ప్రెస్ రివ్యూ: తిరుమల దర్శనానికి ఆధార్ లింకు!! మీ అభిప్రాయం ఏంటి?

ఫొటో సోర్స్, Sridhr Raju
తిరుమలలో ఏటా పరిమిత సంఖ్యలో దర్శన అవకాశం కల్పిస్తే ఎలా ఉంటుందో ప్రజలు సూచనలు ఇవ్వాలని దేవదాయ, ధర్మదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు కోరారు.
ఈ అంశాన్ని ప్రజల ముందు చర్చకు పెడుతున్నామని, ఇంకా ఎలాంటి విధాన నిర్ణయమూ తీసుకోలేదని చెప్పారు.
ఏడాదికి ఎన్నిసార్లు దర్శనం కల్పిస్తే బాగుంటుంది? భక్తులు మరింత సులభంగా దర్శనం చేసుకోవాలంటే ఏం చేస్తే బాగుంటుందో చెప్పాలన్నారు. అమరావతిలోని సచివాలయంలో సోమవారం మంత్రి విలేకరులతో మాట్లాడారు.
సాంకేతికత ఆధారంగా ఆధార్‌ను లింకు చేస్తూ తరచూ వచ్చేవారు కాకుండా కొత్తవారికి తొలి ప్రాధాన్యం ఇచ్చేలా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో తెలియజేయాలన్నారు. వీఐపీలకు కూడా ఇది వర్తింపజేస్తామని, సిఫార్సు లేఖలే లేకుండా చేయాలని యోచిస్తున్నట్లు మంత్రి చెప్పారు.
ప్రస్తుతం దేవాదాయ, ధర్మాదాయశాఖగా వ్యవహరిస్తున్న తమశాఖ పేరును మారుస్తున్నామని మంత్రి చెప్పారు.
దేవాలయాలు, ధర్మ సంస్థల నుంచి ప్రభుత్వానికి ఆదాయం సంపాదించే శాఖగా ఇది అర్థం వస్తోందని అందుకనే మార్పు చేస్తున్నామని చెప్పారు. పండితుల సూచన మేరకు సీఎంతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారని ఈనాడు ఒక కథనం ప్రచురించింది.

ఫొటో సోర్స్, Getty Images
'తత్కాల్' పాస్‌పోర్టులకు అటెస్టేషన్ అవసరం లేదు!
‘తత్కాల్ పథకం కింద పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకునే వారికి శుభవార్త. ఇకపై ఐఏఎస్/ఐపీఎస్ అధికారుల అటెస్టేషన్ లేకుండానే పాస్‌పోర్టు పొందవచ్చు’ అని సాక్షి ఒక కథనం ప్రచురించింది.
ఆధార్/ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ నంబర్, స్వీయ ధ్రువీకరణ పత్రంతో పాటు కేంద్రం సూచించిన 12 రకాల పత్రాల్లో ఏవైనా రెండు జత చేసి పాస్‌పోర్టు రుసుము రూ.1,500, అదనంగా తత్కాల్ రుసుము రూ.2 వేలు చెల్లిస్తే మరుసటి రోజు నుంచి గరిష్టంగా 3 రోజుల్లోగా పాస్‌పోర్టు జారీ కానుంది.
ఈ మేరకు 'తత్కాల్' కింద పాస్ పోర్టుల జారీని సరళీకరిస్తూ విదేశాంగ శాఖ జనవరి 11న గెజిట్ ప్రకటన జారీ చేసిందని ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి విష్ణువర్ధన్‌రెడ్డి వెల్లడించారు. సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సాధారణ పథకం కింద తక్కువ సమయంలో (ఔట్ ఆఫ్ టర్న్) పాస్‌పోర్టు జారీకి పై విధానంలో దరఖాస్తు చేసుకుంటే 3 నుంచి వారం రోజుల్లో పాస్‌పోర్టు జారీ చేస్తామన్నా రు.
పై రెండు విధానాల కింద దరఖాస్తు అంది న వెంటనే ప్రక్రియ ప్రారంభిస్తామని, పాస్‌పోర్టు జారీ చేసిన తర్వాత పోలీస్ వెరిఫికేషన్ జరిపిస్తామని చెప్పారు. అటెస్టేషన్ పొందడంలో గ్రామీణ, చిన్న పట్టణాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటుండటంతో ఆ విధానాన్ని కేంద్రం తొలగించిందని పేర్కొన్నారు.
12 రకాల పత్రాలివే..
12 రకాల పత్రాల్లో ఓటరు గుర్తింపు కార్డు, కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ, స్థానిక సంస్థలు, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు జారీ చేసే ఉద్యోగుల గుర్తింపు కార్డు, ఎస్టీ/ఎస్సీ/ఓబీసీ సర్టిఫికెట్, ఆయుధ లైసెన్స్, పెన్షన్ పత్రాలు, సెల్ఫ్ పాస్‌పోర్టు, పాన్‌కార్డు, బ్యాంక్/కిసాన్/పోస్టాఫీస్ పాస్ బుక్, విద్యా సంస్థలు జారీ చేసే విద్యార్థి గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, జనన ధ్రువీకరణ పత్రం, రేషన్ కార్డులు ఉన్నాయి.

