కర్ణాటక: ప్రొటెం స్పీకర్‌గా బోపయ్య, అసలు ప్రొటెం స్పీకర్ ఎలా ఎంపికవుతారు?

బోపయ్య

ఫొటో సోర్స్, facebook.com/bopaiah.kg.5

శనివారం సాయంత్రం 4 గంటలకు కర్ణాటక శాసనసభలో విశ్వాసపరీక్ష జరిపించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. బలపరీక్ష ఎలా జరగాలో ప్రొటెం స్పీకర్ నిర్ణయిస్తారని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది.

ఆ బలపరీక్ష నిర్వహించేందుకు ప్రొటెం స్పీకర్‌గా బీజేపీ ఎమ్మెల్యే కేజీ బోపయ్యను కర్ణాటక గవర్నర్ నియమించారని ఏఎన్‌ఐ వార్తా సంస్థ తెలిపింది.

అయితే, నిబంధనలకు విరుద్ధంగా బోపయ్యను ప్రొటెం స్పీకర్‌‌గా నియమించారని కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీ ఆరోపించారు.

నిబంధనల ప్రకారం అసెంబ్లీకి ఎక్కువ సార్లు ఎన్నికైన సీనియర్ ఎమ్మెల్యే రఘునాథ్ విశ్వనాథ్ దేశ్‌పాండేను పక్కన పెట్టి, తక్కువ సీనియారిటీ ఉన్న వ్యక్తిని నియమించారని ఆయన విమర్శించారు.

కానీ, బోపయ్య నియామకం నియమ నిబంధనలకు లోబడే జరిగిందని బీజేపీ నేత, కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్ అన్నారు.

ఇంతకూ ప్రొటెం స్పీకర్‌ను ఎలా ఎంపిక చేస్తారు? అసలు బల పరీక్ష ప్రక్రియ ఎలా సాగుతుంది?

  • అసెంబ్లీకి ఎక్కువ సార్లు ఎంపికైన సీనియర్ ఎమ్మెల్యేను శాసససభ కార్యదర్శి గుర్తిస్తారు. అత్యధిక సార్లు సభకు ఎన్నికైన వ్యక్తినే ప్రొటెం స్పీకర్‌గా ఎంపిక చేస్తారు.
  • ఎంపిక చేసిన వ్యక్తి పేరును ప్రొటెం స్పీకర్‌గా సూచిస్తూ శాసససభ కార్యదర్శి గవర్నర్‌కు సిఫార్సు చేస్తారు. తర్వాత గవర్నర్ ఆ సీనియర్ ఎమ్మెల్యేతో ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణ స్వీకారం చేయిస్తారు.
  • కొత్తగా ఎంపికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం కోసం అసెంబ్లీని సమావేశపర్చమని ప్రొటెం స్పీకర్‌ అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశిస్తారు.
  • కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రెండు మార్గాలు ఉంటాయి - 1) ప్రొటెం స్పీకర్‌ విశ్వాస పరీక్ష చేపట్టవచ్చు. లేదా 2) కొత్త స్పీకర్‌ను ఎన్నుకోవచ్చు.
  • ఒకవేళ బలపరీక్షను చేపడితే మొదట వాయిస్ ఓటు నిర్వహిస్తారు. ఆ తర్వాత డివిజన్‌ చేపడతారు. కోరమ్ బెల్ మోగుతుంది. అసెంబ్లీ తలుపులు మూసేస్తారు. సభ్యులందరూ నిలబడాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎమ్మెల్యేలు ఎవరు ఎటువైపున్నారో లెక్కిస్తారు.
  • ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఫలితాలను స్పీకర్ ప్రకటిస్తారు.

ఎవరీ బొప్పయ్య?

కర్ణాటకలో రేపు సాయంత్రం జరగనున్న బలపరీక్షకు ప్రొటెం స్పీకర్‌గా గవర్నర్ నియమించిన కేజీ బోపయ్య గతంలో కర్ణాటక అసెంబ్లీ స్పీకరుగా కూడా పనిచేశారు. బీజేపీకి చెందిన బోపయ్య 1955లో జన్మించారు. న్యాయశాస్త్రంలో గోల్డ్ మెడల్ సాధించిన బోయయ్య చిన్ననాటి నుంచి సంఘ్ పరివార్, ఆరెస్సెస్‌లతో కలిసి పనిచేశారు. ఏబీవీపీలో క్రియాశీల సభ్యుడిగా ఉండేవారు. దేశంలో ఎమర్జెన్సీ కాలంలో అరెస్టై జైలుకు కూడా వెళ్లారు.

తర్వాత 1990లో బీజేపీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. 2004లో మడికేరి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2008లో విరాజ్‌పేట్ నుంచి గెలిచిన బోపయ్య అప్పట్లో ప్రొటెం స్పీకరుగా వ్యవహరించారు. డిప్యూటీ స్పీకరుగా ఏకగ్రీవంగా ఎన్నికైన బోపయ్య, తర్వాత కాలంలో స్పీకర్ జగదీష్ షెట్టర్ రాజీనామా చేయడంతో స్పీకర్ అయ్యారు.

