అమెరికాలో 10శాతం మందికే పాస్‌పోర్టులు.. నిజమేనా?

ఫొటో సోర్స్, Morgan Grant / Hilary Cassoday
కేవలం పది శాతం మంది అమెరికన్లకు మాత్రమే పాస్‌పోర్టులు ఉన్నాయనే వార్త విస్తృతంగా ప్రచారంలో ఉంది. 20ఏళ్ల క్రితం ఆ మాట వాస్తవమే. కానీ ఇప్పుడు కాదు.
అమెరికాలో పాస్‌పోర్టు కలిగిన వారు కేవలం పది శాతమనే ప్రచారం ఎక్కువగా ఆన్‌లైన్‌లో జరుగుతుంది. 1994లో ముందు ఆ సంఖ్య అంతే ఉండేది.
ఇప్పుడు మాత్రం 40శాతానికి పైగా అమెరికన్లు పాస్‌పోర్టు కలిగి ఉన్నారు. ఏటికేడు ఆ సంఖ్య పెరుగుతూ వస్తోంది.
అమెరికాలో పాస్‌పోర్టులు తీసుకునే వారి సంఖ్య పెరగడానికి ముఖ్యంగా మూడు కారణాలున్నాయని జార్జి వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన టూరిజమ్ ప్రొఫెసర్ లిసా డెల్పీ అంటారు.
అందులో మొదటిది.. 9/11 దాడులు. ఆ దాడి జరిగిన తరవాత ప్రయాణ నిబంధనలు చాలా వరకూ మారిపోయాయి.

ఫొటో సోర్స్, Getty Images
2007కు ముందు పాస్‌పోర్టు లేకుండానే కెనడా, మెక్సికో లాంటి కొన్ని పొరుగు దేశాలకు ప్రయాణించే వెసులుబాటు అమెరికన్లకు ఉండేది. కానీ దాడుల తరవాత చట్టంలో సవరణలు చేసి ఆ నిబంధనలను సడలించారు.
ప్రయాణ నిబంధనలు కఠినతరం కావడంతో పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకునేవారి సంఖ్యా పెరుగుతూ వచ్చింది. వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై దాడుల అనంతరం మూడేళ్లలోనే అమెరికాలో చెలామణిలో ఉన్న పాస్‌పోర్టుల సంఖ్య 2కోట్ల మేర పెరిగింది.
ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడం, విమాన ప్రయాణ ధరలు తగ్గడం, ఆయిల్ ధరలు అదుపులోకి రావడం లాంటి కారణాల వల్ల ప్రయాణాలు చేసే వారి సంఖ్య కూడా క్రమంగా పెరిగింది. అమెరికాలో పాస్‌పోర్టుల సంఖ్య పెరగడానికి ఇది రెండో కారణం.
‘90డాలర్లకే ఇంగ్లండ్ విమాన టికెట్.. అనే ప్రకటనను నేనోసారి చూశాను. అంత తక్కువ ధరకు ప్రయాణించే అవకాశం వస్తున్నప్పుడు ఎవరు మాత్రం దాన్ని వదులుకుంటారు. అందుకే పాస్‌పోర్టు పొందాలనుకునేవారి సంఖ్య ఎక్కువవుతోంది’ అంటారు ప్రొఫెసర్ లిసా.
ఇక మూడో కారణం.. జీవితాన్ని ఆస్వాదించాలనే కోరిక మిలీనియల్స్‌లో పెరిగిపోవడమే.
‘ఈ తరం వాళ్లు వస్తువుల కంటే అనుభవాల మీదే ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. వాళ్లు కార్లు, ఫ్లాట్ల లాంటి వాటికంటే జీవిత కాలం తమకు మంచి జ్ఞాపకాలను మిగిల్చే వాటిపైనే డబ్బు ఖర్చు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు’ అంటారు డెల్పీ.

