నల్లడబ్బు స్విస్ బ్యాంకులకు ఎలా తరలిపోతోంది?

ఫొటో సోర్స్, Getty Images
నల్లడబ్బు గురించి ఎప్పుడు చర్చ జరిగినా. స్విట్జర్లాండ్ బ్యాంకుల గురించే ప్రస్తావన వస్తుంది. స్విస్ బ్యాంకుల్లో ఉన్న భారతీయుల డబ్బు గురించి ఎప్పుడు చర్చ జరిగినా, మనకు దానిపై ఆసక్తి పెరిగిపోతుంది. ఆ బ్యాంకుల గురించి తెలుసుకోవాలని అనిపిస్తుంది.
స్విస్ బ్యాంకుల్లో జమ అవుతున్న భారతీయుల డబ్బు మూడేళ్ల నుంచి తగ్గుతూ వస్తోంది. కానీ 2017లో పరిస్థితి మారింది. గత ఏడాది స్విస్ బ్యాంకులో ఉన్న భారతీయుల డబ్బు 50 శాతం పెరిగి 1.01 బిలియన్ స్విస్ ఫ్రాంక్స్( సుమారు 7 వేల కోట్ల రూపాయలు) చేరుకుంది.
స్విస్ నేషనల్ బ్యాంక్ ఈ గణాంకాలు విడుదల చేసింది. స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంక్(ఎస్ఎన్‌బి) విడుదల చేసిన ఈ గణాంకాల ప్రకారం స్విస్ బ్యాంకుల్లో ఉన్న విదేశీయులందరి డబ్బు 2017లో 3 శాతం పెరిగి 1.46 లక్షల కోట్లు, సుమారు 100 లక్షల కోట్ల స్విస్ ఫ్రాంక్స్ అయ్యింది.
ఈ వార్త మోడీ ప్రభుత్వాన్ని టెన్షన్ పెడుతోంది. ఎందుకంటే ఆయన అధికారంలోకి రాగానే, నల్లధనాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. అంతేకాదు, స్విస్ బ్యాంకుల్లో డబ్బు దాచుకునే వారి గురించి ఎవరైనా వివరాలు ఇస్తే, ప్రభుత్వం వారికి కూడా ప్రోత్సాహకాలు అందిస్తామని చెబుతోంది.

స్విస్ బ్యాంకుల్లో భారతీయుల నగదు
బ్లూంబర్గ్ గణాంకాల ప్రకారం 2016 మోడీ ప్రభుత్వానికి ఉపశమనం కలిగించింది. ఎందుకంటే ఆ ఏడాది స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డబ్బు 45 శాతం తగ్గింది. 1987 నుంచి స్విట్జర్లాండ్ ఈ గణాంకాలను అందిస్తూ వస్తోంది. భారత్ విషయంలో 2016లో చాలా భారీ తగ్గుదల కనిపించింది. కానీ ప్రస్తుత గణాంకాలు కొత్త సమస్యను సృష్టిస్తున్నాయి.
ఎస్ఎన్‌బీ అంకెల ప్రకారం స్విస్ బ్యాంకుల్లో ఉన్న భారతీయుల డబ్బులో, వ్యక్తిగతంగా జమ చేసిన డబ్బు 3200 కోట్ల రూపాయల వరకూ ఉంది. మిగతా బ్యాంకుల ద్వారా జమ చేసిన డబ్బు 1050 కోట్లు, సెక్యూరిటీస్ రూపంలో 2640 కోట్ల రూపాయలు కూడా ఇక్కడ ఉన్నాయి.
2006 చివర్లో స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డబ్బు 23 వేల కోట్ల రూపాయలు ఉండేది. కానీ గత దశాబ్ద కాలంగా ఇది చాలా తగ్గిపోయింది.
ఈ భారీ అంకెలు చూస్తుంటే మన మనసులో కచ్చితంగా రెండు ప్రశ్నలు మెదులుతాయి. మొదటిది, నల్లధనం జమ చేయడానికి జనం స్విట్జర్లాండ్, అక్కడి బ్యాంకులనే ఎందుకు ఎంచుకుంటారు? రెండోది, ఈ నల్లడబ్బు స్విస్ బ్యాంకుల వరకూ ఎలా చేరుతోంది?

