#AadhaarFacts: ఆధార్‌తో లాభమా? నష్టమా?

ఆధార్ అమలులోకి వచ్చి ఎనిమిదేళ్లు గడుస్తున్నా, అది నేటికీ వివాదాస్పదమే.
ఆధార్ సమాచారం దుర్వినియోగం అవుతోందని కొందరు, ఆధార్ లేకపోవడం వల్ల రేషన్ అందక మరణించిన వారు కొందరు.. ఇలా ఆధార్ నిత్యం వార్తల్లో నిలుస్తోంది.
ఈ నేపథ్యంలో బీబీసీ కొందరు నిపుణులతో మాట్లాడి ఆధార్‌పై సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం చేస్తోంది.
ఆధార్ సిరీస్‌లో ఇది మొదటి భాగం.
ఇతరుల వద్ద నా ఆధార్ సంఖ్య ఉంటే వారు ఎలాంటి సమాచారాన్ని పొందగలరు?
ఆధార్‌పై ఇప్పటివరకు ప్రభుత్వం చెబుతున్నదాన్ని బట్టి, ఎవరూ మీ ఆధార్ సంఖ్య ఆధారంగా మీ గురించి ఎలాంటి సమాచారాన్ని పొందే అవకాశం లేదు.
థర్డ్ పార్టీ కూడా మీ ఆధార్ సంఖ్య, పేరు, ఒక్కోసారి వేలిముద్రల వివరాలను డాటాబేస్‌కు పంపుతుంది. అవి సరిపోలితే 'యస్' అని, సరిపోకపోతే 'నో' అని మాత్రమే డాటాబేస్ ప్రతిస్పందిస్తుంది. ఇంకో మాట చెప్పాలంటే, అది కేవలం ధ్రువీకరించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది.
ఇంకో అదనపు ధృవీకరణ విధానం కూడా ఉంది. చట్టప్రకారం 'నో యువర్ కస్టమర్' (మీ కస్టమర్ గురించి తెలుసుకోండి) ప్రక్రియను పూర్తి చేయాల్సిన సంస్థలు లేదా సర్వీస్ ప్రొవైడర్లు లింగం, వయసు, చిరునామా మొదలైన వివరాలను పొందవచ్చు.
ఆధార్ సంఖ్య ఆధారంగా యూఐడీఏఐ ఈ ఈ-కేవైసీ విధానాన్ని రూపొందించింది.
దీని ప్రకారం టెలికాం ఆపరేటర్లు కాగితం ఫారాలను నింపడానికి బదులుగా, ఎలెక్ట్రానిక్ విధానంలో వేగంగా వాటిని నింపగలుగుతున్నారు.
దీంతో టెలికాం సంస్థలు కేవలం పేరు, వేలిముద్ర ఆధారంగా యూఐడీ డాటాబేస్ సదరు వినియోగదారునికి సంబంధించిన చిరునామా, లింగం, వయసు తదితర వివరాలను తెలుసుకోగలిగే అవకాశం ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
ఇతర ప్రైవేట్ సంస్థలు, థర్డ్ పార్టీలు కూడా తమకు లభించిన ఆధార్ సమాచారంతో మీ ఇతర వివరాలను అనుసంధానిస్తూ తమ సొంత డాటాబేస్‌ను సృష్టించుకోవచ్చు.
ఆధార్‌ను బలంగా వ్యతిరేకిస్తున్న డిజిటల్ రైట్స్ కార్యకర్త నిఖిల్ పాహ్వా బీబీసీతో మాట్లాడుతూ.. అదనపు సమాచారాన్ని పొందడానికి ఆధార్ సంఖ్య ఒక మార్గం అని తెలిపారు.
డిసెంబర్‌లో యూఐడీఏఐ ఒక నెంబర్‌ను ట్వీట్ చేసింది. మీరు ఆ నెంబర్‌కు ఆధార్ సంఖ్యను ఎస్సెమ్మెస్ చేస్తే, మీ ఆధార్‌ను ఏ బ్యాంకుతో జతపరిచారో (అకౌంట్ నెంబర్ కాదు) మెసేజ్ వస్తుంది.
ఇలాంటి వాటితో మోసాలు కూడా జరిగే వీలుంది.
''చాలా మందికి తాము బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామని, వాళ్ల ఓటీపీ చెప్పమని ఫోన్ కాల్స్ వస్తుంటాయి. ఇదంతా మోసపూరితంగా బ్యాంక్ అకౌంట్ నుంచి సొమ్మును తమ అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేయడానికే'' అని పాహ్వా తెలిపారు.

