అస్సాం: భారతీయులుగా నిరూపించుకునేందుకు పోరాటం

అస్సాం మహిళ
    • రచయిత, నితిన్ శ్రీవాస్తవ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఉదయం 9 గంటలవుతోంది. ఆమ్రాఘాట్ గ్రామంలో ఒక చిన్న ఇంట్లో నుంచి గంట వాయిస్తున్న శబ్దం వినిపిస్తోంది.

ఇంటి వాకిట్లో ఉన్న ఒక మందిరంలో తిన్నెపై కూచున్న మహిళ ఎడమ చేత్తో గంట కొడుతూ, కుడిచేత్తో హారతి ఇస్తోంది.

తిన్నెకు కింద ఆమె ఇద్దరు పిల్లలు కూచుని ఉన్నారు. వారిలో ఒకరైన నాలుగేళ్ల పాప ఆటిజంకు గురైంది. పూజ చేస్తున్నంతసేపూ ఆ మహిళ కన్నీళ్లు పెడుతూనే ఉంది.

కష్టంగా కన్నీళ్లను ఆపుకున్న జుతికా దాస్ "ఈరోజు ఆయన గురించి తెలుసుకోడానికి మళ్లీ జైలుకు వెళ్తున్నా. ఇప్పటివరకూ పదకొండు సార్లు వెళ్లాను. అక్కడ చూసిన ప్రతిసారీ ఆయన మరింత సన్నగా అయిపోతున్నారు, జబ్బు పడ్డట్టు కనిపిస్తున్నారు" అన్నారు.

అస్సాంలోని సిల్చర్ జిల్లాలోని ఈ అందమైన పల్లెలో రెండున్నర నెలల ముందు జుతిక తన కుటుంబంతో ఆనందంగా గడిపేది.

ఆమె భర్త అజిత్ దాస్ కిరాణా షాపు నడుతుపూ తన కుటుంబాన్ని పోషించేవాడు. కూతురికి వైద్యం చేయిస్తూ, కొడుకును స్కూలుకు పంపించాలని కూడా అనుకున్నాడు. కానీ ఒక సాయంత్రం అంతా మారిపోయింది.

భర్తను తాత్కాలిక డిటెన్షన్ క్యాంప్ పంపించారు

భర్తను తాత్కాలిక డిటెన్షన్ క్యాంపునకు పంపించారు

షాపులో కూచుని ఉన్న అజిత్ దాస్‌ను స్థానిక పోలీసులు విచారణ కోసం అట్నుంచి అటే తీసుకెళ్లారు.

పోలీసులు అతడిని సిల్చర్ సెంట్రల్ జైల్లో ఉన్న తాత్కాలిక డిటెన్షన్ క్యాంపునకు పంపించారని ఆమెకు తర్వాత రోజు తెలిసింది.

1951 ఎన్ఆర్సీలో లేదా 1971 వరకూ ఉన్న ఓటరు జాబితాల్లో తన పేరు, తన పూర్వీకుల పేర్లు ఉన్నట్టు చూపించేందుకు అవసరమైన పత్రాలు రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియాకు సమర్పించలేదని అతడిపై ఆరోపణలు వచ్చాయి.

నిజానికి, అజిత్ కుటుంబం 1960వ దశకంలో బంగ్లాదేశ్ నుంచి భారత్ వచ్చింది.

దాంతో అతడి భారతీయ పౌరసత్వంపై ప్రశ్నలు తలెత్తాయి. ఇప్పుడు ఈ కేసు విదేశీ ట్రైబ్యునల్లో ఉంది.

అజిత్‌ ఇద్దరు అన్నయ్యలపై కూడా వారెంట్ జారీ అయ్యింది. ఇద్దరూ సరెండర్ కావాలని నోటీసులు జారీ చేశారు.

అంధకారంలో కుటుంబ భవిష్యత్తు

అంధకారంలో కుటుంబ భవిష్యత్తు

2018 జులై 30న పౌరసత్వ రిజిస్టర్‌ తుది ముసాయిదా జారీ చేశారు.

అస్సాంలోని లక్షల మందితో పాటు అజిత్ దాస్‌ పౌరసత్వం కూడా ప్రమాదంలో పడింది. ఆయన కుటుంబ భవిష్యత్ అంధకారంలో ఉంది.

