పెళ్లి కానుకగా పార్సిల్ బాంబును ఎవరు పంపారు? ఈ నూతన వరుడిని ఎవరు చంపారు?

ఆ జంటకు పెళ్లై ఐదు రోజులైంది. ఐదో రోజు వివాహ కానుకగా వచ్చిన ఒక పార్సిల్ బాంబు పేలి భర్త చనిపోయాడు. భార్య తీవ్రగాయాల పాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
ఒడిషాలోని ఒక చిన్న పట్టణంలో ఈ ఘటన జరిగి నెల రోజులు దాటిపోయింది. కానీ.. ఆ పార్సిల్ బాంబు పంపించింది ఎవరు? అతడిని చంపింది ఎవరు అనేది పోలీసులు ఇంతవరకూ కనుక్కోలేకపోయారు. అసలేం జరిగిందనే దానిపై బీబీసీ ప్రతినిధి సౌతిక్ బిస్వాస్ అందిస్తున్న కథనం.
ఒడిషాలోని ఒక చిన్న పట్టణం పట్నాగఢ్. సౌమ్యశేఖర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. వయసు 26 ఏళ్లు. అతడి భార్య రీమా వయసు 22 ఏళ్లు. శేఖర్ కొత్తగా కట్టుకున్న ఇంటిలో ఫిబ్రవరి 23వ తేదీ మధ్యాహ్నం భార్యాభర్తలిద్దరూ కిచెన్‌లో వంట చేసేందుకు సిద్ధమవుతున్నారు. అప్పటికి ఐదు రోజుల కిందటే వారిద్దరికీ పెళ్లయింది.
అంతలో ఇంటి గేటు కొట్టిన చప్పుడైంది. శేఖర్ వెళ్లి చూశాడు. ఒక డెలివరీ మ్యాన్ చేతిలో పార్సిల్ పట్టుకుని ఉన్నాడు. దాని మీద శేఖర్ పేరు, చిరునామా ఉంది.
ఆ పార్సిల్ బాక్స్ పైన అరిగిపోయిన స్టికర్ మీద.. రాయ్‌పూర్ నుంచి ఎస్.కె.శర్మ అనే వ్యక్తి దీనిని పంపించినట్లు ఉంది. పట్నాగఢ్ నుంచి రాయ్‌పూర్ 230 కిలోమీటర్ల దూరం.
కిచెన్‌లో తన భర్త ఆ బాక్స్‌ను ఓపెన్ చేయటం, అందులో ఆకుపచ్చ రంగు కాగితం చుట్టివున్న మరొక పార్సిల్, ఆ పార్సిల్ నుంచి తెల్లని దారం వేలాడుతుండటం రీమాకు గుర్తుంది. ఆ పార్సిల్‌లో ఏముందో చూడాలన్న కుతూహలంతో శేఖర్ నానమ్మ 85 ఏళ్ల జెమామని సాహు కూడా వారి దగ్గరికి వచ్చారు.
‘సర్‌ప్రైజ్ గిఫ్ట్’
‘‘ఇది పెళ్లి కానుక లాగా కనిపిస్తోంది. కానీ ఇది పంపిన వారు నాకు తెలియదు. రాయ్‌పూర్‌లో నాకు తెలిసిన వారు ఎవరూ లేరు’’ అని శేఖర్ తన భార్యతో చెప్పాడు.
ఆ పార్సిల్ మీద ఉన్న దారం లాగాడతడు. అంతే పెద్ద మెరుపుతో కూడిన భారీ పేలుడుతో వంట గది దద్దరిల్లిపోయింది. ముగ్గురూ రక్తమోడుతూ ఎగిరిపడ్డారు. గది పైకప్పు ప్లాస్టర్ ఊడిపోయింది. వాటర్ ప్యూరిఫయర్ ముక్కలుగా పేలిపోయింది. వంట గది తలుపు ఊడి దూరంగా పడిపోయింది. గోడలు పగుళ్లిచ్చాయి.
రక్తసిక్తమైన నేల మీద ఆ ముగ్గురూ బాధతో విలవిల్లాడారు. జెమామని సాహుకు మంటలు అంటుకున్నాయి. ‘‘నన్ను కాపాడండి. నేను చనిపోతున్నట్లుంది’’ శేఖర్ మాటలు కూడబలుక్కుని అంటూనే స్పృహ తప్పాడు.

రీమా తన భర్త మాట్లాడుతుండగా వినటం అదే ఆఖరు.
