దేశ చరిత్రలోనే అత్యంత తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటున్న భారత్

ఫొటో సోర్స్, Getty Images
భారతదేశ చరిత్రలో మునుపెన్నడూ లేనంతటి తాగునీటి ఎద్దడి ఏర్పడింది. దేశంలో సుమారు 60 కోట్ల మందిని తాగునీటి కొరత తీవ్రంగా పీడిస్తోంది.
ఇది ఇక్కడితో ఆగిపోలేదని, మున్ముందు సమస్య మరింత తీవ్రం కానుందని నీతి ఆయోగ్ తన తాజా నివేదికలో వెల్లడించింది.
దేశంలోని 24 రాష్ట్రాల్లో పరిశీలన జరిపి నీతి ఆయోగ్ ఈ విషయం వెల్లడించింది.
అంతేకాదు.. 21 నగరాలు తాగునీటి విషయంలో పెను ప్రమాదం అంచున ఉన్నాయని హెచ్చరించింది. ఆయా నగరాల్లో తాగునీటి అవసరాలు రోజురోజుకీ పెరుగుతుండగా అక్కడి భూగర్భ జలాలు మాత్రం అంతకంటే వేగంగా అడుగంటుతున్నాయని తేల్చింది.
ఇదే పరిస్థితి కొనసాగితే ఆ 21 నగరాల్లో 2020 నాటికి భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోతాయని హెచ్చరించింది.

ఫొటో సోర్స్, NITIAayog
ఆహార భద్రతకు ముప్పు
నీటి ఎద్దడి ప్రభావం వల్ల ఆహార భద్రతకు ముప్పు కలగొచ్చని నీతి ఆయోగ్ చెప్పింది.
దేశంలో వినియోగమయ్యే నీటిలో 80 శాతం వ్యవసాయానికే ఉపయోగిస్తుండడంతో నీటి కొరత ప్రభావం ఆహార ఉత్పత్తులపైనా పడనుంది.
దేశంలోని అనేక నగరాలు, పట్టణాలు ఏటా వేసవిలో నీటి ఎద్దడిని ఎదుర్కొంటుంటాయి. ఇంటింటికీ తాగునీటి సరఫరా చేసేలా సువ్యవస్థీకృతమైన ఏర్పాట్లు లేకపోవడం వల్ల ఏటా ఈ పరిస్థితి తప్పడం లేదు.
వేసవి వచ్చిందంటే పబ్లిక్ కుళాయిలు, వీధుల్లోకి వచ్చే నీళ్ల ట్యాంకర్ల వద్ద బిందెలతో బారులు తీరడం సర్వసాధారణమైపోయింది. ప్రభుత్వం అరకొరగా సరఫరా చేసే నీరు చాలక ప్రయివేటు ట్యాంకర్లనూ ఆశ్రయిస్తుంటారు.
ఇక గ్రామాల్లో అయితే స్వచ్ఛమైన తాగునీరు దొరక్క ప్రజారోగ్యం ప్రమాదంలో పడుతోందని.. దేశవ్యాప్తంగా ఏటా 2 లక్షల మంది అపరిశుభ్రమైన నీరు తాగడం వల్ల రోగాలకు గురై మరణిస్తున్నారని ఈ నివేదిక వెల్లడించింది.

ఫొటో సోర్స్, NITIAayog
2030 నాటికి మరిన్ని కష్టాలు
మరోవైపు పట్టణాలు, నగరాలు విస్తరిస్తుండడంతో పట్టణాల్లోని జలవనరులపై మరింత భారం పెరుగుతోంది.
నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం 2030 నాటికి దేశంలో తాగునీటి సరఫరా కంటే అవసరం రెండింతలు ఉంటుందని అంచనా.
అంతేకాదు... నీటి కొరత కారణంగా దేశ స్థూల దేశీయోత్పత్తిలో 6 శాతం తగ్గుదల నమోదు కావొచ్చని అంచనా వేసింది.
అయితే, జలయాజమాన్యం విషయంలో కొన్ని రాష్ట్రాలు మిగతా రాష్ట్రాల కంటే మెరుగైన స్థితిలో ఉన్నాయి.
నీతి ఆయోగ్ జలయాజమాన్య సూచిలో గుజరాత్ ప్రథమ స్థానంలో నిలవగా.. మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.

ఫొటో సోర్స్, AFP
ఆ 15 రాష్ట్రాల పరిస్థితి మెరుగైంది..
అధ్యయనం చేసిన 24 రాష్ట్రాల్లో 15 గత ఏడాది కంటే కొంత ప్రగతి సాధించాయి.
మరోవైపు జలయాజమాన్యం విషయంలో అట్టడుగున ఉన్న ఉత్తర్‌ప్రదేశ్, హరియాణా, బిహార్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లోనే దేశ జనాభాలో సుమారు సగం మంది నివసిస్తుండడం ఆందోళనకర అంశం.
అంతేకాదు.. వ్యవసాయ ఉత్పాదకతా ఈ రాష్ట్రాల్లోనే ఎక్కువ. ఇలాంటి రాష్ట్రాలు జలయాజమాన్యంలో వెనుకబడడంపై నీతి ఆయోగ్ నివేదిక ఆందోళన వ్యక్తంచేసింది.
జల వినియోగం, యాజమాన్యం విషయంలో కుటుంబాలు, పరిశ్రమలకు సంబంధించిన కచ్చితమైన సమాచారం అందుబాటులో లేకపోవడంతో ప్రభుత్వాలు ఈ పరిస్థితిని చక్కదిద్దడంలో ఇబ్బంది పడుతున్నాయని నీతి ఆయోగ్ అభిప్రాయపడింది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








