మహిళల్లో విటమిన్-డి లోపం: భారత్‌లో 95 శాతం మంది మహిళలకు సరిపడా లేదు
- రచయిత, సరోజ్ సింగ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
మీకు తెలుసా? ఉత్తర భారతదేశానికి చెందిన 69 శాతం మంది మహిళల్లో విటమిన్-డి లోపం ఉంది. ఈ ప్రాంతంలో 5 శాతం మంది మహిళలకు మాత్రమే తగిన పాళ్లలో విటమిన్-డి అందుతోంది.
దిల్లీలోని ఎయిమ్స్, ఫోర్టిస్ ఆసుపత్రికి చెందిన డాక్టర్లు నిర్వహించిన పరిశోధనలో ఈ విస్మయకర వాస్తవాలు వెల్లడయ్యాయి.
మనం ఎంతసేపు సూర్మరశ్మిలో ఉంటామన్న దాని మీదే మన శరీరంలోని విటమిన్-డి ఆధారపడి ఉంటుంది. శరీరంలోని ఎముకలకే కాకుండా, శరీర రోగ నిరోధక వ్యవస్థకు కూడా సూర్మరశ్మి చాలా అవసరం.
భారతీయ మహిళల్లో చాలా మంది ఇంటి పనులకే పరిమితం అవుతారు. కాబట్టి వారికి అందే సూర్మరశ్మి కూడా చాలా తక్కువ.
రెండోది భారతీయ మహిళలు ధరించే దుస్తులు. చాలా మంది మహిళలు చీర లేదా చుడీదార్ ధరిస్తారు. ఇవి వాళ్ల శరీరంలో ఎక్కువ భాగాన్ని కప్పేస్తాయి. విటమిన్-డి లోపానికి ఇది కూడా ఒక కారణం.
మూడో కారణం - మహిళల్లో వచ్చే హార్మోన్ మార్పులు. పిల్లలకు పాలిచ్చే దశలో, మెనోపాజ్ తరువాత మహిళల్లో ఈ సమస్యను ఎక్కువగా ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
రిఫైన్డ్ ఆయిల్‌తోనూ సమస్యలు
మాజీ రాష్ట్రపతులు శంకర్ దయాళ్ శర్మ, ఆర్ వెంకట్రామన్, ప్రణబ్ ముఖర్జీలాంటి వారికి ఫిజీషియన్‌గా పని చేసిన డాక్టర్ మొహసీన్ వలి చెప్పిన ప్రకారం, దీనికి నాలుగో కారణం కూడా ఉంది.
''సూర్మరశ్మి లేకపోవడం వల్లే విటమిన్-డి లోపం ఏర్పడుతుందని చాలా మంది భావిస్తారు. అయితే, అదొక్కటే కారణం కాదు. మనం తినే ఆహారంలో రిఫైన్డ్ ఆయిల్ ఉపయోగిస్తే, దాని వల్ల శరీరంలో కొలెస్టరాల్ తగ్గుతుంది. కొలెస్టరాల్ పదార్థాలు శరీరంలో విటమిన్-డి ఏర్పడ్డంలో చాలా ముఖ్యపాత్ర పోషిస్తాయి. అందువల్ల విటమిన్-డి లోపం ఏర్పడుతుంది'' అని వివరించారు.
మరి రిఫైన్డ్ ఆయిల్ ఉపయోగించడం పూర్తిగా ఆపేయాలా?
దీనికి సమాధానంగా డాక్టర్ వలి, ''ప్రయత్నించాలి. ఒకవేళ అది సాధ్యం కాకపోతే, దానికి బదులుగా నెయ్యి, ఆవనూనెను ఉపయోగించడం ప్రారంభించవచ్చు'' అని తెలిపారు.
రిఫైన్డ్ ఆయిల్‌లో ట్రాన్స్ ఫ్యాట్ అధికంగా ఉంటుంది. ఇవి శరీరంలోని మంచి కొలెస్టరాల్‌ను తగ్గించి, చెడ్డ కొలెస్టరాల్ పెంచుతాయి. అందువల్ల వ్యాధులు వచ్చే అవకాశం పెరుగుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
మిల్లీలీటర్ రక్తంలో 75 నానోగ్రాముల విటమిన్-డి ఉంటే అది సరైన పాళ్లలో ఉన్నట్లు లెక్క. అదే 50-75 నానోగ్రాములు ఉంటే విటమిన్-డి తగినంత లేదని భావిస్తారు.
మిల్లీలీటరుకు 50 నానోగ్రాముల కన్నా తక్కువ విటమిన్-డి ఉంటే, దానిని లోపంగా పరిగణిస్తారు.
