్చేవి. ఈ క్యాన్సర్లు వస్తే.. జీవించే అవకాశాలు చాలా తక్కువ.

ఫొటో సోర్స్, AFP
ప్రస్తుతం భారతదేశంలో మహిళల్లో చాలా ఎక్కువగా కనిపిస్తోంది రొమ్ము క్యాన్సర్. మొత్తం కేసుల్లో 27 శాతం ఈ కేసులే.
గత ఆరేళ్లలో ఈ క్యాన్సర్ కేసుల సంఖ్య చాలా ఎక్కువైందని ఆంకాలజిస్టులు చెబుతున్నారు.
భారతదేశంలో 45-50 ఏళ్ల మధ్య వారికి ఎక్కువగా బ్రెస్ట్, ఒవేరియన్ క్యాన్సర్ వస్తుండగా.. ఎక్కువ ఆదాయం కలిగిన దేశాలలో ఈ వయసు సుమారు 60 ఏళ్లుగా ఉంది. జెనెటిక్, పర్యావరణ అంశాలే దీనికి కారణమై ఉండవచ్చు.
కొన్నిసార్లు క్యాన్సర్ జన్యుసంబంధమైన కారణాల వల్ల వస్తుంది. బీఆర్‌ఏసీ1 మరియు బీఆర్‌ఏసీ2 జీన్స్ మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలను నాలుగు నుంచి ఎనిమిది రెట్లు పెంచుతాయని గుర్తించారు.
కొన్ని కుటుంబాలలో చాలా మంది బంధువులకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉండడం గమనించవచ్చు. అయితే ఇది ప్రాంతాలను బట్టి కూడా మారవచ్చు.
ఉదాహరణకు, దేశ రాజధాని దిల్లీలో బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు ఎక్కువ. అయితే ఆంకాలజిస్టులు దీనికి సరైన వివరణ ఇవ్వలేకపోతున్నారు. క్యాన్సర్‌పై పెరిగిన అవగాహన, వైద్య పరీక్షలు పెరగడం దీనికి కారణం కావచ్చని వారి అంచనా.

ఫొటో సోర్స్, AFP
మూడు, నాలుగో దశల్లో గుర్తిస్తున్నాం
ఈ పరిశోధన చేసిన వారిలో ఒకరైన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ ప్రివెన్షన్ అండ్ రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ రవి మెహ్రోత్రా - ఎక్కువ కొవ్వు పదార్థాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం, ఒబెసిటీ, ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకోవడం - తదితర కారణాలు బ్రెస్ట్ క్యాన్సర్‌కు కారణమని భావిస్తున్నారు.
అంతే కాకుండా అవగాహనాలేమి, డాక్టర్ల వద్దకు పోవడానికి ఇష్టం లేకపోవడం వల్ల మహిళల్లో క్యాన్సర్‌ను గుర్తించడంలో ఆలస్యమవుతోంది.
ఉదాహరణకు, అమెరికాలో 80 శాతం బ్రెస్ట్ క్యాన్సర్ కేసులను మొదటి, రెండో దశల్లోనే గుర్తిస్తే, భారతదేశంలో మూడు, నాలుగో దశల్లో గుర్తిస్తున్నారు.
హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (హెచ్‌పీవీ) కారణంగా సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది. మహిళలకు వచ్చే క్యాన్సర్లలో 23 శాతం ఈ తరహా క్యాన్సరే.
2008 నుంచి 11-13 ఏళ్ల మధ్య వయసున్న బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్లను అందిస్తున్నారు. దీని వల్ల ప్రపంచవ్యాప్తంగా సర్వైకల్ క్యాన్సర్ తగ్గుముఖం పట్టింది.
అయితే భారతదేశంలో కేవలం పంజాబ్, దిల్లీలో మాత్రమే హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ పథకం అమలు చేస్తున్నారు.

ఫొటో సోర్స్, AFP
'నివారించదగ్గ క్యాన్సర్'
భారతదేశంలోని మహిళా క్యాన్సర్ బాధితుల్లో సర్వైకల్ క్యాన్సర్ బాధితులది రెండో స్థానం. క్యాన్సర్ కారణంగా మరణిస్తున్న మహిళల్లో పావుభాగం ఈ క్యాన్సర్ వల్లే మరణిస్తున్నారు.
''మిగతా క్యాన్సర్లతో పోలిస్తే దీనిని నివారించడం చాలా సులభం'' అని డాక్టర్ మెహ్రోత్రా తెలిపారు.
క్యాన్సర్ సమస్య పరిష్కారానికి దేశంలో లైంగిక ఆరోగ్యంపై మరింత ఎక్కువగా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. అంతే కాకుండా హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ పథకాన్ని ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేయాలి.
భారతదేశం 1976లోనే క్యాన్సర్ నియంత్రణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. కానీ క్యాన్సర్ నివారణ కోసం ప్రభుత్వం జీడీపీలో 1.2 శాతం కన్నా తక్కువ ఖర్చు చేస్తోంది.
అయితే ప్రభుత్వం ఈ ఏడాది దేశంలోని 165 జిల్లాలలో నోటి, బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్‌లకు ఉచిత వైద్య పరీక్షలు ప్రారంభిస్తామని చెబుతోంది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








