రాజకీయాలను తలకిందులు చేసిన 5 బలపరీక్షలు

ఫొటో సోర్స్, Getty Images
కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన భారతీయ జనతా పార్టీ శనివారం సాయంత్రం 4 గంటలకు బలం నిరూపించుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత బీజేపీ నేత బీఎస్ యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ వజూభాయ్ వాలా ఎక్కువ సీట్లు గెలుచుకున్న పార్టీగా బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు.
కానీ కాంగ్రెస్, జేడీఎస్ గవర్నర్ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. తమ రెండు పార్టీలకూ ప్రభుత్వం ఏర్పాటు చేసే సంఖ్యాబలం ఉందని వాదిస్తున్నాయి.
భారత రాజకీయాల్లో ఇలాంటి ఆసక్తికరమైన పరిస్థితి ఇదే మొదటి సారి కాదు. రాజకీయ చరిత్రలో ఇలాంటి ఘటనలు ఎన్నో ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
1979: ప్రమాణం చేసిన 15 రోజుల్లోనే పడిపోయిన చరణ్ సింగ్ ప్రభుత్వం
దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన దాదాపు రెండేళ్ల తర్వాత ప్రతిపక్షాల ప్రభావం పెరిగినట్లు గమనించిన ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ, లోక్ సభను రద్దు చేసి ఎన్నికలు నిర్వహించాలని సిఫారసు చేశారు.
అత్యవసర పరిస్థితి విధించాలనే నిర్ణయం కాంగ్రెస్‌కు ఎన్నికల్లో చాలా నష్టం కలిగించింది. 30 ఏళ్ల తర్వాత కేంద్రంలో కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడింది.
జనతా పార్టీ భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. మొరార్జీ దేశాయ్ ప్రధాన మంత్రి అయ్యారు. చరణ్ సింగ్ ఆ ప్రభుత్వంలో హోంమంత్రి, ఉప ప్రధాని అయ్యారు.
పార్టీలో అంతర్గత కలహాలతో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం పడిపోయింది. ఆ తర్వాత కాంగ్రెస్, సీపీఐ మద్దతుతో చరణ్ సింగ్ 1979 జులై 28న ప్రధాన మంత్రిగా ప్రమాణం చేశారు.
బలం నిరూపించుకోడానికి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి ఆయనకు ఆగస్టు 20 వరకు గడువు ఇచ్చారు. కానీ ఒక రోజు ముందే అంటే ఆగస్టు 19న ఇందిరాగాంధీ తన మద్దతు వెనక్కు తీసుకున్నారు. దాంతో ఫ్లోర్ టెస్ట్ ఎదుర్కోకుండానే ఆయన తన రాజీనామా సమర్పించారు.

ఫొటో సోర్స్, Getty Images
1989: బీహార్‌లో రథయాత్ర ఆగింది, అక్కడ ఢిల్లీ ప్రభుత్వం కూలింది.
మరో కథ 1989లో జరిగింది. ఏడాది ముందే అంటే 1988లో జయ ప్రకాశ్ నారాయణ్ జన్మదినం అక్టోబర్ 11న జనమోర్చా, జనతా పార్టీ, లోక్ దళ్, కాంగ్రెస్(ఎస్) విలీనం అయ్యాయి. కొత్త పార్టీ జనతాదళ్ ఆవిర్భవించింది.
వీపీ సింగ్‌ను జనతా దళ్ అధ్యక్షుడుగా ఎంచుకున్నారు. ఆయన నేతృత్వంలో ఎన్నో ప్రాంతీయ పార్టీలు ఒకే గొడుకు కిందకు వచ్చాయి. నేషనల్ ఫ్రంట్ ఏర్పడింది.
1989లో ఎన్నికలు జరిగాయి. నేషనల్ ఫ్రంట్‌కు మంచి మెజారిటీ సాధించింది. అంతే కాదు అది ప్రభుత్వం కూడా ఏర్పాటు చేసింది.
బీజేపీ, వామ పక్షాలు బయటి నుంచి మద్దతు ఇవ్వడంతో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీపీ సింగ్ ప్రధాన మంత్రి అయ్యారు.
ఏడాది తర్వాత బీజేపీ రథయాత్ర ప్రారంభించింది. రథం చాలా రాష్ట్రాల నుంచి వెళ్తూ బీహార్ చేరుకుంది. బీహార్‌లో జనతా దళ్ ప్రభుత్వం ఉంది. అప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.
ఆయన లాల్‌కృష్ణ అద్వానీ రథ యాత్రను అడ్డుకున్నారు. ఆయన్ను అరెస్ట్ చేయించారు. దాంతో బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి తమ మద్దతు ఉపసంహరించుకుంది. దాంతో వీపీ సింగ్ సర్కారు కూలిపోయింది.