స్విస్ బ్యాంకుల్లో డబ్బు ఎందుకు జమ చేస్తున్నారు?
మొదటి ప్రశ్నకు జవాబు, స్విట్జర్లాండ్ బ్యాంకులు తమ వినియోగదారులు, వారు జమ చేసిన మొత్తం వివరాలను చాలా రహస్యంగా ఉంచుతాయి. అందుకే నల్లడబ్బు దాచుకోవాలి అనుకుంటున్న వారందరూ స్విస్ బ్యాంకులవైపే చూస్తున్నారు.
జేమ్స్ బాండ్ లేదా వేరే ఏవైనా హాలీవుడ్ సినిమాల్లో కనిపించే స్విస్ బ్యాంక్ లేదా వాటిలోని ఉద్యోగులు చాలా గోప్యత మెయింటైన్ చేస్తారు. నల్ల సూటు వేసుకుని, బ్రీఫ్ కేసులో ఉన్న కంప్యూటర్ డివైజ్‌లతో మొత్తం పని పూర్తి చేస్తుంటారు.
నిజానికి స్విస్ బ్యాంకులు కూడా మిగతా రెగ్యులర్ బ్యాంకుల్లాగే పనిచేస్తాయి. ఈ బ్యాంకులు పాటించే గోప్యత వాటిని ప్రత్యేకంగా మార్చింది. స్విస్ బ్యాంకుల్లో కనిపించే ఈ గోప్యత నియమాలు కొత్తేం కాదు.
ఈ బ్యాంకులు గత 300 ఏళ్లుగా ఈ రహస్యాలు దాస్తున్నాయి. 1713లో గ్రేట్ కౌన్సిల్ ఆఫ్ జెనీవా రూపొందించిన నియమాల ప్రకారం అన్ని బ్యాంకులు తమ క్లయింట్ రిజిస్టర్ లేదా వివరాలను నమోదు చేయాలి.

స్విస్ బ్యాంక్ సీక్రెట్
కానీ ఈ నియమాలతోపాటే అది మరో విషయం కూడా చెప్పింది. వినియోగదారుల వివరాలను సిటీ కౌన్సిల్‌తో తప్ప వేరే ఎవరితోనూ పంచుకోకూడదని సూచించింది. స్విట్జర్లాండ్‌లో బ్యాంకులు ఒక వేళ తమ వినియోగదారుడికి సంబంధించిన వివరాలు వేరే ఎవరికైనా ఇస్తే, అది నేరం అవుతుంది
ఈ గోప్యత నియమాలే స్విట్జర్లాండ్‌ను నల్లడబ్బు దాచుకోడానికి సురక్షిత స్థావరంగా మార్చేసిందని చెబుతారు. చాలా ఏళ్ల క్రితం వరకూ, డబ్బు, బంగారం, జ్యువెలరీ, పెయింటింగ్స్, ఇతర విలువైన వస్తువులు ఏవైనా జమ చేస్తున్నప్పుడు ఈ బ్యాంకులు ఎలాంటి ప్రశ్నలూ అడిగేవి కావు.
అయితే, తీవ్రవాదం, అవినీతి, పన్ను ఎగవేత లాంటివి బాగా పెరిగిపోవడంతో స్విట్జర్లాండ్ కూడా ఇప్పుడు చట్టవిరుద్ధ కార్యకలాపాలతో సంబంధం ఉందనిపించే ఖాతాలను తొలగించాలని భావిస్తోంది.
అంతే కాదు, భారత్ లేదా మిగతా దేశాలు ఏవైనా, ఫలానా వ్యక్తి మీ బ్యాంకులో జమ చేసిన డబ్బు చట్టవిరుద్ధమైనది అనే రుజులువు సమర్పిస్తే, వారి సమాచారం కోరితే, ఆ అభ్యర్థనలను కూడా పరిశీలిస్తోంది.