ఆమె ముఖానికి, చేతులకు మంటలు అంటుకున్నాయి. ఊపిరితిత్తుల్లో పొగ నిండిపోవటంతో శ్వాస తీసుకోవటానికి చాలా కష్టపడింది. ఆమె కర్ణభేరికి చిల్లుపడింది. పేలుడు శబ్దానికి పొరుగువారు కంగారుగా పరిగెత్తి వస్తున్న శబ్దం కానీ, గ్యాస్ సిలిండర్ పేలిందా అని వారు అడుగుతున్న మాటలు కానీ ఆమెకు వినిపించలేదు. పేలుడులో రేగిన చెత్త ఆమె కళ్లలో పడటంతో చూపు కూడా అస్పష్టంగా ఉంది.
అప్పటికీ రీమా నేల మీద పాకుతూ బెడ్‌రూమ్ వరకూ వెళ్లగలిగింది. స్థానికంగా ఒక కాలేజీలో ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్న తన అత్తగారికి ఫోన్ చేయటం కోసం ఫోన్ తీసుకోగలిగింది. కానీ ఫోన్ చేయటానికి ముందే స్పృహ కోల్పోయింది.
పేలుడు జరిగిన కొన్ని నిమిషాల తర్వాత ఆ ఇంట్లో చిత్రీకరించిన వీడియో దృశ్యాల్లో.. గాయపడిన ఈ ముగ్గురినీ పొరుగువారు దుప్పట్లలో అంబులెన్సుల్లోకి చేర్చటం కనిపించింది. సౌమ్యశేఖర్, జెమామని సాహులకు 90 శాతం కాలిన గాయాలవటంతో ఆస్పత్రికి చేరే లోపే చనిపోయారు. రీమా ఒక ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ ఇరుకైన గదిలో నెమ్మదిగా కోలుకుంటోంది.
ఈ కిరాతక హత్య జరిగి నెల రోజులు గడిచిపోయాయి. ‘ఒక గురువును ఆరాధించే దైవభక్తి గల శాంత మనస్కుడ’ని బంధువులు, స్నేహితులు అభివర్ణించే సౌమ్యశేఖర్‌ను చంపింది ఎవరు అనేది ఇప్పటికీ లేశమాత్రంగానైనా ఏ ఒక్కరూ కనుక్కోలేకపోయారు.

’’మేం సాధారణ జీవితాలు గడిపే మామూలు మనుషులం. నాకు శత్రువులెవరూ లేరు. నా కూతురుకు శత్రువులెవరూ లేరు. నా అల్లుడికి శత్రువులెవరూ లేరు. ఎవరి మీదా నాకు అనుమానం లేదు. ఈ పని ఎవరు చేసి ఉంటారనేది నాకు తెలీదు’’ అని రీమా తండ్రి సుదామ్ చరణ్ సాహు నాతో పేర్కొన్నారు.
శేఖర్, రీమాలను పరస్పరం పరిచయం చేసింది వారి వారి కుటుంబాలే. వారిద్దరికీ ఏడాది కన్నా ముందే నిశ్చితార్ధం జరిగింది. రీమా తండ్రి ఒక వస్త్ర వ్యాపారి. ఆయనకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. కానీ ఒక కూతురు కూడా కావాలని.. తన తమ్ముడికి గల ముగ్గురు కూతుళ్లలో ఒకరైన రీమాను దత్తత తీసుకున్నాడు. ఎప్పుడూ ఉల్లాసంగా ఉండే ఆకర్షణీయమైన ఆ అమ్మాయి స్థానిక కాలేజీలో చదువుకుంది. ఒరియా భాషలో డిగ్రీ పూర్తిచేసింది.
శేఖర్ తల్లిదండ్రులిద్దరూ అధ్యాపకులే. అతడి తండ్రి జువాలజీ బోధించేవాడు. శేఖర్ కంప్యూటర్ సైన్స్ అభ్యసించాడు. మైసూర్, చండీగఢ్‌లలో ఐటీ కంపెనీల్లో పనిచేశాడు. రెండు నెలల కిందట బెంగళూరులో ఒక జపనీస్ ఎలక్ట్రానిక్స్ సంస్థలో చేరాడు.

‘‘వాళ్లిద్దరూ పెళ్లికి ముందు మా కుటుంబాల సమక్షంలో పలుమార్లు కలుసుకున్నారు. ఆ జంట చాలా సంతోషంగా ఉండేది. ఎవరైనా అతడిని ఎందుకు చంపాలనకుంటారు?’’ అంటారు శేఖర్ తండ్రి 57 ఏళ్ల రబీంద్రకుమార్ సాహు.