ఫొటో సోర్స్, Asia Jones
డెల్పీ చెప్పిన కారణాన్ని ఏషియా జోన్స్ అనే 20ఏళ్ల యువతి కూడా అంగీకరిస్తారు.
మంచి రైటర్ కావాలనేది ఏషియా జోన్స్ కోరిక. అందం, ప్రయాణాలకు సంబంధించిన అంశాలను స్పృశిస్తూ ఆమె ఓ బ్లాగ్‌ను నడిపిస్తున్నారు.
ఈ ఏడాది మొదట్లోనే జోన్స్ తొలిసారి పాస్‌పోర్టును పొందారు. వీలైనంత త్వరగా దాన్ని ఉపయోగించాలని ఆమె తహతహలాడుతున్నారు.
ఇంటర్నెట్, సోషల్ మీడియా వాడకం పెరగడం కూడా యువత ప్రయాణాలను ఇష్టపడటానికి ఓ కారణమని జోన్స్ భావిస్తున్నారు.
‘ఒకప్పుడు యువత జీవితం అంటే.. చదువుకోవడం, పెళ్లి చేసుకోవడం, ఉద్యోగంలో స్థిరపడటం అన్నట్లు సాగేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. ఒక్కోసారి ఈ తరం వాళ్లు చేయి దాటిపోతున్నట్లు అనిపించినా, మేం ఎక్కడికి వెళ్లినా మంచి గమ్యాన్నే చేరుకుంటాం’ అంటారు జోన్స్.
అమెరికాలో పాస్‌పోర్టు కలిగిన వారి సంఖ్య ప్రస్తుతం 42శాతంగా ఉన్నా, బ్రిటన్ లాంటి దేశాలతో పోల్చి చూస్తే అది చాలా తక్కువ.
2011లో యూకే సెన్సస్‌ను సేకరించినప్పుడు- ఇంగ్లండ్, వేల్స్‌లో నివసించే 76శాతం మందికి యూకే పాస్‌పోర్టులు ఉన్నాయి. కేవలం 17శాతం మందికి మాత్రమే ఎలాంటి పాస్‌పోర్టూ లేదు.
కానీ అమెరికా విస్తీర్ణం ఎక్కువ కావడంతో పాస్‌పోర్టు లేని బ్రిటన్ వాసులతో పోలిస్తే పాస్‌పోర్టు లేని అమెరికా వాసులకే ఎక్కువ దూరం ప్రయాణించే అవకాశం ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
మేరీల్యాండ్‌కు చెందిన మోర్గన్ గ్రాంట్ అనే 22ఏళ్ల అమ్మాయికి ఈ నెలలోనే తొలి పాస్‌పోర్టు వచ్చింది. అప్పుడే ఆమె అలాస్కా, హవాయి, యూఎస్ వర్జిన్ ఐలాండ్స్ లాంటి ప్రాంతాలకు ప్రయాణించింది. పాస్‌పోర్టు అందుకున్న కొన్నాళ్లకే ఆమె పదకొండు వేల కి.మీ.కు పైగా ప్రయాణించడాన్ని చూస్తే, యువ అమెరికన్లు ప్రయాణాలపై ఎంత ఉత్సాహం చూపుతున్నారో అర్థమవుతుంది.
పాస్‌పోర్టు కేవలం ప్రయాణాల కోసమే కాదు, ప్రస్తుతం అదో అవసరం కూడా అని మోర్గన్ అభిప్రాయపడతారు.
‘నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇక్కడి నుంచి బయటపడే అవకాశం ఉండాలి. ఈ మనిషి (ట్రంప్) ఇలానే కిమ్ జోంగ్ ఉన్ న్యూక్లియర్ బటన్ గురించి ట్వీట్లు చేస్తూ ఉంటే, నేను ఇక్కడి నుంచి వెళ్లక తప్పదు’ అని మోర్గాన్ చెబుతారు.
హిలరీ కాసొడే అనే 25ఏళ్ల మహిళ, ఏడాది క్రితమే తన తొలి పాస్‌పోర్టును పొందారు. ముందే పాస్‌పోర్టును ఎందుకు తీసుకోలేదని ప్రశ్నిస్తే.. భయమే దానికి కారణమని అంటారు.
‘అమెరికా చాలా భద్రమైన దేశమనీ, సరిహద్దు దాటితే పరిస్థితులు ఎంత మాత్రం సురక్షితం కాదనీ నాలాంటి చాలామంది భావిస్తారు’ అంటారామె.
గతేడాది కాలేజీ ట్రిప్‌లో భాగంగా హిలరీ నార్తర్న్ ఐలాండ్ ప్రాంతానికి వెళ్లారు. అది చాలా నచ్చడంతో, మరిన్ని ప్రాంతాలను చుట్టేసే ఉద్దేశంతో ఆమె పాస్‌పోర్టును పొందారు.
‘కొన్నాళ్ల క్రితం పీఎస్ ఐలవ్యూ అనే సినిమా చూశా. అందులో ఐర్లాండ్ అందాలు నాకు బాగా నచ్చాయి. పాస్‌పోర్టు తీసుకోవడంతో ఇప్పుడు ఆ ప్రాంతాలన్నీ చుట్టేసే అవకాశం నాకు దొరికింది’ అంటారు హిలరీ ఎంతో ఉత్సాహంగా.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