ఆ రాష్ట్రంలో ఉన్న కొన్ని లక్షల మంది ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలోనే ఉన్నారు. ఎందుకంటే భారతదేశంలో ఇలాంటి ప్రక్రియ అమలయ్యే ఒకే ఒక రాష్ట్రం అస్సాం.

ఇన్ని కష్టాల మధ్య జుతికా దాస్ లాంటి వారి జీవితం అయోమయంలో పడింది.

"ఇల్లు నదికి దగ్గరగా ఉంటుంది. అందుకే పాములు లోపలికి వచ్చేస్తాయి. పిల్లలను చూసుకోవాలా? వంట చేయాలా? షాపు చూసుకోవాలా? వకీలుకు ఫీజు కూడా ఇవ్వాలి" అని జుతికా చెప్పారు.

ఎన్ఆర్సీ ప్రక్రియలో చిక్కుకుపోయిన కుటుంబాలు

ఎన్ఆర్సీ ప్రక్రియలో చిక్కుకుపోయిన కుటుంబాలు

రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా 2018 జనవరి 1న 1.9 కోట్ల అస్సాం వాసుల జాబితా విడుదల చేసింది. దీనిని అస్సాంలో ఉన్న మొత్తం 3.29 కోట్ల మంది నుంచి రూపొందించారు.

ఆ జాబితాలో పేర్లు లేని వారు జులై 30న విడుదలయ్యే తుది జాబితా కోసం వేచిచూడాలన్నారు. ఇప్పుడు ఆ జాబితా కూడా విడుదలైంది. అస్సాంలోని 2.89 కోట్ల మందిని దేశ పౌరులుగా భావించారు.

మిగతా 40 లక్షల మందిని అక్రమ పౌరులుగా చెప్పారు. అయితే ఇప్పుడు ఈ జాబితాలో పేర్లు లేని వారు అపీలు చేసుకుని తమ వాదన వినిపించే అవకాశం ఇంకా ఉంది.

ఈ జాబితా కోసం వేచిచూసిన వారిలో రాష్ట్రంలోని హిందువులు, ముస్లింలు అందరూ ఉన్నారు.

కానీ ఎన్ఆర్సీ చేపట్టిన ఈ భారీ ప్రక్రియలో జుతికా దాస్ లాంటి వారు చాలా మంది తీవ్రంగా నష్టపోయారు.

జుతికా ఇంటికి కిలోమీటరు దూరంలో 48 ఏళ్ల కామాఖ్యా దాస్ కూడా ఉంటారు.

ఆమె భర్త 11 నెలలుగా డిటెన్షన్ క్యాంపులో ఉన్నారు. ప్రస్తుతం ఆమెను పెళ్లైన కూతురు, అల్లుడే చూసుకుంటున్నారు.

భర్తను చూడగలనో, లేదో

భర్తను చూడగలనో, లేదో?

జుతికా దాస్ ఒక సాయంత్రం మాతోపాటు కామాఖ్యను చూడ్డానికి వచ్చారు.

"నా భర్తను ఎప్పటికైనా చూడగలనో లేదో తెలీడం లేదు. ఈ కష్టం మాపై ఎలా వచ్చి పడిందో" అని కామాఖ్య ఆవేదన వ్యక్తం చేశారు.

అంతలోనే జులై 30 వచ్చేసింది. డిటెన్షన్ క్యాంపుల్లో ఉన్న వారికి తమ పరిస్థితి ఏమవుతుందోననే ఆందోళన మరింత పెరిగింది.

పిల్లలతో సెంట్రల్ జైలు వెళ్లిన జుతికా

పిల్లలతో సెంట్రల్ జైలుకు వెళ్లిన జుతికా దాస్

జుతికా దాస్, ఆమె ఇద్దరు పిల్లలతో మేం సిల్చర్ సెంట్రల్ జైలు దగ్గరకు వెళ్లాం.

జైలు బయట జనం భారీగా గుమిగూడి ఉన్నారు. డిటెన్షన్ క్యాంపులో ఉన్న తమవారిని కలవడానికి వాళ్లంతా అక్కడ వేచిచూస్తున్నారు.

గేటు బయట పిల్లలను బెంచిపై కూచోపెట్టిన జుతికా, రిజిస్టర్‌లో సంతకం చేసిన తర్వాత ఒక గంటవరకూ వేచిచూశాం.

