అక్కడ మహిళలు మగవాళ్ల ముందు చెప్పులు తీసి చేతిలో పట్టుకోవాల్సిందే!

ఫొటో సోర్స్, Aarju Aalam/BBC
- రచయిత, ఆర్జూ ఆలమ్
- హోదా, బీబీసీ కోసం, చంబల్‌లోని అమేఠ్ గ్రామం నుంచి
తెలంగాణ సహా చాలా రాష్ట్రాల్లో కొన్ని దశాబ్దాల క్రితం దొరల గడీల ముందు నుంచి వెళ్లేటప్పుడు కాళ్లకున్న చెప్పులు తీసి నడిచే వారనే విషయం మనం విని ఉన్నదే. అలాంటి ఆచారాలు చాలా వరకు చరిత్రలో మరుగున పడిపోయాయి.
కానీ మధ్యప్రదేశ్‌లోని ఓ ప్రాంతంలో పురుషుల ముందు మహిళలు చెప్పులు విడిచి చేతిలో పట్టుకోవడమనే ఆచారం నేటికీ కొనసాగుతున్నదంటే ఆశ్చర్యం కలిగించక మానదు.
చంబల్ డివిజన్‌లో అమేఠ్ అనే గ్రామంలో మహిళలు ఇప్పటికీ పురుషులు ఎదురైతే చాలు చెప్పులు తీసి చేతిలో పట్టుకొని ఉత్త కాళ్లతో నడుస్తారు.
దాదాపు 1200 జనాభా ఉన్న ఈ గ్రామంలో మహిళల సంఖ్య ఐదొందల దాకా ఉంటుంది. తెల్లవారగానే అమేఠ్ మహిళలు నీటి కోసం ఖాళీ పాత్రలు తీసుకొని గ్రామానికి కిలోమీటరున్నర దూరంలో ఉన్న వాగు వద్దకు బయలుదేరుతారు.
ఇంటికి అవసరమయ్యే నీటి కోసమే రోజుకు 7-8 గంటలు శ్రమించి అలసిపోయే శశిబాయి తనకు కుటుంబంలోనూ, గ్రామంలోనూ దక్కాల్సిన గౌరవం దక్కడం లేదని వాపోయారు.

ఫొటో సోర్స్, Aarju Aalam/BBC
ఒక చేతిలో చెప్పులు... మరో చేతిలో సామాన్లు..
"తలపై నీటి కుండ లేదా గడ్డిమోపు పెట్టుకొని మేం ఊళ్లోకి ప్రవేశించగానే చావడిలో కూర్చున్న పెద్దల ముందు నుంచి నడవాలంటే కాళ్లకున్న చెప్పులు విడిచెయ్యాల్సిందే. ఒక చేతితో తలపై ఉన్న మూటను పట్టుకొని మరో చేత్తో చెప్పులు పట్టుకోవాల్సి రావడంతో నడకలో కొన్ని సార్లు బ్యాలెన్స్ తప్పుతుంది" అని శశిబాయి అన్నారు.
"ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న ఈ ఆచారాన్ని మేమెలా మార్చగలం? ఒకవేళ మేం దాన్ని మారిస్తే అత్తామామలు, భర్త, మరదులు వీళ్లు ఎలాంటి కోడళ్లని అంటూ ఎగతాళి చేస్తారు. మాకు మంచి లక్షణాలు లేవని, బుద్ధి లేదని, పెద్దవాళ్లను గౌరవించడం తెలియదని, చెప్పులు తొడుక్కొని ఎగురుతున్నారని... రకరకాలుగా సూటిపోటి మాటలంటారు" అని శశిబాయి చెప్పారు.
గ్రామ చావడి దగ్గర పులి-బోను ఆడుతున్న మగవాళ్లను ఈ విషయం అడిగినప్పుడు 'ఇది మా తాతముత్తాల నుంచి వస్తున్న రివాజు' అని అన్నారు.
"మగవాళ్లను గౌరవించడం కోసం మహిళలు చెప్పులు తొడుక్కొని నడవకుండా ఉండాల్సిందే" అని వారన్నారు.

