చింపాంజీలకు మనిషి వీర్యం ఎక్కించి హైబ్రిడ్ మానవులను సృష్టించే దారుణ ప్రయోగం.... దీన్ని ఎవరు, ఎలా చేశారు?

చింపాంజీ-మనుషుల హైబ్రిడ్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, దహిలా వెంటురా
    • హోదా, బీబీసీ ముండో

‘‘ద ఆరిజిన్స్ ఆఫ్ మ్యాన్’’ పుస్తకంతో 1871లో ఇంగ్లిష్ శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్.. సైన్స్‌లో ఒక విప్లవమే సృష్టించారు.

చింపాంజీల నుంచి మనుషులు పరిణామం చెందారనే విషయంపై ఆ తర్వాత చాలా చర్చ జరిగింది. వార్తా పత్రికల్లో దీనిపై చాలా కార్టూన్లు కూడా వచ్చాయి.

అయితే, నాలుగు దశాబ్దాల తర్వాత, 1910లో ఆస్ట్రియాలోని గ్రాజ్‌లో జరిగిన ‘‘వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ జువాలజిస్ట్స్’’లో చింపాంజీల నుంచి ఒక మనిషిని సృష్టించడంపై రష్యన్ బయాలజిస్టు ఇల్యా ఇవనోవిచ్ ప్రసంగించారు. మరో విధంగా చెప్పాలంటే ‘‘ఏప్-మ్యాన్’’ను అభివృద్ధి చేయాలని చెప్పారు.

ఏదో ఒక రోజు ఏప్‌లు, మనుషుల మధ్య హైబ్రిడ్ మానవులను సృష్టించే ప్రయత్నాలు ఫలిస్తాయని ఆయన అన్నారు.

కృత్రిమంగా ఏప్స్‌కు మానవ వీర్యాన్ని ఎక్కించడం ద్వారా ఈ ప్రయోగంలో ఉండే నైతిక సమస్యలను పరిష్కరించవచ్చని, ముఖ్యంగా జంతువులతో సెక్స్ విషయంలో వచ్చే అభ్యంతరాలను ఇలా పరిష్కరించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

చింపాంజీ-మనుషుల హైబ్రిడ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గుస్టావే ఫ్లాబెర్ట్

రష్యా విప్లవంతో..

‘‘వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ జువాలజిస్ట్స్’’లో ఇవనోవిచ్ ప్రసంగాన్ని మొదట్లో పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు.

అయితే, 1917లో రష్యా విప్లవం తర్వాత తన ఆలోచనకు కార్యరూపం ఇచ్చేందుకు ఇవనోవిచ్‌కు అవకాశం వచ్చింది. ఫ్రెంచ్ రచయిత గుస్టావ్ ఫ్లాబెర్ట్ తన పుస్తకం ‘‘క్విడ్‌క్విడ్ వోల్యూరెస్’’ ప్రస్తావించిన ఒక జీవిని నిజంగా సృష్టించాలని ఆయన భావించారు.

చరిత్రలో అత్యంత దారుణమైన ప్రయోగాల్లో ఒకటైన ‘‘క్రాసింగ్ ఏన్ ఏప్ విత్ ఏ హ్యూమన్’’ ప్రయోగాన్ని చేపట్టేందుకు.. 1926లో ఫ్రాన్స్ ఆధీనంలోని పశ్చిమ ఆఫ్రికా ప్రాంతం గినియాకు ఇవనోవిచ్ వెళ్లారు.

ఇవనోవిచ్ ప్రయోగానికి అవసరమైన నిధులను బోల్షివిక్ ప్రభుత్వం సమకూర్చింది. అసలు దీనికి ఎందుకు అప్పటి రష్యా ప్రభుత్వం నిధులు సమకూర్చిందని చరిత్రకారులు, శాస్త్రవేత్తలు తలలు పట్టుకునేవారు.

చింపాంజీ-మనుషుల హైబ్రిడ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇవనోవిచ్‌

‘‘మంచి పేరుంది..’’

కృత్రిమంగా వీర్యాన్ని జీవుల్లోకి ఎక్కించడం, సంకర జాతి జీవులను పుట్టించడంలో ఇవనోవిచ్‌కు మంచి అనుభవముంది.