అనుమానాస్పదంగా తోస్తున్న అంశం ఒక్కటే కనిపిస్తోంది. అది.. శేఖర్ బెంగళూరులో ఉన్నప్పుడు అతడికి వచ్చిన ఒక అంతుచిక్కని ఫోన్.
‘‘ఆ ఫోన్ కాల్ గత ఏడాది వచ్చింది. మేమిద్దరం ఫోన్‌లో మాట్లాడుకుంటున్నాం. ఏదో ఫోన్ వస్తోందని శేఖర్ నాతో చెప్పాడు. నన్ను హోల్డ్‌లో ఉంచటం, ఆ తర్వాత ‘నాకో బెదిరింపు కాల్ వచ్చింది. నన్ను పెళ్లి చేసుకోవద్దని ఆ ఫోన్ చేసిన వ్యక్తి అంటున్నాడు’ అని నాకు చెప్పటం లీలగా గుర్తుంది’’ అని రీమా నాతో పేర్కొన్నారు.
‘‘అలాంటి ఫోన్ కాల్స్ ఇంకా ఏమైనా వచ్చాయా అనేది అతడు ఎప్పుడూ చెప్పలేదు. మా పెళ్లయ్యే సమయానికి ఆ ఫోన్ కాల్ గురించి మేం పూర్తిగా మరచిపోయాం’’ అని ఆమె చెప్పారు.
పోలీసు అధికారులు, సిబ్బంది రెండు డజన్ల మంది దర్యాప్తు చేశారు. ఈ హత్యతో ముడిపడి ఉన్న నాలుగు నగరాల్లో 100 మందికి పైగా ఈ కొత్త జంటకు చెందిన స్నేహితులు, బంధువులను ప్రశ్నించారు. ఈ దంపతుల మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్లను క్షుణ్నంగా పరిశీలించారు.
ఈ పార్సిల్‌ను ఇక్కడికి 119 కిలోమీటర్ల దూరంలోని కలహండి జిల్లాలోని ఒక ప్రైవేట్ కంప్యూటర్ ఇన్‌స్టిట్యూట్ నుంచి రెండు సార్లు ఆన్‌లైన్‌లో ట్రాక్ చేసినట్లు పోలీసులు గుర్తించినపుడు.. హంతకుడు ఆ పార్సిల్ మీద ఓ కన్ను ఉంచాడని, తద్వారా ఆధారం లభించిస్తుందని భావించారు. కానీ.. ఆ పార్సిల్‌ను ట్రాక్ చేస్తోంది సదరు కొరియర్ కంపెనీయేనని దర్యాప్తులో తేలింది.
అది నాటు బాంబు?
ఈ పార్సిల్‌ను రాయ్‌పూర్ నుంచి నకిలీ పేరు, చిరునామాతో పంపించారన్నది మాత్రమే పోలీసులకు కచ్చితంగా తెలిసిన సమాచారం. ఈ పార్సిల్ డెలివరీ కోసం హంతకుడు 400 రూపాయలు చెల్లించాడు. అయితే అతడు కొరియర్ కంపెనీని చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకున్నాడు. అక్కడి ఆఫీస్‌లో సీసీటీవీ కెమెరాలు లేవు. పార్సిల్‌ను స్కాన్ చేయలేదు.
ఆ తర్వాత ఈ పార్సిల్ మూడు బస్సులు, నాలుగు జతల చేతులు మారి 650 కిలోమీటర్లు ప్రయాణించి ఫిబ్రవరి 20వ తేదీన పట్నాగఢ్ చేరింది. డెలివరీ మ్యాన్ అదే రోజు సాయంత్రం పార్సిల్ ఇవ్వటానికి శేఖర్ ఇంటికి వెళ్లాడు. కానీ ఆ ప్యాకేజీ ఇవ్వకుండానే వెనుతిరిగాడు. ఎందుకంటే.. ‘‘ఆ ఇంట్లో భారీ మ్యారేజ్ రిసెప్షన్ జరుగుతుండటం చూశాడు’’ అని సదరు కొరియర్ కంపెనీ లోకల్ మేనేజర్ దిలీప్‌కుమార్‌దాస్ చెప్పాడు. మూడు రోజుల తర్వాత సదరు డెలివరీ మ్యాన్ ఆ పార్సిల్‌ను డెలివరీ చేశాడు.