2010 అక్టోబరులో అప్పటి ముఖ్యమంత్రి యడ్యూరప్పపై తిరుగుబాటు చేసిన 11మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకుని, ప్రభుత్వాన్ని నిలబెట్టింది బోపయ్యే. కర్ణాటక హైకోర్టు ఈ నిర్ణయాన్ని సమర్థించినా, సుప్రీంకోర్టు మాత్రం దీన్ని తప్పుబట్టింది.

దేశ్‌పాండే

ఫొటో సోర్స్, Facebook/RVDeshpande

నేనే అందరికన్నా సీనియర్ సభ్యుణ్ని: దేశ్‌పాండే

పై లెక్కన చూసినపుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే రఘునాథ్ విశ్వనాథ్ దేశ్‌పాండే అందరికన్నా సీనియర్ అవుతారు. 1983లో తొలిసారి శాసనసభకు పోటీ చేసిన దేశ్‌పాండే ఇప్పటి వరకు తొమ్మిది సార్లు పోటీ పడి 8 సార్లు గెలుపు సాధించారు.

ఈసారి ఎన్నికల్లో ఆయన ఉత్తర కన్నడ జిల్లాలోని హాలియాల్ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు.

'ద న్యూస్ మినట్' వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ దేశ్‌పాండే, "సభలో నేనే అత్యంత సీనియర్ సభ్యుడినని అనుకుంటున్నాను. ప్రొటెం స్పీకర్‌గా నన్నే నియమిస్తారు. సీక్రెట్ బ్యాలెట్ జరిగే సమస్యే లేదు. వాయిస్ ఓట్‌గా కానీ, లేదంటే డివిజన్ ద్వారా గానీ బ్యాలట్ ఉంటుంది" అని అన్నారు.

బీఎస్ యడ్యూరప్ప ప్రవేశపెట్టబోయే విశ్వాస తీర్మానాన్ని కాంగ్రెస్ సభ్యులందరూ కలిసి ఓడిస్తారని ఆయన విశ్వాసం ప్రకటించారు.

ఎవరీ దేశ్‌పాండే?

ఆర్వీ దేశ్‌పాండే 1971లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. కర్ణాటక రాష్ట్ర సహకార వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు ప్రెసిడెంటుగా ఆయన ప్రస్థానాన్ని ప్రారంభించారు. 43సంవత్సరాల తన రాజకీయ జీవితంలో ఎన్నో కీలక పదవుల్లో పనిచేశారు.

సిద్ధరామయ్య ప్రభుత్వంలో మొన్నటి వరకు ఆయన పరిశ్రమలు, మౌలిక సదుపాయాల మంత్రిగా పని చేశారు. దేశంలోనే అత్యధిక కాలం పరిశ్రమల మంత్రిగా పనిచేసిన ఘనత కూడా ఈయన సొంతం.

ఈయన ఆధ్వర్యంలో 'గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్' (ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు) నిర్వహించిన తొలిరాష్ట్రంగా కర్ణాటక గుర్తింపు పొందింది.

బెంగళూరు ఐటీ హబ్‌గా, భారత సిలికాన్ వ్యాలీగా పేరుపొందడంలో ఈయన పాత్ర కీలకమని చాలామంది భావిస్తారు.

తాజ్ కృష్ణ హోటల్ వద్ద మీడియా సిబ్బంది హడావుడి
ఫొటో క్యాప్షన్, హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌‌లో కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బస చేస్తున్నారు.

హైదరాబాద్‌కు మారిన కర్ణాటక రాజకీయాలు

కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శుక్రవారం ఉదయం హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌కు చేరుకున్నారు. దాదాపు 70 మంది ఎమ్మెల్యేలు ఈ హోటల్‌లో ఉన్నట్టు తెలుస్తోంది.

హైదరాబాద్‌లోని మరో స్టార్ హోటల్ నోవాటెల్‌లో జేడీఎస్‌ ఎమ్మెల్యేలు మకాం వేసినట్టు సమాచారం.

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య ప్రత్యేక విమానంలో బెంగళూరు నుంచి హైదరాబాద్ చేరుకున్నారు.

ఆయనతో పాటు, జేడీఎస్ నేత కుమారస్వామి కూడా తాజ్ కృష్ణ హోటల్‌కు చేరుకున్నారు.

కర్ణాటక కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం ఆ హోటల్‌లోనే నిర్వహించనున్నారు.

సమావేశం అనంతరం శనివారం కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్షకు హాజరయ్యేందుకు వారంతా చిన్న చిన్న బృందాలుగా ఏర్పడి బెంగళూరుకు వెళ్లనున్నట్టు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)