పారిస్‌లోని పెస్టెర్ ఇన్‌స్టిట్యూట్ నుంచి 1896లో ఫిజియాలజీలో ఇవనోవిచ్ పీహెచ్‌డీ పట్టా పొందారు. ఆ తర్వాత బ్యాక్టీరియాలజీపై పరిశోధనలు కొనసాగించారు. ఆ తర్వాత ప్రపంచ ప్రముఖ సైకాలజిస్టు ఇవన్ పావ్లోవ్‌తో కలిసి పనిచేశారు.

పావ్లోవ్‌కు నోబెల్ బహుమతి తెచ్చిపెట్టిన విధానాలను ఉపయోగించి జంతువుల నుంచి వీర్యం సేకరించడంలో ఇవనోవిచ్ నైపుణ్యం సంపాదించారు. ఈ విధానం సాయంతో మేలు జాతి గుర్రాలను ఆయన అభివృద్ధి చేయగలిగారు.

క్రమంగా ఈ పరిశోధన మిగతా జంతువులపైకి కూడా వెళ్లింది. దీంతో అంతర్జాతీయంగా ప్రముఖ శాస్త్రవేత్తగా ఆయన మారిపోయారు.

అయితే, మొదట్లో ఇవనోవిచ్‌కు కూడా కష్టాలు తప్పలేదు. కానీ, 1924 నాటికి ఆస్ట్రియాలో తను ప్రతిపాదించిన ఆలోచనపై ఆయన పనిచేసేందుకు అవసరమైన అన్ని వనరులూ సమకూర్చుకున్నారు.

చింపాంజీ-మనుషుల హైబ్రిడ్

ఫొటో సోర్స్, Getty Images

చింపాంజీలపై..

పెస్టెర్ ఇన్‌స్టిట్యూట్‌లో చదువుకునేటప్పుడే శుక్ర కణాల్లో లోపాలపై ఇవనోవిచ్ మాట్లాడేవారు. ఆయన ప్రసంగాలకు ప్రభావితమైన అక్కడి అధికారులు ఫ్రెంచ్ గినియాలోని కిండియా గ్రామంలో సంస్థకు చెందిన చింపాంజీల కేంద్రానికి ఎప్పుడు కావాలన్నా రావొచ్చని ఆహ్వానం పలికారు.

ఈ ఆహ్వానం ఎంతో విలువైనది. ఎందుకంటే అప్పట్లో ప్రముఖ విద్యా సంస్థల్లో ఒకటైన సంస్థ నుంచి ఆయనకు ఆ ఆహ్వానం వచ్చింది. మరోవైపు రష్యాతో పాటు చాలా దేశాల పరిశోధకులకు ఇలాంటి ఆహ్వానాలు రావడం చాలా అరుదు.

అయితే, ఈ ప్రాజెక్టుతో పాటు ప్రయాణానికి సంబంధించి నిధుల కొరత ఆయన్ను వెంటాడేది.

దీంతో తన ప్రాజెక్టుకు ఆర్థిక సాయం చేయాలని సోవియట్ ప్రభుత్వంలోని పీపుల్స్ కమిషనర్ ఆఫ్ ఎన్‌లైటెన్‌మెంట్ అనటోలి లునాచర్స్‌కీని కలిశారు. 15,000 డాలర్లు (రూ. 11.98 లక్షలు) మంజూరు చేయాలని అభ్యర్థించారు. అయితే, అనటోలికి ఈ ప్రాజెక్టుపై అంత ఆసక్తి లేదు.

అయితే, సంవత్సరం తర్వాత బోల్షివిక్ ప్రభుత్వంలోని ‘‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైంటిఫిక్ ఇన్‌స్టిట్యూషన్స్’’కు ప్రముఖ శాస్త్రవేత్తల్లో ఒకరైన నికోలెయ్ పెట్రోవిచ్ గోర్బునోవ్‌ను అధిపతిగా నియమించారు. దీంతో ఇవనోవిచ్‌కు నిధులు సమకూరే అవకాశాలు మెరుగుపడ్డాయి.

ఇవనోవిచ్ ప్రతిపాదనను ప్రభుత్వ ఫైనాన్షియల్ కమిషన్‌ ముందుకు గోర్బునోవ్ తీసుకెళ్లారు. దీంతో 10,000 డాలర్లు (7.99 లక్షలు)ను ప్రభుత్వం సమకూర్చింది. దీంతో గినియాకు ఇవనోవిచ్ పయనం అయ్యారు.