ఫొటో సోర్స్, AFP
ఇతరుల వద్ద నా ఆధార్ సంఖ్యలో కొంత భాగం మాత్రమే ఉంటే? అప్పుడు కూడా వాళ్లు నా సమాచారం తెలుసుకోవచ్చా?
అది వాళ్ల వద్ద ఎన్ని అంకెలు ఉన్నాయన్న మీద ఆధారపడి ఉంటుంది. కేవలం కొన్ని అంకెలతోనే వాళ్లు మీ సమాచారాన్ని తెలుసుకోలేరు. అయితే వాళ్ల వద్ద చాలా అంకెలు ఉంటే మాత్రం మీ పేరు, ఆ అంకెలతో కలిసి యూఐడీ డాటాబేస్ నుంచి మీ సమాచారం తెలుసుకొనే ప్రయత్నం చేయొచ్చు.
ఎవరి వద్ద అయినా నా ఆధార్ సంఖ్య ఉంటే లేదా అది లీక్ అయితే, దాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉందా? ఉంటే, ఎలా?
లీక్ అయింది కేవలం ఆధార్ సంఖ్య ఒక్కటే అయితే సాధారణంగా దానిని దుర్వినియోగం చేయడానికి అవకాశం లేదు. కానీ భవిష్యత్తులో టెలికాం ఆపరేటర్లు, బ్యాంకులు ఆధార్ సంఖ్యతో పాటు మీ బయోమెట్రిక్స్‌ను కూడా ఉపయోగించుకోవచ్చు.
థర్డ్ పార్టీల (ఉదాహరణకు ఈ-కామర్స్ కంపెనీలు) వద్ద ఉన్న డాటాబేస్‌లో ఆధార్ సంఖ్యలు కూడా ఉంటే, ఆ డాటాబేస్ లీక్ అయితే, అది ప్రైవసీ సమస్య అవుతుంది. దాని వల్ల పౌరులకు సంబంధించిన సమగ్ర వివరాలు వాణిజ్యసంస్థలు, కొన్నిసార్లు నేరస్తుల చేతిలో పడే ప్రమాదం కూడా ఉంది.
''ఆధార్‌ను ఎక్కువ సర్వీసులకు జతపరిచే కొద్దీ, దాని పర్యవసానాలు ఎక్కువగా ఉండే ప్రమాదం ఉంది'' అని పాహ్వా తెలిపారు.
''ఒక్కసారి ఆ సంఖ్య ఇతరులకు తెలిసిపోతే వేలిముద్రలు లేదా ఓటీపీ సాయంతో ఇతరుల వ్యక్తిగత సమాచారాన్ని తెలుసుకోవడానికి లేదా బ్యాంకులను మోసం చేయడానికి అవకాశం కలుగుతుంది'' అన్నారు.
కానీ ప్రభుత్వం మాత్రం ఎన్‌క్రిప్టెడ్ రూపంలోని బయోమెట్రిక్ డాటా చాలా సురక్షితంగా, భద్రంగా ఉందని చెబుతోంది.

ఆన్‌లైన్ మార్కెట్ లేదా రిటైల్ స్టోర్లలాంటి సేవలతో నా ఆధార్ సంఖ్యను జతపరచడం ఎంత వరకు సురక్షితం?
మీ గుర్తింపును సులభంగా నిర్ధారించేందుకు అలాంటి సంస్థలు ముందు ముందు మరింత ఎక్కువగా మీ ఆధార్ సంఖ్యను చెప్పమని కోరే అవకాశం ఉంది.
దీని వల్ల అవి ఆధార్‌తో సంబంధమున్న సమగ్రమైన కస్టమర్ ప్రొఫైల్ డాటాను తయారు చేసే ప్రమాదం ఉంది. దీని వల్ల వ్యక్తిగత ప్రైవసీకి భంగం కలుగుతుంది.
గతంలో ఇలాంటి సంఘటనలు జరిగాయి. ఉదాహరణకు, డిసెంబర్‌లో డాటాను దుర్వినియోగం చేస్తోందన్న ఆరోపణలతో ఆధార్ జతపరిచిన ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌కు చెందిన ఈ-కేవైసీ సర్టిఫికేట్లను యూఐడీఏఐ సస్పెండ్ చేసింది.
దీంతో ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంకు సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ శశి ఆరోరా తన పదవికి రాజీనామా చేశారు.
''ఆధార్‌తో ఎన్ని సేవలను జత చేస్తారో, దాని వల్ల అన్ని ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉంది'' అని పాహ్వా తెలిపారు.
అయితే యూఐడీఏఐ మాత్రం తమ డాటా బేస్‌కు ఇతర ఏ డాటా బేస్‌లతో కానీ లేదా డాటా బేస్‌లలో ఉన్న సమాచారంతో కానీ సంబంధం లేదని చెబుతోంది.

