అరుదైన ఫొటోల్లో లక్షల ఏళ్ల భారత ఘన చరిత్ర!

కొన్ని లక్షల ఏళ్ల క్రితం మానవులు రాళ్లనే ఆయుధాలుగా వాడేవారు.

ఫొటో సోర్స్, Sharma Centre for Heritage Education, Chennai

ఫొటో క్యాప్షన్, ఇది దాదాపు పది లక్షల ఏళ్ల కిందటి రాతి గొడ్డలి. తమిళనాడులో లభ్యమైన ప్రాచీన కాల ఆయుధాలలో ఇదొకటి.

భారత ఉపఖండం చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచే అత్యంత అరుదైన కళాఖండాలను ముంబయిలో ప్రదర్శనకు పెట్టారు. వాటిలో కొన్ని 20 లక్షల ఏళ్ల కిందటివి కూడా ఉన్నాయి.

'ఇండియా అండ్ వరల్డ్: ఎ హిస్టరీ ఇన్ నైన్ స్టోరీస్' పేరుతో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్‌లో 9 విభాగాలకు చెందిన 228 చిత్రాలు.. శిల్పాలు.. బొమ్మలు.. స్థూపాలు.. డ్రాయింగ్‌‌లు ఉంచారు.

ముంబయిలోని అతిపెద్ద మ్యూజియం ఛత్రపతి శివాజీ మహరాజ్ వాస్తు సంగ్రహాలయ(సీఎస్‌ఎంవీఎస్)లో నవంబర్ 11న ఈ ప్రదర్శన ప్రారంభమైంది. ఫిబ్రవరి 18 వరకు కొనసాగుతుంది.

బయటి ప్రపంచానికి భారత ఉపఖండానికి మధ్య ఉన్న చారిత్రక సంబంధాలు, పోలికలను నేటి తరాలకు తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామని మ్యూజియం డైరెక్టర్ ఎస్. ముఖర్జీ తెలిపారు.

భారత ఉపఖండ చారిత్రక వైభవాన్ని ప్రతిబింబించే వందకు పైగా కళాఖండాలను దేశంలోని వివిధ మ్యూజియంలు, ప్రైవేటు సంస్థల నుంచి సేకరించారు.

మరో 124 అరుదైన వస్తువులను లండన్‌లోని 'ది బ్రిటిష్ మ్యూజియం' నుంచి తీసుకొచ్చారు.

క్రీస్తు పూర్వం 35–28 శతాబ్దాల మధ్య కాలం నాటి పాత్ర

ఫొటో సోర్స్, TAPI Collection of Praful and Shilpa Shah, Surat

బలూచిస్తాన్ పాట్

ఇది క్రీ.పూ. 35-28 శతాబ్దాల మధ్యకాలం నాటి 'బలూచిస్తాన్ పాత్ర'.

దీన్ని టెర్రకోటతో తయారు చేశారు. ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉన్న బలూచిస్తాన్ ప్రాంతంలోని చారిత్రక ప్రదేశం మెహర్‌గర్‌లో దొరికింది.

ప్రాచీన కాలంలో బాగా ప్రాచుర్యంలో ఉన్న 'పోలీక్రోమీ' పరిజ్ఞానంతో వేసిన అందమైన పెయింటింగ్‌లు ఈ పాత్ర మీద ఉన్నాయి.

స్మశానాలలో దొరికినా కూడా ఈ పాత్రలను స్థానికులు వంటకు, ఆహార పదార్థాలను నిల్వచేసేందుకు ఉపయోగించేవారు.

సింధు లోయ నాగరికత కాలం నాటి బంగారు కొమ్ముల ఎద్దు బొమ్మ

ఫొటో సోర్స్, Haryana State Archaeology and Museums

బంగారు కొమ్ములు కలిగిన ఈ ఎద్దు బొమ్మ సింధు లోయ నాగరికత కాలం నాటిది. హరియాణా రాష్ట్రంలో దొరికింది.

చక్రవర్తి అశోకుడు వేయించిన శిలా శాసనం

ఫొటో సోర్స్, CSMVS

ఫొటో క్యాప్షన్, అశోకుడు వేయించిన శిలా శాసనం

ఈ బసాల్టు శిల మీద చెక్కిన శాసనం క్రీ. పూ. రెండున్నర శతాబ్దాల క్రితం మౌర్య సామ్రాజ్య చక్రవర్తి అశోకుడు వేయించినది.

ముంబయి సమీపంలోని థానే జిల్లా సోపార పట్టణంలో లభ్యమైంది.

శాంతికాముకుడిగా అశోకుడికి పేరుంది. తన సిద్ధాంతాలను మౌర్య సామ్రాజ్యం అంతటా ఇలా శాసనాల రూపంలో చెక్కించేవారు ఆయన.

కుషాణుల రాజు విగ్రహం తల భాగం

ఫొటో సోర్స్, National Museum, New Delhi

ఎర్ర రాతిపై చెక్కిన ఈ శిల్పం క్రీ.శ. 150 ఏళ్ల నాటిది. కుషాణుల సామ్రాజ్యానికి చెందిన ఓ రాజు ప్రతిమగా భావిస్తున్నారు.

