2017: దంగల్ బాహుబలి.. రెండూ రెండే

- రచయిత, శరత్ బెహరా
- హోదా, బీబీసీ ప్రతినిధి
క్యాలెండర్‌లో పేజీలు వేగంగా చిరిగిపోతున్నాయి. కాలం 2017ను వడివడిగా దాటేసి 2018 వైపు అడుగేస్తోంది.
మానుషి చిల్లర్, బాహుబలి, ట్రిపుల్ తలాక్‌పై తీర్పు, క్రికెట్‌లో రికార్డులు.. 2017లో భారతీయులను సంతోషించేలా చేసిన అంశాలెన్నో ఉన్నాయి. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే ముందు, ఈ పాత విజయాలను ఓసారి గుర్తు చేసుకుందామా...

ఫొటో సోర్స్, Getty Images
అందానికి వందనం
మానుషి ఛిల్లర్.. నెలన్నర క్రితం ఈ పేరు చాలా కొద్ది మందికే తెలుసు. కానీ ఇప్పుడు ఆ పేరు, ఆమె అందం విశ్వవ్యాప్తమయ్యాయి. వివిధ దేశాలకు చెందిన 118 మంది సుందరీమణులతో పోటీపడి మానుషి ఛిల్లర్ ‘మిస్ వరల్డ్’ కిరీటాన్ని గెలుచుకుంది.
ఆ పోటీ చివరి రౌండ్లో.. ‘ప్రపంచంలో ఎక్కువ జీతం ఎవరికివ్వాలి?’ అనే ప్రశ్నకు ‘అమ్మకే ఇవ్వాలి’ అని చెప్పి ఆమె న్యాయ నిర్ణేతల మనసులనూ గెలుచుకొని టైటిల్‌ని కైవసం చేసుకుంది. హర్యానాకి చెందిన మానుషి ఛిల్లర్ ప్రస్తుతం మెడిసిన్ చదువుతోంది. పదిహేడేళ్ల తరవాత మానుషి భారత్‌కు ఆరో ‘మిస్ వరల్డ్’ టైటిల్‌ని అందించి సుదీర్ఘ ఎదురుచూపులకు తెర దించింది.

ఫొటో సోర్స్, ISRO
ఇస్రో ‘బాహుబలి’
‘బాహుబలి’కీ ఇస్రోకీ సంబంధం ఏంటనుకుంటున్నారా? ‘బాహుబలి’ లాంటి బలమైన రాకెట్‌ని ఈ ఏడాది ఇస్రో ప్రయోగించింది మరి. ఇస్రోకి చెందిన ‘పీఎస్ఎల్‌వీ-సీ37’ రాకెట్ రికార్డు స్థాయిలో ఏకంగా 104 శాటిలైట్లను అంతరిక్షంలో ప్రవేశపెట్టి అంతర్జాతీయ సమాజాన్ని ఆశ్చర్యంలో, భారతీయులను ఆనందంలో ముంచేసింది. అందుకే దాన్ని నెటిజన్లు ‘బాహుబలి’తో పోల్చారు.
ఆంధ్ర ప్రదేశ్‌లోని శ్రీహరికోట - సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఫిబ్రవరి 15న ఈ ప్రయోగం చోటు చేసుకుంది. అంతరిక్షంలోని వివిధ కక్ష్యల్లోకి విజయవంతంగా చేరిన 104 ఉపగ్రహాల్లో కేవలం మూడు మాత్రమే భారత్‌కు చెందినవి. మిగతా 101 ఉపగ్రహాలూ విదేశాలకు చెందినవే. ఇస్రో కంటే ముందు రష్యాకు చెందిన ‘నెప్ర్’ రాకెట్ అత్యధికంగా 37 ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెట్టింది.

