మెట్రోల్లో పరుగులెడుతున్న ఉల్లి ధరలు

ఫొటో సోర్స్, AFP
- రచయిత, సరోజ్ సింగ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఉల్లి ధరలు పరుగులు పెడుతున్నాయి. హైదరాబాద్‌తోపాటు ఇతర మెట్రో నగరాల్లో ఉల్లిధరలు రూ.50-60కి మధ్యలో ఉన్నాయి. దేశ రాజధాని దిల్లీలో కిలో ధర రూ.50 దాటింది.
ప్రభుత్వాలనే ప్రభావితం చేసే శక్తి ఉల్లిపాయల్లో ఉంది. ధరలు కొండెక్కుతుండటంతో ఉల్లి కొనుగోలుకు సామాన్యులు సాహసించడం లేదు.
కానీ ఉల్లిగడ్డను ఎక్కువగా వాడే భారత్‌లో.. ఈ ఉల్లిని మొట్టమొదటిగా ఇక్కడ పండించలేదనే విషయం చాలా మందికి తెలియదు.
ఉల్లిగడ్డను పండించే ప్రయోగాలు 4000 ఏళ్ల ముందు నుంచే జరిగాయని తెలుస్తోంది. మెసొపొటామియా కాలంలో రాసిన ఓ లేఖతో ఈ విషయం స్పష్టమవుతోంది.
1985లో ఆ లేఖ ఓ ఫ్రెంచ్ పురావస్తు శాస్త్రజ్ఞుడి చేతికి దొరికింది. ఇప్పడు ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల్లో ఉల్లిగడ్డను పండిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తయ్యే మొత్తం ఉల్లిలో.. చైనా, భారత్ రెండు దేశాలు కలిసే 45 శాతం పండిస్తున్నాయి. కానీ ఉల్లి వినియోగంలో మాత్రం భారత్ వెనకబడే ఉంది.
లిబియా దేశంలోని ప్రతి వ్యక్తి ఏడాదికి 33.6 కిలోల ఉల్లి తింటాడని 2011లో అమెరికా నిర్వహించిన ఓ అధ్యయనం వెల్లడిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా ఉల్లిని వివిధ వంటకాల్లో ఉపయోగిస్తారు. ఉల్లిలో మంచి రుచితోపాటు, పోషక పదార్థాలు కూడా ఉండటమే దీనికి కారణం.

ఫొటో సోర్స్, iStock
ఉల్లిలో పోషకాలు ఎంత?
"ఉల్లి తక్కువ కేలరీలున్న ఆహారం. ఇందులో కొవ్వు పదార్థాలు అస్సలు ఉండవు. విటమిన్ సి ఉల్లిలో పుష్కలంగా ఉంటుంది" అని ప్రముఖ పోషకాహార నిపుణురాలు డాక్టర్ అర్చనా గుప్తా అన్నారు.
"100 గ్రాముల ఉల్లిలో ఉండే పోషక పదార్థాల గురించి మాట్లాడుకుంటే ఇందులో 4 మిల్లీగ్రాముల సోడియం, 1 మిల్లీగ్రాము ప్రోటీన్లు, 9-10 మిల్లీగ్రాముల కార్బోహైడ్రేట్లు, 3 మిల్లీగ్రాముల పీచు పదార్థాలు ఉంటాయి" అని ఆమె తెలిపారు.
అందుకే ఆరోగ్య నిపుణులు కూడా ఉల్లిపాయలు తినాలని సలహా ఇస్తారు. యాంటీ ఆక్సిడెంట్లు అధిక మోతాదులో ఉండటం వల్ల క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు ఉల్లిపాయను తరచూ ఆహారంలో తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

ఫొటో సోర్స్, AFP
వంటగదికి వచ్చేసరికి రెట్టింపు ధర
ఉల్లిసాగు ఎక్కువగా ఉండే మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, కర్నాటక వంటి రాష్ర్టాల్లో ఈ ఏడాది అధిక వర్షాల కారణంగా ఉల్లి పంట దెబ్బతింది.
ఉల్లిగడ్డకు అతిపెద్ద మార్కెటైన మహారాష్ట్రలోని లాసల్గావ్ మండీలో ఇప్పటికీ ఉల్లిగడ్డ ధర రూ.26 పలుకుతుండగా, అది వంటగదికి వచ్చేసరికి రెట్టింపవుతోంది.
ఇలా ఎందుకు జరుగుతుందనే ప్రశ్నకు స్పందిస్తూ.. "దిల్లీకి చెందిన హోల్‌సేల్ వ్యాపారులు మహారాష్ట్రకు వచ్చి కిలోకు రూ.26 చెల్లించి రీటైలర్లకు రూ.30-32 చొప్పున అమ్ముతారు" అని మహారాష్ట్రలోని లాసల్గావ్ మండీకి చెందిన హోల్‌సేల్ వ్యాపారి జై దత్ హోల్కర్ తెలిపారు.
హోల్‌సేల్ వ్యాపారైనా, రిటైల్ వ్యాపారైనా ప్యాకింగ్ ఖర్చులు, రవాణా ఖర్చులు, లాభం వీటన్నిటిని పరిగణనలోకి తీసుకొని ధరను నిర్ణయిస్తారు. కానీ సరఫరా తగ్గిందంటే వ్యాపారులు ఇష్టమొచ్చినట్లు ధరను నిర్ణయిస్తారు. ఈ కారణంతోనే మహారాష్ట్రలో రూ.26 పలికే కిలో ఉల్లి దిల్లీలో వంటగది దాకా వచ్చేసరికి రూ.50-60కి చేరుతోంది.

ఫొటో సోర్స్, AFP
ఉల్లిపాయపై రాజకీయాలు
ఉల్లిపాయ కేవలం వంటగదికే పరిమితంకాదు. ధరలు పెరిగినప్పుడు ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు ప్రతిపక్షాలకు ప్రధాన అస్త్రంగా కూడా ఉల్లి మారుతూ వచ్చింది. 1998 దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పరాజయానికి ఉల్లిధరలు పెరగడమే ముఖ్య కారణమని అంటారు.
పెరుగుతున్న ఉల్లిధరను దృష్టిలో పెట్టుకొని గతవారమే ఉల్లి కనీస ఎగుమతి ధరను పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఎగుమతులను తగ్గించడం ద్వారా దేశీయంగా సరఫరా పెంచి ధరలకు కళ్లెం వేసే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఉల్లిఘాటు కేవలం సాధారణ ప్రజానీకానికే కాదు దాని ప్రభావం ప్రభుత్వాలకు కూడా బాగా తెలుసు.
మా ఇతర కథనాలు:
- ఇందిర క్యాంటీన్లు: కడుపు నింపుతాయి సరే.. ఓట్లు రాలుస్తాయా!
- దుర్భిక్షం ముంగిట్లో యెమెన్
- ఇరానీ చాయ్‌తో సమోసా ఎందుకు తింటారంటే..
- ఇరాన్లో పుట్టింది మనింటికొచ్చింది - ఏంటది?
- భారత్‌లో దొరకని భారతీయ వంటకం!
- ‘8 నెలలుగా సంతోషి కుటుంబానికి రేషన్ లేదు’
- గూగుల్‌లో ఉద్యోగం వదిలేశాడు.. అమ్మతో కలిసి హోటల్ పెట్టాడు
- ట్రంప్ ఏం తింటారు? వాటి అర్థం ఏంటి?
- తల్లిపాలకు టెక్నాలజీ అవసరమా?
- ఇక్కడి నుండి చైనా సరిహద్దు ఈజీగా దాటేయొచ్చు!
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