ఆ పార్సిల్ బాంబు ఎలాంటిది అనేది నిర్ధారించటానికి ఫోరెన్సిక్ నిపుణులు ఇంకా ప్రయత్నిస్తున్నారు. ప్రాధమికంగా చూస్తే.. అది పురికొసలో చుట్టిన నాటు బాంబులాగా కనిపిస్తోందని, పేలుడు తర్వాత తెల్లటి పొగను వెదజల్లిందని దర్యాప్తు అధికారులు చెప్తున్నారు.

ఈ కేసులో బలమైన ఆధారాలు కనిపించటం లేదు కాబట్టి.. ఈ హత్యకు గల కారణాలు ఏమయివుంటాయనే అంశం మీద దర్యాప్తు అధికారులు దృష్టి సారించారు.
ఇది తిరస్కరణకు గురైన లేదా నిరాదరణకు గురైన లవర్ (ప్రేమికుడు లేదా ప్రేమికురాలు) పనా? పోలీసులకు ఇంతవరకూ అర్థం కాలేదు. అయితే శేఖర్ తన పెళ్లికి కొన్ని వారాల ముందు ఎందుకు తన ఫేస్‌బుక్ ఖాతాను డిలిట్ చేసి, కొత్త అకౌంట్ ఓపెన్ చేశాడు? అనే అంశంపై వారు దర్యాప్తు చేస్తున్నారు.
శేఖర్ ఒక్కడే కొడుకు, సహజ వారసుడు అయిన సాహు కుటుంబంలో ఆస్తి గొడవకు ఈ హత్యకు సంబంధం ఉందా? ఏవైనా నిర్ధారణలకు వచ్చే ముందు కుటుంబ సభ్యులు మరింత మందిని తాము ప్రశ్నించాల్సి ఉంటుందని దర్యాప్తు అధికారులు అంటున్నారు.
రీమా సెకండరీ స్కూల్‌లో ఉన్నప్పుడు జరిగిన ఒక గొడవతో ఈ హత్యకు సంబంధం ఉందా? ఆ స్కూల్‌లో రీమాను ఒక క్లాస్‌మేట్ వేధించినపుడు ఆమె తల్లిదండ్రులు ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేశారు. కానీ ఆ ఘటన ఆరేళ్ల కిందట జరిగింది కావటంతో ఆ గొడవకు ఈ హత్యకు సంబంధం ఉండే అవకాశం అతి స్వల్పంగా ఉన్నట్లు కనిపిస్తోంది.

అలాగే.. ఈ బాంబును పంపించిన వ్యక్తికి.. ఈ బాంబును సంపాదించటం, ప్యాక్ చేయటం, తన టార్గెట్‌కు పంపించటం అంత సులభంగా చేయటం ఎలా సాధ్యమైంది? ‘‘ఇది చాలా సంక్లిష్టమైన కేసు. ఇది బాంబుల తయారీలో ప్రావీణ్యమున్న నిపుణుడి పని’’ అంటారు బాలాంగిర్ సీనియర్ పోలీస్ అధికారి శశిభూషణ్ సత్పతి.
రీమా ఇంకా ఆస్పత్రిలోనే ఉంది. ఆమె ఎదుర్కొంటున్న విషాదం సోమవారం ఓ సంచలనంగా మారింది. ఆస్పత్ర గదిలో ఉన్న ఒక పాత వార్తాపత్రిక చూసి తన భర్త చనిపోయాడన్న విషయం తెలుసుకుని హతాశురాలైన రీమా గుండె చెదిరేలా విలపిస్తున్న దృశ్యాన్ని ఆమె కుటుంబ సభ్యులొకరు మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించారు. శేఖర్ చనిపోయిన విషయాన్ని రీమాకు ఆమె కుటుంబ సభ్యులు మూడు వారాల పాటు చెప్పలేదు. ఇప్పుడామెను ఓదార్చటం ఎవరితరం కావటంలేదు.
‘‘మీరు నాకు అబద్ధం చెప్పారు. నాకు నిజం చెప్పలేదు’’ అంటూ ఆమె తన తండ్రి వద్ద కూలబడి విలపించారు. ఆ సాయంత్రానికి ఈ వీడియో స్థానిక టీవీ చానల్‌లో ప్రసారమైంది.
‘‘దీని ద్వారా అయినా ప్రభుత్వం స్పందిస్తుందని, దర్యాప్తును ముమ్మరం చేసి దోషిని త్వరగా పట్టుకుంటుందని మేం భావించాం. మేం కోరుకుంటున్నది అంతే’’ అన్నారు ఆమె తండ్రి.
ఇవి కూడా చూడండం:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