ఫొటో సోర్స్, facebook/BaahubaliMovie
సాహోరే సినిమా!
ఈ ఏడాది రెండు భారతీయ చిత్రాలు ప్రపంచ స్థాయిలో భారత సినీ పరిశ్రమ స్టామినా ఏమిటో చూపించాయి. అందులో ఒకటి ‘బాహుబలి 2’, రెండు ‘దంగల్’. ఇందులో ‘దంగల్’ విడుదలైంది గతేడాది చివర్లో అయినా సంచలనాలు నమోదు చేసింది మాత్రం 2017లోనే. ప్రపంచ వ్యాప్తంగా రూ.2వేల కోట్లకు పైగా వసూలు చేసిన ‘దంగల్’, అత్యధిక వసూళ్లు రాబట్టిన భారతీయ చిత్రంగా చరత్ర సృష్టించింది.
అన్ని సినీ పరిశ్రమలనూ ఈ ఏడాది తనవైపు తిప్పుకున్న మరో చిత్రం ‘బాహుబలి 2’. ఎస్.ఎస్.రాజమౌళి తీసిన ఈ భారీ బడ్జెట్ చిత్రం వసూళ్లలోనూ తన సత్తా చాటింది. స్వదేశంలో దాదాపు రూ.1400 కోట్లు వసూలు చేసి భారత్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. నిజంగా బాహు ‘భళీ’ అనిపించింది.

ఫొటో సోర్స్, Twitter/dpradhanbjp
నింగిలో శుభాంగి
ఏ రంగంలోనైనా మొదటి అడుగు వేయడమే చరిత్ర. ఆ తరవాత పడే ఎన్ని అడుగులకైనా ఆ తొలి అడుగే ప్రేరణ. ఇటీవల భారత నావికా దళంలో అలాంటి చరిత్రనే సృష్టించారు శుభాంగి స్వరూప్. ఇండియన్ నేవీలో తొలి మహిళా పైలట్‌గా శుభాంగి నియమితులయ్యారు. నావికా దళానికి చెందిన సముద్రతల నిఘా విమానాన్ని శుభాంగి నడపనున్నారు.
శుభాంగితో పాటు మరో ముగ్గురు మహిళలు ‘నేవల్ ఆర్మమెంట్ ఇన్‌స్పెక్టరేట్’ (నాయ్)లో అధికారిణులుగా రంగ ప్రవేశం చేశారు. ఆ విభాగంలో మహిళలు పనిచేయడం కూడా ఇదే తొలిసారి. అలా నేవీలో ఈ ఏడాది ఈ నలుగురు మహిళలూ కొత్త చరిత్రకు తెరతీశారు.

ఫొటో సోర్స్, Getty Images
ఫుట్‌బాల్ కిక్ ఆఫ్
ప్రపంచంలో ఎక్కువ మంది ఆడే ఆట ఫుట్‌బాల్. అలాంటి క్రీడలో భారత ప్రదర్శన అంతంతమాత్రమే. ఫుట్‌బాల్‌లోనూ ఇతర దేశాలతో పోటీ పడాలని భారత క్రీడాకారులు ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తున్నా చెప్పుకోదగ్గ స్థాయిలో ఫలితాలు మాత్రం రావట్లేదు. అలాంటి సమయంలో భారత్‌లో నిర్వహించిన ఫిఫా అండర్-17 ఫుట్‌బాల్ వరల్డ్ కప్, మొత్తం దేశానికి కొత్త ఉత్సాహాన్నిచ్చింది.
భారత్‌లో జరిగిన తొలి ఫిఫా టోర్నీ ఇదే. ఈ టోర్నీకి రికార్డు స్థాయిలో 13.47లక్షల మంది ప్రేక్షకులు హాజరయ్యారు. టోర్నీలో భారత జట్టు అద్భుతాలు సృష్టించకపోయినా, ఈ ప్రపంచ కప్ నిర్వహణ భారత ఫుట్‌బాల్ రంగంలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది.

