ఈ ఇంజెక్షన్ తీసుకుంటే 3 నెలలు గర్భం రాదు

నేను గర్భ నిరోధక మాత్ర వేసుకుంటున్న ప్రతీసారీ నా భర్త కళ్లలో ఏదో అనుమానం.
ఆ అనుమానం పడక గదిలో అతని ఆసక్తిని ఎంతోకొంత చంపేస్తోంది.
ఆయన ప్రవర్తనతో నేను కూడా ఇబ్బంది పడుతున్నా.
దింపి అనే మహిళకు ప్రతీరోజు రాత్రి ఎదురయ్యే బాధ ఇది.
ఈ పరిస్థితి వచ్చినప్పుడల్లా గర్భం దాల్చడానికి సిద్ధంగా ఉన్నానా అని ఆమె తనను తానే ప్రశ్నించుకునేది.

ఆమెకు ఏడాది క్రితమే పెళ్లైంది.
వైవాహిక జీవితం ఆనందంగా సాగడానికి శృంగారం ఎంత అవసరమో ఆమెకు అర్ధమైంది.
అదే సమయంలో గర్భ నిరోధక మాత్రలు వేసుకోవడం వల్ల ఆ ఆనందం ఎంతోకొంత ప్రభావితం అవుతోందన్న విషయం కూడా ఆమె గ్రహించింది.
ఈ సమస్యకు పరిష్కారం కనిపెట్టాలనే ఉద్దేశంతో ఆమె ఒక గైనకాలజిస్టును సంప్రదించారు.
అప్పుడే ఆమెకు గర్భ నిరోధక ఇంజెక్షన్ గురించి తెలిసింది.

ఫొటో సోర్స్, Thinkstock
గర్భ నిరోధక ఇంజెక్షన్ అంటే ఏమిటి?
మూడు నెలల పాటు గర్భం రాకుండా మహిళలు ఈ ఇంజెక్షన్ వాడొచ్చు.
దీన్ని డీఎంపీఏ ఇంజెక్షన్ అంటారు. అంటే 'డిపోమెట్రోక్సీ ప్రొజెస్టెరాన్ అసిటేట్'అని అర్ధం.
ఇందులో ప్రొజెస్టెరాన్ హార్మోన్ ఉంటుంది.
డాక్టర్ బాసాబ్ ముఖర్జీ ప్రకారం ఈ ఇంజెక్షన్ మూడు రకాలుగా పనిచేస్తుంది.
- ఇది మహిళ శరీరంలోని అండంపై ప్రభావం చూపిస్తుంది.
- వీర్యం గర్భాశయంలోకి వెళ్లకుండా ఒక అడ్డుగోడను తయారు చేస్తుంది.
- ఈ రెండు కారణాల వల్ల పిండం తయారు కాదు.
ఈ ఇంజెక్షన్ ధర రూ.50 నుంచి రూ.250 వరకు ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
గర్భ నిరోధక ఇంజెక్షన్లపై అపోహలు
ఇతర దేశాల్లో ఈ గర్భ నిరోధక ఇంజెక్షన్లను ఎన్నో ఏళ్లుగా వాడుతున్నారు.
1990ల్లో భారత దేశంలోనూ ఈ ఇంజెక్షన్‌ను ఉపయోగించేందుకు అనుమతి ఇచ్చారు.
అయినప్పటికీ, భారత ప్రభుత్వం పంపిణీ చేసే కుటుంబ నియంత్రణ కిట్‌లలో ఈ ఇంజెక్షన్ ఇవ్వడం లేదు.
గర్భ నిరోధక ఇంజెక్షన్ వాడితే మహిళల ఎముకలు బలహీన పడతాయని, కేన్సర్ వచ్చే అవకాశాలు పెరుగుతాయని చాలామంది అనుకుంటారు.
ఈ కారణంతో మహిళలు ఈ ఇంజెక్షన్లు వాడటానికి ఇష్టపడరు.

ఫొటో సోర్స్, Getty Images
కానీ ఇవన్నీ అపోహలేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ - డబ్ల్యూహెచ్‌ఓ నివేదిక చెబుతోంది.
ఈ ఇంజెక్షన్ దీర్ఘకాలం వాడితే మహిళల ఎముకలు బలహీనపడటం నిజమే. కానీ ఇంజెక్షన్ వాడటం మానేసిన తర్వాత తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటాయని డబ్ల్యూహెచ్‌ఓ నివేదికను ఉటంకిస్తూ డాక్టర్ రవి ఆనంద్ చెప్పారు.
మహిళల్లో కేన్సర్ ముప్పు కూడా తగ్గుతుందని డాక్టర్ రవి చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
గర్భ నిరోధక ఇంజెక్షన్ ఉపయోగాలు
గర్భ నిరోధక ఇంజెక్షన్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని డాక్టర్ బాసాబ్ ముఖర్జీ చెప్పారు.
- ప్రతీరోజు గర్భ నిరోధక మాత్ర వేసుకోవాల్సిన అవసరం ఉండదు.
- ఇది వాడితే గర్భం దాల్చే అవకాశాలు దాదాపు సున్నా.
- బిడ్డ పుట్టిన తర్వాత కూడా ఈ ఇంజెక్షన్ వాడొచ్చు.
కొందరు గర్భ నిరోధక మాత్రలు రహస్యంగా వేసుకుంటారు. అలాంటి వారికి ఈ ఇంజెక్షన్ చాలా మంచి పద్ధతి.

ఫొటో సోర్స్, PA
ఈ ఇంజెక్షన్ వాడిన తర్వాత కొందరు మహిళల్లో నెలసరి సమయంలో రక్తస్రావం తగ్గింది. దాంతో మహిళల్లో రక్తహీనత రాదని వైద్యులు చెబుతున్నారు.
ముఖ్యంగా ఈ ఇంజెక్షన్ వల్ల గర్భం దాల్చే అవకాశాలు దాదాపు ఉండవు.
అంతేకాదు, ఇంజెక్షన్ విరామ సమయం కూడా చాలా తక్కువ.
మూడు నెలల గడువు ముగిసిన తర్వాత నాలుగు వారాల విరామంతో మరో ఇంజెక్షన్ తీసుకోవచ్చు.
ఇంజెక్షన్‌కు ఇంజెక్షన్‌కు మధ్య ఉన్న ఈ నాలుగు వారాల్లో గర్భం దాల్చడం జరగదు.

జాతీయ కుటుంబ సర్వే - 4 ప్రకారం దేశవ్యాప్తంగా 145 జిల్లాల్లో సంతానోత్పత్తి రెటు 3 కంటే ఎక్కువగా ఉంది.
అంటే ఈ జిల్లాల్లో ఒక్కో మహిళ సగటున ముగ్గురు కంటే ఎక్కువ మంది పిల్లలకు జన్మనిస్తోంది.
'మేమిద్దరం-మాకిద్దరు' అనే ప్రభుత్వ విధానానికి ఇది విరుద్ధం.
ఈ 145 జిల్లాలు బిహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, జార్ఖండ్, ఒడిసా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఉన్నాయి.
అందుకే భారత ప్రభుత్వం ఈ రాష్ట్రాల్లో పంపిణీ చేసే గర్భ నిరోధక కిట్‌లలో ఈ ఇంజెక్షన్లను కూడా చేర్చింది. వాటిని ఉచితంగా పంపిణీ చేస్తోంది.
ఇవి కూడా చదవండి:
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.








