తొలిరాత్రి కన్యత్వ పరీక్ష: నెత్తురు కనిపించకపోతే ఆమెకు నరకమే!

ఫొటో సోర్స్, BBC news
మహారాష్ట్రలోని ఓ సంచార జాతిలో నూతన వధువులకు 'కన్యత్వ' పరీక్షలు చేసే అనాగరిక ఆచారానికి ముగింపు పలికేందుకు ఉద్యమం ప్రారంభమైంది.
22 ఏళ్ల అనితకు (పేరు మార్చాం) రెండేళ్ల క్రితమే పెళ్లైంది. ఇప్పటికీ తన వివాహ సమయంలో జరిగిన కొన్ని అమానవీయ ఘటనలు గుర్తొస్తే ఆమెకు కన్నీరు ఉబికి వస్తుంది.
ఈమె ఒక్కరే కాదు, మహారాష్ట్రలో ఎక్కువగా కనిపించే కంజర్భట్ వర్గంలోని ఏ మహిళను కదిలించినా ఇదే గాథ.
తొలిరాత్రే అగ్ని పరీక్ష
పెళ్లైన తొలిరోజే అనిత 'శీలవతా? కాదా?' అన్న విషయాన్ని తెలుసుకునేందుకు బలవంతంగా 'కన్యత్వ పరీక్ష'ను ఎదుర్కోవాల్సి వచ్చింది.
ఈ వర్గంలోని ప్రతి మహిళ పెళ్లైన రోజున ఈ పరీక్ష ఎదుర్కోవాల్సిందే. అది గ్రామ పంచాయతీ పర్యవేక్షణలోనే జరుగుతుంది.
వివాహం అయిన రోజే కొత్త దంపతులకు తెల్లని వస్త్రం (బెడ్ షీట్) ఇచ్చి ఓ హోటల్ గదిలోకి పంపిస్తారు. ఆ గది అద్దెను గ్రామ పంచాయతీ లేదా అమ్మాయి, అబ్బాయి కుటుంబాలు చెల్లిస్తాయి.
గదిలో కొత్త దంపతులు శృంగారంలో పాల్గొని బయటకు వచ్చేవరకు ఇరువురి కుటుంబ సభ్యులు.. గ్రామ పంచాయతీ సభ్యులు బయటే వేచిచూస్తుంటారు.

సంభోగం సమయంలో వధువుకు రక్తస్రావం అయితే ఆమెను కన్యగా పరిగణిస్తారు, లేదంటే ఆమె తర్వాత జరిగే పరిణామాలకు సిద్ధం కావాల్సిందే.
'తన భార్య కన్యత్వాన్ని నిరూపించుకోలేకపోయింది' అంటూ పురుషులు తమ వివాహాలను రద్దు చేసుకున్న దాఖలాలు అనేకం.
అంతేకాదు.. ఆ మహిళను బహిరంగంగానే చిత్రహింసలకు గురిచేస్తారు. హేయమైన ప్రశ్నలు వేసి మానసికంగా హింసిస్తారు. తమ 'పరువు' తీశావంటూ కుటుంబ సభ్యులు కొడతారు.
అది అపోహ
అయితే తొలిసారి శృంగారంలో పాల్గొన్నప్పుడు మహిళలకు రక్తస్రావం తప్పనిసరిగా అవుతుందన్నది అపోహ మాత్రమేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
"శృంగార అనుభవం ఒక్కో వ్యక్తికి ఒక్కోలా ఉంటుంది. తొలిరాత్రి రక్తస్రావం అయితేనే ఆమె కన్య అని చెప్పడం పూర్తిగా మూఢనమ్మకమే. ప్రజల్లో ఆ దురభిప్రాయాన్ని పోగొట్టాల్సిన అవసరం ఉంది" అని దిల్లీకి చెందిన గైనకాలజిస్ట్ డాక్టర్ సోనియా నాయక్ అన్నారు.