ఫొటో సోర్స్, Getty Images
1990: రాజీవ్ గాంధీపై నిఘా, కూలిన ప్రభుత్వం
భారత రాజకీయ చరిత్రలో తర్వాత పేజీ తిప్పితే, 1990లో జరిగింది కనిపిస్తుంది. వీపీ సింగ్ రాజీనామా తర్వాత జనతాదళ్ నేత చంద్రశేఖర్, తన మద్దతుదారులతో పార్టీని వీడారు. సమాజ్ వాదీ జనతా పార్టీ ఏర్పాటు చేశారు.
ఎన్నికలు జరిగాయి, ఆయన పార్టీ 64 స్థానాల్లో విజయం సాధించింది. లోక్‌సభలో జరిగిన ఫ్లోర్ టెస్ట్‌లో కాంగ్రెస్ ఆయనకు మద్దతు ఇచ్చింది. చంద్రశేఖర్ ప్రధాన మంత్రి అయ్యారు.
సుమారు ఏడు నెలల తర్వాత ఒక ఘటన చంద్రశేఖర్ తన పదవికి రాజీనామా ఇచ్చేలా చేసింది. 1991 మార్చి 2న హర్యానా పోలీస్ కానిస్టేబుళ్లు ప్రేమ్ సింగ్, రాజ్ సింగ్ రాజీవ్ గాంధీ నివాసం 10 జన్ పథ్ బయట నిఘా పెట్టారనే ఆరోపణలతో అరెస్ట్ అయ్యారు.
ఇద్దరూ మఫ్టీలో ఉన్నారు, కొంత సమాచారం సేకరించడానికి తమను పంపించారని అరెస్ట్ తర్వాత వారిద్దరూ అంగీకరించారు.
ఈ విషయంపై రాజకీయ కలకలం మొదలైంది. కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వానికి తమ మద్దతును ఉపసంహరిస్తున్నట్టు ప్రకటించింది. ఆ తర్వాత పార్లమెంటులో విశ్వాస పరీక్ష నిర్వహించవలసి వచ్చింది. ఫ్లోర్ టెస్ట్ జరగడానికి ముందే చంద్రశేఖర్ అందరికీ షాక్ ఇచ్చారు. 1991 మార్చి 6న ప్రధాని పదవికి రాజీనామా చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
1992: కుర్చీ కోసం సొంతంగా బల పరీక్షకు సిద్ధమైన మాయావతి
అత్యంత ఆసక్తికరమైన బల పరీక్ష ఉత్తర ప్రదేశ్‌లో జరిగింది. 1992లో ములాయం సింగ్ యాదవ్ సమాజ్ వాదీ జనతా పార్టీ నుంచి విడిపోయి, సమాజ్ వాదీ పార్టీ స్థాపించారు.
ఒక ఏడాది తర్వాత ఉత్తర్ ప్రదేశ్‌లో వివాదాస్పద నిర్మాణాన్ని కూల్చివేశారు. ఈ ఘటనతో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కల్యాణ్ సింగ్ ప్రభుత్వాన్ని రద్దు చేశారు.
ఆ తర్వాత ఎన్నికలు జరిగాయి. సమాజ్ వాదీ పార్టీ, మాయావతి బహుజన్ సమాజ్ వాదీ పార్టీ పొత్తు పెట్టుకున్నాయి. ఈ రెండు పార్టీలూ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. కానీ ఈ సంకీర్ణ ప్రభుత్వం ఐదేళ్లూ అధికారంలో ఉండలేకపోయింది.
బీఎస్‌పీ తన మద్దతు వెనక్కు తీసుకుంది, ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీలో విశ్వాస పరీక్ష జరిగింది. బీజేపీ మద్దతుతో మాయావతి ముఖ్యమంత్రి అయ్యారు. తాము మోసపోయామని భావించిన సమాజ్ వాదీ పార్టీ అధికారానికి దూరమైంది.

ఫొటో సోర్స్, Getty Images
1999: ఒక్క ఓటుతో వాజ్ పేయి ప్రభుత్వం కూలిపోయినప్పుడు...
1998లో లోక్ సభ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో ఏ పార్టీకీ ఆధిక్యం దక్కలేదు. కానీ అన్నాడీఎంకే మద్దతుతో ఎన్డీయే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
13 నెలల తర్వాత అన్నాడీఎంకే తన మద్దతు ఉపసంహరించుకుంది. ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. విపక్షాల డిమాండ్‌తో రాష్ట్రపతి ప్రభుత్వం బలం నిరూపించుకోవాలని ఆదేశించారు.
లోక్‌సభలో ఫ్లోర్ టెస్ట్ జరిగింది. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం ఒక్క ఓటుతో పడిపోయింది. అప్పుడు అలా జరుగుతుందని ఎవరూ ఊహించలేదు.
ఏ ఒక్క ఓటుతో ఎన్డీయే సర్కారు కుప్పకూలిందో ఆ ఓటు ఒడిషా ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్ వేశారు. గమాంగ్ ఆ సమయంలో ఒడిషా ముఖ్యమంత్రిగా, ఎంపీగా ఉన్నారు. ఆయన తన ఓటు వేసేందుకు ప్రత్యేకంగా ఢిల్లీ వచ్చారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