ఆమె భర్త అజిత్ దాస్‌ జైలు ఊచల నుంచి బయటకు వచ్చారు. జాలీ దగ్గరకు రాగానే.. పిల్లలు తండ్రిని చూసి ఆనందంలో ఆ జాలీని చేతులతో తట్టడం మొదలెట్టారు.

వారి చేతులను తన చేతులతో తాకలేకపోతున్నందుకు అజిత్ దాస్ కుమిలి కుమిలి ఏడ్చారు.

'భర్తను కోల్పోయే పరిస్థితి వస్తుందనుకోలేదు'

'భర్తను కోల్పోయే పరిస్థితి వస్తుందనుకోలేదు'

జుతికా బయటకొచ్చాక ములాకాత్ గురించి వివరంగా చెప్పారు.

"పండ్లు ఇస్తుంటే ఏడుస్తాడు, జాలీ వెనుక నుంచే పిల్లలకు తినిపించాలని ప్రయత్నిస్తాడు. నేను వంద రూపాయలు చేతికివ్వాలని ప్రయత్నించా. కానీ వద్దన్నాడు. జైల్లో దాన్ని కూడా మాయం చేసేస్తారని చెప్పాడు. ఎంత బెదిరిపోయి ఉన్నాడంటే, నువ్వు ఎన్ఆర్సీ జాబితాలో కుటుంబం పేర్లు వెతకడానికి వెళ్తావా అని కూడా అడగలేకపోయాడు" అన్నారు.

అయితే పెరుగుతున్న ఉద్రిక్తతలను దృష్టిలో పెట్టుకున్న భారత ప్రభుత్వం.. రిజిస్టర్‌ గురించి ఎవరైనా ఏవైనా ఫిర్యాదులు చేస్తే వాటిపై విచారణ జరుపుతామని చెప్పింది. ఈ ప్రక్రియ పౌరసత్వం ఇవ్వడం, లేదా ఇవ్వకపోవడం గురించి కాదని చెప్పింది.

కానీ ఇలాంటి మాటల వల్ల జుతికా దాస్‌కు పెద్దగా మార్పు వస్తుందని అనిపించ లేదు.

సాయంత్రం జైలు నుంచి తిరిగి ఆమ్రాఘాట్ వెళ్తున్నప్పుడు "పౌరసత్వం కోసం భర్తనే దూరం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు" అన్నారు జుతికా దాస్.

జాబితాలో పేర్ల కోసం వెతుకులాట

జాబితాలో పేర్ల కోసం వెతుకులాట

జులై 30న మొత్తం అస్సాం రాష్ట్రంలో నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్‌షిప్ తుది జాబితా విడుదలైంది.

దీంతో అస్సాం మారుమూల సిల్చర్ లాంటి పట్టణాల్లో, చుట్టుపక్కల గ్రామాల్లో పరిస్థితి అంత ఉత్సాహంగా ఏం కనిపించడం లేదు.

ఉదయం 10 గంటలకు ఎన్ఆర్సీ జాబితా విడుదలైనప్పటి నుంచి అది ఉన్న ప్రాంతాల్లో బయట పొడవాటి క్యూలు కనిపిస్తున్నాయి.

అవసరమైన అన్ని పత్రాలూ సమర్పించినా, తుది జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

వారిలో ఒకరైన మజీద్ అలీ "మా తల్లిదండ్రులు ప్రస్తుతం బంగ్లాదేశ్‌‌గా ఉన్న తూర్పు పాకిస్తాన్‌ నుంచి గతంలో ఇక్కడకు వచ్చారు. కానీ, ఇప్పుడు నేను శిక్ష అనుభవిస్తున్నా" అన్నారు.

ఇటు పుతుల్ పాల్ లాంటి వారు "జాబితాలో నా భార్య పేరు తప్ప, కుటుంబ సభ్యులు అందరి పేర్లూ ఉన్నాయి. కానీ నాకు సంతోషంగానే ఉంది. మేం ఇంకోసారి ప్రయత్నిస్తాం" అని బీబీసీకి చెప్పారు.

జాబితాలో పేర్లు లేక ఎక్కువ మందిలో ఆందోళన వ్యక్తం అవుతున్నట్టు అధికారులు చెప్పడంతో రాష్ట్రంలో భద్రతా బలగాలను భారీగా మోహరించారు.

ఇవికూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)