‘క్యాష్ లెస్’ దొంగతనాలు: పర్సులు కొట్టేవారంతా ఇప్పుడు పక్షుల వెంటపడ్డారు

ఫొటో సోర్స్, Getty Images
స్కాట్లాండ్‌లోని లూయిస్ ద్వీపంలో డొనాల్డ్ మెక్‌లియాడ్ ఆ రోజు పొద్దున్న లేవగానే ఎప్పటిలా పెరట్లోని పక్షుల గూడు దగ్గరకు వెళ్లాడు.
పక్షులన్నీ ఉన్నాయో లేదో చూసుకోవడం ఆయనకు రోజూ అలవాటు.
కానీ, ఆ రోజు కాస్త తేడాగా అనిపించింది. గూడు పైకప్పు విరిగిపోయి ఉంది. విరిగిపోవడం కాదు... ఎవరో విరిచేశారని గుర్తించాడాయన.
డొనాల్డ్ వెంటనే పక్షుల లెక్క చూసుకున్నాడు. ఖరీదైన గుడ్లగూబ 'స్వాంప్'ను దొంగలు ఎత్తుకెళ్లారని అర్థం చేసుకుని చాలా బాధపడ్డాడు.
ఒక్క డొనాల్డే కాదు, అలా విలువైన పక్షులు పోగొట్టుకుంటున్నవారి సంఖ్య ఐరోపా దేశాల్లో పెరిగిపోతోంది.
ఈ దొంగతనాల వెనుక కారణం పరిశీలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. నగదు రహిత ఆర్థిక వ్యవస్థ వల్ల ఈ ప్రాంతంలో గుడ్లగూబలు, ఇతర పక్షుల దొంగతనాలు పెరుగుతున్నాయి.
దొంగలకు నగదు దోచుకునే అవకాశాలు లేకపోవడంతో ప్రత్యామ్నాయంగా ఇలా విలువైనవి ఏమున్నా సరే ఎత్తుకెళ్లి సొమ్ము చేసుకుంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
నగదు రహిత ప్రపంచం దిశగా..
ప్రపంచవ్యాప్తంగా నగదు రహిత లావాదేవీలు పెరుగుతున్నాయి. 2015తో పోల్చితే ప్రస్తుతం నగదు రహిత లావాదేవీల్లో 10.9 శాతం పెరుగుదల నమోదైంది. చాలా దేశాల్లో నగదు వినియోగం భారీగా తగ్గిపోతోంది.
బ్రిటన్‌లో 2017లో అంతకుముందు ఏడాది కంటే 15 శాతం మేర నగదు వాడకం తగ్గింది. జపాన్‌లో ఇదే కాలంలో 8.5 శాతం తగ్గుదల నమోదైంది.
భారత్ వంటి దేశాల్లోనూ పెద్ద నోట్ల రద్దు తరువాత నగదు రహిత లావాదేవీలు భారీగా పెరిగాయి.
మొబైల్ పేమెంట్లు పెరగడం, కార్డుల వినియోగం, ఆన్‌లైన్ చెల్లింపుల కారణంగా ప్రజలు నగదు తమతో తీసుకెళ్లడం తగ్గిపోయింది, దుకాణాల క్యాష్ కౌంటర్లలోనూ నగదు పెద్ద మొత్తంలో ఉండడం లేదు.
నగదు వాడకం తగ్గిపోవడంతో డబ్బు దొంగిలించే నేరస్థులకు చేతులు కట్టేసినట్లయింది.
దీంతో వారు దొంగతనాలకు ఇతర మార్గాలు ఎంచుకుంటున్నారు. అరుదైన జీవజాలాన్ని దొంగిలించి అమ్ముకుంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
బ్యాంకు దోపిడీలు తగ్గాయి కానీ..
దాదాపు పూర్తిగా నగదు రహితంగా మారిన దేశం స్వీడన్. అక్కడ గత ఏడాది నమోదైన మొత్తం ఆర్థిక లావాదేవీల్లో కేవలం 2 శాతమే నగదు లావాదేవీలు. అక్కడ అయిదో వంతు ప్రజలు అసలు ఏటీఎంకు వెళ్లి డబ్బులు తీయడమే మానేశారు.
నగదు వినియోగం దాదాపు పూర్తిగా తగ్గిపోవడంతో బ్యాంకు దోపిడీలు, వాహనాలు ఆపి దోచుకోవడాలు బాగా తగ్గిపోయాయి. 1990 ప్రాంతాల్లో ఏటా సగటున 100 బ్యాంకు దోపిడీలు జరిగే స్వీడన్‌లో నాలుగేళ్ల కిందట ఆ సంఖ్య 30కి తగ్గింది. 2017లో అది 11కి తగ్గింది. కార్లు ఆపి తుపాకులు చూపించి డబ్బు దోచుకున్న ఘటనలూ తగ్గాయి.