ప్రస్తుతం భారతదేశపు మహిళల్లో విటమిన్ డి కేవలం మిల్లీమీటరు రక్తంలో 5-20 నానోగ్రాములు మాత్రమే ఉంది.
డాక్టర్ వలి ప్రకారం, 95 శాతం మంది మహిళలు విటమిన్-డి లోపంతో బాధపడుతున్నారు. అయితే విటమిన్-డి లోపం కేవలం మహిళల్లో మాత్రమే కాదు, పురుషుల్లోనూ ఉంది. అయితే మహిళలతో పోలిస్తే అది చాలా తక్కువ.
విటమిన్-డి లోపం సూచనలేంటి?
త్వరగా అలసిపోవడం, కీళ్ల నొప్పులు, పాదాలు వాయడం, ఎక్కువ సేపు నిలబడలేకపోవడం, కండరాల బలహీనత విటమిన్-డి లోపానికి సూచనలు.
అయితే, వీటిని చాలా మంది పట్టించుకోరు. విటమిన్-డి లోపం క్రమక్రమంగా శరీర భాగాలన్నటినీ బలహీనపరుస్తుంది. దీంతో వృద్ధాప్యంలో ఎముకలు, కీళ్లు, కండరాల నొప్పులు మరింత ఎక్కువవుతాయి.

ఫొటో సోర్స్, Getty Images
విటమిప్-డి లోపం వల్ల నష్టాలు
విటమిన్-డి లోపం వల్ల శరీరంలో కాల్షియంను సంగ్రహించే సామర్థ్యం తగ్గిపోతుంది. ఫలితంగా ఎముకలు, కండరాలు, కీళ్ల నొప్పులు ఎక్కువవుతాయి. ఎముకలు విరిగే అవకాశాలు పెరుగుతాయి.
భారతదేశంలో చేసిన పరిశోధనలో విటమిన్-డి లోపం ఉన్న మహిళలకు ఎక్కువగా మధుమేహ వ్యాధి వచ్చే అవకాశం ఉందని వెల్లడైంది.
ఇక అంతర్జాతీయ పరిశోధనల విషయానికి వస్తే, బ్రిటన్ జర్నల్ 'న్యూరాలజీ' విటమిన్-డి లోపం వల్ల వృద్ధులలో డిమెన్షియా వచ్చే అవకాశం పెరుగుతుందని తెలిపింది.
విటమిన్-డి లోపాన్ని పూరించడం ఎలా?
ఎయిమ్స్‌లో ఎముకల విభాగంలో పని చేస్తున్న డాక్టర్ సీఎస్ యాదవ్, ''కేవలం ఆహారం ద్వారా విటమిన్-డి లోపాన్ని పూరించలేం. అతి తక్కువ దుస్తులతో ఎండలో నడవడం, విటమిన్-డి ని మాత్రల రూపంలో తీసుకోవడమే ఈ సమస్యకు పరిష్కారం'' అన్నారు.
తక్కువ దుస్తులకు, విటమిన్-డికి సంబంధం ఏమిటి?
దీనికి బదులిస్తూ డాక్టర్ యాదవ్, ''మొత్తం శరీరం అంతా దుస్తులు కప్పుకుని ఎండలో వెళితే లాభం ఏంటి? శరీరంలో ఎంత ఎక్కువ భాగానికి సూర్యరశ్మి తగిలితే అంత తక్కువ సమయంలో విటమిన్-డి లభిస్తుంది'' అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అలా అయితే, ఎంత సేపు ఎండలో ఉండాలి?
దీనికి నిర్దిష్టమైన ఫార్ములా అంటూ ఏమీ లేకున్నా, రోజూ ఒక గంట పాటు సూర్యరశ్మి తగిలితే విటమిన్-డి లోపం పరిష్కారం అవుతుందని వైద్యులు అంటున్నారు.
ఉదయం లేదా సాయంత్రం సూర్యరశ్మి అయితే మేలని, అది కుదరనప్పుడు ఏ సమయంలోనైనా ఎండలో వెళ్లడం మంచిదని డాక్టర్ యాదవ్ తెలిపారు.
నోటి ద్వారా తీసుకునే మాత్రలు కూడా విటమిన్-డి లోపాన్ని అధిగమించడానికి దోహదపడతాయి.
ఏదేమైనా, భారతదేశంలో ఎక్కడా సూర్యరశ్మి సమస్య లేదు. అయినప్పటికీ, మహిళలు విటమిన్-డి లోపంతో బాధ పడుతున్నారంటే అది ఆలోచించాల్సిన విషయమే.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్)