ఫొటో సోర్స్, Aarju Aalam/BBC
ఏ కాలమైనా.. ఏ కులమైనా
తెల్లటి గుబురు మీసాలున్న 65 ఏళ్ల గోవింద్ సింగ్ ఏ మాత్రం దాపరికం లేకుండా ఇలా వివరిస్తారు: "మహిళలందరూ ఈ ఆచారాన్ని ఇష్టంగా, సంతోషంగా పాటిస్తారు. మేం వారిని ఇందుకు బలవంతపెట్టం. నేటికీ మహిళలు మమ్మల్ని దూరం నుంచి చూడగానే చెప్పులు విడిచి చేతులో పట్టుకుంటారు. ఎప్పుడైనా తోవలో ఎదురైతే చెప్పులు తీసేసి పక్కకు తొలగి నిలబడతారు."
వర్షాకాలంలో బురదతో నిండిన వీధుల్లో నడవాలన్నా, గడ్డ కట్టుకుపోయే చలిలోనైనా, మండే ఎండల్లోనైనా ప్రతి సీజన్‌లోనూ మహిళలు ఈ ఆచారాన్ని పాటించాల్సిందే.
చుట్టుపక్కల గ్రామాలన్నింట్లోనూ ఈ ఆచారం కొనసాగుతోందని ఆదర్శ్ ఫౌండేషన్ అనే ఎన్‌జీవోలో పని చేస్తున్న ఝరియాదేవి అనే కార్యకర్త తెలిపారు. తాను ఇప్పటికీ తమ వాడకు వెళ్తే చెప్పులు తీసి చేతిలో పట్టుకుంటానని ఆమె చెప్పారు.
"మొదట్లో ఈ కట్టుబాటు కేవలం 'కింది' కులాల మహిళలకు మాత్రమే ఉండేది. అయితే 'కింది' కులాల మహిళలు దీనిపై అసంతృప్తి వెళ్లగక్కడం మొదలవడంతో దీనిని 'పై' కులాల మహిళలకు కూడా అనివార్యం చేశారు" అని ఝరియాదేవి చెప్పారు.

ఫొటో సోర్స్, Aarju Aalam/BBC
కట్టుబాటుపై యువతలో అసంతృప్తి
పట్టణాల వాసనలు సోకిన యువజనులు మాత్రం ఈ కట్టుబాటును పక్షపాతమైందని భావిస్తున్నారు.
"ఎవరైనా మహిళ చెప్పులు తొడుక్కొని మందిరం ముందు నుంచి నడిస్తే ఫలానా ఇంటి కోడలు అవమానకరంగా ప్రవర్తించిందని ఊరంతా చెప్పుకుంటారు. కానీ గ్రామంలోని పురుషులు మాత్రం చెప్పులు తొడుక్కొనే మందిరం ముందున్న చావడి దగ్గర కూర్చొని పేకాట ఆడుతుంటారు. అయినా దీంతో దేవుడికి అవమానం జరిగినట్టు కాదు" అని రమేశ్ అన్నారు.
అయితే ఇదే మాట గ్రామ పెద్దల ముందు అనడానికి రమేశ్ భయపడతారు. అయితే మీడియా ద్వారా ఈ విషయంపై చర్చ మొదలైతే ఈ కట్టుబాటు లేకుండా పోతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Aarju Aalam/BBC
ఇదీ ఒక సమస్యేనా?
తమ జిల్లాలో ఇలాంటి కట్టుబాటు ఒకటి అమలులో ఉందనే విషయం తనకు తెలియదని శ్యోపోర్ జిల్లా కలెక్టర్ పన్నాలాల్ సోలంకి అన్నారు. అయితే, దీని గురించి తెలుసుకుంటాననీ, ఒకవేళ తన ప్రాంతంలో ఇది అమలులో ఉన్నట్టయితే దానిని ఆపేందుకు ప్రయత్నిస్తానని ఆయన చెప్పారు.
ఈ గ్రామానికి ఉత్తరాన ఉన్న ఆదివాసీ పల్లెలో కూడా పురుషుల ముందు మహిళలు చెప్పులు విడిచే ఆచారం అమలులో ఉంది.
నేను మహిళలతో మాట్లాడటం చూసిన ఓ ఆదివాసీ యువకుడు ఆవేశంగా ఇలా అన్నాడు, "ఇది మా పెద్దలను గౌరవించే సాంప్రదాయం. మేం మా మహిళలను ఇంట్లో, బయటా చెప్పులు తొడుక్కోవడానికి అనుమతినివ్వం."
అయితే మహిళలు చెప్పులు తొడుక్కోవడంలో తప్పేముందని ఈ పల్లెలో కొందరు అభిప్రాయపడ్డారు.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