ఫొటో సోర్స్, EPA
కార్పొరేట్ విరాళాల్లో బిజెపికి 89 శాతం
కార్పొరేట్ సంస్థల నుండి విరాళాలు పొందడంలో బిజెపి ఆగ్రభాగాన నిలిచిందని ప్రజాశక్తి ఒక కథనం ప్రచురించింది.
2016-17 సంవత్సరంలో మొత్తం 325.27 కోట్ల విరాళాలు ఆయా సంస్థల నుండి అందగా వాటిల్లో 290.22 కోట్లు ఒక్క బిజెపికే వెళ్లాయని అసోసియేషన్ ఆఫ్ డెమెక్రటిక్ రిఫార్స్మ్ అనే సంస్థ వెల్లడించింది.
ఎన్నికల నిధుల సేకరణకు సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్(సిబిడిటి) వద్ద 21 ట్రస్టులు నమోదు చేసుకోగా వాటిల్లో రెండిటికి ఎక్కువ భాగం నిధులు వచ్చాయి. అవన్నీ బిజెపికి వెళ్లాయి.
వీటిల్లో సత్య-ప్రుడెంట్‌కు ఎక్కువ నిధులు వచ్చాయి. దీనికి నిధులిచ్చిన వారిలో డిఎల్‌ఎఫ్ గ్రూపు, యుపిఎల్, జెఎస్‌డబ్ల్యు ఎనర్జీ, అండ్ పిరమల్ ఎంటర్ ప్రైజెస్, భారతీ ఎయిర్‌టెల్, ఎస్సార్ అండ్ గ్రాసిమ్ సిమెంట్స్ వంటి సంస్థలున్నాయి.
అలాగే జనతా నిర్వాచక్ ట్రస్ట్ కూడా నిధులు సేకరించింది. దీనిలో జనతా నిర్వాచక్ ట్రస్ట్‌కు వచ్చిన నిధులను 100 శాతం బిజెపికి మళ్లించింది.
ఫ్రుడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ కార్పొరేట్ సంస్థల నుండి రూ.283.73 కోట్లు సేకరించింది. వీటిని తొమ్మిది రాజకీయ పార్టీలకు మళ్లించింది. దీనిలో కాంగ్రెస్‌కు రూ.16.5 కోట్లు, శిరోమణి అకాళీదళ్‌కు రూ.9 కోట్లు, సమాజ్‌వాదీ పార్టీకి రూ.6.5 కోట్లు, అమ్‌ఆద్మీ, శివసేన, తృణమూల్ కాంగ్రెస్, రాష్ట్రీయ లోక్‌దళ్, పీపుల్స్ డెమెక్రటిక్ పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్‌కు కోటి రూపాయల చొప్పున ఇచ్చారు.
2014లో అధికారంలోకి వచ్చిన తరువాత బిజెపి నిధుల సేకరణలో ముందుంది.
2013-14లో రాజకీయ పార్టీలు కార్పొ రేట్ సంస్థల నుండి విరాళాల కింద రూ.85.37 కోట్లు పొందాయి. 2014-15లో 177.40 కోట్లు, 2015-16లో 49.50 కోట్లు, 2016-17లో 325.27 కోట్లు విరాళాలు పొందినట్లు ఎడిఆర్ నివేదికలో పేర్కొంది.
నరేంద్రమోడీ ప్రవేశపెట్టిన ఎలక్టోరల్ బాండ్ల వల్ల నిధుల్లో పారదర్శకత మరింత తగ్గుతుదని ఎడిఆర్ నివేదికలో పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
- ప్యారడైజ్ పేపర్స్‌లో బీజేపీ మంత్రి, ఎంపీల పేర్లు
- బీజేపీ ఆస్తుల్లో 6 రెట్ల పెంపుదల
- మీ మైండ్‌ని రీఛార్జి చేయడానికి ఐదు మార్గాలు
- మన టీ-షర్టులు మనకన్నా ఎక్కువ దేశాలు తిరిగాయా?
- ఆలు చిప్స్‌పై 76 శాతం పన్ను.. సమర్థించిన కోర్టు
- ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ కాలం జీవించిన గొరిల్లా మృతి
- అడవుల్లో పులులను ఎలా లెక్కిస్తారో తెలుసా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