ఈ ప్రయోగానికి అవసరమైన అన్నీ (డబ్బులు, చింపాంజీలు, సమాచారం) అప్పటికి ఇవనోవిచ్‌కు సమకూరాయి.

చింపాంజీ-మనుషుల హైబ్రిడ్

‘‘మిషన్ ఇంపాజిబుల్’’

నిజానికి ఈ ప్రాజెక్టు విఫలమైంది. లేదంటే ఇవనోవిచ్ పేరు చరిత్ర పుటల్లో నిలిచిపోయేది.

మొదట ఆయన గినియాలోని కిండియా నగరంలోని చింపాంజీల దగ్గరకు వెళ్లారు. అయితే, అప్పటికి అక్కడ జీవులు గర్భధారణకు సరిపడే వయసులో లేవు.

దీంతో ఇవనోవిచ్ మళ్లీ పారిస్‌కు వచ్చేశారు. ఆ తర్వాత చింపాంజీలను మచ్చికచేసుకునే విధానాలపై పాస్టెర్ ఇన్‌స్టిట్యూట్‌లో అధ్యయనం మొదలుపెట్టారు.

ప్రముఖ శస్త్రచికిత్సా నిపుణుడైన సెర్జీ వొరోనాఫ్‌తోనూ ఇవనోవిచ్ కలిసి పనిచేశారు. ‘‘రెజువెనేషన్ థెరపీ’’ని కనిపెట్టింది సెర్జీనే.

వీడియో క్యాప్షన్, కృత్రిమంగా అవయవాలను ఎలా తయారుచేస్తున్నారు

మొత్తానికి మళ్లీ ఆఫ్రికాకు వచ్చిన ఇవనోవిచ్ మూడు చింపాంజీలకు మానవ వీర్యంతో గర్భం తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. కానీ, ఆ ప్రయత్నాలు ఫలించలేదు.

మరోవైపు కోతుల్లో ఒకజాతి అయిన ఒరంగుటాన్‌ల వీర్యాన్ని ఆఫ్రికా మహిళలకు తెలియకుండానే వారిలో ప్రవేశపెట్టేందుకు ఆయన ప్రయత్నించారు. అదృష్టవశాత్తు ఫ్రెంచ్ అధికారులు దీన్ని అడ్డుకున్నారు.

దీంతో రష్యా వచ్చేయడం మినహా ఆయనకు వేరే ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. అయితే, ఆయన వచ్చేటప్పుడు కొన్ని చింపాంజీలను కూడా వెంట పెట్టుకొని వచ్చారు. మరోవైపు ఆ చింపాంజీల వీర్యాన్ని తమలో ఎక్కించుకునేందుకు రష్యాలో కొందరు వలంటీర్లను కూడా ఆయన ఒప్పించారు.

అయితే, వీర్యాన్ని ఎక్కించకముందే, ఆ చింపాంజీలు కూడా మరణించాయి.

వీడియో క్యాప్షన్, అందరికీ అందుబాటు ధరల్లో పర్యావరణహితమైన ఇళ్ల నిర్మాణం కోసం ప్రయత్నం

ఒకవైపు విప్లవం.. మరోవైపు సైన్స్

సోవియట్ రష్యాలో సాంస్కృతిక విప్లవం పతాక స్థాయిలో ఉన్నప్పుడే.. ఇవనోవిచ్ తన ప్రయోగాలపై దృష్టిపెట్టారు.

అయితే, 1930లో ఆయన్ను సీక్రెట్ పోలీసులు అరెస్టు చేశారు. కొందరు నిపుణులతో కలిసి ప్రభుత్వ వ్యతిరేక కుట్ర పన్నారని ఆయనపై ఆరోపణలు మోపారు. ఆ తర్వాత ఆయన్ను కజఖ్‌లోని ఆల్మఅట్టాకు తరలించారు.

అయితే, 1931లో మళ్లీ ఆయన్ను జైలు నుంచి జోసెఫ్ స్టాలిన్ విడిపించారు. కానీ, అప్పటికే ఇవనోవిచ్ ఆరోగ్యంపై జైలు జీవితం తీవ్రమైన ప్రభావం చూపింది. ఆల్మఅట్టాలో పక్షవాతంతో ఆయన మరణించారు. ‘‘మాస్కోకు వెళ్లేందుకు ఒక రోజు ముందే ఆయన చనిపోయారు’’అని రికార్డుల్లో ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)