డబ్బు ఎలా జమ చేస్తారు?
ఇక రెండో ప్రశ్న, నల్లడబ్బు స్విస్ బ్యాంకుల్లోకి ఎలా చేరుతుంది. అది తెలుసుకోవాలంటే, స్విస్ బ్యాంకుల్లో అసలు ఖాతా ఎలా తెరుస్తారు అనేది కూడా తెలుసుకోవాలి.
18 ఏళ్ల వయసు దాటిన ఎవరైనా స్విస్ బ్యాంకులో ఖాతా తెరవచ్చు.
అయితే, డబ్బు జమ చేసే వ్యక్తి, ఏదైనా రాజకీయ ఉద్దేశంతో అది చేస్తున్నాడా లేదా జమ చేసిన డబ్బు చట్టవిరుద్ధమా అనే అనుమానం బ్యాంకులకు వస్తే, అవి ఆ అప్లికేషన్ తోసిపుచ్చవచ్చు.
బిజినెస్ స్టాండర్డ్స్ ప్రకారం స్విట్జర్లాండ్‌లో సుమారు 400 బ్యాంకులు ఉన్నాయి. వీటిలో యూబీఎస్, క్రెడిస్ స్విస్ గ్రూప్ అతిపెద్దవి. ఈ రెండు బ్యాంకుల దగ్గర మిగతా అన్ని బ్యాంకుల బ్యాలెన్స్ షీట్స్ కలిపితే వాటిలో సగాని కంటే ఎక్కువ డబ్బు ఉంటుంది.
ఏ ఖాతాల్లో ఎక్కువ గోప్యత లభిస్తుంది? ఈ ఖాతాలను 'నంబర్డ్ అకవుంట్' అంటారు. ఈ ఖాతాకు సంబంధించిన లావాదేవీలన్నీ అకౌంట్ నంబరు ఆధారంగానే జరుగుతాయి. దీనికి ఎలాంటి పేరూ ఉండదు.

ఆ బ్యాంకు ఖాతా ఎవరిదని తెలిసిన వారు బ్యాంకులో కొంతమందే ఉంటారు. కానీ ఆ అకౌంట్ లభించడం అంత సులభం కాదు.
పట్టుబడకూడదని అనుకునేవారు ఎవరైనా, ఆ బ్యాంక్ నుంచి క్రెడిట్, డెబిట్ కార్డ్ లేదా చెక్ సౌకర్యాలు లాంటివి తీసుకోరని చెబుతారు.
అంతే కాదు, ఈ బ్యాంకుల్లో మీకు ఒక వేళ ఖాతా ఉంటే, దాన్ని క్లోజ్ చేయాలని అనుకుంటే, అది ఎప్పుడైనా, ఎలాంటి రుసుమూ లేకుండానే చేయొచ్చు.
ఇవి కూడా చదవండి:
- అంధత్వం: మేనరికాలు, దగ్గరి సంబంధాలు.. పుట్టబోయే పిల్లలకు శాపం
- పాస్‌పోర్ట్ గురించి తప్పక తెలుసుకోవాల్సిన 5 విషయాలు
- 'తల్లి కాబోయే లక్షల మంది మహిళలకు ఇదో శుభవార్త'
- జపాన్‌లో కూలీలకు బిజినెస్ సూట్లు - ఎందుకంటే..
- వందేమాతరం గీత రచయిత బంకిమ్ చంద్ర గురించి ఈ విషయాలు మీకు తెలుసా
- ఏసీలు చల్లబరుస్తున్నాయా.. లేక వేడెక్కిస్తున్నాయా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