ఫొటో సోర్స్, AFP
మోసకారి భర్త
అనిత కేసు విషయానికి వస్తే, కన్యత్వ పరీక్షలో విఫలమవుతుందనే విషయం ఆమెకు ముందే తెలుసు. ఎందుకంటే పెళ్లికి ముందు నుంచే కాబోయే భర్తతో ఆమెకు శారీరక సంబంధం ఉంది.
కానీ, పెళ్లయ్యాక ఎదురయ్యే పరిణామాల విషయం గురించి ఆమె ఆలోచించలేదు.
"గ్రామ పంచాయతీ పెద్దల ముందు నా భర్త నాకు అండగా నిలుస్తాడని అనుకున్నా. కానీ నేను శీలవతా? కాదా? అని వారు అడిగినప్పుడు ఆయన తెల్లటి వస్త్రాన్ని చూపించారు. నేను కన్యను కాదని చెప్పారు" అంటూ బీబీసీతో అనిత ఆవేదన వ్యక్తం చేశారు.
"దిక్కుతోచని స్థితిలో పడిపోయాను. అతను బలవంతం చేస్తేనే పెళ్లికి ఆరు నెలల ముందు అతనితో శారీరకంగా కలిశాను. చివరికి నేను శీలవతిని కాదన్న ముద్ర వేసి పంచాయతీ పెద్దలు వెళ్లిపోయారు. ఒంటరిగా మిగిలిపోయాను. బోరున విలపించాను" అని ఆమె తనకు ఎదురైన చేదు అనుభవాలను వివరించారు.
అనిత కన్యత్వ పరీక్షలో విఫలమైందన్న కారణంతో మొదట్లో ఆమె భర్త దూరం పెట్టాడు. అయితే తర్వాత సామాజిక కార్యకర్తలు, పోలీసులు జోక్యం చేసుకోవడంతో బలవంతంగా మళ్లీ ఆమెను పెళ్లి చేసుకున్నాడు.
కానీ, అతడు తన జీవితాన్ని నరకంలా మార్చాడని, నిత్యం కొడుతూ చిత్రహింసలు పెడుతున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
గర్భం దాల్చినా...
ఈ దంపతులకు 'నకిలీ' జంట అన్న ముద్ర వేసి, తమ కులస్థులు నిర్వహించే ఏ కార్యక్రమంలోనూ పాల్గొనకూడదంటూ గ్రామ పంచాయతీ నిషేధం విధించింది. దాంతో వీళ్ల పరిస్థితి మరింత దారుణంగా మారింది.
"నేను గర్భం దాల్చిన తర్వాత కూడా పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు రాలేదు. కొడుకు పుట్టాడు. అతను ఎవరి వల్ల పుట్టాడు? అని నా భర్త పదేపదే ప్రశ్నిస్తుంటాడు. పంచాయతీ సభ్యులు కూడా ఇప్పటికీ అలాగే అడుగుతున్నారు" అంటూ అనిత తాను ఎదుర్కొంటున్న క్షోభను వెల్లడించారు.
రెండు నెలల క్రితమే అనితను, చంటిబిడ్డను అత్తవారింటి నుంచి బయటకు తరిమేశారు. ఇప్పుడు ఆమె తన తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారు.
'కన్యత్వ పరీక్ష'లో తాను విఫలమవడం నా కుటుంబం మొత్తాన్ని ఛిన్నాభిన్నం చేసిందని... దీని వల్ల తన చెళ్లెళ్లకు కూడా సంబంధాలు రావట్లేదంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఫొటో సోర్స్, VIVEK TAMAICHIKAR
వ్యతిరేక ఉద్యమం
ఎంతోమంది మహిళల జీవితాలను ప్రశ్నార్థకంగా మారుస్తున్న ఈ దురాచారానికి ముగింపు పలకాల్సిందే అంటూ కంజర్భట్ సామాజిక వర్గానికి చెందిన 25 ఏళ్ల వివేక్ తమైచికర్ తాజాగా ఓ ఉద్యమాన్ని ప్రారంభించారు.
అనితలాంటి పరిస్థితి మరెవరికీ రాకూడదని, కన్యత్వ పరీక్షలను తిరస్కరించాలని తమ సామాజిక వర్గంలోని యువతకు పిలుపునిస్తున్నారు.
"నేను పన్నెండేళ్ల వయసులో ఉన్నప్పుడు ఓ పెళ్లికి వెళ్లాను. అక్కడ ఉన్నట్టుండి ఒక్కసారిగా పెళ్లికూతుర్ని అందరూ చెప్పులతో, బూట్లతో తీవ్రంగా కొట్టడం ప్రారంభించారు. ఏం జరుగుతోందో నాకేమీ అర్థం కాలేదు. కొన్నేళ్లకు అసలు విషయాన్ని గ్రహించాను" అని తమైచికర్ బీబీసీతో తన అనుభవాన్ని పంచుకున్నారు.