ఫొటో సోర్స్, FACEBOOK/uidai
భారత్‌లోని విదేశీయులకు ఆధార్ అవసరమా?
మీరు విదేశీయులై, భారతదేశంలో పని చేస్తుంటే - మొబైల్ ఫోన్ లేదా సిమ్ లేదా బ్యాంక్ అకౌంట్‌లాంటి కొన్ని సేవలను పొందేందుకు మీరు ఆధార్‌ను పొందవచ్చు.
అది సుప్రీంకోర్టు తీర్పు మీద ఆధారపడి ఉంటుంది.
తుది తీర్పు వెలువరించే వరకు అన్ని సేవలకు ఆధార్‌ను జతపరిచే డెడ్‌లైన్‌ను సుప్రీంకోర్టు నిరవధికంగా పొడిగించింది.
ప్రవాస భారతీయులు, భారతీయ మూలాలు కలిగిన వ్యక్తుల విషయం ఏమిటి?
ప్రవాస భారతీయులు, ఓసీఐలు (ఓవర్సీస్ సిటిజన్‌షిప్ ఆఫ్ ఇండియా) భారతదేశంలో నిర్దిష్ట కాలం (గడిచిన 12 నెలల్లో కనీసం 182 రోజులు) పాటు లేనట్లయితే వారు ఆధార్ సంఖ్యను పొందడానికి అనర్హులు.
అంటే - బ్యాంకు అకౌంట్ల ధృవీకరణ, సిమ్ కార్డులు లేదా పాన్ కార్డులను ఆధార్‌తో అనుసంధానించే విషయంలో వారికి మినహాయింపు ఉంటుంది.

సుప్రీంకోర్టులో కేసు ఇంకా పెండింగ్‌లో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏదైనా సంస్థ నా ఆధార్ వివరాలు ఇవ్వమని కోరడం చట్టబద్ధమా?
ప్రస్తుతం ఏవైనా సేవలను ఆధార్‌తో అనుసంధానించడం కోసం విధించిన డెడ్ లైన్‌ను సుప్రీంకోర్టు నిరవధికంగా పొడిగించింది.
అందువల్ల ఏదైనా సంస్థ ఆధార్ వివరాలు అడగడం చట్టబద్ధమే కానీ, అది సరైనది కాదు అని పాహ్వా అన్నారు.
''ప్రైవేట్ సంస్థలు ఆధార్ వివరాలను కోరవచ్చు కానీ దానిని నిరాకరించే హక్కు మీకు ఉంటుంది'' అన్నారు పాహ్వా.
కానీ దీని వల్ల ఆయా సంస్థలు తమ సేవలను నిరాకరించవచ్చు.
టెలికాం ఆపరేట్లర కోసం టెలికమ్యూనికేషన్ శాఖ అన్ని మొబైల్ నెంబర్లూ ఆధార్‌తో లింక్ అయి ఉన్నాయో లేదో నిర్ధారించుకోమని ఆదేశించింది.
మొబైల్ నెంబర్లు.. చిన్న చిన్న డిజిటల్ చెల్లింపులు, మొబైల్ వాలెట్లు మొదలైన పౌరసేవలకు గుర్తింపుగా ఉపయోగపడుతున్నాయి. అందువల్ల వాటిని నిర్ధారించుకోవడం అవసరం.
''నా అభిప్రాయం ప్రకారం ఆధార్ అనేది ఐచ్ఛికంగా, మార్చుకోదగినదిగా ఉండాలి. దానిని బయోమెట్రిక్స్‌తో జతపరచరాదు. అంతే కాకుండా, ఆధార్‌ను రద్దు చేసుకునే అవకాశం కూడా ఉండాలి'' అన్నారు పహ్వా.
అయితే యూఐడీఏఐ వెబ్‌సైట్ ప్రకారం, ఆధార్‌ను రద్దు చేసుకొనే అవకాశం లేదు. ఆధార్ సంఖ్య కలిగిన వారు తమ బయోమెట్రిక్స్‌ను యూఐడీఏఐ వెబ్‌సైట్‌పై 'లాక్/అన్ లాక్ బయోమెట్రిక్స్' అన్న ట్యాబ్ ద్వారా భద్రపరచుకోవచ్చు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








