కొత్త ఏడాదిలో కీలక మార్పులు ఇవే!

ఫొటో సోర్స్, Getty Images
2018 వచ్చేస్తోంది.! ఎన్నో మార్పులు తీసుకురాబోతోంది! కొత్త టెక్నాలజీ, కొత్త సంబరాలు, కొత్త ఆవిష్కరణలకు వేదిక కాబోతోంది.
భవిష్యత్‌లో ఏం జరగబోతోందో ముందే తెలుసుకోవడం ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది.
ఇప్పటి వరకు ఆలోచనలకు పరిమితమైన కొన్ని అంశాలు 2018లో కార్యరూపం దాల్చబోతున్నాయి.
ఎన్నో కొత్త ఆవిష్కరణలు అబ్బురపరచ బోతున్నాయి.
ఇంతకీ 2018లో చోటు చేసుకునే కీలక ఘటనలు, ఆవిష్కరణలు ఏమిటి?

ఫొటో సోర్స్, Getty Images
మగవారికి గర్భ నిరోధక మాత్రలు!
2018లో చోటు చేసుకునే కీలక పరిణామాల్లో ఇది ఒకటి. ఇప్పటి వరకు స్త్రీలకు మాత్రమే గర్భనిరోధక మాత్రలు ఉన్నాయి.
ప్రస్తుతం పురుషులు కూడా వాడే గర్భ నిరోధక మాత్రలపై పరిశోధనలు జరుగుతున్నాయి.
2018 ప్రారంభంలో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించబోతున్నారు.
'వాసల్‌జెల్' గా పిలుస్తున్న ఈ పిల్ వాడితే కండోమ్‌లు, వాసెక్టమీ చేయించుకోవాల్సిన అవసరం ఉండదు.
ఈ జెల్‌ను అమెరికా ఇల్లినాయిస్ యూనివర్శిటికి చెందిన ప్రొఫెసర్ డొనాల్డ్ వాలర్ కనిపెట్టారు.
కోతులు, కుందేళ్లపై జరిపిన పరిశోధనల్లో మంచి ఫలితాలు వచ్చాయని తెలిపారు.
ఇక మనుషులపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించి, మార్కెట్‌లోకి విడుదల చేయాలని భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
రోడ్లపై ఎలక్ట్రిక్ షి'కారు'!
ప్రస్తుతం డీజిల్, పెట్రోల్ కార్లదే హవా. కానీ 2018లో ఎలక్ట్రిక్ కార్లు రోడ్లపై షికారు చేయబోతున్నాయి. ఇప్పటికే ఎలక్ట్రిక్ కార్లు ఉన్నా.. 2018లో వీటి అమ్మకాలు బాగా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.
మొత్తం మార్కెట్ వాటాలో వీటి అమ్మకాలు కనీసం 4శాతం పెరుగుతాయని భావిస్తున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రిక్ కార్లకు చైనాలో విపరీతమైన డిమాండ్ ఉంటుందని లెక్కలు వేస్తున్నారు.
మొత్తం కార్ల మార్కెట్‌లో 4శాతం వాటా అంటే పెద్ద లెక్క కాదు. కానీ 2016తో పోలిస్తే ఇది చాలా ఎక్కువ.
అంతర్జాతీయ ఎనర్జీ ఏజెన్సీ నివేదిక ప్రకారం ఎలక్ట్రిక్ కార్ల విక్రయాల్లో కేవలం ఆరు దేశాలు మాత్రమే మొత్తం కార్ల మార్కెట్‌లో ఒక శాతం వాటా కలిగి ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
'చంద్రుడి చీకటిని ఛేదించనున్న చైనా'!
అందమైన చందమామను మనం ఒకవైపే చూస్తున్నాం. మరోవైపు ఏముందో, ఎలా ఉంటుందో అన్న కుతూహలం ప్రజలతో పాటు శాస్త్రవేత్తలకూ ఉంది.
చంద్రుడి గురించి ప్రపంచానికి తెలియని చీకటి కోణాన్ని 2018లో ఆవిష్కరిస్తామంటోంది చైనా.
చైనా ప్రయోగించిన చాంగ్ ఏ-4 రోవర్ 2018 చివరి కల్లా చంద్రుడిపై ల్యాండ్ కాబోతోంది.
చంద్రుడి చీకటి భాగంలో భౌగోళిక పరిస్థితులు ఎలా ఉన్నాయనే అంశంపై చాంగ్ ఏ-4 పరిశోధనలు చేయనుంది.
చైనాకు చందమామపైకి వ్యోమనౌకను పంపించడం ఇదే తొలిసారి కాదు.
2013లోనే చంద్రుడిపై రోవర్‌ను సాఫీగా దింపిన మూడో దేశంగా చైనా రికార్డు సృష్టించింది.

ఫొటో సోర్స్, Getty Images
చైనాను ఓవర్ టేక్ చేయనున్న భారత్!
2018లో చైనాను భారత్ దేశం ఓవర్ టేక్ చేయబోతోంది. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్థగా భారత్ నిలవబోతోందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది.
2018లో భారతదేశ జీడీపీ 7.2 శాతంగా ఉంటుందని, అదే చైనా ఆర్థిక వృద్ధి రేటు కేవలం 6.5శాతంగా ఉంటుందని లెక్కలు వేసింది.
ప్రస్తుతం ప్రపంచంలో భారతదేశానిది ఏడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ.
కేవలం పదేళ్లలో మూడో స్థానానికి చేరబోతోందని మెర్రిల్ లించ్ నివేదిక తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
గుడ్‌బై టు పోలియో!
2018లో పోలియోకు శాశ్వతంగా గుడ్ బై చెప్పే అవకాశం ఉంది.
20 ఏళ్ల క్రితం పోలియో 3,50,000 మందిని బలి తీసుకుంది.
2017 పోలియో కేసుల సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా 17కు తగ్గించగలిగారు.
2018లో ఈ వ్యాధిని పూర్తిగా అరికట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
వెండితెరపై వినోదాల విందు!
2018లో వెండితెరపై హాలీవుడ్ సినిమాలు కనువిందు చేయబోతున్నాయి.
ఆంట్ మెన్ స్టోరీకి సీక్వెల్ రాబోతోంది.
కెప్టెన్ మార్వెల్, అవెంజర్స్ సిరీస్‌లో మూడో చిత్రం విడుదలకు సిద్ధమవుతున్నాయి.
'అవతార్' అభిమానులను అలరించేందుకు ఆ చిత్రానికి సీక్వెల్ కూడా కొత్త సంవత్సరంలోనే ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
'స్టార్ వార్స్' అభిమానులకు రాన్ హవర్డ్ చిత్రం చూసే అదృష్టం కలగబోతోంది.
చిన్న పిల్లల కోసం ఫ్రొజెన్ సిరీస్‌లో 'లిటిల్ మాటర్' రాబోతోంది.
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