ఫొటో సోర్స్, Vivek Tamaichikar
కన్యత్వ పరీక్ష మాకొద్దు
ఈ ఏడాదిలోనే పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమవుతున్న తమైచికర్, తనకు కాబోయే భార్య ఇద్దరూ తాము కన్యత్వ పరీక్షలో పాల్గొనబోము అని పంచాయతీకి తేల్చిచెప్పేశారు.
తమలాగే తమ సామాజిక వర్గంలోని యువత అంతా ఆలోచించి, ఈ దురాచారానికి ముగింపు పలకాలని కోరుతున్నారు.
'స్టాప్ ద వి రిచువల్ (ఈ దురాచారాన్ని ఆపాలి)' పేరుతో వాట్సాప్ గ్రూపును ప్రారంభించారు. ఆ గ్రూపులో చేరిన 60 మందిలో సగం మంది అమ్మాయిలు ఉన్నారు.
అందరూ కలిసి తమ సామాజిక వర్గంలో అనాగరికంగా కొనసాగుతున్న మూఢవిశ్వాసాన్ని పోగొట్టేందుకు ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.

ఫొటో సోర్స్, VIVEK TAMAICHIKAR
మద్యం తాగించి.. అశ్లీల చిత్రాలు చూపించి
"కన్యత్వ పరీక్ష పేరుతో దంపతుల వ్యక్తిగత గోప్యత హక్కును హరించివేస్తున్నారు. అత్యంత అమానవీయంగా, దంపతులను తీవ్ర క్షోభకు గురిచేసే చర్య అది. గది వెలుపల చాలామంది గుమికూడి, లోపల శృంగారంలో పాల్గొనాలంటూ కొత్త జంటను బలవంతపెడతారు. వరుడికి 'అవగాహన' కలిగించేందుకు మద్యం తాగిస్తారు, అశ్లీల చిత్రాలు చూపిస్తారు. మరుసటి రోజు నిర్వహించే వేడుకలో వధువు శీలవతా? కాదా? అన్న విషయం చెప్పాలంటూ వరుడికి అందరిముందు అవమానకరమైన ప్రశ్నలు వేస్తారు" అని తమైచికర్ వివరించారు.
అయితే.. కొంతమంది పెద్దలు వీళ్ల ఉద్యమాన్ని తప్పుపడుతున్నారు.
పుణెలో జరుగుతున్న ఓ వివాహానికి హాజరయ్యేందుకు వెళ్లిన ఈ బృందంలోని కొందరు సభ్యులపై పెళ్లికి వచ్చిన అతిథులు దాడి చేశారు. కంజర్భట్ వర్గానికి ఉన్న ప్రతిష్ఠను దెబ్బతీసే చర్యలకు పాల్పడుతున్నారని, ఆ వాట్సాప్ గ్రూప్‌ను తొలగించకుంటే వారిపై, వారి కుటుంబాలపై సామాజిక బహిష్కరణ విధిస్తామంటూ హెచ్చరించారు.

ఫొటో సోర్స్, Vivek Tamaichikar
తమైచికర్ మాత్రం తాను వెనక్కి తగ్గేది లేదంటున్నారు. ఆ బృందంపై జరిగిన దాడి ఘటన మీడియాలో విస్తృతంగా ప్రసారమైంది. దాంతో ఇప్పుడు దేశంలో కన్యత్వ పరీక్ష అనేది చర్చనీయాంశంగా మారింది.
'ఈ చర్చ అనాదిగా వస్తున్న దురాచారాన్ని రూపుమాపేందుకు సాయపడుతుందేమో' అని తమైచికర్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చూడండి
- ఆఫ్రికన్ చారిత్రక గాథ: వాంఛ తీర్చుకుని చంపేస్తుంది: కాదు, జాతి పోరాట యోధురాలు
- తన ఆధార్ డేటా హ్యాక్ చేయాలని ట్రాయ్ చీఫ్ సవాల్.. ‘చేసి చూపించిన’ గుజరాత్ యువకుడు
- ఎయిడ్స్ తర్వాత అత్యంత ప్రమాదకరమైన వ్యాధి ఇదేనా?
- మహాత్మా గాంధీని ఎందుకు హత్య చేశారు?
- పాకిస్తాన్ అణుకేంద్రం గుట్టు ‘రా’ ఎలా కనిపెట్టింది?
- స్విస్ నుంచి నల్లధనాన్ని వెనక్కు తెచ్చి పేదలకు పంచనున్న నైజీరియా ప్రభుత్వం
- తిరుమల దర్శనానికి ఆధార్ లింకు!! మీకు ఓకేనా?
- శివసేనలో మహిళలకు చోటు లేదా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








