#UnseenLives: వెనక 40 మంది పురుషులున్నా, నేను ఆ మరకను దాచుకోలేదు

మంజిత వంజారా

ఫొటో సోర్స్, MANJITA VANZARA

మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యేక కథనాల సిరీస్‌లో భాగంగా ధైర్యవంతురాలైన ఐపీఎస్ అధికారి మంజితా వంజారాతో బీబీసీ మాట్లాడింది.

మంజిత గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఏసీపీ (అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్)గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నేరస్తులను హడలెత్తించడమే కాదు, చక్కగా కూచిపూడి, భరత నాట్యం కూడా చేస్తారు.

మహిళల పీరియడ్స్ పై ప్రజల ఆలోచనా తీరు మారాల్సిన అవసరముందని మంజిత బలంగా చెబుతారు. నెలసరి సమయంలోనూ ఎలాంటి భయం లేకుండా డ్యూటీ చేస్తానని అంటున్నారు.

తన అనుభవాన్ని ఇలా గుర్తు చేసుకున్నారు. ఆ విషయాలు ఆమె మాటల్లోనే...

మంజిత వంజారా

ఫొటో సోర్స్, MANJITA VANZARA

అప్పుడు నా వెనుక ఉన్న 40 మంది మగవారే

"అప్పుడు అహ్మదాబాద్‌లో నేరాలపై సదస్సు జరుగుతోంది. అందులో మేము ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 వరకు యూనిఫాంలోనే కూర్చోవాల్సి వచ్చింది.

ఆ సదస్సు జరుగుతున్న సమయంలో నాకు నెలసరి వచ్చింది. దాంతో నా యూనిఫాం మీద పెద్ద మరక ఏర్పడింది. నేను కూర్చున్న కుర్చీ కూడా తడిచిపోయింది.

అప్పుడు అక్కడ ఉన్న మహిళా పోలీసు అధికారి నేనొక్కదాన్నే.

మిగతా వారంతా మగవాళ్లే. నేను ఎవరితో మాట్లాడాలి?

వారి ముందు ఎలా నిలబడాలి? ఎలా వెళ్లాలి?

ఆ సదస్సు ముగిసిన తర్వాత ప్రొటోకాల్ ప్రకారం, మేమంతా నిలబడి పైఅధికారికి సెల్యూట్ చేయాలి.

నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది.

అప్పటి దాకా నెలసరి అంటే అందరికీ చెప్పే విషయం కాదన్న అభిప్రాయం ఉండేది. నాకు ఆత్మవిశ్వాసం ఎక్కువ. ఆ సమయంలో మాత్రం ఇబ్బందిగా అనిపించింది.

ఒకవేళ నేను నిలబడితే, నా వెనక ఉన్నవాళ్లంతా ఆ మరకను చూస్తారని అర్థమైంది.

అయినా సరే, నిలబడాలని నిర్ణయించుకున్నా.

నా వైపు చూసి అంతా నవ్వినా, నా డ్యూటీ నేను చేయాలని అనుకున్నా.

మంజిత వంజారా

ఫొటో సోర్స్, MANJITA VANZARA

సెల్యూట్ చేశాను

నిలబడ్డాను. మా బాస్‌కి సెల్యూట్ చేశాను.

నేను వెళ్లేవరకూ ఎవరూ వెళ్లరని నాకు తెలుసు. దాంతో నేనే వెళ్లడం ప్రారంభించాను.

అప్పుడు నా వెనుక 40 మంది మగ పోలీసు అధికారులు ఉన్నారు.

వాళ్లంతా నా యూనిఫాం మీద ఉన్న ఆ మరకను చూశారు.

ఆ మరక కనిపించకుండా డైరీ లేదా ఫైల్‌ అడ్డుపెట్టుకుని బయటకు వెళ్లేదాన్ని.

కానీ, అలా చేయొద్దని నిర్ణయించుకున్నా.

"మేడం మీ బట్టల మీద మరక బయటికి కనిపిస్తోంది" అని నా గన్‌మెన్ చెప్పారు.

అది సహజంగా వచ్చేదే, వర్రీ అవ్వొద్దు అని అతనికి చెప్పాను.

అదే విషయం నా కింది అధికారులకు కూడా చెప్పాను.

మహిళా సిబ్బందికి నెలసరి వచ్చినప్పుడు వారికి కాస్త విశ్రాంతి ఇవ్వాలని సూచించాను.

line

ఆ మరకలతో నాకు సమస్య లేదు

మంజిత వంజారా

ఫొటో సోర్స్, MANJITA VANZARA

ఇతర మహిళల పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఎందుకంటే, నేను స్వయంగా అనుభవించాను.

నేను ఈ విషయం గురించి మాట్లాడటానికి కారణం, ప్రజలు దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పడమే.

చాలామంది మహిళలు ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు.

నాకు మాత్రం ఇప్పుడు ఆ మరకలతో ఎలాంటి సమస్య లేదు.

నా యూనిఫాం మీద ఆ మరక కనిపిస్తే చెప్పాలని నా వెంట ఉండే మగ గన్‌మెన్లకు కూడా చెప్పాను.

ఈ మార్పు మహిళలందరిలోనూ రావాలన్నదే నా కోరిక.

పీరియడ్స్‌ గురించి అందరూ బయటికి మాట్లాడాలి.

చాలామంది నాలాంటి పరిస్థితి ఎదుర్కొనే ఉంటారు. కానీ, దాన్ని బయటకు చెప్పుకోవద్దన్న అభిప్రాయం మన సమాజంలో నాటుకుపోయింది.

మన శరీరంలో కలిగే సహజ మార్పుల వల్ల బట్టల మీద మరక కనిపిస్తే అందులో తప్పేముంది?

line
మంజిత వంజారా

ఫొటో సోర్స్, MANJITA VANZARA

మనం మారాలి

నెలసరి సమయంలో మహిళలు కేవలం శారీరక బాధే కాదు, మానసికంగానూ ఒత్తిడి ఉంటుందన్న విషయాన్ని మన సమాజంలో పురుషులు అర్థం చేసుకోవాలి.

పీరియడ్స్‌ సమయంలో మహిళలు ఎప్పుడూ రక్తస్రావం గురించే ఆలోచిస్తుంటారు. బట్టల మీద మరక కనిపిస్తే చూసి ఎవరైనా నవ్వుతారేమో అని భయపడుతుంటారు.

సహజంగా వచ్చే దాని గురించి ఆలోచించలేని వాతావరణాన్ని మన సమాజం తయారు చేసింది. ఈ తీరు మారాలి.

పీరియడ్స్ సమయంలో మహిళా ఉద్యోగులు తమకు సులువైన పనులు ఇవ్వాలని అడిగితే ఇచ్చే విధంగా ఓ చట్టం ఉండాలి.

ఆ సమయంలో మహిళలతో ఎలా ప్రవర్తించాలో అందరూ నేర్చుకోవాలి. ఎందుకంటే, పీరియడ్స్‌ రావడం అనేది సహజ ప్రక్రియ.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)