ఫొటో సోర్స్, Getty Images
ఇన్‌స్టెంట్ ట్రిపుల్ తలాక్‌కు చెల్లు
దశాబ్దాలుగా ఎంతో మంది ముస్లిం మహిళల వేదనకు కారణమైన విధానం.. ‘ఇన్‌స్టెంట్ ట్రిపుల్ తలాక్’. ఈ ఇస్లామిక్ ఆచారాన్ని రాజ్యాంగ విరుద్ధమని తీర్మానిస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం ఆగస్టులో చారిత్రక తీర్పుని వెలువరించింది.
ఐదుగురు సభ్యులున్న ధర్మాసనంలో ముగ్గురు జడ్జిలు ‘ఇన్‌స్టెంట్ ట్రిపుల్ తలాక్’ రాజ్యాంగ విరుద్ధమనీ , అది మహిళలపై వివక్ష చూపేదిగా ఉందనీ పేర్కొన్నారు. సుప్రీం కోర్టు ప్రకటించిన ఈ నిర్ణయం పట్ల దేశ ప్రజలు, ముఖ్యంగా ముస్లిం మహిళలు హర్షం వ్యక్తం చేశారు. పార్లమెంటులో ట్రిపుల్ తలాక్ బిల్లుని సైతం ప్రవేశ పెట్టడంతో దానికి సంబంధించిన చట్ట రూపకల్పనలో మరో ముందడుగు పడింది.
కానీ కొన్ని ముస్లిం మహిళా సంఘాలు, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్‌తో సహా కొన్ని రాజకీయ పార్టీలు మాత్రం ఆ బిల్లుని వ్యతిరేకిస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
భారత్ నం.1
ఎక్కువ మంది భారతీయులు ఇష్టపడే క్రీడ క్రికెట్. కోహ్లీ సిక్స్ కొట్టినా, బుమ్రా వికెట్ తీసినా అది తమ ఘనతేనన్నట్టు క్రీడాభిమానులు సంబర పడతారు.
అలాంటి అభిమానులను ఉత్సాహ పరిచే మరో అరుదైన మైలురాయిని భారత క్రికెట్ జట్టు ఈ ఏడాది తొలిసారి నమోదు చేసింది. సెప్టెంబరులో ప్రకటించిన ఐసీసీ ర్యాంకుల్లో అటు టెస్టులూ, ఇటు వన్డేల్లోనూ భారత్ నంబర్.1 స్థానాన్ని కైవసం చేసుకుంది. ఒకేసారి ఇలా రెండు ఫార్మాట్లలో తొలి స్థానంలో నిలవడం భారత జట్టుకి ఇదే మొదటిసారి.
కాగా, రోహిత్ శర్మ ఈ ఏడాది చివరలో వన్డేల్లో మూడో ద్విశతకం సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.
మిథాలీ సారథ్యంలో భారత మహిళా క్రికెట్ జట్టు ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరి రన్నరప్‌గా నిలిచింది.
ఫిబ్రవరిలో జరిగిన ‘2017 బ్లైండ్ వరల్డ్ టీ20’ క్రికెట్ టోర్నీని కూడా భారత అంధుల క్రికెట్ జట్టే గెలుచుకుంది.

ఫొటో సోర్స్, Getty Images
మరోపక్క బ్యాడ్మింటన్‌లో తెలుగు కుర్రాడు కిదాంబి శ్రీకాంత్ కొత్త చరిత్ర సృష్టించాడు. ఒక ఏడాదిలో నాలుగు సూపర్ సిరీస్ టైటిళ్లు గెలుచుకున్న తొలి భారతీయుడిగా రికార్డు నెలకొల్పాడు. ఇండొనేసియా, ఆస్ట్రేలియా, డెన్మార్క్, ఫ్రాన్స్ దేశాల్లో జరిగిన సూపర్ సిరీస్ టోర్నీల్లో శ్రీకాంత్ విజేతగా నిలిచాడు.

ఫొటో సోర్స్, Getty Images
ట్రాన్స్‌జెండర్ల ముందడుగు
ఎంతో కాలంగా దేశంలో సమానత్వం కోసం పోరాడుతున్న ట్రాన్స్‌జెండర్లు ఈ ఏడాది అనేక రంగాల్లో తమదైన ముద్ర వేశారు. పశ్చిమ బెంగాల్‌కి చెందిన జోయితా మోండల్ దేశంలో మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్ జడ్జిగా నియమితులై చరిత్ర సృష్టించారు.
తమిళనాడుకి చెందిన ప్రీతికా యాషిని దేశంలోనే తొలి ట్రాన్స్‌జెండర్ సబ్-ఇన్‌స్పెక్టర్‌గా ఉద్యోగాన్ని పొందారు. ‘తమిళనాడు యూనిఫామ్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు’ని కోర్టులో సవాలు చేసి మరీ యాషిని ఈ ఉద్యోగాన్ని దక్కించుకున్నారు.
దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ రంగ సంస్థ ‘కొచ్చీ మెట్రో రైల్ లిమిటెడ్’ 23మంది ట్రాన్స్‌జెండర్లకు ఉద్యోగం కల్పించింది. ఇలా 2017లో అనేక రంగాల్లో ట్రాన్స్‌జెండర్లు తమదైన ముద్ర వేస్తూ తమలాంటి మరెందరికో స్ఫూర్తినిస్తూ ముందుకెళ్లారు.
మా ఇతర కథనాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