అయితే, అరుదైన జీవజాతులను దొంగిలించడం మాత్రం పెరుగుతోంది. మునుపెన్నడూ లేనట్లుగా 2016లో ఏకంగా ఇలాంటి ఘటనలు 156 నమోదయ్యాయి.
అధికారులు ఈ విషయం గుర్తించి చురుగ్గా వ్యవహరిస్తుండడంతో 2017లో ఈ సంఖ్య కాస్త తగ్గింది.
ఎక్కువగా అరుదైన గుడ్లగూబలు, వాటి గుడ్లు, అరబ్ దేశాల్లో బాగా డిమాండ్ ఉన్న పక్షులు, విలువైన పూలమొక్కలను దొంగలు ఎత్తుకెళ్తున్నారు. ఆ తరువాత వీటిని నల్లబజారులో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
కొన్ని రకాల డేగలు, గద్దలు, గుడ్లగూబలను పెంచుకోవడం దర్పంగా భావించే సౌదీ అరేబియా, అరబ్ ఎమిరేట్స్, ఖతార్ వంటి దేశాలకు ఇలాంటి విలువైన జీవ సంపదను స్మగ్లింగ్ చేస్తున్నారు.
'గ్రేట్ గ్రే' రకం గుడ్లగూబలైతే సుమారు 1,12,000 డాలర్లు (భారతీయ కరెన్సీలో 75 లక్షల రూపాయల పైమాటే) ధర పలుకుతున్నాయని స్వీడన్ పోలీసులు చెబుతున్నారు.
బ్రిటన్‌లోనూ ఈ తరహా దొంగతనాలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి.
మొత్తంగా ఐరోపాలో ఇలాంటి నేరాలు వ్యవస్థీకృతంగా మారాయి.

ఫొటో సోర్స్, Getty Images
దేన్నీ వదలడం లేదు
దొంగలు కేవలం అరుదైన పక్షులనే కాదు, సముద్ర ప్రాణులనూ విడిచిపెట్టడం లేదు. 'గ్లాస్ ఈల్' చేపల అక్రమ రవాణా పెరగడమే దీనికి ఉదాహరణ.
చైనాలో మంచి డిమాండ్ ఉన్న ఈ రకం చిన్న ఈల్‌లను ఐరోపా దేశాల నుంచి అక్రమంగా తరలిస్తున్నారు. ఇవి టన్ను రూ. 7 కోట్లకు పైగా ధర పలుకుతున్నాయట.
ఈ ఏడాది ఇప్పటివరకు ఐరోపా దేశాల నుంచి 100 టన్నుల గ్లాస్ ఈల్ చైనాకు స్మగ్లింగ్ చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
ఐరోపాలో ఇప్పుడు గ్లాస్ ఈల్ స్మగ్లింగ్ కొకైన్ స్మగ్లింగ్ అంత లాభదాయకమైందిగా నేరగాళ్లు పరిగణిస్తున్నారని బ్రిటన్ పోలీసులు చెబుతున్నారు.
ఇలాంటి ముఠాలు ఇప్పుడు చిల్లర దొంగలను తమ కార్యకలాపాలకు వినియోగించుకుంటున్నారని చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఐఫోన్లు, జీన్స్, మందులు అన్నీ చోరీ
కొందరు దొంగలైతే సులభంగా తరలించగలిగే, విలువైన వస్తువులను కొట్టేస్తున్నారు.
ఐఫోన్ల దొంగతనాలు అందులో భాగమే. మెక్సికో వంటి దేశాల్లో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడే ముఠాల్లో వారి నుంచి డిమాండ్ బాగా ఉండడంతో ఐఫోన్లను దొంగిలించి మెక్సికోకు చేరవేసే ముఠాలు విజృంభిస్తున్నాయి.
ఖరీదైన దుస్తులు, హ్యాండ్ బ్యాగులనూ దుకాణాల నుంచి దొంగిలిస్తున్నారు.
తేలిగ్గా ఉండి సులభంగా తరలించే వీలున్న రేజర్ బ్లేడ్ల వంటివాటిపైనా దొంగల దృష్టి ఉంటోంది.
దుకాణాల నుంచి మందులను, పిల్లలకు పట్టే పాలసంబంధిత ఉత్పత్తులు వంటివి కొల్లగొట్టేస్తున్నారట ఇప్పుడు.
ఇలా వస్తువులను దోచుకునే చిల్లర దొంగలు వాటిని మళ్లీ ఇతర దుకాణాల్లో మాయమాటలు చెప్పి విక్రయించడమో.. లేదంటే నల్లబజారులో అమ్ముకోవడమో చేస్తున్నారని పోలీసులు చెబుతున్నారు.
మొత్తానికి నగదు రహిత ఆర్థిక వ్యవస్థ పుంజుకొంటున్న తరువాత నేరుగా డబ్బు రూపంలో జరిగే దోపిడీలు తగ్గినా ఇతర దొంగతనాలు ఎక్కువవుతున్నాయని పోలీసులు చెబుతున్నారు.
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