క్రీ.శ. ఒకటో శతాబ్దం, 3వ శతాబ్దం మధ్య కుషాణుల సామ్రాజ్యం విలసిల్లినట్టు చరిత్ర చెబుతోంది.

ఉత్తర భారత్‌లోని అనేక ప్రాంతాలతో పాటు, సెంట్రల్ ఆసియాలోని పలు ప్రాంతాలను కుషాణులు పాలించారు.

ఈ శిల్పం కుషాణుల సామ్రాజ్యానికి రాజధానిగా కొనసాగిన ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథురలో లభ్యమైంది.

జైన మత తీర్ధంకరుడి విగ్రహం

ఫొటో సోర్స్, Bihar Museum, Patna

ఈ విగ్రహం క్రీ.పూ 2వ శతాబ్దం, ఒకటో శతాబ్దం మధ్యకాలం నాటిదని నిపుణులు భావిస్తున్నారు. బిహార్‌ రాజధాని పట్నాలో లభ్యమైన ఈ విగ్రహం అప్పటి జైన తీర్ధంకరుడిది అయ్యుంటుందని చెబుతున్నారు.

జైన తీర్ధంకురులు అందరూ ధ్యానం ఆచరించేవారు. అందుకే వారి ప్రతిమల్లో ధ్యానం చేస్తున్నట్టు కనిపిస్తారు.

ఈ శిల్పానికి కూడా ధ్యానం చేస్తున్నట్టుగా చేతులు నిటారుగా కిందకు వేలాడి ఉన్నాయి.

కంచుతో చేసిన బుద్ధుడి విగ్రహం

ఫొటో సోర్స్, CSMVS, Mumbai

కంచుతో చేసిన ఈ బుద్ధుడి విగ్రహం క్రీ.శ. తొమ్మిదవ, పదవ శతాబ్దాల కాలం నాటిది. దీన్ని తమిళనాడు నుంచి తెప్పించారు.

దక్షిణ భారత ప్రాంతాలను పాలించిన చోళుల కాలంలో బౌద్ధ విగ్రహాల తయారీ తమిళనాడులో ఎక్కువగా జరిగేది.

బుద్ధుడి తలపై ఉండే జ్వాల ఆయన జ్ఞానానికి చిహ్నంగా చెబుతారు.

మొఘల్ చక్రవర్తి జహంగీర్ వేయించిన పటం

ఫొటో సోర్స్, National Museum, New Delhi

ఫొటో క్యాప్షన్, మొఘల్ చక్రవర్తి జహంగీర్ వేయించిన పటం

ఉత్తర్‌ప్రదేశ్ నుంచి తీసుకొచ్చిన ఈ పటం క్రీ.శ. 1620 నాటి మొఘల్ చక్రవర్తి జహంగీర్‌ది.

మేరీ మాత చిత్రాన్ని జహంగీర్ పట్టుకుని ఉన్న ఈ చిత్రాన్ని వాటర్ కలర్, బంగారంతో తయారు చేయించారు.

ఇలాంటి చిన్న చిత్రాలతో కవితాత్మకమైన శాసనాలను జహంగీర్ ఎక్కువగా వేయించేవారు.

మొఘల్ చక్రవర్తి జహంగీర్ వేయించిన పటం

ఫొటో సోర్స్, The British Museum

ఇది క్రీ.శ. 1656, 1661 మధ్య కాలంలో మొఘల్ చక్రవర్తి జహంగీర్ వేయించింది. డచ్ కళాకారుడు రెంబ్రన్ట్ ఈ డ్రాయింగ్ వేశారు.

తన రాజసాన్ని ప్రతిబింబించేలా జహంగీర్ ఇలాంటి సూక్ష్మ చిత్రాలను గీయించేవారట.

మొఘల్ చక్రవర్తులకు చెందిన ఇలాంటి చాలా చిత్రాలు ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా యూరప్ చేరాయి.

చెక్క మగ్గం

ఫొటో సోర్స్, Mani Bhavan Gandhi Sangrahalaya, Mumbai

గాంధీజీ మగ్గం

ఇది 1915- 1948 నాటి చేనేత మగ్గం. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రజా చైతన్యానికి చిహ్నం.

విదేశీ వస్త్ర బహిష్కరణ చేస్తూ దేశ ప్రజలంతా రోజూ అరగంట పాటు మగ్గంపై బట్టలు నేయాలని పిలుపునిచ్చారు. బ్రిటిష్ వస్తువులను బహిష్కరిస్తేనే స్వయం పాలన సిద్ధిస్తుందని చెప్పేవారు.

ఈ చెక్క మగ్గాన్ని ముంబయిలోని మణి భవన్‌(గాంధీ మ్యూజియం) నుంచి ఎగ్జిబిషన్‌కు తీసుకొచ్చారు. ఆ భవనమే గాంధీజీ 17 ఏళ్ల పోరాటానికి ముంబయిలో కేంద్రంగా ఉండేది.

ఈ చారిత్రక కళాఖండాల ప్రదర్శన మార్చిలో దిల్లీలో ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)